workshops
-
Agapi Sikkim: ప్రకృతి ఇచ్చిన ప్రేమ కానుక గెలుపు దారి
పెద్ద నగరాలలో పెద్ద ఉద్యోగం చేస్తున్నప్పటికీ రిన్జింగ్ భూటియా మనసులో ఏదో లోటు ఉండేది. విశాలమైన ప్రకృతి ప్రపంచంలో పుట్టి పెరిగిన రిన్జింగ్ రణగొణ ధ్వనులకు దూరంగా తన మూలాలను వెదుక్కుంటూ సిక్కిం వెళ్లింది. హిమాలయాలలోని అరుదైన మొక్కలతో తయారు చేసే స్కిన్‌కేర్ ప్రాడక్ట్స్‌కు సంబంధించిన ‘అగాపి సిక్కిం’ స్టార్టప్‌తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించింది. సొంతకాళ్ల మీద నిలబడడానికి పునరావాస కేంద్రాల్లోని మహిళల కోసం ఉచిత వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. సిక్కింలోని అద్భుతమైన ప్రకృతి అందాల మధ్య పుట్టి పెరిగిన రిన్జింగ్ వృత్తిరీత్యా దిల్లీ, బెంగళూరు, కోల్‌కత్తాలాంటి మహానగరాల్లో గడిపింది. ఆర్థిక సమస్యలు లేనప్పటికీ ఏదో లోటుగా అనిపించేది. ప్రకృతి మధ్య తాను గడిపిన కాలాన్ని గుర్తు చేసుకునేది. మరో ఆలోచన లేకుండా ఉద్యోగానికి రాజీనామా చేసి సిక్కిం బాట పట్టింది. ఎంటర్ప్రెన్యూర్ కావాలనే రిన్జింగ్ చిరకాల కల అక్కడ రెక్కలు విప్పుకుంది. ‘ఉద్యోగ జీవితానికి సంబంధించి ఏ లోటు లేకపోయినప్పటికీ పెద్ద నగరాలలో కాలుష్యం, ఇరుకు ప్రదేశాలలో నివసించాల్సి రావడంతో బాగా విసుగెత్తిపోయాను. నా బిడ్డ పచ్చని ప్రకృతి ప్రపంచంలో పెరగాలనుకున్నాను. అందుకే వెనక్కి వచ్చేశాను’ అంటుంది రిన్జింగ్. ఉద్యోగం లేదు కాబట్టి బోలెడంత ఖాళీ సమయాన్ని చర్మ సంరక్షణకు సంబంధించిన పరిశోధనకు కేటాయించింది. ప్రకృతిలోని ఎన్నో వనమూలికల గురించి లోతుగా అధ్యయనం చేసింది. హిమాలయాలలో లభించే అరుదైన మొక్కలతో హ్యాండ్ క్రాఫ్టెడ్ స్కిన్‌కేర్ ప్రాడక్ట్స్‌కు సంబంధించిన ‘అగాపి సిక్కిం’ అనే అంకుర సంస్థను ఆరంభించింది. ‘అగాపి’ అనేది గ్రీకు పదం. దీని అర్థం... ప్రేమ. సిక్కింలోని అనేక ప్రాంతాలలో చర్మవ్యాధులకు ఔషధంగా తమ చుట్టుపక్కల ఉండే మొక్కలను ఉపయోగించడం అనేది తరతరాలుగా జరుగుతోంది. ఈ సంప్రదాయమే తనకొక దారి చూపింది. చర్మవ్యాధులను తగ్గించే ఎన్నో ఔషధాల వాడకం పరంపరగా వస్తున్నప్పటికీ వాటి గురించి స్కిన్‌కేర్ ఇండస్ట్రీకి తెలియదు. బిజినెస్ మోడల్‌ను డిజైనింగ్ చేసుకున్న తరువాత కబీ అనే ప్రాంతంలో తొలిసారిగా ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించింది రిన్జింగ్. ఇరవైమందికి పైగా మహిళలు హాజరయ్యారు. ఈ ఉత్సాహంతో మరిన్ని ప్రాంతాలలో మరిన్ని ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించింది.‘మా వర్క్‌షాప్‌లో శిక్షణ తీసుకున్న పదిమందికి పైగా మహిళలు సొంత ప్రాజెక్ట్‌లు మొదలు పెట్టడం సంతోషంగా అనిపించింది. ఏదో సాధించాలనే పట్టుదల వారిలో కనిపించింది. వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాను’ అంటుంది రిన్జింగ్. మాదక ద్రవ్యాలు, మద్యవ్యసనంతో శిథిలం అవుతున్న వారికి ఆ వ్యసనాల నుంచి బయటకు తీసుకువచ్చే సాధనంగా వర్క్‌షాప్‌లను ఉపయోగించుకుంటోంది రిన్జింగ్. పునరావాస కేంద్రాల్లో కూడా వర్క్‌షాప్‌లు నిర్వహించి వారిలో ఆర్థికస్థైర్యాన్ని నింపింది. మాస్కులు, షాంపులు, స్క్రబ్‌లు, ఫేషియల్ ఆయిల్... మొదలైనవి ఎన్నో ఉత్పత్తి చేస్తుంది అగాపి సిక్కిం. స్థానిక రకాల కలబంద, జనపనార... మొదలైన వాటిని తమ ఉత్పత్తులకు ముడిసరుకుగా ఉపయోగించుకుంటోంది. మొదట సిక్కిం చుట్టుపక్కల నగరాలలో ప్రాడక్ట్స్‌ను విక్రయించేవారు. ఆ తరువాత బెంగళూరు, కోల్‌కతాతో పాటు దేశంలోని ఎన్నో ప్రాంతాలకు మార్కెట్ విస్తరించింది. ‘అగాపి’ చెప్పుకోదగిన బ్రాండ్‌గా ఎదిగినప్పటికీ ‘ఇక చాలు’ అనుకోవడం లేదు రిన్జింగ్. స్కిన్ కేర్ సైన్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు తన పరిజ్ఞానాన్ని విస్తృతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంగ్లాండ్‌లోని ‘ఫార్ములా బొటానికా’కు సంబంధించి ఆన్లైన్ కోర్సులు చేస్తోంది. ప్రాచీన ఔషధాలపై కొత్త వెలుగు ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉన్న సంప్రదాయ ఔషధాలు వెలుగు చూసేలా, ప్రపంచానికి తెలిసేలా కృషి చేస్తోంది రిన్జింగ్. తాను కంపెనీ స్థాపించడమే కాదు ఇతరులు కూడా స్థాపించేలా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. ‘ఇక్కడ అడుగు పెట్టడానికి ముందు ఎన్నో ప్రశ్నలు ఉండేవి. ఇప్పుడు వాటికి సమాధానం దొరికింది. అగాపి విజయం నాకు ఎంతో ఉత్సాహం ఇచ్చింది’ అంటుంది రిన్జింగ్ భూటియ. -
Global Innovation Index 2023: ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌లు
న్యూఢిల్లీ: కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తాము దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌లను నిర్వహిస్తున్నట్లు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ) 2023 ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. మరోవైపు 2047 నాటికి సంపన్న ఎకానమీగా ఎదగాలన్న భారత ఆకాంక్షలకు కారి్మక కొరత సమస్య కాబోదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరి తెలిపారు. నవకల్పనల ప్రధాన లక్ష్యం కారి్మకుల ఉత్పాదకతను మరింతగా పెంచడం, వనరులను సమర్ధంగా వినియోగించుకునేలా చేయడమేనని ఆయన పేర్కొన్నారు. జెనీవాకు చెందిన వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ రూపొందించిన జీఐఐ 2023 నివేదికలోని 132 దేశాల్లో భారత్ 40వ ర్యాంకులో కొనసాగింది. అటు గత దశాబ్దకాలంగా జీఐఐలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఏడు దేశాల్లో భారత్ కూడా ఒకటని జీఐఐ కో–ఎడిటర్ సషా ఉన్‡్ష–విన్సెంట్ తెలిపారు. -
Cheriyal Painting: నేర్చిన కళే నడిపిస్తోంది.. నకాశి
గృహిణి అనగానే ఇంటిని చక్కదిద్దుకుంటూ, వంట చేస్తున్న మహిళలే మనకు గుర్తుకు వస్తారు. ఇల్లు, వంట పనితో పాటు పిల్లల ఆలనాపాలనా చూస్తూనే చేర్యాల చిత్రకళను ఔపోసన పట్టారు వనజ. ఆరుపదులకు చేరవవుతున్న వనజ హైదరాబాద్ బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు. కుటుంబకళగా పేరొందిన నకాశీ చిత్రకళ గురించి, ఈ కళలో మమేకమైన జీవితం గురించి, పొందిన సత్కారాల గురించి ఆనందంగా వివరిస్తారు వనజ. తెలంగాణలో అతి ప్రాచీన జానపద చిత్రకళగా చేర్యాల పెయింటింగ్స్‌కి పేరుంది. దీనినే నకాశి చిత్రకళ అని కూడా అంటారు. రామాయణ, మహాభారత, పురాణాలను, స్థానిక జానపద కథలను కూడా ఈ కళలో చిత్రిస్తారు. ఈ పెయింటింగ్స్‌తో పాటు రాజా రాణి, సీతారామ.. పోతరాజు, వెల్కమ్ మాస్క్‌లను తయారు చేస్తుంటారు వనజ. పెయింటింగ్ నేర్చుకుంటామని వచ్చినవారికి శిక్షణ కూడా ఇస్తుంటారు. వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంటారు. 37 ఏళ్ల క్రితం ‘‘చదువుకున్నది ఏడవ తరగతి వరకే. పెళ్లయ్యాక ముగ్గురు పిల్లలు. నా భర్త వైకుంఠం ఈ చిత్రకళలో రోజంతా ఉండేవారు. ఓ వైపు ఇంటిపని, పిల్లల పని.. అంతా పూర్తయ్యాక మధ్యాహ్నం రెండు గంటల నుంచి పెయింటింగ్ నేర్చుకోవడానికి కూర్చునేదాన్ని. అంతకుముందు ఈ కళ మా కుటుంబానికి మా మామగారి ద్వారా ఏ విధంగా వచ్చిందో, ఎంత ప్రాచీనమైనదో తెలుసుకున్నాను. ప్రాణం పెట్టే ఈ కళ సహజత్వం గురించి అర్ధమవుతున్న కొద్దీ నాకు ఎంతో ఇష్టం పెరిగింది. కళ నేర్పిన చదువు వందల ఏళ్ల క్రితం నిరక్షరాస్యులకు ఈ బొమ్మల ద్వారా కథ తెలియజేసే విధానం ఉండేది. ఆ విధంగా సమాజానికి మంచి నేర్పే కళగానూ పేరుంది. దేవతా వర్ణనలతో, ఇతిహాసాలను, పురాణాలను, స్థానిక కుల కథలను కూడా ఈ కళద్వారా చిత్రిస్తాం. ఖాదీ వస్త్రం లేదా కాన్వాస్‌పై ప్రత్యేకంగా ప్రాసెస్ చేసిన చింత గింజల గుజ్జు, కొన్ని చెట్ల జిగురు, సహజ రంగులతో చిత్రిస్తాం. ఎరుపురంగు ప్రధాన భూమికగా ఉంటుంది. నీలం, పసుపు రంగులో దేవతల చిత్రాలు, బ్రౌన్ లేదా డార్క్ షేడ్స్ రాక్షసులకు, పింక్ స్కిన్ టోన్లు మనుషులకు ఉంటాయి. వందల సంవత్సరాల క్రితం పురుడు పోసుకున్న కళ ఇది. 3 అడుగుల వెడల్పుతో 60 అడుగులకు పైగా పొడవుతో ఈ బొమ్మలను చిత్రించవచ్చు. స్క్రోల్‌లో దాదాపు 40 నుంచి 50 ప్యానెల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ప్యానెల్ కథలోని కొంత భాగాన్ని వర్ణిస్తుంది. ఏడాదికి పైగా... రోజూ కనీసం 5–6 గంటల పాటు సాధన చేస్తూ ఉండటంతో ఏడాదిలో కళను నేర్చుకున్నాను. పిల్లలు స్కూల్‌కి వెళ్లే వయసొచ్చాక ఇంకాస్త సమయం కలిసొచ్చింది. దీంతో మెల్లమెల్లగా ఈ పెయింటింగ్స్‌లో లీనమవడం పెరిగింది. స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు కూడా నాతోపాటు పెయింటింగ్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. పిల్లలు చదువుతోపాటు ఈ కళనూ ఒంటపట్టించుకున్నారు. దేశమంతా ప్రయాణించాను ఎక్కడ మా ప్రోగ్రామ్ ఉన్నా నేనూ మెల్ల మెల్లగా వాటిల్లో పాల్గొనడం మొదలుపెట్టాను. ఆ విధంగా ఢిల్లీ, కలకత్తా, ముంబాయ్.. దేశమంతా తిరిగాను. ఎగ్జిబిషన్స్‌లో పెట్టే స్టాల్స్ చూసుకోవడంతో పాటు, ఇంటి వద్దకు వచ్చే మహిళలకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. కాలేజీ అమ్మాయిలు కూడా వస్తూ ఉండేవారు. కాలేజీల్లో వర్క్‌షాప్స్ పెట్టేవాళ్లం. ఇప్పుడు రోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకైనా పెయింటింగ్ పూర్తయ్యేవరకు వర్క్ చేస్తూనే ఉంటాను. మా వారికి జాతీయ స్థాయిలో అవార్డు వస్తే, నాకు రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. జంట మాస్క్‌లు చిత్రకళతో పాటు వినాయకుడు, రాజూరాణి, సీతారాములు, పోతరాజు, బోణాల పండగ సమయంలో అమర్చే అమ్మవార్ల రూపు మాస్క్‌లను చేస్తున్నాం. అలాగే, ఇంట్లోకి ఆహ్వానించడానికి అలంకరణగా, ఇంటి లోపలి అలంకరణగా కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. ఉడెన్ బాక్స్‌లు, ట్రేలు, జ్యువెలరీ బాక్స్‌లను కూడా పెయింటింగ్ తీర్చిదిద్దుతు న్నాం. వీటిని కానుకలుగా ఇవ్వడానికి వీటిని ఎంచుకుంటు న్నారు. మాస్క్‌ల తయారీలో చింతగింజల పొడి, కర్ర పొట్టు రెండూ కలిపి, తయారుచేసి, పెయింటింగ్ చేస్తాం. అలాగే, మెటల్ ప్లేట్‌కి ఖాదీ క్లాత్ ని పేస్ట్ చేసి, నేచురల్ కలర్స్‌తో పెయింటింగ్ చేసి, వార్నిష్ చేస్తాం. ఇవన్నీ ఇంటి అలంకరణలో అందంగా అమరిపోతాయి. ఈ చిత్రకళ అన్నింటికీ ప్రధాన ఆకర్షణగా తయారయ్యింది. నా తర్వాత మా ఇంటి కోడలు నాతో కలిసి మెల్ల మెల్లగా ఈ కళను నేర్చుకుంటోంది. కుటుంబంలో కలిసిపోవడం అంటే ఆ కుటుంబంలో ఉన్న ఇష్టాన్ని, కష్టాన్ని కూడా పంచుకోవడం మొదలుపెడుతూ ఉండాలి. ఈ విషయాన్ని నా జీవితం నాకే నేర్పింది. నా కుటుంబం చేతిలో కళ ఉంది. దానిని నేనూ అందిపుచ్చుకుంటే నా తర్వాతి తరం దానిని మరింత నైపుణ్యంగా ముందుకు తీసుకువెళుతుంది. ఇదే నేను నమ్మాను. నాలాంటి మహిళలకు ఈ కళలో శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగాను. ఇప్పుడు ఎంతో గుర్తింపుతో పాటు, ప్రపంచాన్ని కొత్తగా చూశానన్న సంతృప్తితో పెయింటింగ్స్‌ను చిత్రిస్తున్నాను. దీని వల్ల నా కుటుంబ ఆదాయమూ పెరిగింది’’ ఆని ఆనందంగా వివరించారు వనజ. – నిర్మలారెడ్డి -
భారతీయ ఆర్మీలోకి ప్రైవేట్ కంపెనీలు
బెంగుళూరు : రక్షణ శాఖలోకి ప్రైవేటు కంపెనీల అడుగుపడబోతోంది. భారతీయ ఆర్మీకి చెందిన ఆర్మీ బేస్ వర్క్‌షాపు(ఏబీడబ్ల్యూ)లను నిర్వహించేందుకు చేసేందుకు ప్రైవేటు కంపెనీలకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో గల ఎనిమిది నగరాల్లోని ఏబీడబ్ల్యూలను ప్రవేటు కంపెనీలు నడపనున్నాయి. ‘ప్రభుత్వ ఆస్తిని కాంట్రాక్టర్ నిర్వహించే మోడల్’ కింద రక్షణ శాఖ దీన్ని ఆమోదించింది. ఈ మోడల్లో ప్రైవేటు కంపెనీలు రక్షణ శాఖలో ఎలాంటి పెట్టుబడులు పెట్టవు. కానీ, కంపెనీలకు కావలసిన భూమి, వస్తువులు, మెషీన్లు తదితర వనరులను ప్రభుత్వమే సమకూర్చుతుంది. నిపుణుల కమిటీ(సీఓఈ) సూచనలతోనే రక్షణ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిసింది. ఆర్మీ సామర్ధ్యాన్ని పెంచడం, రక్షణ శాఖ వ్యయాన్ని అదుపులో ఉంచడం తదితరాలను దృష్టిలో పెట్టుకుని సీఓఈ ఈ సూచనలు చేసినట్లు సమాచారం. ఎల్లప్పుడూ యుద్ధం కోసం ఆయుధాలను సిద్ధంగా ఉంచేందుకు ఏబీడబ్ల్యూలను రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆరంభించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఓ వైపు ఆయుధాలను పర్యవేక్షించేందుకు ఉన్నా.. భారతీయ ఆర్మీ ఎన్నడూ దానిపై ఆధారపడలేదు. ఢిల్లీ, కోల్‌కతా, పుణె, బెంగుళూరు తదితర కీలక నగరాల్లో ఏబీడబ్ల్యూలు ఉన్నాయి. -
అందరికీ ఫ్రీ ఇంటర్నెట్ లక్ష్యం- గూగుల్
-
అందరికీ ఫ్రీ ఇంటర్నెట్ లక్ష్యం- గూగుల్
న్యూఢిల్లీ: భారత పర్యటనకు విచ్చేసిన ఇంటర్నెట్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చిన్న వ్యాపారస్తులకు ఆఫర్లను ప్రకటించారు. ఢిల్లీలో చిన్న మధ్య తరహా పరిశ్రమల సమావేశంలో బుధవారం పాల్గొన్న ఆయన గూగుల్ కంటే కూడా చిన్న వ్యాపారాల గురించి మాట్లాడానికి ఇక్కడికి వచ్చానని తెలిపారు. గూగుల్ ఆధ్వర్యంలో చిన్న వ్యాపారస్తులకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆఫీసర్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ సమాఖ్య కంపెనీ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సమావేశంలో పాల్గొన్న సుందర్ పిచాయి రాబో్యే మూడు సంవత్సరాలుగా భారతదేశంలో 40 నగరాల్లో 5,000 వర్క్ షాప్ లను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. భారతదేశ సమస్యల్ని అధిగమిస్తే ప్రపంచానికి పరిష్కారాలు చూపించినట్టేనని ఈ సందర్భంగా పిచాయ్ పేర్కొన్నారు. అందరికీ ఉచిత ఇంటర్నెట్ అందించడమే గూగుల్ లక్ష్యమన్నారు. దాదాపు ఇండియాలో దేశ వ్యాప్తంగా 100 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కృషిలో భాగంగా గడిచిన 18 ఏళ్ళలో మెజార్టీ ప్రజలకు తమ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఇంటర్నెట్ ద్వారా ఏ వ్యాపారస్తుడైనా రిజిస్టర్ చేసుకొని శిక్షణ పొందొచ్చని తెలిపారు. అలాగే వారు ఉచితంగా సాధారణ వెబ్సైట్ సృష్టించుకోవచ్చన్నారు. దీనికోసం . వారు చేయవలసిందల్లా ఒక స్మార్ట్ ఫోన్ మరియు కొన్నినిమిషాల సమయాన్ని కేటాయింపు అని చెప్పారు. రిజిస్టర్ చేసుకున్న వారికి ఉచితంగా శిక్షణ సదుపాయాన్ని అందిస్తామని తెలిపారు. ముఖ్యాంశాలు చెన్నై లో చిన్నప్పుడు , నేను సమాచారం కోసం వెదుక్కున్నాను. నేడు చిన్న పిల్లవాడు వీలైనంత సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు. భారతదేశం లో చాలా చిన్న వ్యాపారులు ఇంటర్నెట్ ప్రతి ఒక్కరిదీ అనుకోవాలి. కావాలనుకున్నవారందరికీ నాణ్యమైన డిజిటల్ శిక్షణ అందుబాటులో డిజిటల్ అన్‌లాక్ ప్రోగ్రామ్ గా దీన్ని పిలుస్తున్నాం. భారతదేశం లో 40 నగరాల్లో 5,000 వర్క్ షాప్స్ -
18, 19 తేదీల్లో సీపీఐ వర్క్‌షాప్
అనంతపురం అర్బన్ : ఈ నెల 18, 19 తేదీలలో రాప్తాడు మండలం మరూరులోని చిన్న కదిరయ్య స్వామి దేవాలయంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, మండల, గ్రామ శాఖ కార్యదర్శులు, నాయకులకు వర్క్‌షాప్ ఉంటుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ తెలిపారు. నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ వర్క్‌షాపును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రారంభిస్తారని, ఇందులో దాదాపు 300 మందికి పలు అంశాలపై శిక్షణ ఇస్తారని తెలిపారు. 18న సింగమనేని నారాయణ, వెంకటరత్నం, తలేంద్ర, 19న సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కె.రాజశేఖర్ వివిధ అంశాలపై శిక్షణ ఇస్తారని తెలిపారు. -
మన విద్యాలయాలు నిరుద్యోగుల కార్ఖానాలు
అవలోకనం మన దేశంలోని ఎంబీఏ పట్టభద్రులలో 7% మాత్రమే ఉద్యోగాల్లో నియమించదగినవారని అసోచాం కొద్ది రోజుల క్రితం జరిపిన అధ్యయనంలో తెలిసింది. ఐటీ పరిశ్రమలో కూడా అలాంటి పరిస్థితే ఉంది. మన పట్టభద్రుల్లో 90% , ఇంజనీర్లలో 75% శిక్షణ గరపడానికి తగిన అర్హతలు లేనివారని నాస్కామ్ అధ్యయనం నిర్ధారించింది. మన విద్యాసంస్థలు ఉద్యోగాల్లో నియమించలేని భారతీయులను తయారుచేస్తున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ను గొప్ప వ్యూహంగా చెయ్యాలంటే వ్యవసాయ పనులలో ఉన్న వారికి తగిన శిక్షణనిచ్చి ఫ్యాక్టరీ ఉద్యోగాలకు తరలించాల్సి ఉంటుంది. ఈ కర్తవ్యాన్ని పాలిటెక్నిక్ కళాశాలల స్థాయిలోనే నిర్వహించాల్సి ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ కరెస్పాండెన్స్ కోర్సు డిగ్రీని వెతికి ఇవ్వాలని గుజరాత్ విశ్వవిద్యాలయాన్ని కోరారు. వాళ్లు నా డిప్లొమాను కూడా వెతికి పెడితే బావుం టుందని నా ఆశ. బరోడాలోని ఎమ్ఎస్ విశ్వవిద్యాలయంలో నేను రెండే ళ్ల (1987-89) కోర్సు చేశాను. చిట్టచివరి పరీక్షలు రాసేశాక సర్టిఫికెట్ తీసుకో కుండానే వచ్చేశాను. ఆ కోర్సు ఇంచుమించుగా నిరర్థకమైనది, సమయాన్ని వృథా చేసేది కావడం వల్లనే నేనా సర్టిఫికెట్ తీసుకోవాలని కూడా అనుకోలేదు. వస్తు తయారీ రంగం భారతదేశపు అతి పెద్ద సమస్యగా ఉన్న నిరుద్యోగానికి గొప్ప పరిష్కారాన్ని చూపగలదని అంటున్నారు కాబట్టి, ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. అది నిజమేనా? నేనలా అనుకోవడం లేదు. ఎందుకో చూద్దాం. 2011లో హార్వార్డ్ ‘కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్’కు చెందిన లాన్ ప్రిచెత్ భారత విద్యావిధానం గురించి ఇలా చెప్పారు: ‘‘భారత ఉన్నత వర్గాలకు నిజంగానే గొప్ప విద్య అందుతోంది... ప్రపంచ స్థాయిలో పదిహేనేళ్లు పైబడ్డ 10 శాతం అగ్రశ్రేణి విద్యార్థులను ఎక్కువగా తయారు చేసే దేశాలేవో చూస్తే భారత్ మొదటి వరుసలో ఉంటుంది. అది ఏడాదికి 1,00,000 మంది ప్రపంచస్థాయిలోని 10% అగ్రశ్రేణి విద్యార్థులను తయారు చేస్తుందని అంచనా. ప్రపంచస్థాయిలోని 10% అగ్రశ్రేణి విద్యార్థులను 1,00,000 మందిని తయారుచేసే దేశమే... ఎలాంటి నైపుణ్యాలూ లేని వారిని లక్షల్లో తయారుచేస్తుందంటే నమ్మశక్యం కాదు.’’ ఈ మాటలు కటువుగా ఉన్నాయా? కాదంటాను. నా అనుభవం ఏమిటో చెబితే మీరూ ఆ మాటలు సమంజసమైనవేనని అంగీకరిస్తారు. ప్రిచెత్ చెప్పిన అధ్వానమైన విద్యకు సంబంధించిన మొదటి అంశం, ప్రాథమిక పాఠశాల స్థాయిది. ఆ స్థాయి పిల్లల చదవగల, లెక్కించగల శక్తిసామర్థ్యాలపై ఇప్పటికే చాలా పరిశోధనలు జరిగాయి. కాబట్టి అదే విషయాన్ని నేను ఇక్కడ మళ్లీ ఏకరువు పెట్టను. ఇక ఆయన చెప్పిన రెండో అంశం, ప్రత్యేక రంగాలకు సంబంధించినది. మన దేశంలోని ఎంబీఏ పట్టభద్రులలో 7% మాత్రమే ఉద్యోగాల్లో నియమించ దగినవారని ‘అసోసియేషన్ ఆఫ్ ఇండియాస్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (అసోచాం) కొద్ది రోజుల క్రితం జరిపిన అధ్యయనంలో తెలిసింది. ఐటీ పరిశ్రమలో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. మన పట్టభద్రుల్లో 90%, ఇంజనీర్లలో 75% శిక్షణ గరపడానికి తగిన అర్హతలు లేనివారని ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్’ (నాస్కామ్) అధ్యయనం నిర్ధారించింది. మన విద్యాసంస్థలు ఉద్యోగాల్లో నియమించలేని భారతీయులను తయారు చేస్తున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ను గొప్ప వ్యూహంగా చెయ్యాలంటే వ్యవ సాయ పనులలో ఉన్న వారికి తగిన శిక్షణనిచ్చి ఫ్యాక్టరీ ఉద్యోగాలకు తరలించాల్సి ఉంటుంది. ఈ కర్తవ్యాన్ని పాలిటెక్నిక్ కళాశాలల స్థాయిలోనే నిర్వహించాల్సి ఉంది. నేను జౌళి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన రెండేళ్ల డిప్లొమా కోర్సును చదివాను. అప్పుడు నాకు నేత మగ్గాన్ని వాడటం, వడకడం తదితర దారం తయారీ పనులు ఎలా చెయ్యాలో బోధించారు. పాలిటెక్నిక్ కళాశాలలన్నీ అక్కడ ఉండాలని కోరుకోని వారితోనే నిండిపోయి ఉన్నాయని ముందుగా తెలుసుకోవాలి. మాలో చాలా మందిమి అప్పుడే పదో తరగతి పాసైన 16 లేదా 17 ఏళ్ల ప్రాయం వాళ్లం. ఇంకా పెద్ద చదువులు చదవాలనే ఆసక్తిగానీ లేదా గొప్ప ఆశయాలుగానీ లేని వాళ్లం. పాఠశాల చదువు పూర్తిచేశాక, డిగ్రీ కళాశాలలో చేరలేక అక్కడికి చేరిన బాపతు వాళ్లం. బ్లూ కాలర్ (పారిశ్రామిక కార్మికులుగా) పనులు చేయాలని చేరిన వాళ్లు ఎవరైనా ఉన్నట్టు నాకైతే గుర్తులేదు. నా రెండేళ్ల పాలిటెక్నిక్ కళాశాల చదువు అనుభవం ఇది: మేం పనిచేసిన యంత్రాలు నిజంగా పనిచేసేవేం కాదు. అంటే ఆ యంత్రా లను మేం చూడగలమే తప్ప వాటితో పనిచేయించలేం. ఒక కార్మికుడు పని చేసినట్టుగా మేం వాటితో పనిచేసి ఎరుగం. పరికరాలు తదితర సాధన సంపత్తి అంతా కాలం చెల్లినవి (నెహ్రూ ప్రారంభో త్సవం చేసిన యంత్రాలు, అంతకంటే పూర్వ కాలం నాటివి కూడా). చాలా వరకు పనిచేయని యంత్రాలపైనే జాకార్డ్, డాబీ నేత పనిని మాకు నేర్పారు. వాటర్ జెట్ లూమ్స్గానీ, వడకడానికి సంబంధించిన నిజమైన ఆధునిక సాధన సంపత్తిగానీ ఏవీ ఉండేవి కావు. దశాబ్దాల క్రితం అహ్మదాబాద్ మిల్లులలో ఉపయోగించిన పత్తిని వడకడానికి సంబంధించిన యంత్రాలపైనే ప్రధానంగా మా కోర్సు ఉండేది. పాలియెస్టర్ దారం, వస్త్ర తయారీల గురించి సిద్ధాంతాన్ని బోధించేవారు. అంటే అవెలా చేయాలో మాకు తెలియదు. నూలు యంత్రాలు సైతం సాధారణంగా విద్యుదీకర ణ చేసినవి కావు. మా ఉపాధ్యాయులంతా యంత్రాల మీద పని చేయని వైట్ కాలర్ ఉద్యోగులే ఉండేవారు. మిల్లుల్లో పనిచేసిన అనుభవం ఉన్న బ్లూ కాలర్ స్టాఫ్ (కార్మిక సిబ్బంది) మాకు బోధించేవారు కారు. కాబట్టి ఎలాంటి శిక్షణనూ పొందని వారే మాకు బోధించేవారుగా ఉండేవారు. తరగతులు ఇంగ్లిష్ మీడియంలో సాగేవి. మేమెన్నడూ వాస్తవంగా యంత్రాలపై పనిచేయకుండానే మమ్మల్ని పరీక్షించేవారు (మౌఖిక పరీక్ష సహా). మా చుట్టూ ఉన్నవాళ్లు ఎలా పనిచేస్తారో, వారు మరింత సమర్థవంతంగా ఎలా పనిచేయగలుగుతారో తెలుసుకోవాల్సిన అవసరం లేకుండానే మేం వారికి ఆజ్ఞలు జారీ చేయాల్సి ఉంటుందని భావించేవారు. అక్కడి విద్యార్థులంతా మధ్యతరగతి వారే. వారిలో చాలా మంది ఆసక్తితో గాక మరే అవకాశమూ లేక ఆ కోర్సులో చేరినవారు. అందరు విద్యార్థులూ ఆ తర్వాత డిగ్రీ కోర్సులో చేరాలని కోరుకునేవారు. కుటుంబ వ్యాపారాలున్నవారు తప్ప, చాలా మంది ఆ పనే చేశారు. అంతే గానీ, మాలో ఎవరూ ఫోర్మాన్ పని చేయలేదు. నేను ఆ డిప్లొమా కోర్సు ముగిసిన వెంటనే మా కుటుంబ వ్యాపారమైన పాలియెస్టర్ నేత, బట్టతయారీ పనిలో చేరాను. అయితే అంతా మొదటి నుంచి ప్రారంభించి నేర్చుకోవాల్సి వచ్చింది. ఆనాటి నా సహచర విద్యార్థుల్లో ఎవరూ ఫ్యాక్టరీలో సమర్థవంతంగా పనిచేసి ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే అసలు మాకా పనిలో శిక్షణను ఇచ్చిందే లేదు. ఎమ్ఎస్ విశ్వవిద్యాలయం నుంచి నేను నా డిప్లొమాను సంపాదించగలిగి నట్టయితే... దాన్ని ఫ్రేమ్ కట్టించి నా జీవితంలో రెండేళ్లను నేనెలా పూర్తిగా వృథా చేశాననే దానికి గుర్తుగా ఉంచుకుంటాను. దానికి అంతకు మించిన ప్రయోజన మేమీ లేదు. వ్యాసకర్త: ఆకార్ పటేల్ (కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com -
7న ఢిల్లీలో టీజేఏసీ వర్క్‌షాప్
బిల్లులో సవరణలపై ఎంపీలకు అవగాహన కల్పించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లులో సవరణలు చేయాల్సిన అంశాలపై పార్లమెంటరీ పార్టీల నేతలకు, ఎంపీలకు వచ్చే నెల 7వ తేదీన వర్క్‌షాప్‌ను నిర్వహించాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లో టీ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అధ్యక్షతన జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. అన్ని పార్టీల పార్లమెంటరీ విభాగాల నేతలతో, ఎంపీలతో 7న ఢిల్లీలో వర్క్‌షాపును నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అందులో హైదరాబాద్ శాంతిభద్రతలపై గవర్నర్‌కు అధికారాలు, ఉద్యోగుల విభజన, విద్య, నీరు, విద్యుత్, హైకోర్టు వంటివాటిని ముఖ్యమైన 5 అంశాలుగా క్రోడీకరించి.. ఒక్కో అంశంపై గంట పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, రిఫరెన్సులతో అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఫిబ్రవరి 2న జేఏసీ బృందం వరంగల్ జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లి... తెలంగాణ బిల్లు ఆమోదం పొందాలని మొక్కుకోనుంది. కాగా.. సమావేశం అనంతరం జేఏసీ నేతలు కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు మాట్లాడుతూ... సీఎం కిరణ్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీమాంధ్రలో రాజకీయ ప్రయోజనాల కోసమే కిరణ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బిల్లును వెనక్కి పంపడం సాధ్యం కాదని లోక్‌సత్తా అధ్యక్షుడు జేపీకి తెలియదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగంపై గౌరవం ఉంటే సీఎం కిరణ్‌ను చంద్రబాబు, జేపీలు నిలదీయాలని డిమాండ్ చేశారు. కాగా.. టీఆర్టీయూ రూపొందించిన డైరీని జేఏసీ నేతలు ఈ సందర్భంగా ఆవిష్కరించారు. -
‘పారిశ్రామిక భద్రత’పై హైదరాబాద్‌లో వర్క్‌షాప్
హైదరాబాద్: ‘పారిశ్రామిక భద్రత, అత్యవసర అప్రమత్తత’ అంశాలపై జాతీయ భద్రతా కౌన్సిల్ రాష్ట్ర విభాగం, రాష్ట్ర పరిశ్రమల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జీడిమెట్ల పారిశ్రామికవాడలోని పరిశ్రమల అసోసియేషన్ కార్యాలయంలో ఒక రోజు వర్క్‌షాప్ జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు పరిశ్రమలకు చెందిన 175 మంది సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. పరిశ్రమల శాఖ డెరైక్టర్ జి.బాల కిషోర్ ఈ వర్క్‌షాప్‌ను ప్రారంభించి ప్రసంగించారు. వర్క్‌షాప్‌లు పరిశ్రమల్లో భద్ర తా వ్యవస్థలు మరింత మెరుగుపడడానికి తోడ్పడతాయని పేర్కొన్నారు. ప్రమాదాలను నివారించడానికేగాకుండా, ప్రణాళిక, సంసిద్ధత, పారిశ్రామిక అత్యవసర పరిస్థితుల్లోనూ ఉపయోగపడే సమాచారం అందుతుందని ఆయన చెప్పారు. పరిశ్రమల అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.సదాశివరెడ్డి మాట్లాడుతూ.. ఈ వర్కషాప్ భద్రతా ప్రమాణాలు పెరగడానికి దోహదం చేస్తుందని అన్నారు. పరిశ్రమల శాఖ జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఎ.బాలాజీ శ్రీధర్ మాట్లాడుతూ.. అన్ని ఫ్యాక్టరీల ప్రతినిధులు ఈ సదస్సుల్లో పాల్గొని, ఆ నిర్ణయాలను పరిశ్రమల్లో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ వర్క్‌షాప్‌లో టి.ఈ.సీ విద్యాసాగర్, ఎం.వెంకన్న, బి.రాజగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.