7న ఢిల్లీలో టీజేఏసీ వర్క్‌షాప్
బిల్లులో సవరణలపై ఎంపీలకు అవగాహన కల్పించాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లులో సవరణలు చేయాల్సిన అంశాలపై పార్లమెంటరీ పార్టీల నేతలకు, ఎంపీలకు వచ్చే నెల 7వ తేదీన వర్క్‌షాప్‌ను నిర్వహించాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లో టీ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అధ్యక్షతన జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. అన్ని పార్టీల పార్లమెంటరీ విభాగాల నేతలతో, ఎంపీలతో 7న ఢిల్లీలో వర్క్‌షాపును నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అందులో హైదరాబాద్ శాంతిభద్రతలపై గవర్నర్‌కు అధికారాలు, ఉద్యోగుల విభజన, విద్య, నీరు, విద్యుత్, హైకోర్టు వంటివాటిని ముఖ్యమైన 5 అంశాలుగా క్రోడీకరించి.. ఒక్కో అంశంపై గంట పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, రిఫరెన్సులతో అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఫిబ్రవరి 2న జేఏసీ బృందం వరంగల్ జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లి... తెలంగాణ బిల్లు ఆమోదం పొందాలని మొక్కుకోనుంది.
కాగా.. సమావేశం అనంతరం జేఏసీ నేతలు కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు మాట్లాడుతూ... సీఎం కిరణ్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీమాంధ్రలో రాజకీయ ప్రయోజనాల కోసమే కిరణ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బిల్లును వెనక్కి పంపడం సాధ్యం కాదని లోక్‌సత్తా అధ్యక్షుడు జేపీకి తెలియదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగంపై గౌరవం ఉంటే సీఎం కిరణ్‌ను చంద్రబాబు, జేపీలు నిలదీయాలని డిమాండ్ చేశారు. కాగా.. టీఆర్‌టీయూ రూపొందించిన డైరీని జేఏసీ నేతలు ఈ సందర్భంగా ఆవిష్కరించారు.