teachers posts requirement
-
డీఎస్సీ నోటిఫికేషన్లు లేనేలేవు
సాక్షి, అమరావతి: ఏటా టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామన్న హామీని చంద్రబాబు ప్రభుత్వం తుంగలోతొక్కింది. 2014లో ఓ నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత చేతులు దులుపుకొంది. ప్రభుత్వం ఆమోదంలేకపోవడంతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయలేకపోతున్నామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించినా మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఒకపక్క ఉద్యోగ వయోపరిమితిని 34 నుంచి 42 ఏళ్లకు పెంచినా నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగుల ఆశలు ఎండమావులే అయ్యాయి. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు రిటైర్మెంట్ అయిన పోస్టులతో కలుపుకుంటే 19,468 ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం సుముఖంగా లేదు. పోస్టుల్లో కోత పెట్టేలా నివేదికను తెప్పించింది. ఇటీవల జిల్లాల నుంచి విద్యాశాఖ తెప్పించిన సమాచారంలో కేవలం 10,603 పోస్టులు ఉన్నట్లుగా చూపారు. 2014లో డీఎస్సీ ప్రకటించినప్పుడు 10,313 పోస్టులు భర్తీచేశారు. ఆతరువాత సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధులకోసం కేంద్రానికి పంపిన నివేదికల్లో రాష్ట్రంలో తొలుత 19,468 అని, ఆ తరువాత 14,194 ఖాళీలు ఉన్నట్లు చూపించారు. టీచర్ పోస్టుల భర్తీపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసుకు సంబంధించిన కౌంటర్ అఫిడవిట్లోనూ ఇదే సంఖ్యను చూపారు. ఈ పోస్టుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు 5,655, స్కూల్ అసిస్టెంట్లు 3,119, ఎల్పీలు 260, పీఈటీలు 1,115, మ్యూజిక్ 77, మోడల్ స్కూలు 938, ఐఈడీఎస్‌ఎస్ 860, మున్సిపల్ 1,147, కంప్యూటర్ టీచర్లు 1,023 పోస్టులు ఉన్నట్లు చూపించారు. 2014 డీఎస్సీ తరువాత మళ్లీ నోటిఫికేషన్ రానందున రిటైరయిన వారి పోస్టులను కూడా కలుపుకుంటే పోస్టుల సంఖ్య పెరగాలి కానీ తగ్గినట్లు చూపడం విడ్డూరం. రాష్ట్రంలో 22,814 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేస్తామని గత ఏడాది చివర్లో మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. తరువాత ఆ సంఖ్యను ప్రభుత్వం తగ్గిస్తూ 14,300 భర్తీ చేయాలని పేర్కొంది. ఈ పోస్టుల్లో మోడల్ స్కూల్ టీచర్లు 988, మున్సిపల్ టీచర్ పోస్టులు 1,447, పాఠశాల విద్యాశాఖ పరిధిలో సెకండరీ గ్రేడ్ టీచర్లు 5,900, స్కూల్ అసిస్టెంటు టీచర్లు 3,419, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు 1,100, ఐటీ టీచర్లు 1,020, మ్యూజిక్ టీచర్లు 77, ఇతర టీచర్ పోస్టులు 349 గుర్తించారు. ఈ పోస్టుల్లో ఆర్థిక పరమైన మంజూరు ఉన్నవి 10,603 మాత్రమేనని, తక్కిన వాటికి ప్రభుత్వం అనుమతించాల్సి ఉందని తేల్చారు. ఆర్థిక అనుమతులు లేని పోస్టుల విషయంలో నాలుగు నెలల క్రితం ప్రభుత్వానికి విద్యాశాఖ నివేదించినా ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఆర్థిక శాఖ అనుమతులు వస్తేనే కానీ ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం లేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఒకేసారి పోస్టులన్నీ భర్తీ చేసే బదులు రెండు విడతలుగా భర్తీ చేస్తే.. రెండు ఏళ్లు వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చినట్లు భ్రమింపచేయవచ్చు అన్నట్లు ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా పోస్టులను తగ్గించి ప్రస్తుత డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం. అదే అయితే పోస్టుల సంఖ్య సగానికి సగం తగ్గిపోతాయని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
‘అధ్యాపకుల’ నిబంధనలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో 1,061 అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియను నవంబర్‌లో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,500కు పైగా పోస్టుల్లో మొదటి విడతలో 1,061 పోస్టుల భర్తీకి ఇదివరకే ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ నేపథ్యంలో నియామకాల్లో అనుసరించాల్సిన నిబంధనలపై వైస్ చాన్స్లర్ల కమిటీ అందజేసిన సిఫారసులకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో యథాతథంగా ఆమోదించారు. దీంతో నియామకాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే యూనివర్సిటీలు తమ ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల సమావేశాలను ఏర్పాటు చేసుకొని పోస్టుల భర్తీకి తీర్మానాలు చేయాలని వీసీల కమిటీ సూచించింది. ఈ ప్రక్రియ వచ్చే నెల నుంచి ప్రారంభించాలని స్పష్టం చేసినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. మరోవైపు వర్సిటీలకు కేటాయించిన పోస్టుల్లో సబ్జెక్టుల వారీగా, ప్రాధాన్యాల వారీగా ఏయే పోస్టులను భర్తీ చేయాలన్న విషయంలో ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి త్వరలోనే సమావేశమై తేల్చనున్నాయి. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లలో ఆమోదం తీసుకొని పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించనున్నాయి. ప్రస్తుతం కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ పద్ధతిన పని చేస్తున్న అధ్యాపకులకు ఈ నియామకాల్లో కొంత వెయిటేజీ లభించనుంది. వారి అకడమిక్ రికార్డుకు 10 మార్కులను వర్సిటీలు ఇవ్వనున్నాయి. ఈ నియామకాల వల్ల ప్రస్తుతం కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ పద్ధతిన పని చేస్తున్న వారిపై ప్రభావం ఉంటుందా? అనే విషయంలో ఇప్పుడే ఏమీ చెప్పలేమని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తానికి మే నెలాఖరుకల్లా ఈ నియామకాలను పూర్తి చేసి, కొత్త విద్యా సంవత్సరంలో కొత్త అధ్యాపకులు యూనివర్సిటీల్లో పని చేసేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వచ్చే నెల నుంచే కొత్త వేతనాలు వర్సిటీల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం పద్ధతిన పని చేస్తున్న అధ్యాపకుల వేతనాల పెంపునకు వీసీల కమిటీ చేసిన సిఫారసులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పాపిరెడ్డి వెల్లడించారు. ఒక్కో అధ్యాపకునికి 75 శాతం వేతనం పెరుగుతుందని తెలిపారు. దీనికి అదనంగా ప్రతి ఏటా 3 శాతం వేతనం పెరగనుందని వివరించారు. 2 వేల మందికి పైగా సిబ్బందికి ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. నవంబర్ నెల నుంచే వేతనాలు పెరుగుతాయని తెలిపారు. -
తెలంగాణలో డీఎస్సీ ఇంకెప్పుడు?
తెలంగాణలో నోటి ఫికేషన్ కోసం నాలుగు లక్షల మంది ఎదురుచూపులు టెట్పైనా వెలువడని స్పష్టత.. టీఈఆర్టీనే అమల్లోకి తెస్తారా? రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 24,861 పోస్టులు ‘సాక్షి’ సేకరించిన సమాచారం మేరకు భర్తీ చేయనున్నవి 12 వేలు మాత్రమే! సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తారనే ఆశతో ఉన్నవారంతా... ఈ దిశగా ప్రభుత్వంలో ఏ మాత్రం కదలిక కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీకావడంతో తెలంగాణలో ఎప్పుడు జారీ అవుతుందన్న అంచనాల్లో పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో గత ఏడాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరుగుతుందని భావించినా.. రాష్ట్ర విభజన నేపథ్యంలో భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. జూన్ 2న కొత్త రాష్ట్రం ఏర్పడడంతో.. ఆర్నెల్ల తర్వాత కనీసం డిసెంబర్లో అయినా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అవుతుందని ఉపాధ్యాయ అభ్యర్థులంతా భావించారు. కానీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టతా రాకపోవడంతో.. కనీసం మార్చి నాటికైనా నోటిఫికేషన్ వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు. మరోవైపు.. ఉపాధ్యాయ విద్య కోర్సులు పూర్తిచేసిన లక్షలాది మంది డీఎస్సీ కోసం ఇప్పటికే శిక్షణ బాట పట్టారు. హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాల్లోని కోచింగ్ సెంటర్లలో వేల రూపాయలు వెచ్చించి మరీ శిక్షణ తీసుకుంటున్నారు. లక్షల మంది ఎదురుచూపు.. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వారు తెలంగాణ జిల్లాల్లో దాదాపు నాలుగు లక్షల మంది వరకు ఉన్నారు. గతంలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ల్లో అర్హత సాధించిన వారు రెండు లక్షల మంది వరకు ఉండగా... మరో రెండు లక్షల మంది టెట్ రాయని లేదా అర్హత సాధించని వారు ఉన్నారు. ఇందులో ఈ ఏడాది బీఎడ్, డీఎడ్, బీపీఈడీ, యూజీపీఈడీ కోర్సులు పూర్తి చేసిన వారు కూడా ఉన్నారు. వారంతా ఇప్పుడు టెట్‌కు, డీఎస్సీకి వేర్వేరు పరీక్షలు నిర్వహిస్తారా? కలిపి ఒకే పరీక్ష నిర్వహిస్తారా? అనే స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖ వేసిన కమిటీ సిఫారసుల మేరకు అప్పట్లోనే టెట్ కమ్ రిక్రూట్మెంట్ పరీక్ష (టీఈఆర్టీ)ను అమల్లోకి తేవాలని భావించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో టీఈఆర్టీని అమలు చేస్తారా? అనేది తేల్చాల్సి ఉంది. విద్యాశాఖ మాత్రం మరోసారి కమిటీ వేసి అధ్యయనం చేయించాలని భావిస్తోంది. పోస్టులు తగ్గుతాయా? రాష్ట్రంలో 24,861 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా... ఇందులో ఎన్ని పోస్టులను భర్తీ చేస్తారనేది తేలాల్సి ఉంది. ప్రభుత్వం వచ్చే వేసవిలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టాలని భావిస్తోంది. ఇదే జరిగితే టీచర్ పోస్టుల సంఖ్య తగ్గుతుందనే ఆందోళన నిరుద్యోగుల్లో నెలకొంది. హేతుబద్ధీకరణ చేస్తే 10 వేల పోస్టులు కూడా అవసరం ఉండకపోవచ్చని విద్యాశాఖ కూడా భావిస్తుండటం గమనార్హం. ‘సాక్షి’ సేకరించిన సమాచారం మేరకు 12,306 పోస్టుల భర్తీకి జిల్లాల్లో అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణను వేసవిలో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుండటంతో... అప్పుడైనా డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందా? లేదా? అనే ఆందోళన నిరుద్యోగుల్లో నెలకొంది.