మన విద్యాలయాలు నిరుద్యోగుల కార్ఖానాలు | Our educational institutions are workshops for the unemployed | Sakshi
Sakshi News home page

మన విద్యాలయాలు నిరుద్యోగుల కార్ఖానాలు

Published Sun, May 1 2016 12:48 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

మన విద్యాలయాలు నిరుద్యోగుల కార్ఖానాలు - Sakshi

మన విద్యాలయాలు నిరుద్యోగుల కార్ఖానాలు

అవలోకనం

మన దేశంలోని ఎంబీఏ పట్టభద్రులలో 7% మాత్రమే ఉద్యోగాల్లో నియమించదగినవారని అసోచాం కొద్ది రోజుల క్రితం జరిపిన అధ్యయనంలో తెలిసింది. ఐటీ పరిశ్రమలో కూడా అలాంటి పరిస్థితే ఉంది. మన పట్టభద్రుల్లో 90% , ఇంజనీర్లలో 75% శిక్షణ గరపడానికి తగిన అర్హతలు లేనివారని నాస్‌కామ్ అధ్యయనం నిర్ధారించింది. మన విద్యాసంస్థలు ఉద్యోగాల్లో నియమించలేని భారతీయులను తయారుచేస్తున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ను గొప్ప వ్యూహంగా చెయ్యాలంటే వ్యవసాయ పనులలో ఉన్న వారికి తగిన శిక్షణనిచ్చి ఫ్యాక్టరీ ఉద్యోగాలకు తరలించాల్సి ఉంటుంది. ఈ కర్తవ్యాన్ని పాలిటెక్నిక్ కళాశాలల స్థాయిలోనే నిర్వహించాల్సి ఉంటుంది.
 
ప్రధాని నరేంద్ర మోదీ కరెస్పాండెన్స్ కోర్సు డిగ్రీని వెతికి ఇవ్వాలని గుజరాత్ విశ్వవిద్యాలయాన్ని కోరారు. వాళ్లు నా డిప్లొమాను కూడా వెతికి పెడితే బావుం టుందని నా ఆశ. బరోడాలోని ఎమ్‌ఎస్ విశ్వవిద్యాలయంలో నేను రెండే ళ్ల (1987-89) కోర్సు చేశాను. చిట్టచివరి పరీక్షలు రాసేశాక సర్టిఫికెట్ తీసుకో కుండానే వచ్చేశాను. ఆ కోర్సు ఇంచుమించుగా నిరర్థకమైనది, సమయాన్ని వృథా చేసేది కావడం వల్లనే నేనా సర్టిఫికెట్ తీసుకోవాలని కూడా అనుకోలేదు. వస్తు తయారీ రంగం భారతదేశపు అతి పెద్ద సమస్యగా ఉన్న నిరుద్యోగానికి గొప్ప పరిష్కారాన్ని చూపగలదని అంటున్నారు కాబట్టి, ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. అది నిజమేనా? నేనలా అనుకోవడం లేదు. ఎందుకో చూద్దాం.
 
2011లో హార్వార్డ్ ‘కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్’కు చెందిన లాన్ ప్రిచెత్ భారత విద్యావిధానం గురించి ఇలా చెప్పారు:
 ‘‘భారత ఉన్నత వర్గాలకు నిజంగానే గొప్ప విద్య అందుతోంది... ప్రపంచ స్థాయిలో పదిహేనేళ్లు పైబడ్డ 10 శాతం అగ్రశ్రేణి  విద్యార్థులను ఎక్కువగా తయారు చేసే దేశాలేవో చూస్తే భారత్ మొదటి వరుసలో ఉంటుంది. అది ఏడాదికి 1,00,000 మంది ప్రపంచస్థాయిలోని 10% అగ్రశ్రేణి విద్యార్థులను తయారు చేస్తుందని అంచనా. ప్రపంచస్థాయిలోని 10% అగ్రశ్రేణి విద్యార్థులను 1,00,000 మందిని తయారుచేసే దేశమే... ఎలాంటి నైపుణ్యాలూ లేని వారిని లక్షల్లో తయారుచేస్తుందంటే నమ్మశక్యం కాదు.’’
 
ఈ మాటలు కటువుగా ఉన్నాయా? కాదంటాను. నా అనుభవం ఏమిటో చెబితే మీరూ ఆ మాటలు సమంజసమైనవేనని అంగీకరిస్తారు. ప్రిచెత్ చెప్పిన అధ్వానమైన విద్యకు సంబంధించిన మొదటి అంశం, ప్రాథమిక పాఠశాల స్థాయిది. ఆ స్థాయి పిల్లల చదవగల, లెక్కించగల శక్తిసామర్థ్యాలపై ఇప్పటికే చాలా పరిశోధనలు జరిగాయి. కాబట్టి అదే విషయాన్ని నేను ఇక్కడ మళ్లీ ఏకరువు పెట్టను. ఇక ఆయన చెప్పిన రెండో అంశం, ప్రత్యేక రంగాలకు సంబంధించినది. మన దేశంలోని ఎంబీఏ పట్టభద్రులలో 7% మాత్రమే ఉద్యోగాల్లో నియమించ దగినవారని ‘అసోసియేషన్ ఆఫ్ ఇండియాస్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (అసోచాం) కొద్ది రోజుల క్రితం జరిపిన అధ్యయనంలో తెలిసింది.
 
ఐటీ పరిశ్రమలో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. మన పట్టభద్రుల్లో 90%, ఇంజనీర్లలో 75% శిక్షణ గరపడానికి తగిన అర్హతలు లేనివారని ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్’ (నాస్‌కామ్) అధ్యయనం నిర్ధారించింది.
 
మన విద్యాసంస్థలు ఉద్యోగాల్లో నియమించలేని భారతీయులను తయారు చేస్తున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ను గొప్ప వ్యూహంగా చెయ్యాలంటే వ్యవ సాయ పనులలో ఉన్న వారికి తగిన శిక్షణనిచ్చి ఫ్యాక్టరీ ఉద్యోగాలకు తరలించాల్సి ఉంటుంది. ఈ కర్తవ్యాన్ని పాలిటెక్నిక్ కళాశాలల స్థాయిలోనే నిర్వహించాల్సి ఉంది. నేను జౌళి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన రెండేళ్ల డిప్లొమా కోర్సును చదివాను. అప్పుడు నాకు నేత మగ్గాన్ని వాడటం, వడకడం తదితర దారం తయారీ పనులు ఎలా చెయ్యాలో బోధించారు. పాలిటెక్నిక్ కళాశాలలన్నీ అక్కడ ఉండాలని కోరుకోని వారితోనే నిండిపోయి ఉన్నాయని ముందుగా తెలుసుకోవాలి.
 
మాలో చాలా మందిమి అప్పుడే పదో తరగతి పాసైన 16 లేదా 17 ఏళ్ల ప్రాయం వాళ్లం. ఇంకా పెద్ద చదువులు చదవాలనే ఆసక్తిగానీ లేదా గొప్ప ఆశయాలుగానీ లేని వాళ్లం. పాఠశాల చదువు పూర్తిచేశాక, డిగ్రీ కళాశాలలో చేరలేక అక్కడికి చేరిన బాపతు వాళ్లం. బ్లూ కాలర్  (పారిశ్రామిక కార్మికులుగా) పనులు చేయాలని చేరిన వాళ్లు ఎవరైనా ఉన్నట్టు నాకైతే గుర్తులేదు.
 
నా రెండేళ్ల పాలిటెక్నిక్ కళాశాల చదువు అనుభవం ఇది:
మేం పనిచేసిన యంత్రాలు నిజంగా పనిచేసేవేం కాదు. అంటే ఆ యంత్రా లను మేం చూడగలమే తప్ప వాటితో పనిచేయించలేం. ఒక కార్మికుడు పని చేసినట్టుగా మేం వాటితో పనిచేసి ఎరుగం. పరికరాలు తదితర సాధన సంపత్తి అంతా కాలం చెల్లినవి (నెహ్రూ ప్రారంభో త్సవం చేసిన యంత్రాలు, అంతకంటే పూర్వ కాలం నాటివి కూడా). చాలా వరకు పనిచేయని యంత్రాలపైనే జాకార్డ్, డాబీ నేత పనిని మాకు నేర్పారు. వాటర్ జెట్ లూమ్స్‌గానీ, వడకడానికి సంబంధించిన నిజమైన ఆధునిక సాధన సంపత్తిగానీ ఏవీ ఉండేవి కావు. దశాబ్దాల క్రితం అహ్మదాబాద్ మిల్లులలో ఉపయోగించిన పత్తిని వడకడానికి సంబంధించిన యంత్రాలపైనే ప్రధానంగా మా కోర్సు ఉండేది. పాలియెస్టర్ దారం, వస్త్ర తయారీల గురించి సిద్ధాంతాన్ని బోధించేవారు. అంటే అవెలా చేయాలో మాకు తెలియదు. నూలు యంత్రాలు సైతం సాధారణంగా విద్యుదీకర ణ చేసినవి కావు.
   
మా ఉపాధ్యాయులంతా యంత్రాల మీద పని చేయని వైట్ కాలర్ ఉద్యోగులే ఉండేవారు. మిల్లుల్లో పనిచేసిన అనుభవం ఉన్న బ్లూ కాలర్ స్టాఫ్ (కార్మిక సిబ్బంది) మాకు బోధించేవారు కారు. కాబట్టి ఎలాంటి శిక్షణనూ పొందని వారే మాకు బోధించేవారుగా ఉండేవారు.
   
తరగతులు ఇంగ్లిష్ మీడియంలో సాగేవి. మేమెన్నడూ వాస్తవంగా యంత్రాలపై పనిచేయకుండానే మమ్మల్ని పరీక్షించేవారు (మౌఖిక పరీక్ష సహా). మా చుట్టూ ఉన్నవాళ్లు ఎలా పనిచేస్తారో, వారు మరింత సమర్థవంతంగా ఎలా పనిచేయగలుగుతారో తెలుసుకోవాల్సిన అవసరం లేకుండానే మేం వారికి ఆజ్ఞలు జారీ చేయాల్సి ఉంటుందని భావించేవారు. అక్కడి విద్యార్థులంతా మధ్యతరగతి వారే. వారిలో చాలా మంది ఆసక్తితో గాక మరే అవకాశమూ లేక ఆ కోర్సులో చేరినవారు.
   
అందరు విద్యార్థులూ ఆ తర్వాత డిగ్రీ కోర్సులో చేరాలని కోరుకునేవారు. కుటుంబ వ్యాపారాలున్నవారు తప్ప, చాలా మంది ఆ పనే చేశారు. అంతే గానీ, మాలో ఎవరూ ఫోర్‌మాన్ పని చేయలేదు. నేను ఆ డిప్లొమా కోర్సు ముగిసిన వెంటనే మా కుటుంబ వ్యాపారమైన పాలియెస్టర్ నేత, బట్టతయారీ పనిలో చేరాను. అయితే అంతా మొదటి నుంచి ప్రారంభించి నేర్చుకోవాల్సి వచ్చింది.  ఆనాటి నా సహచర విద్యార్థుల్లో ఎవరూ ఫ్యాక్టరీలో సమర్థవంతంగా పనిచేసి ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే అసలు మాకా పనిలో శిక్షణను ఇచ్చిందే లేదు.
 
ఎమ్‌ఎస్ విశ్వవిద్యాలయం నుంచి నేను నా డిప్లొమాను సంపాదించగలిగి నట్టయితే... దాన్ని ఫ్రేమ్ కట్టించి నా జీవితంలో రెండేళ్లను నేనెలా పూర్తిగా వృథా చేశాననే దానికి గుర్తుగా ఉంచుకుంటాను. దానికి అంతకు మించిన ప్రయోజన మేమీ లేదు.
వ్యాసకర్త: ఆకార్ పటేల్ (కాలమిస్టు, రచయిత)
aakar.patel@icloud.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement