జపాన్‌లో బాలల దినోత్సవం ఏటా మే 5న జరుగుతుంది. జపాన్ రాచరిక సంప్రదాయం ప్రకారం ఏటా జరిగే ఐదు వార్షిక ఉత్సవాలలో ఇది ఒకటి. జపాన్‌లో దేశవ్యాప్తంగా జరిగే వేడుకల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటారు. రకరకాల ప్రదర్శనలు చేస్తారు. జపాన్‌లో బాలల దినోత్సవం పన్నెండో శతాబ్దిలో పరిపాలించిన కమకురా వంశస్థుల హయాం నుంచి జరుగుతూ వస్తోంది.
తొలినాళ్లలో బాలల దినోత్సవాన్ని ఏటా చాంద్రమానం ప్రకారం ఐదో నెలలోని పున్నమి తర్వాత వచ్చే ఐదో రోజున జరుపుకొనేవారు. తర్వాత పంతొమ్మిదో శతాబ్ది నుంచి ఈ వేడుకను గ్రెగేరియన్ కేలండర్ ప్రకారం ఏటా మే 5న జరుపుకోవడం మొదలుపెట్టారు. ఈ వేడుకలో ఊరూరా ఆరుబయట ఎత్తుగా నిలిపిన స్తంభాలకు కట్టిన దండాలకు చిత్ర విచిత్రమైన రంగురంగుల గాలిపటాలను ఎగురవేస్తారు. వీటిని ‘కొయినొబొరి’ అంటారు.
అలాగే, ఇంటింటా బయటి ఆవరణల్లో గాని, పెరటి స్థలాల్లోగాని నిలిపిన స్తంభాలకు సంప్రదాయకమైన ‘నొబోరి’, ‘ఫుకునుకె’ జెండాలను ఎగురవేస్తారు. బహిరంగ వేదికల మీద సమురాయ్ బొమ్మలను ప్రదర్శనతో పాటు చిన్నారుల విచిత్ర వేషధారణలు, సంగీత, నృత్య ప్రదర్శనలు, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో జనాలు ఆరుబయట విందుభోజనాలు చేస్తారు.
ఈ విందుభోజనాల్లో ఓక్ ఆకుల్లో చుట్టిన రెడ్‌బీన్స్ జామ్ నింపిన బియ్యప్పిండి ముద్దలను ఆవిరిపై ఉడికించిన వంటకం ‘కషివామొచి’, గంజితో తయారు చేసే మద్యం ‘సాకె’లను తప్పనిసరిగా వడ్డిస్తారు. ఓక్ ఆకులను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. అందువల్ల ఈ వేడుకల్లో ఓక్ ఆకుల వినియోగానికి అత్యంత ప్రాధాన్యమిస్తారు.
ఇవి చదవండి: రేటే 'బంగారమాయెనే!'
Comments
Please login to add a commentAdd a comment