హరిహరనాథ శర్మ, లక్ష్మణరావులచే ప్రమాణం చేయించిన సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
30కి చేరిన జడ్జిల సంఖ్య
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్ యడవల్లి లక్ష్మణరావులు శుక్రవారం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరి చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అంతకు ముందు హైకోర్టు రిజిస్ట్రార్.. వీరి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను చదవి వినిపించారు. అనంతరం సీజే వారి చేత ప్రమాణం చేయించారు.
ఆ తర్వాత సీజే వారికి విడి విడిగా రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ప్రమాణం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్‌జీ) పసల పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, హైకోర్టు రిజి్రస్టార్లు, న్యాయవావాదులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రమాణం అనంతరం వీరు సింగిల్ జడ్జీలుగా కేసులను విచారించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు, శ్రేయోభిలాషులు వీరిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment