rehabilitation centers
-
పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి..
ఖమ్మం మయూరిసెంటర్: ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం రూరల్ మండలంలో మున్నేరు వరద ముంపు బాధితులకోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు ఖాళీ అయ్యాయి. ఆయా ప్రాంతాల్లో వరద నీరు తగ్గడంతో ముంపు బాధితులంతా పునరావాస కేంద్రాలను వీడి ఇళ్లకు చేరుకున్నారు. ఈనెల 1న మున్నేరుకు వచి్చన భారీ వరదలతో ఖమ్మం నగరంలోని 13 డివిజన్లతో పాటు ఖమ్మం రూరల్ మండలంలోని 20 కాలనీలు నీట మునిగాయి. వందలాది ఇళ్లను వరద ముంచెత్తగా.. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో ప్రభావిత ప్రాంతాల ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలోని రామన్నపేట ప్రభుత్వ పాఠశాల, జూబ్లీ క్లబ్, స్వర్ణభారతి కల్యాణ మండపం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ధంసలాపురం పాఠశాలల్లో 8,200 మందికి, ఖమ్మం రూరల్ మండలంలో టీసీవీ రెడ్డి ఫంక్షన్‌హాల్, రామ్‌లీలా ఫంక్షన్‌హాల్, పోలేపల్లి స్ఫ్రింగ్ లీఫ్ పాఠశాల, సాయిబాబా ఆశ్రమంలో 2,300 మందికి ఆశ్రయం కలి్పంచి ఇన్నాళ్లూ భోజనం సమకూర్చారు. బాధితులు వెళ్లిపోవడంతో కేంద్రాల మూసివేత వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు పూర్తికావడం, ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకోవడంతో పునరావాస కేంద్రాలను వీడి ఇళ్లకు చేరుకున్నారు. ఈనెల 10 వరకు ప్రభుత్వ యంత్రాంగం పునరావాస కేంద్రాలను నిర్వహించగా.. బాధితులు ఇళ్లకు వెళ్లిపోతుండడంతో శుక్రవారం పూర్తిగా మూసివేసింది. అయితే, ఇళ్లు పూర్తిగా నేలమట్టమైన వారు మాత్రం ఎక్కడకు వెళ్లాలో దిక్కుతోచక.. మిగిలిన ఒకటి, అరా సామగ్రితో చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. కొనసాగుతున్న దాతల చేయూతవరద బాధితులకు పలువురు నిత్యావసరాలతో పాటు భోజనం అందిస్తున్నారు. అనేక మంది ఇళ్లను కోల్పోయి వండుకునేందుకు సామగ్రి లేక భోజనం కోసం ఇబ్బంది పడుతుండగా.. వారికి స్వచ్ఛంద సేవా సంస్థలు భోజనం సమకూరుస్తున్నాయి. శుక్రవారం కూడా ఖమ్మం రూరల్ మండలంలోని రాజీవ్ గృహకల్ప, ఖమ్మంలోని వెంకటేశ్వరనగర్‌లో బాధితులకు పలు సంస్థల ద్వారా భోజనం సమకూర్చారు. -
Agapi Sikkim: ప్రకృతి ఇచ్చిన ప్రేమ కానుక గెలుపు దారి
పెద్ద నగరాలలో పెద్ద ఉద్యోగం చేస్తున్నప్పటికీ రిన్జింగ్ భూటియా మనసులో ఏదో లోటు ఉండేది. విశాలమైన ప్రకృతి ప్రపంచంలో పుట్టి పెరిగిన రిన్జింగ్ రణగొణ ధ్వనులకు దూరంగా తన మూలాలను వెదుక్కుంటూ సిక్కిం వెళ్లింది. హిమాలయాలలోని అరుదైన మొక్కలతో తయారు చేసే స్కిన్‌కేర్ ప్రాడక్ట్స్‌కు సంబంధించిన ‘అగాపి సిక్కిం’ స్టార్టప్‌తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించింది. సొంతకాళ్ల మీద నిలబడడానికి పునరావాస కేంద్రాల్లోని మహిళల కోసం ఉచిత వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. సిక్కింలోని అద్భుతమైన ప్రకృతి అందాల మధ్య పుట్టి పెరిగిన రిన్జింగ్ వృత్తిరీత్యా దిల్లీ, బెంగళూరు, కోల్‌కత్తాలాంటి మహానగరాల్లో గడిపింది. ఆర్థిక సమస్యలు లేనప్పటికీ ఏదో లోటుగా అనిపించేది. ప్రకృతి మధ్య తాను గడిపిన కాలాన్ని గుర్తు చేసుకునేది. మరో ఆలోచన లేకుండా ఉద్యోగానికి రాజీనామా చేసి సిక్కిం బాట పట్టింది. ఎంటర్ప్రెన్యూర్ కావాలనే రిన్జింగ్ చిరకాల కల అక్కడ రెక్కలు విప్పుకుంది. ‘ఉద్యోగ జీవితానికి సంబంధించి ఏ లోటు లేకపోయినప్పటికీ పెద్ద నగరాలలో కాలుష్యం, ఇరుకు ప్రదేశాలలో నివసించాల్సి రావడంతో బాగా విసుగెత్తిపోయాను. నా బిడ్డ పచ్చని ప్రకృతి ప్రపంచంలో పెరగాలనుకున్నాను. అందుకే వెనక్కి వచ్చేశాను’ అంటుంది రిన్జింగ్. ఉద్యోగం లేదు కాబట్టి బోలెడంత ఖాళీ సమయాన్ని చర్మ సంరక్షణకు సంబంధించిన పరిశోధనకు కేటాయించింది. ప్రకృతిలోని ఎన్నో వనమూలికల గురించి లోతుగా అధ్యయనం చేసింది. హిమాలయాలలో లభించే అరుదైన మొక్కలతో హ్యాండ్ క్రాఫ్టెడ్ స్కిన్‌కేర్ ప్రాడక్ట్స్‌కు సంబంధించిన ‘అగాపి సిక్కిం’ అనే అంకుర సంస్థను ఆరంభించింది. ‘అగాపి’ అనేది గ్రీకు పదం. దీని అర్థం... ప్రేమ. సిక్కింలోని అనేక ప్రాంతాలలో చర్మవ్యాధులకు ఔషధంగా తమ చుట్టుపక్కల ఉండే మొక్కలను ఉపయోగించడం అనేది తరతరాలుగా జరుగుతోంది. ఈ సంప్రదాయమే తనకొక దారి చూపింది. చర్మవ్యాధులను తగ్గించే ఎన్నో ఔషధాల వాడకం పరంపరగా వస్తున్నప్పటికీ వాటి గురించి స్కిన్‌కేర్ ఇండస్ట్రీకి తెలియదు. బిజినెస్ మోడల్‌ను డిజైనింగ్ చేసుకున్న తరువాత కబీ అనే ప్రాంతంలో తొలిసారిగా ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించింది రిన్జింగ్. ఇరవైమందికి పైగా మహిళలు హాజరయ్యారు. ఈ ఉత్సాహంతో మరిన్ని ప్రాంతాలలో మరిన్ని ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించింది.‘మా వర్క్‌షాప్‌లో శిక్షణ తీసుకున్న పదిమందికి పైగా మహిళలు సొంత ప్రాజెక్ట్‌లు మొదలు పెట్టడం సంతోషంగా అనిపించింది. ఏదో సాధించాలనే పట్టుదల వారిలో కనిపించింది. వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాను’ అంటుంది రిన్జింగ్. మాదక ద్రవ్యాలు, మద్యవ్యసనంతో శిథిలం అవుతున్న వారికి ఆ వ్యసనాల నుంచి బయటకు తీసుకువచ్చే సాధనంగా వర్క్‌షాప్‌లను ఉపయోగించుకుంటోంది రిన్జింగ్. పునరావాస కేంద్రాల్లో కూడా వర్క్‌షాప్‌లు నిర్వహించి వారిలో ఆర్థికస్థైర్యాన్ని నింపింది. మాస్కులు, షాంపులు, స్క్రబ్‌లు, ఫేషియల్ ఆయిల్... మొదలైనవి ఎన్నో ఉత్పత్తి చేస్తుంది అగాపి సిక్కిం. స్థానిక రకాల కలబంద, జనపనార... మొదలైన వాటిని తమ ఉత్పత్తులకు ముడిసరుకుగా ఉపయోగించుకుంటోంది. మొదట సిక్కిం చుట్టుపక్కల నగరాలలో ప్రాడక్ట్స్‌ను విక్రయించేవారు. ఆ తరువాత బెంగళూరు, కోల్‌కతాతో పాటు దేశంలోని ఎన్నో ప్రాంతాలకు మార్కెట్ విస్తరించింది. ‘అగాపి’ చెప్పుకోదగిన బ్రాండ్‌గా ఎదిగినప్పటికీ ‘ఇక చాలు’ అనుకోవడం లేదు రిన్జింగ్. స్కిన్ కేర్ సైన్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు తన పరిజ్ఞానాన్ని విస్తృతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంగ్లాండ్‌లోని ‘ఫార్ములా బొటానికా’కు సంబంధించి ఆన్లైన్ కోర్సులు చేస్తోంది. ప్రాచీన ఔషధాలపై కొత్త వెలుగు ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉన్న సంప్రదాయ ఔషధాలు వెలుగు చూసేలా, ప్రపంచానికి తెలిసేలా కృషి చేస్తోంది రిన్జింగ్. తాను కంపెనీ స్థాపించడమే కాదు ఇతరులు కూడా స్థాపించేలా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. ‘ఇక్కడ అడుగు పెట్టడానికి ముందు ఎన్నో ప్రశ్నలు ఉండేవి. ఇప్పుడు వాటికి సమాధానం దొరికింది. అగాపి విజయం నాకు ఎంతో ఉత్సాహం ఇచ్చింది’ అంటుంది రిన్జింగ్ భూటియ. -
AP: తుపాను ప్రభావిత జిల్లాల్లో వాయువేగంతో సాయం
సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: తుపాను ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వలంటీర్ల నుంచి గ్రామ, మండల స్థాయి అధికారులు, కలెక్టర్లు, సీనియర్ అధికారులు, ప్రత్యేక అధికారులు అంతా సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. వర్షాలు కాస్త తెరిపి ఇవ్వడంతో దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. తుపాను ప్రభావిత 12 జిల్లాల్లో గురువారం రాత్రి నాటికి 428 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిల్లో 26,226 మంది ఆశ్రయం పొందుతున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 144 పునరావాస కేంద్రాల్లో 8,529 మందికి ఆశ్రయం కల్పించారు. బాపట్ల జిల్లాలో 74 కేంద్రాల్లో 3,888 మంది, కృష్ణా జిల్లాలోని 67 కేంద్రాల్లో 3579 మంది, తిరుపతి జిల్లాలో 36 కేంద్రాల్లో 3,386 మంది, ప్రకాశం జిల్లాలోని 11 కేంద్రాల్లో 865 మంది, పల్నాడు జిల్లాలోని 14 కేంద్రాల్లో 1,677 మంది, ఏలూరు జిల్లాలోని రెండు కేంద్రాల్లో 151 మంది, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 37 కేంద్రాల్లో 910 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలోని 21 కేంద్రాల్లో 1,887 మంది, తూర్పు గోదావరి జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో 248 మంది ఆశ్రయం పొందుతున్నారు. శిబిరాల్లో ఉన్న వారికి భోజనం, మంచినీరు సౌకర్యం కల్పించారు. 74 వేలకుపైగా ఆహార పొట్లాలను బాధితులకు పంపిణీ చేశారు. 2.69 లక్షల మంచినీళ్ల ప్యాకెట్లను సరఫరా చేశారు. 171 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు ఎటువంటి వైద్య పరమైన సమస్యలు తలెత్తినా వెంటనే చికిత్స అందిస్తున్నారు. తాగు నీటికి ఇబ్బందులు లేకుండా బోర్ల వద్ద జనరేటర్లు, ట్యాంకర్లు ఏర్పాటు చేసి మరీ సరఫరా చేస్తున్నారు. సహాయ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.24.85 కోట్లు విడుదల చేసింది. ఆ నిధులతో జిల్లా కలెక్టర్లు బాధితులకు ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. పునరావాస కేంద్రాల నుంచి బాధితులు ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు ప్రభుత్వం అందించే రూ.1,000 నుంచి రూ.2,500 ఆర్థిక సాయాన్ని పలుచోట్ల పంపిణీ చేయగా, మిగిలిన చోట్ల కూడా అందించేందుకు ఏర్పాట్లు జరిగాయి. బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ విస్తృతంగా చేపట్టారు. ఆయా కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, లీటర్ పామాయిల్ ఇస్తున్నారు. విద్యుత్ సరఫరా దెబ్బతిన్న అన్ని చోట్లా వెంటనే పునరుద్ధరించారు. దెబ్బతిన్న రహదారులను తాత్కాలికంగా బాగు చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 12 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిర్విరామంగా సేవలు అందిసూ్తనే ఉన్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ, మచిలీపట్నం, ప్రకాశం జిల్లా ఒంగోలు, అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి, బాపట్ల జిల్లా బాపట్ల, పొట్టిశ్రీరాములు జిల్లా నెల్లూరు, తిరుపతి జిల్లా నాయుడుపేట, గూడూరులో ఈ బృందాల సభ్యులు అలుపెరగకుండా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ♦ బాపట్ల జిల్లాలో గురువారం ఉదయం నాటికి 596 గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. దెబ్బతిన్న ఒక్కో గృహానికి రూ.10 వేలు చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నారు. 700కిపైగా కూలిన చెట్లను రోడ్లపై నుంచి తొలగించారు. జిల్లాలో లక్షకుపైగా హెక్టార్లలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. ఉపాధి కూలీలతో వరి పొలాల్లోని నీటిని బయటకు తరలించే పనులు కొనసాగిస్తున్నారు. తుపాన్ ఉధృతికి పర్చూరు నియోజకవర్గంలో పర్చూరు వాగు, కప్పలవాగు, కొమ్మమూరు కాలువ, ఆలేరు వాగులకు దాదాపు 20 చోట్ల గండ్లు పడటంతో మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ♦ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధి హామీ కూలీలను వ్యవసాయ సహాయక చర్యల్లో వినియోగిస్తున్నారు. ముంపు తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో 1,282 మంది ఉపాధి కూలీలతో పంట బోదెల్లో పూడికలు తీయించారు. జేసీబీలతో డ్రెయిన్లలో పూడిక తొలగిస్తున్నారు. గ్రామాల్లో డోర్ టు డోర్ ఫీవర్ సర్వే చేపట్టారు. ♦తిరుపతి జిల్లాలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంతోపాటు 17 గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహించారు. జిల్లాకు తక్షణ సాయం కింద ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. బాధితులకు నిత్యావసర సరుకులను కిట్ రూపంలో అందజేశారు. ♦వర్షాలు కొద్దిగా తెరిపివ్వడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, చోడవరంలో ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ♦ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో దెబ్బతిన్న పంటను వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు ధైర్యం చెప్పారు. -
వరద బాధితులకు కొండంత అండ
సాక్షి, అమరావతి/నెట్వర్క్: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూత అందిస్తోంది. వరద వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పటినుంచే అప్రమత్తమై ఏ ఒక్క కుటుంబానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు రంగంలోకిదిగి అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఉన్నతాధికారులు, ఆ జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకుని యుద్ధప్రాతిపదికన పునరావాస ఏర్పాట్లకు ప్రణాళిక రూపొందించారు. అందుకనుగుణంగా చకచకా పునరావాస ఏర్పాట్లు జరిగాయి. గతంలో మాదిరిగా వరద ప్రభావం తగ్గిన తర్వాత తాపీగా అరకొర నిధులు విడుదల చేయడం కాకుండా.. ఐదుజిల్లాలకు అవసరమైన రూ.12 కోట్లు వెంటనే విడుదల చేశారు. ఫలితంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కార్యకలాపాలు పక్కాగా అమలవుతున్నాయి. 216 గ్రామాలకు వరద ముంపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 216 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ఆ గ్రామాల నుంచి 52,753 మందిని తరలించారు. వీరిలో 48,345 మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. 79 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. వరద ముంపు ప్రభావం అల్లూరి సీతారామరాజు జిల్లాపై ఎక్కువగా ఉండడంతో అక్కడ నాలుగు మండలాల పరిధిలోని 96 గ్రామాల ప్రజల కోసం 51 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిల్లో 43,587 మంది ఆశ్రయం పొందుతున్నారు. పారిశుధ్య పనులు ముమ్మరం వరద తగ్గిన తర్వాత బాధితులు పునరావాస కేంద్రాల నుంచి తిరిగి తమ ఇళ్లకు వెళ్లేటప్పుడు వారికి రూ.వెయ్యి నుంచి రూ. 2 వేల ఆర్థికసాయం అందించాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టంగా ఆదేశాలు జారీచేయడంతో అధికారులు అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ డబ్బు పంపిణీ కోసం ఇప్పటికే రెవెన్యూ శాఖ ఉత్వర్వులు జారీచేసింది. బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, లీటర్ పామాయిల్ ఇస్తున్నారు. ఐదు వరద ప్రభావిత జిల్లాల్లో దెబ్బతిన్న ఇళ్లకు ఇచ్చే పరిహారాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ రూ.10 వేలకు పెంచారు. గతంలో ఇది రూ.5 వేలు ఉండగా సీఎం సూచనతో దాన్ని రూ.10 వేలకు పెంచుతూ జీవో జారీ అయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, తాగునీటి సరఫరా పథకాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఇప్పటికే పునరుద్ధరించారు. ఆ గ్రామాల్లో పారిశుధ్యం దిగజారకుండా బ్లీచింగ్ చల్లడం వంటి కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నారు. గ్రామ వలంటీర్లు చురుగ్గా పనిచేస్తూ స్థానికంగా ఉన్న పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారమిస్తున్నారు. గ్రామ సచివాలయాల నుంచే గ్రామాల వారీగా సహాయక చర్యలు జరుగుతున్న తీరును కలెక్టర్లు, ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ♦ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లోని ముంపు గ్రామాల్లో అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్ సుమిత్‌కుమార్ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. చింతూరు కేంద్రంగా డివిజన్లోని ముంపు ప్రాంతాలకు లాంచీలు, మరబోట్ల ద్వారా బియ్యం, కందిపప్పు, కూరగాయలు, పాలప్యాకెట్లు, కొవ్వొత్తులు, టార్పాలిన్లు సరఫరా చేస్తున్నారు. వరద బాధితులకు పంపిణీ చేసేందుకు పట్టణ ప్రాంతాల నుంచి ఎప్పటికప్పుడు తాజా కూరగాయలు రప్పిస్తున్నారు. వరదలకు చింతూరు డివిజన్లో 250 గ్రామాలకు చెందిన 17 వేల కుటుంబాలు ప్రభావితమైనట్లు అధికారులు తెలిపారు. ఎటపాక మండలం నెల్లిపాకకు చెందిన దేదారి రాముడు (50) అనే వ్యక్తి పశువులు మేపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ వరదనీటిలో పడి మృతిచెందాడు. ♦ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వరద బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలను అధికారులు ముమ్మరం చేశారు. పునరావాస కేంద్రాలు, వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. బాధితులకు ఆహార, తాగునీటి అవసరాలు తీరుస్తూ, అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నారు. ♦ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 1,321 కుటుంబాలకు చెందిన 3,787 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానికుల రాకపోకలకు అనువుగా 172 పడవలు ఏర్పాటు చేశారు. వరదలకు బాధితులకు పునరావాసం కల్పించడంతోపాటు భోజన ప్యాకెట్లు అందిస్తున్నారు. కె.గంగవరం మండలం కోటిపల్లి వద్ద మత్స్యకార కాలనీ ముంపు బారిన పడింది. ఇక్కడ 300 మందికి భోజన వసతి కల్పించారు. ఐ.పోలవరం మండలం కేశనకుర్రులో 700 మందికి ఆహార పొట్లాలు అందించారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి, పాశర్లపూడిలంకల్లో సుమారు 400 మందికి భోజన ప్యాకెట్లను పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పంపిణీ చేశారు. జిల్లాలో 20 పునరావాస కేంద్రాలు నడుస్తూండగా, బాధితులకు 21,756 భోజన ప్యాకెట్లు అందజేశారు. 33 వేల మంచినీటి ప్యాకెట్లు, 4,400 వరకు 20 లీటర్ల వాటర్ టిన్నులను అందించారు. -
గోదావరికి పెరుగుతున్న వరద
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ఏటూరునాగారం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం ఓ మోస్తరునుంచి భారీ స్థాయిలో వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. అయితే, అశ్వారావుపేట, దమ్మపేట, అన్న పురెడ్డిపల్లి, జూలూరుపాడు, పాల్వంచ, సుజాతనగర్, సత్తుపల్లి, ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు తది తర మండలాల్లో మాత్రం భారీ వర్షపాతం నమోదైంది. దీంతో జలాశయాల్లోకి నీరు చేరి జలకళ సంతరించుకుంది. ఇక లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడగా, పలుచోట్ల లోలెవల్ వంతెనల పైనుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏ ర్పడింది. కాగా, ఎగువన వదిలిన నీటితో భద్రాచలంలో ని గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గురు వారం రాత్రికి 15 అడుగులకు నీటిమట్టం చేరి స్నానఘ ట్టాలను తాకుతూ ప్రవహిస్తోంది. అయితే, ఇంకా వరద వస్తుండటంతో మరో రెండు అడుగులు పెరగొచ్చని అధి కారులు అంచనా వస్తున్నారు. ఈమేరకు నీటిమట్టం పెరి గితే లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు 12 చోట్ల పునరావాస కేంద్రాలను సైతం సిద్ధం చేశారు. కాగా, భద్రాచలం వద్ద గోదావరి గత ఏడాది ఇదే సమ యానికి 71.3 అడుగులకు చేరిన విషయం విదితమే. ఇక భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజె క్టుకు ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్ నుంచి భారీగా వరద వచ్చి చేరు తోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా, 71. 80 మీటర్ల వద్ద క్రమబద్ధీకరించేందుకు గేట్లు ఎత్తి 2,196 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉగ్రగోదావరి....: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ముళ్లకట్ట గోదావరి బ్రిడ్జి వద్ద గోదావరి నది సుమారు రెండు కిలోమీటర్ల వెడల్పుతో ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లోని బ్యారేజీల నుంచి నీరు విడుదల కావడం, వరద నీరు బ్రిడ్జి వద్ద ప్రవహిస్తుండటంతో ఇన్ని రోజులు వెలవెలబోయిన గోదావరి నిండుకుండలా మారింది. దీంతో పలువురు పర్యాటకులు సెల్ఫోన్లో వరద అందాలను బంధించారు. -
వరదలో చిక్కుకున్న గిరిజనులు..
సాక్షి, నెల్లూరు: పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన పునరావాస కేంద్రాలను సందర్శించారు. ఆహారం, వసతి సౌకర్యాలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. (చదవండి: నివర్ తుపాన్: రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే) వరద బాధితులకు ఫుడ్ ఫ్యాకెట్లు పంపిణీ.. వైఎస్సార్ జిల్లా: వరద బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారని ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన వరద బాధితులకు ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నప్రతి ఒక్కరికీ రూ.500 ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. (చదవండి: ఏపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం) రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్... హేమాద్రివారిపల్లె వద్ద రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం అయ్యింది. వరదలో చిక్కుకున్న 130 మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. లోతట్టుప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో.. నెల్లూరు జిల్లా: పెరమన వద్ద గిరిజనులు వరదలో చిక్కుకున్నారు. రొయ్యల గుంటలకు కాపలా కోసం వెళ్లిన 11 మంది గిరిజనులు.. ఒక్కసారిగా పెరిగిన వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సంగం జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో నెల్లూరు నుంచి కడప రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
ఆ ఐదు గ్రామాలూ ఖాళీ
విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి సమీపంలోని ఐదు గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. బస్సుల్లో వీరిని సింహాచలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. సింహాచలం కొండ దిగువ పాత గోశాల దగ్గర నుంచి మార్కెట్ కూడలి వరకు ఉన్న పలు ప్రైవేటు కల్యాణ మండపాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు. వెంకటాపురంలో ఉన్న 1250 ఇళ్ల నుంచి సుమారు 8 వేల మందిని, నందమూరినగర్‌లో ఉన్న 600 కుటుంబాలకు చెందిన 2,250 మందిని, కంపరపాలెంలోని 250 ఇళ్ల నుంచి 1200 మందిని, పద్మనాభనగర్‌లో 500 కుటుంబాల నుంచి 2,500 మందిని, ఎస్సీ, బీసీ కాలనీలో 480 ఇళ్ల నుంచి 2 వేల మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వారందరికీ అక్కడే భోజన ఏర్పాట్లు చేసి వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. పూర్తిగా ప్రమాదం లేదని నిర్ధారించిన తరువాతే ప్రజలను గ్రామాలకు వెళ్లేందుకు అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్, చినగదిలి తహసీల్దార్ పునరావాస కేంద్రాల వద్దకు వెళ్లి బాధితులను పలకరించారు. కాగా, గురువారం అర్ధరాత్రి కూడా వెంకటాపురం చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు..
సాక్షి, విజయవాడ: కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో వీఎంసీ (విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్) పునరావాస కేంద్రాల పెంపుపై దృష్టి పెట్టింది. నగరంలోని సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాల్లో కొత్తగా మరో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 14 పునరావాస కేంద్రాలు ఏర్పాటయ్యాయి. నిరాశ్రయులు, వలస వాసుల కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు. గుర్తించిన 200 మందిని సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజిలో ఏర్పాటు చేసిన పునరావాసానికి తరలించారు. భౌతిక దూరం పాటించేలా పడకలు ఏర్పాటు చేయడంతో పాటు.. మెరుగైన సదుపాయాలతో ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తోంది. ప్రతి నిత్యం వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నోడల్ అధికారి పర్యవేక్షణలో పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. -
టర్కీలో భారీ భూకంపం
ఎలాజిగ్: తూర్పు టర్కీని భారీ భూకంపం వణికించింది. ఎలాజిగ్, మలాట్యా ప్రావిన్స్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంపం ధాటికి 22 మంది మృతిచెందగా.. 1,015 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. సివ్రిస్ నగరంలో చిన్న సరస్సు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. తొలుత సివ్రిస్లో భూమి కంపించిందని టర్కీ విపత్తు, అత్యవసర నిర్వహణ సంస్థ వెల్లడించింది. దాదాపు 30 సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూకంప తీవ్రతకు పలు ఇళ్లు నేలకూలాయి. ఘటనా స్థలాలకు చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఎలాజిగ్‌లో శిథిలాల్లో చిక్కుకున్న 39 మందిని సురక్షితంగా కాపాడామని టర్కీ అంతర్గత మంత్రి సులేమాన్ సోయ్లు వెల్లడించారు. టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దాదాపు 2 వేల మంది రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. భూకంప బాధితుల కోసం మలాట్యాలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని ట్వీట్ చేశారు. -
తలదాచుకునే తావేదీ!
తూర్పుగోదావరి, పిఠాపురం/గొల్లప్రోలు: సుమారు 30 వేల మందికి పైగా తుపాను బాధితులు. అంతమందికి ఆరేసి తరగతి గదులున్న ఎనిమిది పాఠశాలలే పునరావాస కేంద్రాలు. పట్టుమని పదిమంది పడుకుందామన్నావీలు లేనంత ఇరుకుగా గదులు. కరెంటు లేదు. తాగునీరు లేదు. మరుగుదొడ్ల మాటే లేదు. గత్యంతరం లేక ఇటువంటి అవస్థల నడుమనే పెథాయ్ తుపాను బాధితులు ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని పునరావాస కేంద్రాల్లో తల దాచుకోవాల్సి వచ్చింది. తుపాను ముప్పు ముంచుకువస్తోందని, ఇళ్లు వదిలి పునరావాస కేంద్రాలకు తరలిరావాలని, అన్ని వసతులూ కల్పించామని అధికారులు హడావుడి చేశారే తప్ప.. వసతుల కల్పనలో పూర్తిగా విఫలమయ్యారని బాధితులు విమర్శిస్తున్నారు. ఇవీ ఇబ్బందులు ♦ తమ వద్ద పేర్లు నమోదు చేసుకున్న వారికే పునరావాస కేంద్రాల్లో అధికారులు భోజనం పెట్టారు. ఇది తమను అవమానించడమేనని పలువురు వాపోయారు. ♦ పునరావాస కేంద్రాలు కేవలం భోజనాలు వండి పెట్టడానికే తప్ప వందల కుటుంబాలు తలదాచుకోడానికి, పిల్లాపాపలతో నిద్రించడానికి వీలు లేకుండా ఉన్నాయని పలువురు అన్నారు. భోజనం మాత్రమే పెడితే తమ సామగ్రిని ఇళ్ల వద్ద వదిలేసి పునరావాస కేంద్రాలకు ఎలా వస్తామని మత్స్యకారులు ప్రశ్నించారు. ♦ ఆదివారం రాత్రే శిబిరానికి వచ్చినా పాలు, రొట్టెల వంటివి లేక చంటి పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లులు వాపోయారు. పునరావాస శిబిరాలను సందర్శించిన వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు వద్ద పలువురు ఈ విషయమై ఆవేదన వ్యక్తం చేశారు. ♦ అన్ని పునరావాస కేంద్రాల వద్ద భోజనాలు ఏర్పాటు చేయకుండా ఒకచోట వండించి బాధితులకు లెక్క ప్రకారం తెచ్చి పెడుతున్నారని, దీంతో గంటల తరబడి ఆకలితో అలమటించాల్సి వచ్చిందని బాధితులు వాపోతున్నారు. ♦ మూలపేటలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉదయం అల్పాహారం పూర్తిస్థాయిలో సరఫరా చేయలేదు. దీనిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంటి పిల్లలకు పాలు లేవని మహిళలు మండిపడ్డారు. మధ్యాహ్నం రెండు గంటలయినా భోజనం పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు వదిలి కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు వచ్చిన తమకు కనీసం దుప్పట్లు కూడా ఇవ్వలేదన్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా తెలపలేదని అధికారులపై గ్రామస్తులు మండిపడ్డారు. ♦ వందల మందికి ఒకేచోట పునరావాసం ఏర్పాటు చేసినా మరుగుదొడ్లు, మంచినీరు, కరెంట్ వంటి వసతులు కల్పించలేదు. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ♦ రెవెన్యూ అధికారులు అసలు పునరావాస కేంద్రాల వద్దకే రాలేదని మత్స్యకారులు ఆరోపించారు. కొత్తపల్లి జెడ్పీ హైస్కూలులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో కేవలం ఉపాధ్యాయులే పర్యవేక్షకులుగా ఉన్నారు. దీంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నామని బాధితులు చెప్పారు. -
కేరళను పీడిస్తున్న ర్యాట్ ఫీవర్
తిరువనంతపురం: వరద బీభత్సం అనంతరం కేరళలో ర్యాట్ ఫీవర్ (లెప్టోస్పైరోసిస్) విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి 9 మంది చనిపోగా, 71 మందికి చేసిన రక్తపరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో మరో 123 మంది ఇవే లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరారు. పాలక్కడ్, కోజికోడ్ జిల్లాల్లో ర్యాట్ ఫీవర్ ప్రభావం ఎక్కువగా ఉందని కేరళ డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ప్రకటించింది. వరదలు తగ్గుముఖం పట్టాక వివిధ రకాల జ్వరాలతో రాష్ట్రవ్యాప్తంగా చికిత్స పొందిన వారి సంఖ్య 13,800 దాటింది. ర్యాట్ ఫీవర్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ వెల్లడించారు. అలప్పుజ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చాలా ఇళ్లు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. చాలాచోట్ల పునరావాస కేంద్రాలు ఇంకా కొనసాగుతున్నాయి. -
ఎటు చూసినా కన్నీటి గాథలే
ఊహించని విలయం వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. నీటి ప్రవాహం ముంచెత్తడంతో దిక్కుతోచని స్థితిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. ప్రాణాలు దక్కించుకున్నారు. బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీశారు. ప్రకృతి ప్రకోపం చల్లారింది. వరద తగ్గుముఖం పట్టింది. దీంతో పునరావాస కేంద్రాల నుంచి కొంతమంది ఇప్పుడిప్పుడే ఇళ్లకు వస్తున్నారు. ఆనవాళ్లు కోల్పోయిన ఇళ్లు, చెల్లాచెదురుగా పడి ఉన్న సామాగ్రి.. ఎటు చూసిన బురద.. వారికి దర్శనమిచ్చాయి. ఆ ఇంట్లోని వస్తువులను తలచుకుంటూ, జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. కన్నీటి వరదలో ఇళ్లను పునర్నిర్మించుకునే పనిలో పడ్డారు. ఒక్క క్షణం ఆలస్యమైతే బతికేవాడ్ని కాదు ‘మా ఇంట్లోకి పది అడుగుల వరకు నీళ్లు వచ్చేశాయి. ఐదు రోజుల పాటు ఆ నీళ్లు అలానే ఉన్నాయి.. ప్రస్తుతం మా ఇల్లు యుద్ధభూమిని తలపిస్తోంది’ అని చెప్పుకొచ్చారు. ఎర్నాకుళం జిల్లాలోని మంజలే గ్రామానికి చెందిన అబ్దుల్ సలాం. ‘ఆగస్టు 14వ తేదీ రాత్రి నీటి ప్రవాహం మా ఇంటివైపు రావడం గమనించాను. వెంటనే మా పక్కింటి వాళ్లను అప్రమత్తం చేసి మా మొదటి అంతస్తులోకి నేను, నా భార్య వెళ్లిపోయాం. సురక్షితంగా ఉన్నామని భావించా. అయితే నీటి ప్రవాహం అంతకంతకూ పెరిగింది. ట్రెరస్కు కొద్ది దూరం వరకు నీళ్లు వచ్చేశాయి. స్థానికులు ఓ పడవలో వచ్చి మమ్మల్ని రక్షించారు. మొదట నా భార్య పడవలోకి వెళ్లింది. నేను ఆమె చీరను పట్టుకుని పడవలోకి దూకేందుకు ప్రయత్నించాను. అయితే కాలు జారి నీళ్లలో పడిపోయాను. వెంటనే బోటులో ఉన్న వారు స్పందించి నన్ను పట్టుకుని పైకి తీశారు. ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే నా ప్రాణాలు నీటిలో కలిసిపోయేవి’ అంటూ ఆనాటి భయానక సంఘటనను గుర్తు చేసుకున్నారు సలాం. ‘గోడకు ఉన్న అల్మారాలో నా ఇద్దరు పిల్లలు స్కూలు, కాలేజీ రోజుల్లో సాధించిన ట్రోఫీలు, మెడల్స్ భద్రంగా దాచాను. వరదలకు అవి కొట్టుకుపోయాయి. ఆ ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సర్టిఫికెట్లు మాత్రమే మిగిలాయి.. చాలకుడి ప్రాంతానికి చెందిన సురేష్ జాన్ కుటుంబం రెండంతస్తుల భవనంలో ఉంటున్నారు. పది అడుగుల వరకు నీళ్లు రావడంతో ఇంట్లో వారి కుక్కను వదిలిపెట్టి కట్టుబట్టలతో ఇంటి నుంచి పునరావాస కేంద్రానికి వెళ్లారు. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ఇంటికి చేరారు. బురద, మరకలతో భయంకరంగా భయంకరంగా ఉన్న గోడలు వారికి దర్శనమిచ్చాయి. ఫర్నీచర్ అంతా ఓ చోట కూప్పగా పడి ఉంది. పుస్తకాలు అల్మారాలోనే నానిపోయి ఉన్నాయి. ప్రతీ గదిలోనూ బురద పేరుకుపోయింది. ‘ఇంటి పరిస్థితి చూస్తే నాకు మాటలు రావడం లేదు. నేను చాలా విచారంలో ఉన్నాను. సర్వం కోల్పోయాను, మా కుటుంబం మామూలు స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. నా దగ్గర డబ్బులు కూడా లేవు’ అంటూ జాన్ కన్నీటి పర్యంతమయ్యారు. మొదటి అంతస్తులో ఉందామని మొదట అనుకున్నాం. అయితే నీటి ప్రవాహం అంతకంతకూ పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో క్యాంప్‌కు వెళ్లాం. నా బట్టలు, పాత, కొత్త పుస్తకాలు, ఫైల్స్, పేపర్లు అన్నీ పాడైపోయాయి. సర్టిఫికెట్లు జాగ్రత్తగా దాచుకోవడంతో అవి మాత్రమే మిగిలాయి’.అంటూ వాపోయారు ఎల్సా జాన్. అయితే, వారి కుక్క మాత్రం సురక్షితంగా తిరిగి వచ్చింది. మానసిక ఆందోళనలో ఉన్నారు ఓ పునరావాస కేంద్రంలో ఉన్న ఓ వృద్ధుడు ఛాతిలో నొప్పిగా ఉందని క్యాంప్‌లో సేవలందిస్తున్న వైద్యుడు రఫీక్‌ను కలిశాడు. అతన్ని పరీక్షించిన వైద్యుడు.. రోగం సంగతి ఎలా ఉన్నా ‘ముందు నువ్వు మీ ఇంటికి వెళ్లొద్దు.. మీ కొడుకు ఇల్లు మొత్తం శుభ్రం చేశాకే ఇంటికి వెళ్లు’ అని చెప్పాడు. దీన్ని బట్టి అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. ‘ఎంతో కష్టపడి చాలా మంది తమ ఇళ్లను నిర్మించుకున్నారు. ఆ ఇంటితో వారికి విడదీయరాని బంధం, అనుబంధం ఉంటుంది. ఇప్పుడున్న స్థితిలో ఆ ఇంటిని చూస్తే వారు తట్టుకోలేరు. వారంతా మానసిక ఆందోళనకు గురవుతున్నారు. శారీరకంగా ధృడంగా ఉన్న వారు కూడా బోరున విలపిస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు డాక్టర్ రఫీక్. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పునరావాస కేంద్రాల్లోని సమస్యలను పరిష్కరిస్తాం
►జాయింట్ కలెక్టర్ రాంకిషన్ ►ఇంటికో ఉద్యోగం ఇప్పించండి ►సంగంబండ బాధితల మొర మక్తల్: పునరావాస కేంద్రాల్లో సమస్యలు పరిష్కరిస్తామని, ఇందుకు అందరూ సహకరించాలని జేసీ రాంకిషన్ సంగం ముంపు బాధితులను కోరారు. శుక్రవారం మండల సమీపంలో చేపడుతున్న పునరావాస కేంద్రమైన కొత్తగార్లపల్లి గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి సమస్యలపై ఆరా తీశారు. ప్రధానంగా నీటి సమస్య వేధిస్తోందని, దీంతో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయని బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. పునరావాసంలో 240 ఇళ్లు మంజూరయ్యాయని, అందులో 79 ఇళ్లు పూర్తి కాగా 64 బేస్‌మెంట్‌లెవల్, 15 ఇళ్లుపైకప్పు వరకు, 46 ఇళ్లు పనులు చేపట్టలేదని అధికారులు నివేదికలను సమర్పించారు. అందులో పది మంది మృతి చెందారని పేర్కొన్నారు. కొందరు శ్మశాన వాటికకు స్థలంలేదని, మరికొందరు తమకు ఇళ్లస్థలాలు చూపలేదని జేసీ దృష్టికి తీసుకొచ్చారు. కన్నీటితో దాహం తీర్చుకోవాలా సారూ.. పునరావాస కేంద్రాన్ని సందర్శించేందుకు వచ్చిన జేసీ రాంకిషన్‌కు హృదయ విదారకర ఘటన ఎదురైంది. తాగేందుకు గుక్కెడు నీరు లేవు. కన్నీటితో దాహం తీర్చుకోవాలా సారూ...అంటూ బాధితులు మొరపెట్టుకున్నారు. భగభగ మండే ఎండలో దాహం తీర్చుకోడానికి నీళ్లు లేక తాము ఎలా బతకాలి... ఇళ్లు ఎలా నిర్మించుకోవాలని కొందరు ప్రశ్నించారు. నీటి కోసం ఎంత మంది కాళ్లు పట్టుకోవాలి..ఎవరినని అడుక్కోవాలి సారూ...అని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇందుకు చలించిపోయిన ఆయన వెంటనే ఆర్డబ్ల్యూఎస్ అధికారి నాగరాజు పనితీరు గురించి ఆరా తీయగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్ఈకి ఫోన్ చేయగా విద్యుత్ మోటార్ల ద్వారా తాగునీటిని సరఫరా చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకొని ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని కొందరు తెలపగా ప్రస్తుతానికి ఒక మోటారుతో సరిపెట్టుకోవాలని, ఆ తరువాత శాశ్వత పరిష్కారానికి చర్యలు తీ సుకుంటామన్నారు. పదైదు రోజుల కోసారి వచ్చి పరిశీలిస్తానని భరోసా ఇచ్చారు. గార్లపల్లిని ఖాళీ చేయాలి ఆ తరువాత సంగంబండ రిజర్వాయర్ కింద ముంపునకు గురైన ఊట్కూర్ మండలం గార్లపల్లి గ్రామాన్ని ఆయన సందర్శించారు. త్వరలో ఖాళీ చేయాలని బాధితులకు తెలపగా నీటి సమస్యను పరిష్కరించేంత వరకు ఖాళీ చేయమని స్పష్టం చేశారు. సర్వం కో ల్పోయామని తమ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలని కోరారు. కొత్తగార్లపల్లిలో రేషన్‌షాపు, అంగన్వాడీ తదితర అనేక సమస్య లు ఉన్నాయని జేసీకి తెలపగా అన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట నారాయణపేట్ ఆర్డీఓ వేణుగోపాల్, హౌసింగ్ డీఈ సురేందర్‌గౌడ్, తహసీల్దార్లు అంజిరెడ్డి, మాదవ్‌రావు, హౌసింగ్ ఏఈలు విజయకుమార్, వీరేష్‌చారి, సతీష్‌కుమార్, నాగరాజు, బాల్‌రాజు, ఆర్ఐ భాస్కర్, వీఆర్ఓలు నారాయణ, ఆనంద్, మల్లికార్జున, నిర్వాసితులు మల్లేష్‌గౌడ్, శాంతిరెడ్డి తదితరులు ఉన్నారు. -
‘మత్తు’ పంజా
* కల్తీ కల్లు లేక మరో 19 మంది మృతి * మహబూబ్‌నగర్ జిల్లాలోనే 9 మంది * ఒంటికి నిప్పంటించుకొని ముగ్గురి ఆత్మహత్య * రిహాబిలిటేషన్ సెంటర్లు లేకపోవడంతో పరిస్థితి తీవ్రం సాక్షి నెట్వర్క్: తెలంగాణ పల్లెలపై ‘మత్తు’ మృత్యుపంజా విసురుతోంది! ఇన్నాళ్లూ కల్తీ కల్లుకు బానిసలైనవారంతా మత్తుకు దూరమై చావుకు చేరువవుతున్నారు. కొందరు పిచ్చెక్కి ప్రాణాలు తీసుకుంటే.. మరికొందరు ఆసుపత్రుల్లో కన్నుమూస్తున్నారు. బుధవారం ఇలా 19 మంది మృత్యువాత పడ్డారు. మహ బూబ్‌నగర్ జిల్లాలో తొమ్మిది మంది, నిజామాబాద్‌లో నలుగురు, ఆదిలాబాద్‌లో ముగ్గురు, మెదక్‌లో ఇద్దరు, కరీంనగర్ లో ఒక్కరు చనిపోయారు. వీరిలో మతిస్థిమితం కోల్పోయి ముగ్గురు ఒంటిపై కిరోసిన్ పోసుకొని మంటలకు ఆహుతయ్యారు. పలు జిల్లాల్లో ఆసుపత్రులు కల్లు బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రభుత్వపరంగా ఇప్పటికే రీహాబిలిటేషన్ కేంద్రాలను ప్రారంభించి ఉంటే పరిస్థితి ఇంతలా విషమించేది కాదు. బాధితులను వాటిలో చేర్చి, సకాలంలో చికిత్స అందించి ఉంటే వృతుల సంఖ్య తగ్గేది. కానీ ప్రభుత్వం ఆ దిశగా చురుగ్గా కదలడం లేదు. జిల్లాల్లో ఇదీ పరిస్థితి.. మహబూబ్‌నగర్ జిల్లాలో కల్లులో మత్తు మోతాదు తగ్గడంతో పలువురు మతిస్థిమితం కోల్పోతున్నారు. ఆత్మకూర్ మండలం కొంకనివానిపల్లికి చెందిన బోయ బుచ్చమ్మ (45) వారం రోజులుగా కల్లు దొరకకపోవడంతో వింతగా ప్రవర్తిస్తోంది. బుధవారం కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇదే గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డి(40) తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. కల్లు లభించకపోవడంతో మానసిక రోగిగా ప్రవర్తిస్తున్నాడు. భార్య కూలీ పనులకు వెళ్లిన తర్వాత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయాడు. కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామానికి చెందిన చంద్రయ్య (65) వింత ప్రవర్తనతో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మకూర్‌లోని స్థానిక భరత్‌నగర్‌కు చెందిన గోవిందమ్మ(45), జడ్చర్ల మండలం బాదేపల్లి పట్టణానికి చెందిన వి.చెన్నయ్య(60), మైనోద్దిన్(60) మందు కల్లు తాగి చనిపోయారు. కల్లు లేక నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామానికి చెందిన దేవమ్మ(45) అస్వస్థతకు గురై చనిపోయింది. నవాబుపేట మండలం కారుకొండకు చెందిన భాగమ్మ (60) కల్తీ కల్లు లేక మతిస్థిమితం కోల్పోయింది. చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించగా చనిపోయింది. దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన కుమ్మరి బాలమ్మ(60) కల్లు లేక అస్వస్థతకు గురై చనిపోయింది. వనపర్తి మండలం శ్రీనివాసపురానికి చెందిన కృష్ణయ్యను ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. బుధవారం ఉదయం ఆస్పత్రిలోని మొదటి అంతస్తు నుంచి కిందకు దూకాడు. దీంతో అతడి కాలు విరిగింది. ఆదిలాబాద్ జిల్లా బాసరకు చెందిన ముల్కి పోతన్న (57), దూజ్‌గాం పోశెట్టి (63)లు కల్లు లేక ఫిట్స్‌తో ఇంట్లో పడిపోయాడు. వారిని ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయారు. నిర్మల్ పట్టణంలోని ఈద్గాంకు చెందిన మహమూద్ (45) మంగళవారం కల్లు తాగాడు. మత్తు మోతాదు తగ్గడంతో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. మైలాపూర్‌కు చెందిన కొందపురం పోశెట్టి (63) వింతగా ప్రవర్తిస్తూ బావిలో దూకాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిజామాబాద్‌లో నలుగురు నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణికి చెందిన బండారి పర్వయ్య(38) కల్తీ కల్లు మృత్యువాత పడ్డాడు. ఆర్మూర్ పట్టణంలోని రంగాచారీ కాలనీలో నివసించే గాదె బాల్‌రెడ్డి(46) కొంతకాలంగా కల్తీకల్లు తాగుతున్నాడు. కొద్ది రోజులుగా దొరక్కపోవడంతో మతిస్థిమితం కోల్పోరుు ఇంట్లో నుంచి వెళ్లిపోయూడు. బుధవారం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో శవమై కనిపించాడు. కామారెడ్డిలో ముదాంగల్లీకి చెందిన అంజయ్య(42) కల్లు లేక అనారోగ్యం బారిన పడి బుధవారం మృతిచెందాడు. సదాశివ్‌నగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డిలో పందిరి శ్రీనివాస్(35) వారం రోజులుగా కల్లు దొరక్క మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం తిమ్మాపూర్‌కు చెందిన బాస జలపతి 15 రోజులుగా కల్లులో మత్తు తగ్గడంతో వికృత చేష్టలకు దిగుతున్నాడు. బుధవారం భార్యను తల పట్టుకొని గోడకు కొట్టడంతో ఆమె కోమాలోకి వెళ్లింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సిరిసిల్లకు చెందిన శ్రీరాముల రాజయ్య(55) వింతగా ప్రవర్తించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. 21న ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. బుధవారం పట్టణ శివారులోని చెరువు సమీపంలో శవమై కనిపించాడు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లికి చెందిన నీరుడి నర్సింలు (45) కల్లు లేక మంగళవారం రాత్రి కన్నుమూశాడు. ఇదే జిల్లా సుల్తాన్‌పూర్‌కు చెందిన యాదమ్మ (70) కల్తీ కల్లు లేక మతిస్థిమితం కోల్పోయింది. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ మంగళవారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎర్రగడ్డకు 2 రోజుల్లో 130 మంది ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయం అవుట్ పేషంట్ విభాగానికి కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 130 మంది బాధితులు వచ్చారు. వీరిలో 25 మంది ఇన్పేషెంట్లుగా చేరారు. గత వారం రోజుల నుంచి ఆస్పత్రి ఓపీకి వస్తున్న బాధితుల్లో 80-90 శాతం మంది కల్తీ కల్లు బాధితులేనని ఆస్పత్రి వ ర్గాలు తెలిపాయి. గతం మరచి.. హుస్సేన్‌సాగర్‌లో దూకి కల్తీ కల్లుకు దూరమై హైదరాబాద్‌లోని తిరుమలగిరికి చెందిన జక్కం సురేశ్(30) బుధవారం హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. సమయానికి పోలీసులు వచ్చి కాపాడారు. రోజు కల్లు తాగి వస్తుండటంతో భార్య రజిత జనవరిలో ఆయనకు విడాకులిచ్చింది. మంచిగా మారాలని కల్లు మానేశాడు. అయితే మానసిక స్థితి కోల్పోయి గతాన్ని కూడా మరచిపోతున్నట్టు పోలీసులు తెలిపారు. మందులు ఉన్నాయి కల్తీ కల్లుకు విరుగుడుగా మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని అందుబాటులో ఉంచకుండా కల్లుపై నిషేధం విధించడం సరికాదు. మానేయాలని భావించే వారికి ఈ విషయంపై దృఢమైన సంకల్పం ఉండాలి. ఇందుకోసం బాధితులు ముందు వైద్యులను సంప్రదించి వారు ఇచ్చే సూచనలు, సలహాలు పాటించాలి. వీటి సాయంతో బాధితుని శరీరంలో పేరుక పోయిన విష పదార్థాలను బయటికి పంపి మామూలు మనిషిని చేయవచ్చు. - డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ న్యూరో ఫిజిషియన్, సిటీన్యూరో సెంటర్ -
భిక్షాటనలో బాల్యం
పట్టించుకోని పాలకులు గూడూరు టౌన్ : బాల్యం భిక్షాటన చేస్తోంది. నిరక్షరాస్యత, పేదరికం లాంటి కారణాలతో బాల్యం ప్రశ్నార్థకంగా మారింది. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల పలువురు బాలలు యాచకులుగా మారుతున్నారు. ‘బడిపిలుస్తోంది’ కార్యక్రమాలతో బడీఈడు పిల్లలను బడికి రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వడం లేదు. భిక్షాటన చేస్తున్న బాలల కోసం అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు ఎందుకూ పనికి రావడం లేదు. భిక్షాటనే వృత్తిగా.. : జిల్లాలో 2 వేలకు పైగా చిన్నారులు భిక్షాటనే వృత్తిగా జీవనం సాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. రైల్వేస్టేషన్, బస్టాండ్, సినిమాహాళ్లు, కళాశాలలు, షాపింగ్‌మాల్స్, కూడలి ప్రాంతాలు, ఆలయాల వద్ద అనేక మంది చిన్నారులు యాచిస్తున్నారు. బడిఈడు పిల్లలను గుర్తించి వారిని పాఠశాలలకు పంపేలా ఐసీపీఎస్, ఐసీడీఎస్, విద్యాశాఖాధికారులతో పాటు ప్రభుత్వంలోని అన్నిశాఖల అధికారులు పని చేయాల్సి ఉంది. భిక్షాటన చేస్తు న్న వారిలో ఎక్కువగా 14 ఏళ్లలోపు చిన్నారులే ఉంటున్నారు. నెల్లూరులోని సుందరయ్య కాలనీ, గూడూరు, కావలి రైల్వేస్టేషన్ల సమీపంలో నివాసముంటున్న వారి పిల్లలే అధికంగా భిక్షాటన చేస్తున్నారు. కొంతమంది అయ్యప్పమాల సీజన్లో స్వామి మాలలు ధరించి భిక్షాటన చేస్తున్నారు. తూతూ మంత్రంగా పథకాలు అమలు.. నిర్బంధ విద్య, బడి పిలుస్తోంది తదితర పథకాలు తూతూ మంత్రంగా అమలవుతుండడంతో చిన్నారుల జీవితాలు భిక్షాటనతో బుగ్గిపాలవుతున్నాయి. భిక్షాటన చేస్తున్న బాలలకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నా వారు మారడం లేదని ఐసీపీఎస్ అధికారులు అంటున్నారు. అందుకే పోలీసుల సాయంతో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లాలో బాలికల కోసం ఐదు పునరావాస కేంద్రాలున్నాయన్నాయన్నారు. బాలురకు పునరావాస కేంద్రాలు లేవు. వారిని స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న కేంద్రాలకు పంపుతున్నట్లు వారు తెలిపారు. -
ప్రకృతి ఒడి.. ఎలా వీడేది !
పోలవరం, న్యూస్‌లైన్ : ఉన్న ఊరిని కన్నతల్లితో పోలుస్తారు. అలాంటిది తరతరాల నుంచి నివశిస్తున్న గ్రామాన్ని శాశ్వతంగా విడిచి వెళ్లాలంటే... అదీ ప్రకృతి ఒడినుంచి దూరంగా పొమ్మంటుంటే.. పోలవరం మండలంలో గిరిజన గ్రామమైన దేవరగొందిలో ఇప్పుడు అదే జరుగుతోంది. కొండల నడుమ ప్రకృతి ఒడిలో నివశిం చిన గిరిజనుల్ని ఆ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల మండలంలో ముంపునకు గురయ్యే గ్రామాల్లో దేవరగొంది మొట్టమొదటిది. దీంతో గ్రామస్తులను ఖాళీ చేరుుస్తున్నారు. ఇళ్లను కూల్చేస్తూ వారిని పునరావాస కేంద్రాలకు వెళ్లిపొమ్మంటున్నారు. పుట్టిపెరిగిన గ్రామాన్ని విడిచి వెళ్లమనడం గిరిజను లను బాధిస్తోంది. మరోవైపు మైదాన ప్రాంతంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో బతుకుతెరువు ఎలాగోననే భయం కూడా వారిని వెంటాడుతోంది. కొద్దిరోజులుగా దేవరగొంది గ్రామ గిరిజన నిర్వాసితులను అధికార యంత్రాంగం పోలవ రం గ్రామ సమీపంలోని తాలూకా కార్యాలయ ప్రాంతంలో నిర్మించిన పునరావాస కేంద్రానికి తరలించే చర్యలు చేపట్టిన విషయం విదితమే. ఈ సందర్భంలో ఇళ్లను వదిలి రాలేక నిర్వాసితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 2004 నుంచి అధికారులు తమ గ్రామాలకు వచ్చి చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న దానికి ఏమాత్రం పొంతన లేదని వాపోతున్నారు. దేవరగొంది గ్రామం అటవీ ప్రాంతంలో కొండల పక్కన ఉండటంతో అక్కడి గిరిజనులు అటవీ ఉత్పత్తులను సేకరించుకుంటూ.. చెట్ల ఫలసాయంపై ఆధారపడి జీవనోపాధి పొందుతు న్నారు. పునరావాస కేంద్రం మైదాన ప్రాం తంలో ఉండటంతో సమీపంలో కొండలు లేవని, అధికారులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీగా గతంలో ఇచ్చిన సొమ్ములు కూడా అయిపోయాయని, పునరావాస కేంద్రానికి వెళ్లి ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. పునరావాస కేంద్రాన్ని షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటిం చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం ప్రభుత్వం జారీ చేసిన నంబర్-68 జీవోలో 6.20 పాయింట్ ప్రకారం పునరావాస కేంద్రాల్లో ఉండే నిర్వాసితులకు రాజ్యాంగపరంగా అన్ని హక్కులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే గతంలో ఆర్ అండ్ ఆర్ అధికారులుగా పనిచేసిన వారు ఇచ్చిన హామీలు దేవరగొంది గ్రామ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అప్పట్లో 18 సంవత్సరాలు నిండిన యువతులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపచేయడం, పోడు భూములకు పట్టాలివ్వడం అనే అంశాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని, త్వరలోనే అవి అమలులోకి వస్తాయని అధికారులు చెప్పారు. కానీ.. ఆ అంశాలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అదీ పూర్తిగా ఆచరణ సాధ్యం కాలేదు. ఇటీవల కొత్త భూసేకరణ చట్టం వ చ్చింది. జనవరి 1నుంచి ఇది అమలులోకి వస్తుందని, నిర్వాసితులకు వర్తిస్తుందని దేవరగొంది గిరిజనులు ఆశతో ఉన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తే నిర్వాసితులకు ఎంతో లబ్ధి చేకూరుతుందనే అపోహ కూడా వీరిలో ఉంది. జేసీ టి.బాబూరావునాయుడు ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన కొత్తలో నిర్వాసిత గ్రామాల్లో రాత్రి బస చేసి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో పేర్కొన్న వాస్తవాలను గిరిజనులకు స్పష్టంగా చెప్పారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకారం మాత్రమే అన్ని రాయితీలు అందజేస్తామని అవసరమైతే అదనంగా వివిధ శాఖల నుంచి రుణాలు మంజూరు చేయించి జీవనోపాధికి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ కూడా కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. అప్పటి నుంచి నిర్వాసితుల్లో కొంత అభద్రతా భావం నెలకొంది. అవి నిర్వాసితులకు మిం గుడు పడలేదు. దీనికి కొందరు నాయకుల ప్రమేయం కూడా తోడైంది. ఒకపక్క గ్రామాన్ని ఖాళీ చేయలేక ఆవేదన చెందుతూ.. పునరావాస కేంద్రంలో బతుకుతెరువుపై భయం నెలకొన్న నేపథ్యంలో కొన్ని సంస్థలు, నాయకుల పాత్ర గిరిజనులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ దశలో తాము నివాసం ఉంటున్న ఇళ్లను తమ కళ్లముందే అధికారులు కూల్చివేరుుస్తుండటాన్ని తట్టుకోలేక గిరిజనులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పునరావాస కేంద్రానికి వెళితే తమను అధికారులు పట్టించుకోరని, ఎలాంటి సహాయం అందించరని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. తమకు అధికారులపై నమ్మ కం పోయిందని స్పష్టంగా చెబుతున్నారు. వీరికి గల అపోహలను, భావోద్వేగాలను తొలగించడంతోపాటు పునరావాస కేంద్రాల్లో బతుకుతెరువుపై భరోసా ఇవ్వాల్సిన కనీస బాధ్యత అధికారులపై ఉంది. ఈ విషయాలపై ఆర్ అండ్ ఆర్ అధికారి, ఆర్డీవో వి.నాన్‌రాజు మాట్లాడుతూ దేవరగొంది గ్రామంలో 98 నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయని, వీరందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాయితీలను పూర్తిగా అందజేశామని చెప్పారు. పునరావాస కేంద్రంలో వీధిలైట్లు, మంచినీరు వంటి అన్ని వసతులు కల్పించామన్నారు. పొంతన లేదు మాకు మేకలు, గొర్రెలు, పశువులు ఉన్నాయి. వీటిని కట్టుకోవడానికి పునరావాస కేంద్రంలో స్థలం చూపలేదు. 2004 నుంచి గ్రామానికి వచ్చి అధికారులు చెప్పిన మాటలకు, ఇప్పుడు చేసేదానికి ఏమాత్రం పొంతన లేదు. పునరావాస కేంద్రానికి వెళితే అధికారులు మాకేమీ చేయరు. వారిపై మాకు నమ్మకం పోయింది. - తాటి సరస్వతి, దేవరగొంది ఎలా బతకాలి తాత ముత్తాతల కాలంనుంచీ అటవీ ప్రాంతంలోని దేవరగొందిలో ఉంటున్నాం. తేనె, కుంకుడు కాయలు, చింతకాయలు, నేలవేము సేకరించుకుని మహిళలంతా ఉపాధి పొందుతున్నాం. పునరావాస కేంద్రం సమీపంలో పంటలు కూడా లేవు. అక్కడికెళ్లి ఎలా బతకాలి. పునరావాస కేంద్రాన్ని షెడ్యూల్ ప్రాంతంగా మార్పు చేయాలి. - కారం చెల్లాయమ్మ, దేవరగొంది రారుుతీలు పూర్తిగా ఇవ్వలేదు మేం పుట్టి పెరిగిన గ్రామం ఇదే. పోలవరం ప్రాజెక్టు మొదలు పెట్టిన నాటినుంచి అధికారులు ఏ ఒక్కరికీ పూర్తి రాయితీలు ఇవ్వలేదు. సబ్సిడీపై గేదెలు, రుణాలు ఇస్తామంటున్నారు. ఇచ్చిన వెంటనే బ్యాంకు అధికారులు వచ్చి రుణాలు కట్టమంటున్నారు. పునరావాస కేంద్రంలో ఎలా బతకాలి. - వరస జోగమ్మ, దేవరగొంది ఇళ్లు పడగొట్టేస్తున్నారు నాకు ఈ ఊళ్లో 2.24 ఎకరాల భూమి ఉంది. భూమికి భూమి ఇస్తామన్నారు. ఇప్పటికీ భూమి పొజిషన్ చూపలేదు. ఒక్క ఏడాది కూడా ఫలసాయం తినలేదు. ఇప్పుడొచ్చి ఇళ్లు ఖాళీచేయమంటున్నారు. ఇళ్లను పడగొట్టేస్తున్నారు. మమ్ములను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. - తెల్లం రామాయమ్మ, దేవరగొంది -
'8వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు'
లెహర్ తుఫాన్ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా నాలుగు మండలాల్లో ఎనిమిది వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ వెల్లడించారు. గురువారం గుంటూరులో లెహర్ తుఫాన్‌పై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సముద్రంలో నాలుగు అడుగుల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దాంతో సముద్రం అల్లకల్లొలంగా తయారైంది. ఈ నేపథ్యంలో మత్య్సకారులు ఎవరు సముద్రంలోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.గత రాత్రి నుంచి తీర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయని చెప్పారు. తెనాలి డివిజన్ పరిధిలో పాఠశాలకు శెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని నిజాంపట్నం ఓడరేవులో ఐదవ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు చెప్పారు. -
భారీ వర్షాల కారణంగా 17 మంది మృతి
గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారని ఉన్నతాధికారులు వెల్లడించారు. భారీ వర్షాలపై శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ వర్షాల కారణంగా ... 3,050 ఇళ్లు ధ్వంసమైనాయని తెలిపారు. 2.50 లక్షల హెక్టార్ల మేర పంట నీట మునిగిందని పేర్కొన్నారు. 67,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. వరద బాధితుల కోసం 135 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. 117 చెరువులకు గండ్లు పడ్డాయని తెలిపారు. 110 పశువులు మృత్యువాత పడ్డాయని పేర్కొన్నారు. అయితే రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావారణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తం చేసినట్లు ఉన్నతాధికారులు చెప్పారు. -
భారీ వర్షాలకు 10 మంది మృతి: ప్రభుత్వం
హైదరాబాద్: భారీ వర్షాలకు రాష్ట్రంలో 10 మంది మృతి చెందారని ప్రభుత్వం తెలిపింది. 2.5 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని రాష్ట్ర రెవెన్యు మంత్రి ఎన్. రఘువీరారెడ్డి ప్రకటించారు. 300 ఇళ్లు కూలిపోయాయని వెల్లడించారు. 19 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, 6500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామన్నారు. ముంపు ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేయడానికి కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు ఇస్తున్నట్టు ప్రకటించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలు సహకరించాలని కోరారు. అధికారుల సూచనలకు అనుగుణంగా లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మరోవైపు భారీ వర్షాలతో కుదేలయిన శ్రీకాకుళం జిల్లాకు నాలుగు జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను ప్రభుత్వం పంపింది.