సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నా అందులో ఐదు వైద్య కళాశాలల వైపే ఎక్కువ మంది విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. నీట్‌లో మంచి ర్యాంకులు సాధించినవారు జాతీయ పూల్ కింద వివిధ రాష్ట్రాల్లో మంచి వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు పొందే అవకాశమున్నా మన రాష్ట్ర కళాశాలల్లో చేరడానికే ఆసక్తిగా ఉన్నారు. ఆంధ్రా మెడికల్ కళాశాల (విశాఖపట్నం), గుంటూరు మెడికల్ కళాశాల, కర్నూలు మెడికల్ కళాశాల, కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర మెడికల్ కళాశాలల్లో చేరడానికే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. గతేడాది చివరి ర్యాంకులు పొందిన అభ్యర్థుల కటాఫ్ మార్కులు చూసుకున్నా ఆ ఐదు కళాశాలల్లోనే ఎక్కువ మార్కులు సాధించినవారు ఉన్నారు. అక్కడ సీటు రాని అభ్యర్థులే మిగతా కళాశాలల వైపు చూస్తున్నారు.
అధ్యాపకులు, మౌలిక వసతులే కారణం
విద్యార్థులు ఆ ఐదు కళాశాలల వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం.. వాటిలో అధ్యాపకుల కొరత లేకపోవడం, మిగతా వాటితో పోలిస్తే మౌలిక వసతులు మెరుగ్గా ఉండటమే. అన్నిటికీ మించి ఔట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా ఆ కళాశాలలను ఎంచుకోవడానికి కారణంగా నిలుస్తోంది. గతేడాది జనరల్ కేటగిరీలో విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్‌లో సీటు పొందిన చివరి ర్యాంకు అభ్యర్థికి 538 మార్కులు వచ్చాయి. అంటే ఎంతగా పోటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే గుంటూరు మెడికల్ కళాశాలలో చివరి ర్యాంకు పొందిన జనరల్ అభ్యర్థికి 533 మార్కులు వచ్చాయి. ఇలా పైన పేర్కొన్న ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒక్క విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాల మినహా మిగిలిన నాలుగింటిలో చివరి ర్యాంకు పొందిన జనరల్ అభ్యర్థులకు 500 మార్కులు పైనే రావడం విశేషం.
కటాఫ్‌లు పెరిగే అవకాశం
మరికొద్ది రోజుల్లో ఎంబీబీఎస్ సీట్ల భర్తీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్ని మార్కులు వస్తే ప్రభుత్వ సీటు వస్తుందనే దానిపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. తమకు వచ్చిన మార్కులకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీటు వస్తుందా? రాదా? అనే దానిపై విద్యార్థులు చర్చించుకుంటున్నారు. పైగా ఈ ఏడాది ప్రశ్నపత్రం సులువుగానే ఉండటంతో మెజారిటీ అభ్యర్థులు ఎక్కువ మార్కులు సాధించారు. దీంతో కటాఫ్ మార్కులు కూడా పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా.. ఈ ఏడాది ఎంబీబీఎస్ సీట్లు పెరిగే అవకాశం ఉండటంతో మరికొంతమందికి సీట్లు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది నుంచే ఆర్థికంగా వెనుకబడిన బలహీనవర్గాలకు సీట్లు కేటాయించబోతున్నారు. నేడో, రేపో నీట్‌లో మెరిట్ విద్యార్థుల జాబితాను వెల్లడించేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment