Agapi Sikkim: ప్రకృతి ఇచ్చిన ప్రేమ కానుక గెలుపు దారి | Rinzing Choden Bhutia: Sikkim Woman Skincare Startup Uses Rare Himalayan Plants | Sakshi
Sakshi News home page

Agapi Sikkim: ప్రకృతి ఇచ్చిన ప్రేమ కానుక గెలుపు దారి

Published Tue, Jan 2 2024 5:59 AM | Last Updated on Tue, Jan 2 2024 5:59 AM

Rinzing Choden Bhutia: Sikkim Woman Skincare Startup Uses Rare Himalayan Plants - Sakshi

పెద్ద నగరాలలో పెద్ద ఉద్యోగం చేస్తున్నప్పటికీ రిన్‌జింగ్‌ భూటియా మనసులో ఏదో లోటు ఉండేది. విశాలమైన ప్రకృతి ప్రపంచంలో పుట్టి పెరిగిన రిన్‌జింగ్‌ రణగొణ ధ్వనులకు దూరంగా తన మూలాలను వెదుక్కుంటూ సిక్కిం వెళ్లింది. హిమాలయాలలోని అరుదైన మొక్కలతో తయారు చేసే స్కిన్‌కేర్‌ ప్రాడక్ట్స్‌కు సంబంధించిన ‘అగాపి సిక్కిం’ స్టార్టప్‌తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించింది. సొంతకాళ్ల మీద నిలబడడానికి పునరావాస కేంద్రాల్లోని మహిళల కోసం ఉచిత వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. 
   
సిక్కింలోని అద్భుతమైన ప్రకృతి అందాల మధ్య పుట్టి పెరిగిన రిన్‌జింగ్‌ వృత్తిరీత్యా దిల్లీ, బెంగళూరు, కోల్‌కత్తాలాంటి మహానగరాల్లో గడిపింది. ఆర్థిక సమస్యలు లేనప్పటికీ ఏదో లోటుగా అనిపించేది. ప్రకృతి మధ్య తాను గడిపిన కాలాన్ని గుర్తు చేసుకునేది. మరో ఆలోచన లేకుండా ఉద్యోగానికి రాజీనామా చేసి సిక్కిం బాట పట్టింది.
ఎంటర్‌ప్రెన్యూర్‌ కావాలనే రిన్‌జింగ్‌ చిరకాల కల అక్కడ రెక్కలు విప్పుకుంది.

‘ఉద్యోగ జీవితానికి సంబంధించి ఏ లోటు లేకపోయినప్పటికీ పెద్ద నగరాలలో కాలుష్యం, ఇరుకు ప్రదేశాలలో నివసించాల్సి రావడంతో బాగా విసుగెత్తిపోయాను. నా బిడ్డ పచ్చని ప్రకృతి ప్రపంచంలో పెరగాలనుకున్నాను. అందుకే వెనక్కి వచ్చేశాను’ అంటుంది రిన్‌జింగ్‌.
ఉద్యోగం లేదు కాబట్టి బోలెడంత ఖాళీ సమయాన్ని చర్మ సంరక్షణకు సంబంధించిన పరిశోధనకు కేటాయించింది. ప్రకృతిలోని ఎన్నో వనమూలికల గురించి లోతుగా అధ్యయనం చేసింది. హిమాలయాలలో లభించే అరుదైన మొక్కలతో హ్యాండ్‌ క్రాఫ్టెడ్‌ స్కిన్‌కేర్‌ ప్రాడక్ట్స్‌కు సంబంధించిన ‘అగాపి సిక్కిం’ అనే అంకుర సంస్థను ఆరంభించింది. ‘అగాపి’ అనేది గ్రీకు
పదం. దీని అర్థం... ప్రేమ.

సిక్కింలోని అనేక ప్రాంతాలలో చర్మవ్యాధులకు ఔషధంగా తమ చుట్టుపక్కల ఉండే మొక్కలను ఉపయోగించడం అనేది తరతరాలుగా జరుగుతోంది. ఈ సంప్రదాయమే తనకొక దారి చూపింది. చర్మవ్యాధులను తగ్గించే ఎన్నో ఔషధాల వాడకం పరంపరగా వస్తున్నప్పటికీ వాటి గురించి స్కిన్‌కేర్‌ ఇండస్ట్రీకి తెలియదు.

బిజినెస్‌ మోడల్‌ను డిజైనింగ్‌ చేసుకున్న తరువాత కబీ అనే ప్రాంతంలో తొలిసారిగా ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించింది రిన్‌జింగ్‌. ఇరవైమందికి పైగా మహిళలు హాజరయ్యారు. ఈ ఉత్సాహంతో మరిన్ని ప్రాంతాలలో మరిన్ని ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించింది.‘మా వర్క్‌షాప్‌లో శిక్షణ తీసుకున్న పదిమందికి పైగా మహిళలు సొంత ప్రాజెక్ట్‌లు మొదలు పెట్టడం సంతోషంగా అనిపించింది. ఏదో సాధించాలనే పట్టుదల వారిలో కనిపించింది. వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాను’ అంటుంది రిన్‌జింగ్‌. మాదక ద్రవ్యాలు, మద్యవ్యసనంతో శిథిలం అవుతున్న వారికి ఆ వ్యసనాల నుంచి బయటకు తీసుకువచ్చే సాధనంగా వర్క్‌షాప్‌లను ఉపయోగించుకుంటోంది రిన్‌జింగ్‌.

పునరావాస కేంద్రాల్లో కూడా వర్క్‌షాప్‌లు నిర్వహించి వారిలో ఆర్థికస్థైర్యాన్ని నింపింది. మాస్కులు, షాంపులు, స్క్రబ్‌లు, ఫేషియల్‌ ఆయిల్‌... మొదలైనవి ఎన్నో ఉత్పత్తి చేస్తుంది అగాపి సిక్కిం.

స్థానిక రకాల కలబంద, జనపనార... మొదలైన వాటిని తమ ఉత్పత్తులకు ముడిసరుకుగా ఉపయోగించుకుంటోంది. మొదట సిక్కిం చుట్టుపక్కల నగరాలలో ప్రాడక్ట్స్‌ను విక్రయించేవారు. ఆ తరువాత బెంగళూరు, కోల్‌కతాతో పాటు దేశంలోని ఎన్నో ప్రాంతాలకు మార్కెట్‌ విస్తరించింది.
‘అగాపి’ చెప్పుకోదగిన బ్రాండ్‌గా ఎదిగినప్పటికీ ‘ఇక చాలు’ అనుకోవడం లేదు రిన్‌జింగ్‌. స్కిన్‌ కేర్‌ సైన్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు తన పరిజ్ఞానాన్ని విస్తృతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంగ్లాండ్‌లోని ‘ఫార్ములా బొటానికా’కు సంబంధించి ఆన్‌లైన్‌ కోర్సులు చేస్తోంది.
 

ప్రాచీన ఔషధాలపై కొత్త వెలుగు
ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉన్న సంప్రదాయ ఔషధాలు వెలుగు చూసేలా, ప్రపంచానికి తెలిసేలా కృషి చేస్తోంది రిన్‌జింగ్‌. తాను కంపెనీ స్థాపించడమే కాదు ఇతరులు కూడా స్థాపించేలా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. ‘ఇక్కడ అడుగు పెట్టడానికి ముందు ఎన్నో ప్రశ్నలు ఉండేవి. ఇప్పుడు వాటికి సమాధానం దొరికింది. అగాపి విజయం నాకు ఎంతో ఉత్సాహం ఇచ్చింది’ అంటుంది రిన్‌జింగ్‌ భూటియ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement