'ఏపీ' కాదు.. తెలంగాణ ఎక్స్ప్రెస్
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ పేరు మారిపోనుంది. ఇక నుండి అది తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా పేరు మార్చుకోనుంది. త్వరలో ఏపీ ఎక్స్ప్రెస్ పేరును ఇక తెలంగాణ ఎక్స్ప్రెస్గా మార్పు చేస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఏపీకి మరో కొత్త ఎక్స్ప్రెస్ వస్తుందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్కు కొత్త రైల్వేజోన్ వచ్చి తీరుతుందని వెంకయ్య నాయుడు తెలిపారు.
రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఏపీ ఎక్స్ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్ప్రెస్గా మార్చాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...కేంద్ర రైల్వే శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. కాగా విజయవాడ-ఢిల్లీ మధ్య ఒక కొత్త ఎక్స్‌ప్రెస్ నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది.ఆ రైలు ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరిట నడవనుంది. అధికారికంగా రైల్వేబోర్డుకు సమాచారం అందగానే పేరు మారనుంది.