
కోటపల్లి (చెన్నూర్): మంచిర్యాల జిల్లా వేమనపల్లి ప్రాథమిక వైద్యాధికారి కామెర రశ్‌పాల్ (26) డెంగీ వ్యాధికి బలయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస వదిలారు. కోటపల్లి మండలం మల్లంపేటకు చెందిన రశ్‌పాల్‌కు వారం క్రితం జ్వరం రాగా స్వీయ చికిత్స చేసుకున్నా తగ్గలేదు. దీంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. రక్తకణాల సంఖ్య పూర్తిగా తగ్గడంతో ప్లేట్‌లెట్స్ ఎక్కించినప్పటికీ కోలుకోలేదు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించారు. సోమవారం రాత్రి కరీంనగర్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్ తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు.
పెళ్లి అయిన మూడు నెలలకే..
రశ్‌పాల్‌కు మూడు నెలల కిందట ప్రగతితో వివాహం జరిగింది. పెళ్లి అయిన మూడు నెలలకే రశ్‌పాల్ మరణించడంతో మల్లంపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిరుపేద కుటుంబానికి చెందిన రశ్‌పాల్ కష్టపడి చదివి డాక్టర్ కొలువు సాధించాడని, అతడి లక్ష్యం ఐఏఎస్ అని, అది నెరవేరకుండానే మరణించాడని మృతుడి తల్లిదండ్రులు విలపిస్తూ చెప్పారు. కాగా, చికిత్స సమయంలో డబ్బులు లేకపోవడంతో తోటి డాక్టర్లు తలా కొంత జమ చేసి చికిత్సకు తోడ్పాటు అందించారు.