కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’ | Maarina Kokila Children's Story Written By KV Lakshmana Rao Sunday Special | Sakshi
Sakshi News home page

'మారిన కోకిల'..! తాను నాలుగో తరగతి చదువుతోంది...

Published Sun, May 12 2024 2:47 PM | Last Updated on Sun, May 12 2024 5:20 PM

కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’

కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’

కోకిల నాలుగో తరగతి చదువుతోంది. రోజూ బడికి వెడుతుంది. తరగతిలో అందరి కంటే ముందు ఉంటుంది. అయితే కోకిల అస్తమానూ నోట్లో వేలు పెట్టుకుంటుంది. గోళ్లు కోరుకుతుంది.
      ‘కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’ అంటూ అమ్మ ఎన్నిసార్లు చెప్పినా  ,
‘అలాగేనమ్మా! అలవాటు మానుకుంటాన’ని అంటుందే కానీ, మానుకోలేక పోతోంది.
      రోజూలానే ఆరోజు కూడా బడికి వెళ్ళింది కోకిల. సాయంత్రం చివరి పీరియడ్‌లో సైన్స్‌ పాఠాలు చెప్పే సుజాతా టీచర్‌ వచ్చారు. సుజాతా టీచర్‌ చెప్పే సైన్స్‌ పాఠాలు కోకిలకు ఎంతో ఇష్టం.

‘పిల్లలూ! ఈ రోజు ‘అలవాట్లు’ అనే అంశం మీద మాట్లాడుకుందామా? మీరంతా ఖాళీ సమయంలో ఏమేమి చేస్తారో? ఒకొక్కరుగా టేబుల్‌ వద్దకు వచ్చి చెప్పాలి. సరేనా!’ అంటూ పిల్లలను అడిగారు సుజాతా టీచర్‌. ‘అలాగే టీచర్‌’ అంటూ ఉత్సాహంగా తలూపారు పిల్లలు. 
      ‘అయితే మీ మీ అలవాట్లను చెప్పండి’  పిల్లల కేసి చూస్తూ అడిగారు టీచర్‌.
శశాంక్‌ లేచి హుషారుగా టేబుల్‌ వద్దకు వచ్చి ‘టీచర్‌! నేను ఖాళీ సమయంలో బొమ్మలు వేస్తాను’ అని చెప్పాడు. ‘గుడ్‌! మంచి అలవాటు’ మెచ్చుకున్నారు టీచర్‌. ‘నేనయితే ఖాళీ సమయంలో కథలు చదువు తాను’ ఆనందంగా అన్నాడు కిరణ్‌. ‘వేరీ గుడ్‌!’ అని కిరణ్‌ని ప్రశంసిస్తూ ‘మరి నువ్వేం చేస్తావ్‌’ అంటూ కమలను అడిగారు టీచర్‌. ‘ఆడుకుంటాను టీచర్‌’ చెప్పింది కమల. ‘ఆటలు మానసిక ఆనందాన్ని, శారీరక ఆరోగ్యాన్ని ఇస్తాయి. మంచిది’ అని చెబుతూ ‘మరి నువ్వేం చేస్తావు కోకిలా?’ అంటూ కోకిలను అడిగారు టీచర్‌.

కోకిల ముందుకు రాలేదు. ‘నేను చెప్పలేను టీచర్‌.. చెప్పను’  అంటూ విచారంగా జవాబు ఇచ్చింది కోకిల. ‘ముందు నీ అలవాటు చెప్పమ్మా! చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? పర్వాలేదు’ అని టీచర్‌ అనేసరికి ‘గోళ్లు కోరుకుతాను. అమ్మ ఎన్నిసార్లు వద్దని చెప్పినా, ఆ అలవాటు మానుకోలేకపోతున్నాను’ చెప్పింది కోకిల. విన్న పిల్లలంతా ఘొల్లున నవ్వారు. వెంటనే టీచర్‌  ‘హుష్‌! పిల్లలూ! అలా నవ్వకూడదు. అలవాటు మంచిదైతే మెచ్చుకోవాలి. చెడ్డదైతే వద్దని చెప్పాలి. అంతే గానీ వెక్కిరించరాదు’ అంటూ మందలించారు. దాంతో పిల్లలంతా కోకిలకు సారీ చెప్పారు.

      ‘కోకిలా! అలవాటు చెడ్డదైతే అది మన ఎదుగుదలకు ఆటంకంగా మారుతుంది. మీకు నా చిన్నతనంలో జరిగిన ఓ కథ చెబుతాను’ అన్నారు టీచర్‌ పిల్లలందరి వంకా చూస్తూ! 
      కోకిలతో సహా పిల్లలంతా ‘చెప్పండి టీచర్‌’ అంటూ ఉత్సాహంగా అడిగారు. 
‘నా చిన్నప్పుడు నాకు ‘చిట్టి ’ అనే స్నేహితురాలు ఉండేది. తనకు ఖాళీ సమయంలో ముగ్గులు పెట్టడమంటే ఎంతో ఇష్టం. బాగా పెట్టేది. చిట్టి ముగ్గు వేస్తే చాలా బావుంటుంది అని ఇరుగుపొరుగు వాళ్లంతా చిట్టిని మెచ్చుకునే వారు. అయితే చిట్టికి ఒక చెడ్డ అలవాటు ఉంది’ అంటూ పిల్లలకేసి చూశారు టీచర్‌.

‘ఏం అలవాటు టీచర్‌?’ అంటూ ఆసక్తిగా అడిగింది కోకిల. 
      ‘ఉదయాన్నే నిద్ర లేచేది కాదు. బారెడు పొద్దెక్కే దాకా మొద్దు నిద్ర పోయేది. ‘నిద్ర లే చిట్టీ’ అని అమ్మ ఎన్నిసార్లు చెప్పినా, వినిపించుకునేది కాదు. ఒకసారి ఊర్లో సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెట్టారు.
      పచ్చని చిలుకలు, మామిడి తోరణాలతో స్వాగతం చెబుతున్న ముగ్గును పోటీలో వేయాలనుకుంది చిట్టీ. ప్రాక్టీస్‌ కూడా చేసుకుంది. మరునాడు ముగ్గుల పోటీ అనగా, ఆ రాత్రి పడుకోబోతూ.. ‘అమ్మా! ఉదయాన్నే నన్ను నిద్రలేపు. పోటీకి వెళ్ళాలి’ అని చెప్పి పడుకుంది. కానీ మరునాడు.. చిట్టీని అమ్మ ఎన్నిసార్లు నిద్రలేపినా బద్ధకంతో నిద్ర లేవలేదు చిట్టీ.’

‘అయ్యో.. అప్పుడేమయింది? టీచర్‌?’  పిల్లలంతా ఆసక్తిగా అడిగారు.
      ‘ఏముంది? చిట్టి అక్కడకు వెళ్లేటప్పటికి పోటీ అయిపోయింది. చిట్టీకి ఏడుపొచ్చింది. అమ్మ చెప్పినట్లు ‘బద్ధకమే బద్ధ శత్రువ’ని గ్రహించింది. చిట్టికి ఆ అనుభవం ఒక గుణపాఠం అయింది. ఇంకెప్పుడూ మొద్దు నిద్ర పోలేదు. బద్ధకం చూపించలేదు. చక్కగా చదువు కుంది. టీచర్‌ అయ్యింది. ఇప్పుడు మీకు పాఠం చెబుతోంది’ అని ఆపారు సుజాతా టీచర్‌.

పిల్లంతా ఒక్కసారిగా సైలెంట్‌ అయిపోయారు. అందరికన్నా ముందుగా తేరుకున్న కోకిల వెంటనే ‘చిట్టీ అంటే మీరేనా? టీచర్‌?’ అని అడిగింది. ‘అవును! కోకిలా, చిన్నప్పుడు నన్ను ముద్దుగా ‘చిట్టీ’ అని పిలిచేవారు. అర్థమైంది కదా కోకిలా .. చెడు అలవాట్ల వల్ల నష్టమేంటో.. పట్టుదలతో ప్రయత్నిస్తే చెడు అలవాట్లను మానుకోవడం పెద్ద కష్టమేం కాదని!’ అన్నారు టీచర్‌.  
      ‘అవును టీచర్‌.. తప్పకుండా ప్రయత్నిస్తాను’ చెప్పింది కోకిల. ‘వేరీ గుడ్‌! కోకిల మారింది’ అంటూ టీచర్‌ అభినందించగానే, పిల్లలంతా కూడా కోకిలను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. – కె.వి.లక్ష్మణరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement