సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ విభజన పేచీ ఎడతెగకుండా కొనసాగుతోంది. సచివాలయంలో తమ అధీనంలో ఉన్న భవనాలను తెలంగాణకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం మరోమారు సున్నితంగా నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని మరోసారి తోసిపుచ్చింది. ఈ విషయంలో తమ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటూ దాటవేసింది. రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలపై చర్చించేందుకు శుక్రవారం రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు భేటీ అయ్యారు.
హైదరాబాద్‌లోని మెట్రోభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌తోపాటు ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, ప్రేమ్ చంద్రారెడ్డి పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల విభజన వ్యవహారాలను చూస్తున్న రామకృష్ణారావు, ప్రేమ్ చంద్రారెడ్డి తరచుగా సమావేశం కావాలని, అంశాల వారీగా సమస్యలను పరిష్కరించుకోవాలని భేటీలో తీర్మానించారు. సంబంధిత శాఖల అధికారులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు.
పెండింగ్‌లో ఉన్న డీఎస్పీల విభజనకు సంబంధించి హైకోర్టు అనుమతితో తాత్కాలిక కేటాయింపులు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఉపాధ్యాయుల పరస్పర బదిలీల అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌కు సంబంధించిన విభజన అంశంపై త్వరలోనే విభజన కమిటీ సమావేశమయ్యేలా చూడాలని తీర్మానించారు. ఇప్పటికే చేసిన విజ్ఞప్తి మేరకు సచివాలయంలోని భవనాలు సహా హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాలను అప్పగించాలని ఈ సందర్భంగా తెలంగాణ అధికారులు కోరారు. కానీ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకునేంత వరకు తామేమీ చెప్పలేమంటూ ఏపీ సీఎస్ దాటవేశారు.
Comments
Please login to add a commentAdd a comment