డెమాస్కస్: సిరియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. తిరుగుబాటుదారుల దాడులతో దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోవడంతో ఆపద్ధర్మ ప్రధానిగా మొహమ్మద్ అల్ బషీర్ ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో అసద్‌కు రష్యా, ఇరాన్ మద్దతుపై తుర్కీయో కీలక వ్యాఖ్యలు చేసింది.
తాజాగా తుర్కీయే విదేశాంగ శాఖ మంత్రి హకస్ ఫిదాన్ మాట్లాడుతూ..‘సిరియా, డమాస్కస్ తిరుగుబాటుదారుల వశమైంది. ఈ క్రమంలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దళాలకు రష్యా, ఇరాన్‌లు మద్దతు ఇవ్వకూడదు. అసద్‌కు మద్దతు తెలిపే విధంగా వ్యవహరించకూడదు. ఇప్పటికే వారితో మేము చర్చించాం. ఈ విషయాన్ని వారు అర్థం చేసుకున్నారు. 2011లో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మాస్కో, టెహ్రాన్‌లు అసద్‌కు మద్దతుగా నిలిచాయి. ఆ దేశాలు సహాయం చేసినప్పటికీ తిరుగుబాటుదారులే గెలిచేవారు. అయితే, ఫలితం మరింత హింసాత్మకంగా ఉండేది’ అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే తిరుగుబాటుదారుల కారణంగా సిరియా కల్లోల పరిస్థితుల నెలకొన్నాయి. అధ్యక్షుడు అసద్ పాలనను వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేశారు. ఈ క్రమంలో దేశ రాజధాని డమాస్కస్‌తో సహా పలు నగరాలను ఆక్రమించుకున్నారు. దీంతో అసద్ తన కుటుంబంతో సహా రష్యాకు పారిపోయారు. అసద్‌కు రష్యా ఆశ్రయం కల్పించింది. ప్రస్తుతం ఆయన మాస్కోలో ఉన్నారు.
మరోవైపు.. సిరియా తాత్కాలిక ప్రధానిగా ఎంపికైన మొహమ్మద్ అల్ బషీర్ 2025 మార్చి ఒకటో తేదీదాకా పదవిలో కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అల్ బషీర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సిరియాలో శాంతిభద్రతలు నెలకొనడానికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. తిరుగుబాటు అనంతరం శాఖలు, సంస్థల బదిలీలపై చర్చించారు. రాబోయే రెండు నెలలు సిరియా ప్రజలకు సేవలందించడానికి, సంస్థలను పునఃప్రారంభించడానికి సమావేశాలు నిర్వహించామని బషీర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment