ప్రతిపాదనలపై ‘మండలి’లో పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అభ్యంతరం
ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ జోడు గుర్రాల్లా వెళ్లాలి
ప్రతిపక్ష నాయకుడు లేకపోయినా, ప్రతిపక్షం ఉంది
ప్రతిపక్షం నుంచి ఒక సభ్యుడు కమిటీలో ఉంటే బాగుంటుంది
ప్రభుత్వానికి లక్ష్మణరావు సూచన
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త చట్టానికి సవరణలు తీసుకొస్తూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతిపాదనలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగాలేవని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్‌రావు అభిప్రాయపడ్డారు. సీఎం పేరుతో మంత్రి నారా లోకేశ్ లోకాయుక్త చట్ట సవరణ బిల్లు ఆమోదం కోసం శుక్రవారం ‘మండలి’లో ప్రవేశపెట్టగా, దానిపై కొద్దిసేపు చర్చ జరిగింది.
బిల్లులో సవరణలపై లోకేశ్ వివరిస్తూ.. లోకాయుక్త, సభ్యుల నియామక కమిటీలో సీఎం చైర్మన్‌గా, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, హోంమంత్రి లేదా సీఎం నామినేట్ చేసే మంత్రి సభ్యులుగా ఉంటారని.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత లేనిపక్షంలో మిగతా నలుగురు సభ్యులతో లోకాయుక్త కమిటీ సమావేశం ఏర్పాటుకు ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. దీనిపై లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ జోడు గుర్రాల్లా వెళ్లాలని ఓ రాజనీతిశాస్త్ర అధ్యాపకుడిగా నేను భావిస్తున్నా.
బిల్లు సారాంశం నాకు అర్థమైనంత వరకు.. ప్రతిపక్ష నాయకుడు లేరు కాబట్టి ఆయనను మినహాయిస్తూ, మిగిలిన నలుగురితో చేయాలని అనుకుంటున్నట్లుగా ఉంది. నిజానికి.. ప్రతిపక్ష నాయకుడు లేకపోయినా, ప్రతిపక్షం ఉంది. ప్రతిపక్షం నుంచి ఎవరైనా ఒక సభ్యుడు ఉండేలా కమిటీ ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. దానికి ప్రతిపక్ష హోదా అక్కరలేదు. ప్రతిపక్ష పార్టీ అక్కడ ఉంది. ఆ పార్టీని ఎవరో ఒక సభ్యుడిని నామినేట్ చేయమని అడగొచ్చు.
మీ ప్రతిపాదనలు ప్రజాస్వామ్య స్పిరిట్ కాదు’ అంటూ మాట్లాడారు. ఈ సమయంలో పలువురు టీడీపీ సభ్యులు పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయగా.. లక్ష్మణరావు స్పందిస్తూ.. ‘వాదనలు చేయాలంటే చాలా చెయ్యొచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రం చెబుతున్నా. ఆచరిస్తే ఆచరించండి లేకపోతే లేద’ని తెలిపారు.
ప్రజాస్వామ్యయుతంగానే ముందుకు..
లక్ష్మణరావు చేసిన సూచనపై లోకేశ్ స్పందిస్తూ.. ‘ప్రతిపక్ష నేత లేనిపక్షంలో అని బిల్లులో పేర్కొన్నాం.. అంతేగానీ ఏమీ తీసివేయడంలేదు. ఆయన లేనిపక్షంలో నలుగురుతో జరుగుతుందని మాత్రమే బిల్లులో పేర్కొన్నాం’.. అని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగానే లోకాయుక్తను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. మాజీ సీఎం జగన్ రెండు సమావేశాల నుంచి సభకు రాని పరిస్థితి అని.. అన్నీ పరిగణనలోకి తీసుకునే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. చర్చ అనంతరం, సభ మూజువాణితో బిల్లు ఆమోదం పొందినట్లు మండలి చైర్మన్ ప్రకటించారు.
మరో ఏడు బిల్లులు కూడా.. జ్యుడీషియల్ ప్రివ్యూకు రద్దు
ఇప్పటికే అసెంబ్లీ ఆమోదం పొందిన లాండ్ గ్రాబింగ్ సవరణ బిల్లు, పీడీ యాక్ట్ సవరణ బిల్లు, దేవదాయశాఖ పాలక మండలి కమిటీ అదనపు సభ్యుల నియామకం సవరణ బిల్లు, జ్యుడీషియల్ ప్రివ్యూకు సంబంధించిన బిల్లులతో పాటు మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, వ్యాట్ చట్ట సవరణ బిల్లులు కూడా శుక్రవారం మండలిలో ఆమోదం పొందాయి.
Comments
Please login to add a commentAdd a comment