స్టార్టప్‌లలో మహిళల ముందంజ
న్యూఢిల్లీ: భారత్‌లో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వివిధ స్టార్టప్‌లలో ముఖ్యంగా ఈ-కామర్స్ రంగంలో వీరు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఈ రంగంలో వీరి సంఖ్య పురుషులతో సమానంగా ఉంది. ఇదే పరిస్థితి నెమ్మదిగా కార్పొరేట్ కంపెనీలలో కూడా కనిపించనుంది. చాలా వ్యాపారాలలో మహిళలు సీనియర్ మేనేజ్‌మెంట్ హోదాలలో కూడా ఉన్నారు. జివామీ, ఎంబైబ్, గ్రాబ్‌హౌస్, లెబుల్ కార్ప్, లైమ్‌రోడ్ తదితర స్టార్టప్‌లతోపాటు ఆన్‌లైన్ వ్యాపారాలలో
కూడా మహిళలు తమ ఉనికిని చాటుకుంటున్నారు. టెక్నాలజీ వృద్ధి, ఇంటర్నెట్ వినియోగం జోరు, మొబైల్స్ వాడకం పెరగటం వంటి తదితర అంశాలు మహిళా వ్యాపార వృద్ధికి దోహదపడుతున్నాయి. తన కంపెనీ సిబ్బందిలో దాదాపు 50 శాతం మంది మహిళలే ఉన్నారని జామ్‌బే వ్యవస్థాపకురాలు సురుచి వాగ్ అన్నారు. భారత వ్యాపార రంగంలో మహిళల శాతం పెరగటానికి విస్తృతమైన, సమాన అవకాశాలు చాలా దోహదపడతాయని రీసెర్చ్ సంస్థ గ్లోబల్‌హంట్ ఎండీ సునీల్ గోయల్ చెప్పారు.
‘కెరీర్‌ను సవాలుగా తీసుకొని ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఎంతో మంది మహిళా పారిశ్రామికవేత్తలు మన ముందు ఉన్నారు. వీరందరూ సంప్రదాయ భారతీయ మహిళా సంకె ళ్లను బద్దలుకొడుతూ నూతనంగా వివిధ వ్యాపార రంగాలలోకి అడుగుపెడతారు’ అని గ్రాబ్‌హౌస్.కామ్ సహ వ్యవస్థాపకులు పంఖూరీ శీవత్సవా అన్నారు. గ్రాభౌస్‌లో దాదాపు 40 శాతం మంది మహిళా ఉద్యోగులే. వ్యాపార అవకాశాలు పెరగటంతోపాటు మహిళా సాధికారతకు దోహదపడే వివిధ పథకాలను, పాలసీలను ప్రభుత్వం ప్రవేశపెడుతుండటంతో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య పెరుగుతోందని లేబర్‌నెట్ సహ వ్యవస్థాపకులు గాయత్రి వసుదేవన్ చెప్పారు.