సాక్షి, హైదరాబాద్: ‘‘మోటారు రవాణా కార్మికుల చట్ట నిబంధనల అమల్లో చిన్న వాళ్లపైనే మీ ప్రతాపం చూపుతారా? రవాణా వాహన యజమానుల శక్తివంతమైన లాబీ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తారా?’’అంటూ ఉమ్మడి హైకోర్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలపై మండిపడింది. ఈ విషయాన్ని ఒప్పుకునేందుకు ఎం దుకు సిగ్గుపడుతున్నారని ప్రశ్నించింది.
ఉల్లంఘనులపై కొరడా ఝుళిపించకుంటే వారిని తమకే వదిలిపెట్టాలని, నామమాత్రపు జరిమానాలకు వారు భయపడే పరిస్థితి లేనందున కఠిన చర్యలు తీసుకుంటేనే వారు దార్లోకి వస్తారని స్పష్టం చేసింది. చట్ట నిబంధనలు అమలు చేస్తామని బస్సు లు, లారీల యాజమాన్యాలు స్పష్టమైన హామీ ఇచ్చేలా ఏం చర్యలు తీసుకుంటున్నా రో చెప్పాలని ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది.
యాజమాన్యా లు రవాణాశాఖ వద్ద రిజిస్టర్ చేసుకునేందుకు తీసుకుంటున్న చర్యలతోపాటు యాజమాన్యాలకు విధిస్తున్న జరిమానాలు స్వల్పంగా ఉన్న నేపథ్యంలో చట్ట సవరణకు తీసుకుంటున్న చర్యలనూ వివరిం చాలని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉభయ రాష్ట్రాల్లో బస్సు ఆపరేటర్లు బస్సులు నడుపుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని, ఈ నేపథ్యంలోనే ఏపీలోని ముండ్లపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిందం టూ న్యాయవాది కె.వి.సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిల్‌పై ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది.
ఏపీ వద్ద పూర్తిస్థాయి వివరాలూ లేవు...
అనంతరం ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ చట్ట నిబంధనలను అమలు చేస్తామంటూ ఇప్పటివరకు 9,294 మంది హామీ ఇచ్చారని, వారి వద్ద 32,469 బస్సులున్నాయని తెలిపారు. నిబంధనల అమలుకు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్‌ను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రవాణా వాహన యజమాని కూడా మోటారు రవాణా కార్మికుల చట్ట నిబంధనలను అమలు చేస్తామని హామీ ఇవ్వడం తప్పనిసరంటూ చట్ట సవరణలు చేస్తామని, ఇందుకు ఆరు నెలల గడువు కావాలని ఆయన కోర్టును కోరారు.
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ అంత గడువెందుకని, ప్రభుత్వం తలచుకుంటే వెంటనే సవరణలు తీసుకురావచ్చని సూచించింది. శక్తివంతమైన లాబీ వల్లే సమస్యలు వస్తున్నాయని పేర్కొంది. ఈ విషయంలో తెలంగాణలోనే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తోందని, ఏపీ వద్ద పూర్తిస్థాయి వివరాలు కూడా లేవని వ్యాఖ్యానించింది. కాగా, గతవారం ధర్మాసనం ఆదేశాల మేరకు కోర్టు ముందు స్వయంగా హాజరైన రవాణా కమిషనర్లు బాలసుబ్రహ్మణ్యం, సునీల్ శర్మలకు తదుపరి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది.
56 ఏళ్లుగా చట్టం అమలు కావట్లేదా...?
ఈ వ్యాజ్యంపై తెలంగాణ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ మోటారు రవాణా కార్మికుల చట్ట నిబంధనలను అమలు చేస్తామంటూ 4.28 లక్షల మంది యజమానులు హామీ ఇచ్చారన్నారు. 2.02 లక్షల వాహనాలు రవాణాశాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉండగా ఇప్పటివరకు 1,247 వాహనాలు రిజిస్టర్ అయ్యాయని వివరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ కేవలం 0.5 శాతం వాహనాలు మాత్రమే రిజిస్టర్ అయినట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. కఠిన చర్యలు తీసుకోకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని పేర్కొంది.
1961లో చేసిన ఈ చట్టం 56 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అమలు కావట్లేదంటే ఆశ్చర్యం వేస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రవాణా కార్మికుల చట్టం ప్రకారం ఉల్లంఘనులపై చర్యలు తీసుకోనిపక్షంలో మోటారు వాహన చట్ట నిబంధనల కింద వారి లైసెన్సులు ఎందుకు రద్దు చేయట్లేదని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఏజీ స్పందిస్తూ జనవరి నుంచి త్రైమాసిక పన్ను వసూలు ప్రక్రియ ప్రారంభం కానుందని, మోటారు రవాణా కార్మికుల చట్టం కింద రిజిస్టర్ చేసుకోని వాహనాల నుంచి పన్ను స్వీరించబోమన్నారు.
అలా చేస్తే ఆ వాహనాలు రోడ్డెక్కడానికి వీలుండదని కోర్టుకు నివేదించారు. హామీ ఇచ్చిన వారు రవాణాశాఖ వద్ద రిజిస్టర్ చేసుకునేందుకు మూడు నెలల గడువిస్తూ వ్యక్తిగత నోటీసులు జారీ చేస్తున్నామని ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ నామమాత్రపు జరిమానాలతో ప్రయోజనం లేదని, కఠిన చర్యలు తీసుకుంటేనే పరిస్థితులు దార్లోకి వస్తాయని వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment