భూకంప ధాటికి కూలిన భవనాలు. కొనసాగుతున్న సహాయక చర్యలు
ఎలాజిగ్: తూర్పు టర్కీని భారీ భూకంపం వణికించింది. ఎలాజిగ్, మలాట్యా ప్రావిన్స్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంపం ధాటికి 22 మంది మృతిచెందగా.. 1,015 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. సివ్రిస్ నగరంలో చిన్న సరస్సు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. తొలుత సివ్రిస్‌లో భూమి కంపించిందని టర్కీ విపత్తు, అత్యవసర నిర్వహణ సంస్థ వెల్లడించింది. దాదాపు 30 సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.
భూకంప తీవ్రతకు పలు ఇళ్లు నేలకూలాయి. ఘటనా స్థలాలకు చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఎలాజిగ్‌లో శిథిలాల్లో చిక్కుకున్న 39 మందిని సురక్షితంగా కాపాడామని టర్కీ అంతర్గత మంత్రి సులేమాన్ సోయ్‌లు వెల్లడించారు. టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దాదాపు 2 వేల మంది రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. భూకంప బాధితుల కోసం మలాట్యాలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment