TERT
-
తెలంగాణలో డీఎస్సీ ఇంకెప్పుడు?
తెలంగాణలో నోటి ఫికేషన్ కోసం నాలుగు లక్షల మంది ఎదురుచూపులు టెట్పైనా వెలువడని స్పష్టత.. టీఈఆర్టీనే అమల్లోకి తెస్తారా? రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 24,861 పోస్టులు ‘సాక్షి’ సేకరించిన సమాచారం మేరకు భర్తీ చేయనున్నవి 12 వేలు మాత్రమే! సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తారనే ఆశతో ఉన్నవారంతా... ఈ దిశగా ప్రభుత్వంలో ఏ మాత్రం కదలిక కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీకావడంతో తెలంగాణలో ఎప్పుడు జారీ అవుతుందన్న అంచనాల్లో పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో గత ఏడాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరుగుతుందని భావించినా.. రాష్ట్ర విభజన నేపథ్యంలో భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. జూన్ 2న కొత్త రాష్ట్రం ఏర్పడడంతో.. ఆర్నెల్ల తర్వాత కనీసం డిసెంబర్లో అయినా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అవుతుందని ఉపాధ్యాయ అభ్యర్థులంతా భావించారు. కానీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టతా రాకపోవడంతో.. కనీసం మార్చి నాటికైనా నోటిఫికేషన్ వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు. మరోవైపు.. ఉపాధ్యాయ విద్య కోర్సులు పూర్తిచేసిన లక్షలాది మంది డీఎస్సీ కోసం ఇప్పటికే శిక్షణ బాట పట్టారు. హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాల్లోని కోచింగ్ సెంటర్లలో వేల రూపాయలు వెచ్చించి మరీ శిక్షణ తీసుకుంటున్నారు. లక్షల మంది ఎదురుచూపు.. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వారు తెలంగాణ జిల్లాల్లో దాదాపు నాలుగు లక్షల మంది వరకు ఉన్నారు. గతంలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ల్లో అర్హత సాధించిన వారు రెండు లక్షల మంది వరకు ఉండగా... మరో రెండు లక్షల మంది టెట్ రాయని లేదా అర్హత సాధించని వారు ఉన్నారు. ఇందులో ఈ ఏడాది బీఎడ్, డీఎడ్, బీపీఈడీ, యూజీపీఈడీ కోర్సులు పూర్తి చేసిన వారు కూడా ఉన్నారు. వారంతా ఇప్పుడు టెట్‌కు, డీఎస్సీకి వేర్వేరు పరీక్షలు నిర్వహిస్తారా? కలిపి ఒకే పరీక్ష నిర్వహిస్తారా? అనే స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖ వేసిన కమిటీ సిఫారసుల మేరకు అప్పట్లోనే టెట్ కమ్ రిక్రూట్మెంట్ పరీక్ష (టీఈఆర్టీ)ను అమల్లోకి తేవాలని భావించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో టీఈఆర్టీని అమలు చేస్తారా? అనేది తేల్చాల్సి ఉంది. విద్యాశాఖ మాత్రం మరోసారి కమిటీ వేసి అధ్యయనం చేయించాలని భావిస్తోంది. పోస్టులు తగ్గుతాయా? రాష్ట్రంలో 24,861 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా... ఇందులో ఎన్ని పోస్టులను భర్తీ చేస్తారనేది తేలాల్సి ఉంది. ప్రభుత్వం వచ్చే వేసవిలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టాలని భావిస్తోంది. ఇదే జరిగితే టీచర్ పోస్టుల సంఖ్య తగ్గుతుందనే ఆందోళన నిరుద్యోగుల్లో నెలకొంది. హేతుబద్ధీకరణ చేస్తే 10 వేల పోస్టులు కూడా అవసరం ఉండకపోవచ్చని విద్యాశాఖ కూడా భావిస్తుండటం గమనార్హం. ‘సాక్షి’ సేకరించిన సమాచారం మేరకు 12,306 పోస్టుల భర్తీకి జిల్లాల్లో అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణను వేసవిలో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుండటంతో... అప్పుడైనా డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందా? లేదా? అనే ఆందోళన నిరుద్యోగుల్లో నెలకొంది. -
టెర్ట్ దరఖాస్తులు ఆన్లైన్లోనే..!
నేడు టీచర్ పోస్టుల భర్తీ మార్గదర్శకాలు విడుదల పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ ఉషారాణి వెల్లడి దరఖాస్తు నేరుగా డీఈవో కార్యాలయాల్లో ఇస్తే అనుమతించం ఆన్లైన్ దరఖాస్తు ప్రతిని ధ్రువపత్రాలతో డీఈవోకు అందచేయాలి రేపట్నుంచి దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ‘టెర్ట్’ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్లైన్లోనే సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ వి.ఉషారాణి సూచించారు. జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) నేతృత్వంలో ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహిస్తున్న టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ), ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్) ఒకే పరీక్షగా ఉపాధ్యాయ అర్హత, నియామక పరీక్ష (టెర్ట్) పేరుతో నిర్వహించతలపెట్టిన విషయం తెలిసిందే. నేరుగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో అందించే దరఖాస్తులను అనుమతించబోమని స్పష్టంచేశారు. తొలుత తమ శాఖ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు ప్రొఫార్మాలో పూర్తి చేసి సమర్పించాలని చెప్పారు. అనంతరం అప్లికేషన్ కాపీపై సంతకం చేసి అర్హత, స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాల నకళ్లతో కలిపి ఆయా జిల్లాల విద్యాశాఖాధికారుల కార్యాలయాల్లో సమర్పించాలన్నారు. సోమవారం తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి మంగళవారం సవివరంగా మార్గదర్శకాలను విడుదల చేస్తామని తెలిపారు. 'ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని 9,061 టీచర్ పోస్టులు భర్తీచేస్తాం. జిల్లాలవారీగా, కేటగిరీలు, సబ్జెక్టుల వారీగా, రోస్టర్ వారీగా వివరాలను వెబ్సైట్లో పొందుపరుస్తాం. 3వ తేదీ నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవ చ్చు' అని వివరించారు. నూతన ఉపాధ్యాయులు వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం నాటికే పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని టీచర్ పోస్టుల భర్తీని ఈ డీఎస్సీలోనే చేపట్టనున్నారు. మండల, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఏజెన్సీ ఏరియాలోని పోస్టులకు ఎస్టీ అభ్యర్ధులు దరఖాస్తు చేయాలి. 'టెర్ట్'నోటిఫికేషన్ వివరాలు పరీక్ష ఫీజు చెల్లింపు గడువు: డిసెంబర్ 2 నుంచి జనవరి 16 (ఏపీ ఆన్లైన్, ఈ సేవా కేంద్రాల్లో ఫీజు చెల్లించవచ్చు) దరఖాస్తుల దాఖలుకు గడువు: డిసెంబర్ 3 నుంచి జనవరి 17 హాల్ టిక్కెట్ల డౌన్లోడ్ గడువు: 2015 ఏప్రిల్ 25 రాత పరీక్షల తేదీలు: మే 9, 10, 11 ఎస్జీటీ పోస్టులకు: మే 9 భాషా పండితులు, పీఈటీ లకు: మే 10 స్కూల్ అసిస్టెంట్లకు: మే 11 ప్రాధమిక కీ విడుదల తేదీ: మే 18 కీపై ఆన్లైన్లో అభ్యంతరాలకు గడువు: మే 19 నుంచి మే 25 వరకు తుది 'కీ'విడుదల: మే 27 ఫలితాల ప్రకటన: మే 28 పోస్టుల వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం.