భారీ వర్షాలకు 10 మంది మృతి: ప్రభుత్వం
హైదరాబాద్: భారీ వర్షాలకు రాష్ట్రంలో 10 మంది మృతి చెందారని ప్రభుత్వం తెలిపింది. 2.5 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని రాష్ట్ర రెవెన్యు మంత్రి ఎన్. రఘువీరారెడ్డి ప్రకటించారు. 300 ఇళ్లు కూలిపోయాయని వెల్లడించారు. 19 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, 6500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామన్నారు. ముంపు ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేయడానికి కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు ఇస్తున్నట్టు ప్రకటించారు.
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలు సహకరించాలని కోరారు. అధికారుల సూచనలకు అనుగుణంగా లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మరోవైపు భారీ వర్షాలతో కుదేలయిన శ్రీకాకుళం జిల్లాకు నాలుగు జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను ప్రభుత్వం పంపింది.