సాక్షి, అమరావతి: ఏటా టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామన్న హామీని చంద్రబాబు ప్రభుత్వం తుంగలోతొక్కింది. 2014లో ఓ నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత చేతులు దులుపుకొంది. ప్రభుత్వం ఆమోదంలేకపోవడంతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయలేకపోతున్నామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించినా మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఒకపక్క ఉద్యోగ వయోపరిమితిని 34 నుంచి 42 ఏళ్లకు పెంచినా నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగుల ఆశలు ఎండమావులే అయ్యాయి. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు రిటైర్మెంట్ అయిన పోస్టులతో కలుపుకుంటే 19,468 ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం సుముఖంగా లేదు.
పోస్టుల్లో కోత పెట్టేలా నివేదికను తెప్పించింది. ఇటీవల జిల్లాల నుంచి విద్యాశాఖ తెప్పించిన సమాచారంలో కేవలం 10,603 పోస్టులు ఉన్నట్లుగా చూపారు. 2014లో డీఎస్సీ ప్రకటించినప్పుడు 10,313 పోస్టులు భర్తీచేశారు. ఆతరువాత సర్వశిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) నిధులకోసం కేంద్రానికి పంపిన నివేదికల్లో రాష్ట్రంలో తొలుత 19,468 అని, ఆ తరువాత 14,194 ఖాళీలు ఉన్నట్లు చూపించారు. టీచర్ పోస్టుల భర్తీపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసుకు సంబంధించిన కౌంటర్ అఫిడవిట్లోనూ ఇదే సంఖ్యను చూపారు. ఈ పోస్టుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు 5,655, స్కూల్ అసిస్టెంట్లు 3,119, ఎల్పీలు 260, పీఈటీలు 1,115, మ్యూజిక్ 77, మోడల్ స్కూలు 938, ఐఈడీఎస్‌ఎస్ 860, మున్సిపల్ 1,147, కంప్యూటర్ టీచర్లు 1,023 పోస్టులు ఉన్నట్లు చూపించారు. 2014 డీఎస్సీ తరువాత మళ్లీ నోటిఫికేషన్ రానందున రిటైరయిన వారి పోస్టులను కూడా కలుపుకుంటే పోస్టుల సంఖ్య పెరగాలి కానీ తగ్గినట్లు చూపడం విడ్డూరం.
రాష్ట్రంలో 22,814 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేస్తామని గత ఏడాది చివర్లో మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. తరువాత ఆ సంఖ్యను ప్రభుత్వం తగ్గిస్తూ 14,300 భర్తీ చేయాలని పేర్కొంది. ఈ పోస్టుల్లో మోడల్ స్కూల్ టీచర్లు 988, మున్సిపల్ టీచర్ పోస్టులు 1,447, పాఠశాల విద్యాశాఖ పరిధిలో సెకండరీ గ్రేడ్ టీచర్లు 5,900, స్కూల్ అసిస్టెంటు టీచర్లు 3,419, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు 1,100, ఐటీ టీచర్లు 1,020, మ్యూజిక్ టీచర్లు 77, ఇతర టీచర్ పోస్టులు 349 గుర్తించారు. ఈ పోస్టుల్లో ఆర్థిక పరమైన మంజూరు ఉన్నవి 10,603 మాత్రమేనని, తక్కిన వాటికి ప్రభుత్వం అనుమతించాల్సి ఉందని తేల్చారు. ఆర్థిక అనుమతులు లేని పోస్టుల విషయంలో నాలుగు నెలల క్రితం ప్రభుత్వానికి విద్యాశాఖ నివేదించినా ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఆర్థిక శాఖ అనుమతులు వస్తేనే కానీ ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం లేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఒకేసారి పోస్టులన్నీ భర్తీ చేసే బదులు రెండు విడతలుగా భర్తీ చేస్తే.. రెండు ఏళ్లు వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చినట్లు భ్రమింపచేయవచ్చు అన్నట్లు ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా పోస్టులను తగ్గించి ప్రస్తుత డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం. అదే అయితే పోస్టుల సంఖ్య సగానికి సగం తగ్గిపోతాయని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
డీఎస్సీ నోటిఫికేషన్లు లేనేలేవు
Published Fri, Mar 23 2018 3:31 AM | Last Updated on Fri, Mar 23 2018 3:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment