సాక్షి, అమరావతి/నెట్‌వర్క్: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూత అందిస్తోంది. వరద వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పటినుంచే అప్రమత్తమై ఏ ఒక్క కుటుంబానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు రంగంలోకిదిగి అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఉన్నతాధికారులు, ఆ జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకుని యుద్ధప్రాతిపదికన పునరావాస ఏర్పాట్లకు ప్రణాళిక రూపొందించారు.
అందుకనుగుణంగా చకచకా పునరావాస ఏర్పాట్లు జరిగాయి. గతంలో మాదిరిగా వరద ప్రభావం తగ్గిన తర్వాత తాపీగా అరకొర నిధులు విడుదల చేయడం కాకుండా.. ఐదుజిల్లాలకు అవసరమైన రూ.12 కోట్లు వెంటనే విడుదల చేశారు. ఫలితంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కార్యకలాపాలు పక్కాగా అమలవుతున్నాయి.
216 గ్రామాలకు వరద ముంపు
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 216 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ఆ గ్రామాల నుంచి 52,753 మందిని తరలించారు. వీరిలో 48,345 మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. 79 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. వరద ముంపు ప్రభావం అల్లూరి సీతారామరాజు జిల్లాపై ఎక్కువగా ఉండడంతో అక్కడ నాలుగు మండలాల పరిధిలోని 96 గ్రామాల ప్రజల కోసం 51 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిల్లో 43,587 మంది ఆశ్రయం పొందుతున్నారు.
పారిశుధ్య పనులు ముమ్మరం
వరద తగ్గిన తర్వాత బాధితులు పునరావాస కేంద్రాల నుంచి తిరిగి తమ ఇళ్లకు వెళ్లేటప్పుడు వారికి రూ.వెయ్యి నుంచి రూ. 2 వేల ఆర్థికసాయం అందించాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టంగా ఆదేశాలు జారీచేయడంతో అధికారులు అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ డబ్బు పంపిణీ కోసం ఇప్పటికే రెవెన్యూ శాఖ ఉత్వర్వులు జారీచేసింది.
బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, లీటర్ పామాయిల్ ఇస్తున్నారు. ఐదు వరద ప్రభావిత జిల్లాల్లో దెబ్బతిన్న ఇళ్లకు ఇచ్చే పరిహారాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ రూ.10 వేలకు పెంచారు. గతంలో ఇది రూ.5 వేలు ఉండగా సీఎం సూచనతో దాన్ని రూ.10 వేలకు పెంచుతూ జీవో జారీ అయింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, తాగునీటి సరఫరా పథకాలు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఇప్పటికే పునరుద్ధరించారు. ఆ గ్రామాల్లో పారిశుధ్యం దిగజారకుండా బ్లీచింగ్ చల్లడం వంటి కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నారు. గ్రామ వలంటీర్లు చురుగ్గా పనిచేస్తూ స్థానికంగా ఉన్న పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారమిస్తున్నారు. గ్రామ సచివాలయాల నుంచే గ్రామాల వారీగా సహాయక చర్యలు జరుగుతున్న తీరును కలెక్టర్లు, ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
♦ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లోని ముంపు గ్రామాల్లో అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్ సుమిత్‌కుమార్ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. చింతూరు కేంద్రంగా డివిజన్లోని ముంపు ప్రాంతాలకు లాంచీలు, మరబోట్ల ద్వారా బియ్యం, కందిపప్పు, కూరగాయలు, పాలప్యాకెట్లు, కొవ్వొత్తులు, టార్పాలిన్లు సరఫరా చేస్తున్నారు.
వరద బాధితులకు పంపిణీ చేసేందుకు పట్టణ ప్రాంతాల నుంచి ఎప్పటికప్పుడు తాజా కూరగాయలు రప్పిస్తున్నారు. వరదలకు చింతూరు డివిజన్లో 250 గ్రామాలకు చెందిన 17 వేల కుటుంబాలు ప్రభావితమైనట్లు అధికారులు తెలిపారు. ఎటపాక మండలం నెల్లిపాకకు చెందిన దేదారి రాముడు (50) అనే వ్యక్తి పశువులు మేపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ వరదనీటిలో పడి మృతిచెందాడు.
♦ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వరద బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలను అధికారులు ముమ్మరం చేశారు. పునరావాస కేంద్రాలు, వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. బాధితులకు ఆహార, తాగునీటి అవసరాలు తీరుస్తూ, అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నారు.
♦ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 1,321 కుటుంబాలకు చెందిన 3,787 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానికుల రాకపోకలకు అనువుగా 172 పడవలు ఏర్పాటు చేశారు. వరదలకు బాధితులకు పునరావాసం కల్పించడంతోపాటు భోజన ప్యాకెట్లు అందిస్తున్నారు. కె.గంగవరం మండలం కోటిపల్లి వద్ద మత్స్యకార కాలనీ ముంపు బారిన పడింది. ఇక్కడ 300 మందికి భోజన వసతి కల్పించారు.
ఐ.పోలవరం మండలం కేశనకుర్రులో 700 మందికి ఆహార పొట్లాలు అందించారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి, పాశర్లపూడిలంకల్లో సుమారు 400 మందికి భోజన ప్యాకెట్లను పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పంపిణీ చేశారు. జిల్లాలో 20 పునరావాస కేంద్రాలు నడుస్తూండగా, బాధితులకు 21,756 భోజన ప్యాకెట్లు అందజేశారు. 33 వేల మంచినీటి ప్యాకెట్లు, 4,400 వరకు 20 లీటర్ల వాటర్ టిన్నులను అందించారు.
Comments
Please login to add a commentAdd a comment