సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనకు ముందడుగు పడింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన వైపు నుంచి లాంఛనాలను పూర్తి చేయడం ప్రారంభించింది. ఈ ప్రక్రియ తొలి దశలో భాగంగా అత్యంత కీలకమైన న్యాయమూర్తుల ఆప్షన్లకు ఆమోదముద్ర వేసింది. అదే సమయంలో ఉభయ రాష్ట్రాల హైకోర్టులకు న్యాయమూర్తుల సంఖ్యను ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 37 మంది న్యాయమూర్తులను, తెలంగాణ రాష్ట్రానికి 24 మంది జడ్జీలను ఖరారు చేసింది.
60:40 నిష్పత్తిలో కేంద్రం ఈ సంఖ్యను నిర్ణయించింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల మొత్తం సంఖ్య 61. ఇందులో 60 శాతం న్యాయమూర్తులను అంటే 37 (36.6) మందిని ఆంధ్రప్రదేశ్‌కు, 40 శాతం న్యాయమూర్తులను అంటే 24 (24.4) మందిని తెలంగాణకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత హైకోర్టు విభజన ప్రక్రియను పూర్తి చేసే నిమిత్తం ఎవరెవరు ఏ రాష్ట్రానికి వెళ్లదలిచారో వారు తమ ఆప్షన్లు ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తులను కేంద్రం కోరింది.
ఈ మేరకు 2015లోనే న్యాయమూర్తులందరూ ఆప్షన్లను సీల్డ్ కవర్‌లో సమర్పించారు. ఇటీవల నియమితులైన న్యాయమూర్తులు వారి నియామకం తరువాత ఆప్షన్లు ఇచ్చారు. తరువాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. న్యాయమూర్తుల ఆప్షన్లపై చర్చించేందుకు ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమైంది. ఆ సమావేశంలో న్యాయమూర్తుల ఆప్షన్లకు కొలీజియం ఆమోదముద్ర వేసింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం కూడా ఆ ఆప్షన్లకు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులందరికీ తెలియచేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణానికి కేంద్రం పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయడమే మిగిలింది.
ప్రస్తుతం ఉన్న వారిలో 17 మంది ఏపీకి.. 12 మంది తెలంగాణకు...
ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో మొత్తం 61 న్యాయమూర్తులకుగాను 31 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. వారిలో ఇద్దరు న్యాయమూర్తులు బయటి రాష్ట్రాలకు చెందిన వారు. ఈ నేపథ్యంలో 29 మంది న్యాయమూర్తులు ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన వారు.
ఈ 29 మందిలో 17 మందిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు, 12 మంది తెలంగాణ హైకోర్టుకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన వారిలో జస్టిస్ దామా శేషాద్రి నాయుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఆయన తిరిగి ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా రానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment