కొత్తగా 8 వైద్య కళాశాలలు
► తెలంగాణ ప్రభుత్వ పరిధిలో 2, ప్రైవేటులో 6 కాలేజీలు
► ఈఎస్‌ఐ, మహబూబ్‌నగర్ ప్రభుత్వ కాలేజీలకు ఎన్టీఆర్
► హెల్త్ వర్సిటీ అఫిలియేషన్
► ఏపీలో కొత్తగా నాలుగు
► వైద్య కాలేజీలకు అనుమతి
► చిత్తూరు ప్రభుత్వాసుపత్రి లీజుతో జాక్‌పాట్ కొట్టిన అపోలో
► 2 నెలల్లోనే కాలేజీకి అనుమతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 8 వైద్య కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. వీటివల్ల రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలల్లో 250 సీట్లు, ప్రైవేటులో 900 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రానున్నాయి. ఈ కాలేజీలకు ఎసెన్షియాలిటీ ధ్రువీకరణ పత్రాలను రాష్ట్ర సర్కారు ఇప్పటికే మంజూరు చేయగా.. తాజాగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అనుబంధ గుర్తింపు(అఫిలియేషన్) ఇచ్చింది. కొత్తగా అనుమతులు పొందిన కళాశాలల్లో తెలంగాణలో 8 ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 4 ఉన్నాయి. ఒక్కో కళాశాలకు గరిష్టంగా 150 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి ఇచ్చారు. ఈ కాలేజీలను భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) బృందం పరిశీలించి అనుమతించాల్సి ఉంది.
మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఆరు కాలేజీలు
తెలంగాణలో ఏర్పాటు కానున్న 8 మెడికల్ కాలేజీల్లో రెండు ప్రభుత్వ వైద్య కళాశాలలు కాగా.. మిగతా ఆరు ప్రైవేటు కాలేజీలు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈఎస్‌ఐసీ ఆధ్వర్యంలో సనత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలకు అనుమతి లభించింది. దీంతోపాటు మహబూబ్‌నగర్‌లోని జిల్లా ఆసుపత్రిని మెడికల్ కాలేజీగా చేయాలని దరఖాస్తు చేశారు. దీనికి కూడా ఈ ఏడాది అనుమతి లభించింది. ఇక 6 ప్రైవేటు వైద్య కళాశాల్లో నాలుగింటిని మెదక్ జిల్లాలో, రెండింటిని రంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు.
ఏపీలో కొత్తగా 600 సీట్లు
ఏపీలో అనుమతి లభించిన నాలుగూ ప్రైవేటు కాలేజీలే కావడం గమనార్హం. వీటిలో చిత్తూరు జిల్లాలో 2, విశాఖపట్నం జిల్లాల్లో ఒకటి, కృష్ణా జిల్లాలో ఒక కాలేజీకి అనుమతి ఇచ్చారు. ఒక్కో కాలేజీకి గరిష్టంగా 150 సీట్ల చొప్పున ఏపీలో కొత్తగా 600 సీట్లు రానున్నాయి. రెండు నెలల కింద చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిని లీజు తీసుకున్న అపోలో యాజమాన్యం జాక్‌పాట్ కొట్టింది. ఏపీ సర్కారు ఎసెన్షియాలిటీ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడంతో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ కూడా తాజాగా అపోలో కాలేజీకి అఫిలియేషన్ ఇచ్చింది. ఈ కాలేజీలో 2016-17 నుంచి 150 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతినిచ్చారు.
రాష్ట్రంలో ఓ ప్రభుత్వ ఆస్పత్రిని లీజుకు తీసుకుని తొలి దశలోనే అపోలో యాజమాన్యం 150 సీట్లను దక్కించుకోవడం గమనార్హం. కాగా, ఏపీ నుంచి ఒక్క ప్రభుత్వ కళాశాలకూ దరఖాస్తు రాలేదు. ప్రస్తుతం ఏపీలో 11 మెడికల్ కాలేజీలున్నాయి. విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు లేవు. విజయనగరం, ఏలూరు జిల్లా ఆస్పత్రులను ఉన్నతీకరించి వైద్య కళాశాలలుగా మార్చాలన్న ప్రతిపాదన ఎప్పట్నుంచో ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అందుకు ససేమిరా అంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రూ.300 కోట్లు వెచ్చించే పరిస్థితుల్లో లేమని, దీనికంటే జిల్లా ఆస్పత్రులను ప్రైవేటు కంపెనీలకు లీజుకివ్వడమే మేలని భావిస్తోంది. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లా ఆస్పత్రిని అపోలోకు లీజుకిచ్చారు.
‘డీమ్డ్’ హోదా కింద గీతంకు అనుమతి
ఏపీలో తొలిసారిగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫిలియేషన్ లేకుండా గీతం వర్సిటీ వైద్య కళాశాలను ఏర్పాటు చేయనుంది. తాజాగా ఏపీ సర్కారు గీతంకు డీమ్డ్ హోదాకు అనుమతినివ్వడంతో ఇది సాధ్యపడింది. ఈ కాలేజీలో 2016-17లో 150 సీట్లను భర్తీ చేయనున్నారు. 1986 నుంచి ఇప్పటి వరకూ ఇలా డీమ్డ్ వర్సిటీ కింద వైద్య కళాశాల ఏర్పాటు కాలేదు. గత మూడు దశాబ్దాల్లో డీమ్డ్ హోదాతో అనుమతి పొందిన కాలేజీ ఒక్కటి కూడా లేదు.
తెలంగాణలో కొత్త మెడికల్ కాలేజీలివే..
కళాశాల ప్రాంతం సీట్లు
ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీ ఎర్రగడ్డ 100
ఆయాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మొయినాబాద్ 150
మహవీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ శివారెడ్డిపేట, వికారాబాద్ 150
టీఆర్‌ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ పటాన్‌చెరు, మెదక్ 150
మహేశ్వర మెడికల్ కాలేజీ పటాన్‌చెరు, మెదక్ 150
గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మహబూబ్‌నగర్ 150
ఆర్‌వీఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ ములుగు, మెదక్ 150
సురభి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ సిద్దిపేట, మెదక్ 150
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కళాశాలలివీ..
గాయత్రీ విద్యా పరిషత్ విశాఖపట్నం 150
ఆర్‌వీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ పూతలపట్టు, చిత్తూరు 150
నిమ్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ జూపూడి, కృష్ణా 150
అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ మురుకంబట్టు, చిత్తూరు 150