రాజీవ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి. పెళ్లయి ఇద్దరు పిల్లలు. భార్య కూడా ప్రభుత్వోద్యోగి. ఇటీవల కాలంలో వారిద్దరూ తరచూ గొడవపడుతున్నారు. కారణం ఆర్థిక ఇబ్బందులో లేక అభిప్రాయభేదాలో కాదు. రాజీవ్‌కున్న వింత అలవాటు. అది దినపత్రికల్లో, మ్యాగజై¯Œ్సలో వచ్చే నచ్చిన స్టోరీలను దాచుకునే అలవాటు. అందులో వింతేముంది? నచ్చిన పుస్తకాలు దాచుకున్నట్లే అదికూడా.. అని మీరు అనుకోవచ్చు.
- కానీ ఇల్లంతా ఆ ఫైల్స్‌తోనే నిండిపోతే?
- వాటినుంచి వచ్చే దుమ్ము వల్ల పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతుంటే?
- ఆ విషయం తెలిసినా ఆ ఫైల్స్ పడేయడానికి ఒప్పుకోకుంటే?
- వాటిని బయట పడేయడానికి ప్రయత్నించే భార్యతో గొడవ పడుతుంటే?
- ఆమె వెళ్లిపోతానని బెదిరించినా పట్టించుకోకపోతే?
- భార్యాపిల్లల కంటే ఫైల్సే ముఖ్యమనుకుంటే?
దాన్నే హోర్డింగ్ డిజార్డర్ అంటారు. అంటే అవసరం లేని వస్తువులను అతిగా దాచుకునే మానసిక వ్యాధి. పేపర్ క్లిపింగ్సే కాదు పెన్నులు, పిన్నులు, రబ్బర్ బ్యాండ్లు, కర్చీఫ్‌లు.. ఇలా ఏదైనా సరే అతిగా దాచుకుంటున్నారంటే ఈ వ్యాధి బారిన పడినట్లే. వస్తువులను దాచుకోవడమే కాదు, అతిగా జంతువులను పెంచుకోవడం కూడా ఈ రుగ్మత కిందకే వస్తుంది. అతిగా ఆస్తులు కూడగట్టుకోవడం, వాటిని ఎవరికీ ఇవ్వకుండా దాచుకోవడం కూడా ఈ రుగ్మత పరిధిలోనిదే.
హాబీ, హోర్డింగ్ డిజార్డర్ వేర్వేరు..
హాబీలకు, హోర్డింగ్ డిజార్డర్‌కు తేడా ఉంది. స్టాంపుల సేకరణ, నాణేల సేకరణ వంటి హాబీలున్నవారు అనేక అంశాలు శోధించి, సేకరిస్తారు. వాటిని ప్రదర్శిస్తారు. ఈ సేకరణలు భారీ స్థాయిలో ఉండవచ్చు. కానీ అవి చిందరవందరగా ఉండవు. చక్కగా, ఒక పద్ధతిలో అమర్చి ఉంటాయి. కానీ హోర్డింగ్ డిజార్డర్‌లో ఇందుకు భిన్నంగా చిందరవందరగా ఉంటాయి. అందువల్ల ఇవి రెండూ వేర్వేరు.
టీనేజ్ లో మొదలు..
హోర్డింగ్ సాధారణంగా 15 నుంచి 19 సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతుంది. వయసుతో పాటు సమస్య కూడా పెరుగుతుంది. చివరకు భరించలేనిదిగా తయారవుతుంది.
ఈ డిజార్డర్ ఉన్నవారిలో కనిపించే లక్షణాలు..
- తమకు నచ్చిన వస్తువులు ప్రత్యేకమైనవని లేదా భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో అవసరమని నమ్మడం
- వాటితో మానసికంగా కనెక్ట్ అయినట్లు అనిపించడం..
- అవి చుట్టూ ఉన్నప్పుడు సురక్షితంగా ఫీలవ్వడం, ఓదార్పును అనుభవించడం..
- అవసరం లేకపోయినా దాచుకోవడం, విలువ లేకపోయినా విసిరేయ లేకపోవడం..
- వస్తువులను భద్రపరచాలని భావించడం, వదిలించుకోవాలంటే కలత చెందడం..
- మీ గదులను ఉపయోగించలేని స్థాయిలో వస్తువులను నింపడం..
- అపరిశుభ్రమైన స్థాయిలకు ఆహారం లేదా చెత్తను దాచడం..
- దాచుకున్న వస్తువుల కోసం ఇతరులతో విభేదాలు..
అస్పష్టమైన కారణాలు..
హోర్డింగ్ డిజార్డర్‌కు కారణమేమిటో స్పష్టంగా తెలియలేదు. జన్యుశాస్త్రం, మెదడు పనితీరు, ఒత్తిడితో కూడిన సంఘటనలు సాధ్యమయ్యే కారణాలుగా అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ డిజార్డర్ ఉన్న కుటుంబ సభ్యుడిని కలిగి ఉండటం కూడా బలమైన కారణమని తెలుస్తోంది. ప్రేమించిన వ్యక్తి మరణం, విడాకులు తీసుకోవడం లేదా అగ్నిప్రమాదంలో ఆస్తులను కోల్పోవడం వంటి ఒత్తిడితో కూడిన సంఘటనను ఎదుర్కొన్న తర్వాత కొందరిలో ఈ డిజార్డర్ మొదలవుతుంది.
తక్షణ చికిత్స అవసరం..
- కొందరు తమ జీవితాలపై హోర్డింగ్ డిజార్డర్ చూపించే ప్రతికూల ప్రభావాన్ని గుర్తించరు, చికిత్స అవసరమని భావించరు. ఈ డిజార్డర్‌ను అధిగమించేందుకు సైకోథెరపీ అవసరం. దాంతో పాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- దాచుకోవడానికి కారణమైన నమ్మకాలను గుర్తించాలి , వాటిని సవాలు చేయాలి. మరిన్ని వస్తువులను పొందాలనే కోరికల నియంత్రణ అలవరచుకోవాలి.
- ఏయే వస్తువులను వదిలించుకోవచ్చో వాటిని వదిలించుకోవాలి.
- డెసిషన్ మేకింగ్‌ను.. కోపింగ్ మెకానిజాన్ని మెరుగుపరచుకోవాలి.
- గందరగోళాన్ని తగ్గించుకోవడానికి రోజువారీ పనులను షెడ్యూల్ చేసుకోవాలి. ఇంటిని చక్కగా నిర్వహించుకునేందుకు సాయం తీసుకోవాలి. హోర్డింగ్ ఒంటరితనానికి దారితీస్తుంది కాబట్టి ఇతరులకు చేరువవ్వాలి.
- ఇంటికి సందర్శకుల హడావిడిని వద్దనుకుంటే మీరే బయటకు వెళ్లొచ్చు. హోర్డింగ్ డిజార్డర్ సపోర్ట్ గ్రూప్‌లో చేరాలి.
- ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ సహాయం తీసుకోవాలి.
- హోర్డింగ్ డిజార్డర్‌కి సిఫారసు అయిన మొదటి చికిత్స.. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఈ రుగ్మత వల్ల వచ్చే ఆందోళన, నిరాశ వంటి వాటికి మందులు ఇస్తారు. థెరపీ షెడ్యూల్‌ను క్రమం తప్పకుండా అనుసరించాలి. దాచుకోవాలనే కోరికను తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది.
— సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com)
ఇవి చదవండి: హెల్త్: 'గుండె' పెరగడమా..? అవును ఇదొక సమస్యే..!
Comments
Please login to add a commentAdd a comment