తెలంగాణలో డీఎస్సీ ఇంకెప్పుడు?
తెలంగాణలో నోటి ఫికేషన్ కోసం నాలుగు లక్షల మంది ఎదురుచూపులు
టెట్‌పైనా వెలువడని స్పష్టత.. టీఈఆర్‌టీనే అమల్లోకి తెస్తారా?
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 24,861 పోస్టులు
‘సాక్షి’ సేకరించిన సమాచారం మేరకు భర్తీ చేయనున్నవి 12 వేలు మాత్రమే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తారనే ఆశతో ఉన్నవారంతా... ఈ దిశగా ప్రభుత్వంలో ఏ మాత్రం కదలిక కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీకావడంతో తెలంగాణలో ఎప్పుడు జారీ అవుతుందన్న అంచనాల్లో పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో గత ఏడాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరుగుతుందని భావించినా.. రాష్ట్ర విభజన నేపథ్యంలో భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. జూన్ 2న కొత్త రాష్ట్రం ఏర్పడడంతో.. ఆర్నెల్ల తర్వాత కనీసం డిసెంబర్‌లో అయినా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అవుతుందని ఉపాధ్యాయ అభ్యర్థులంతా భావించారు. కానీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టతా రాకపోవడంతో.. కనీసం మార్చి నాటికైనా నోటిఫికేషన్ వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు. మరోవైపు.. ఉపాధ్యాయ విద్య కోర్సులు పూర్తిచేసిన లక్షలాది మంది డీఎస్సీ కోసం ఇప్పటికే శిక్షణ బాట పట్టారు. హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాల్లోని కోచింగ్ సెంటర్లలో వేల రూపాయలు వెచ్చించి మరీ శిక్షణ తీసుకుంటున్నారు.
లక్షల మంది ఎదురుచూపు..
డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వారు తెలంగాణ జిల్లాల్లో దాదాపు నాలుగు లక్షల మంది వరకు ఉన్నారు. గతంలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ల్లో అర్హత సాధించిన వారు రెండు లక్షల మంది వరకు ఉండగా... మరో రెండు లక్షల మంది టెట్ రాయని లేదా అర్హత సాధించని వారు ఉన్నారు. ఇందులో ఈ ఏడాది బీఎడ్, డీఎడ్, బీపీఈడీ, యూజీపీఈడీ కోర్సులు పూర్తి చేసిన వారు కూడా ఉన్నారు. వారంతా ఇప్పుడు టెట్‌కు, డీఎస్సీకి వేర్వేరు పరీక్షలు నిర్వహిస్తారా? కలిపి ఒకే పరీక్ష నిర్వహిస్తారా? అనే స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖ వేసిన కమిటీ సిఫారసుల మేరకు అప్పట్లోనే టెట్ కమ్ రిక్రూట్‌మెంట్ పరీక్ష (టీఈఆర్‌టీ)ను అమల్లోకి తేవాలని భావించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో టీఈఆర్‌టీని అమలు చేస్తారా? అనేది తేల్చాల్సి ఉంది. విద్యాశాఖ మాత్రం మరోసారి కమిటీ వేసి అధ్యయనం చేయించాలని భావిస్తోంది.
పోస్టులు తగ్గుతాయా?
రాష్ట్రంలో 24,861 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా... ఇందులో ఎన్ని పోస్టులను భర్తీ చేస్తారనేది తేలాల్సి ఉంది. ప్రభుత్వం వచ్చే వేసవిలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టాలని భావిస్తోంది. ఇదే జరిగితే టీచర్ పోస్టుల సంఖ్య తగ్గుతుందనే ఆందోళన నిరుద్యోగుల్లో నెలకొంది. హేతుబద్ధీకరణ చేస్తే 10 వేల పోస్టులు కూడా అవసరం ఉండకపోవచ్చని విద్యాశాఖ కూడా భావిస్తుండటం గమనార్హం. ‘సాక్షి’ సేకరించిన సమాచారం మేరకు 12,306 పోస్టుల భర్తీకి జిల్లాల్లో అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణను వేసవిలో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుండటంతో... అప్పుడైనా డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందా? లేదా? అనే ఆందోళన నిరుద్యోగుల్లో నెలకొంది.