ప్రకృతి ఒడి.. ఎలా వీడేది ! | Rehabilitation centers provide for polavaram project victims | Sakshi
Sakshi News home page

ప్రకృతి ఒడి.. ఎలా వీడేది !

Published Tue, Dec 24 2013 12:46 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

Rehabilitation centers provide for polavaram project victims

పోలవరం, న్యూస్‌లైన్ : ఉన్న ఊరిని కన్నతల్లితో పోలుస్తారు. అలాంటిది తరతరాల నుంచి నివశిస్తున్న గ్రామాన్ని శాశ్వతంగా విడిచి వెళ్లాలంటే... అదీ ప్రకృతి ఒడినుంచి దూరంగా పొమ్మంటుంటే.. పోలవరం మండలంలో గిరిజన గ్రామమైన దేవరగొందిలో ఇప్పుడు అదే జరుగుతోంది. కొండల నడుమ ప్రకృతి ఒడిలో నివశిం చిన గిరిజనుల్ని ఆ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల మండలంలో ముంపునకు గురయ్యే గ్రామాల్లో దేవరగొంది మొట్టమొదటిది. దీంతో గ్రామస్తులను ఖాళీ చేరుుస్తున్నారు. ఇళ్లను కూల్చేస్తూ వారిని పునరావాస కేంద్రాలకు వెళ్లిపొమ్మంటున్నారు. పుట్టిపెరిగిన గ్రామాన్ని విడిచి వెళ్లమనడం గిరిజను లను బాధిస్తోంది. మరోవైపు మైదాన ప్రాంతంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో బతుకుతెరువు ఎలాగోననే భయం కూడా వారిని వెంటాడుతోంది. కొద్దిరోజులుగా దేవరగొంది గ్రామ గిరిజన నిర్వాసితులను అధికార యంత్రాంగం పోలవ రం గ్రామ సమీపంలోని తాలూకా కార్యాలయ ప్రాంతంలో నిర్మించిన పునరావాస కేంద్రానికి తరలించే చర్యలు చేపట్టిన విషయం విదితమే. ఈ సందర్భంలో ఇళ్లను వదిలి రాలేక నిర్వాసితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
 
  2004 నుంచి అధికారులు తమ గ్రామాలకు వచ్చి చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న దానికి ఏమాత్రం పొంతన లేదని వాపోతున్నారు. దేవరగొంది గ్రామం అటవీ ప్రాంతంలో కొండల పక్కన ఉండటంతో అక్కడి గిరిజనులు అటవీ ఉత్పత్తులను సేకరించుకుంటూ.. చెట్ల ఫలసాయంపై ఆధారపడి జీవనోపాధి పొందుతు న్నారు. పునరావాస కేంద్రం మైదాన ప్రాం తంలో ఉండటంతో సమీపంలో కొండలు లేవని, అధికారులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీగా గతంలో ఇచ్చిన సొమ్ములు కూడా అయిపోయాయని, పునరావాస కేంద్రానికి వెళ్లి ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. పునరావాస కేంద్రాన్ని షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటిం చాలని డిమాండ్ చేస్తున్నారు.  ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం ప్రభుత్వం జారీ చేసిన నంబర్-68 జీవోలో 6.20 పాయింట్ ప్రకారం పునరావాస కేంద్రాల్లో ఉండే నిర్వాసితులకు రాజ్యాంగపరంగా అన్ని హక్కులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే గతంలో ఆర్ అండ్ ఆర్ అధికారులుగా పనిచేసిన వారు ఇచ్చిన హామీలు దేవరగొంది గ్రామ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అప్పట్లో 18 సంవత్సరాలు నిండిన యువతులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపచేయడం, పోడు భూములకు పట్టాలివ్వడం అనే అంశాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని, త్వరలోనే అవి అమలులోకి వస్తాయని అధికారులు చెప్పారు. కానీ.. ఆ అంశాలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు.  యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అదీ పూర్తిగా ఆచరణ సాధ్యం కాలేదు. ఇటీవల కొత్త భూసేకరణ చట్టం వ చ్చింది. జనవరి 1నుంచి ఇది అమలులోకి వస్తుందని, నిర్వాసితులకు వర్తిస్తుందని దేవరగొంది గిరిజనులు ఆశతో ఉన్నారు.
 
 పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తే నిర్వాసితులకు ఎంతో లబ్ధి చేకూరుతుందనే అపోహ కూడా వీరిలో ఉంది. జేసీ టి.బాబూరావునాయుడు ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన కొత్తలో నిర్వాసిత గ్రామాల్లో రాత్రి బస చేసి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో పేర్కొన్న వాస్తవాలను గిరిజనులకు స్పష్టంగా చెప్పారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకారం మాత్రమే అన్ని రాయితీలు అందజేస్తామని అవసరమైతే అదనంగా వివిధ శాఖల నుంచి రుణాలు మంజూరు చేయించి జీవనోపాధికి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ కూడా కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. అప్పటి నుంచి నిర్వాసితుల్లో కొంత అభద్రతా భావం నెలకొంది. అవి నిర్వాసితులకు మిం గుడు పడలేదు. దీనికి కొందరు నాయకుల ప్రమేయం కూడా తోడైంది. ఒకపక్క గ్రామాన్ని ఖాళీ చేయలేక ఆవేదన చెందుతూ.. పునరావాస కేంద్రంలో బతుకుతెరువుపై భయం నెలకొన్న నేపథ్యంలో కొన్ని సంస్థలు, నాయకుల పాత్ర గిరిజనులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ దశలో తాము నివాసం ఉంటున్న ఇళ్లను తమ కళ్లముందే అధికారులు కూల్చివేరుుస్తుండటాన్ని తట్టుకోలేక గిరిజనులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
 
  పునరావాస కేంద్రానికి వెళితే తమను అధికారులు పట్టించుకోరని, ఎలాంటి సహాయం అందించరని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. తమకు అధికారులపై నమ్మ కం పోయిందని స్పష్టంగా చెబుతున్నారు. వీరికి గల అపోహలను, భావోద్వేగాలను తొలగించడంతోపాటు పునరావాస కేంద్రాల్లో బతుకుతెరువుపై భరోసా ఇవ్వాల్సిన కనీస బాధ్యత అధికారులపై ఉంది. ఈ విషయాలపై ఆర్ అండ్ ఆర్ అధికారి, ఆర్డీవో వి.నాన్‌రాజు మాట్లాడుతూ దేవరగొంది గ్రామంలో 98 నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయని, వీరందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాయితీలను పూర్తిగా అందజేశామని చెప్పారు. పునరావాస కేంద్రంలో వీధిలైట్లు, మంచినీరు వంటి అన్ని వసతులు కల్పించామన్నారు.
 
 పొంతన లేదు
 మాకు మేకలు, గొర్రెలు, పశువులు ఉన్నాయి. వీటిని కట్టుకోవడానికి పునరావాస కేంద్రంలో స్థలం చూపలేదు. 2004 నుంచి గ్రామానికి వచ్చి అధికారులు చెప్పిన మాటలకు, ఇప్పుడు చేసేదానికి ఏమాత్రం పొంతన లేదు. పునరావాస కేంద్రానికి వెళితే అధికారులు మాకేమీ చేయరు. వారిపై మాకు నమ్మకం పోయింది. - తాటి సరస్వతి, దేవరగొంది
 
 ఎలా బతకాలి
 తాత ముత్తాతల కాలంనుంచీ అటవీ ప్రాంతంలోని దేవరగొందిలో ఉంటున్నాం. తేనె, కుంకుడు కాయలు, చింతకాయలు, నేలవేము సేకరించుకుని మహిళలంతా ఉపాధి పొందుతున్నాం.  పునరావాస కేంద్రం సమీపంలో పంటలు కూడా లేవు. అక్కడికెళ్లి ఎలా బతకాలి. పునరావాస కేంద్రాన్ని షెడ్యూల్ ప్రాంతంగా మార్పు చేయాలి. - కారం చెల్లాయమ్మ, దేవరగొంది
 
 రారుుతీలు పూర్తిగా ఇవ్వలేదు
 మేం పుట్టి పెరిగిన గ్రామం ఇదే. పోలవరం ప్రాజెక్టు మొదలు పెట్టిన నాటినుంచి అధికారులు ఏ ఒక్కరికీ పూర్తి రాయితీలు ఇవ్వలేదు. సబ్సిడీపై గేదెలు, రుణాలు ఇస్తామంటున్నారు. ఇచ్చిన వెంటనే బ్యాంకు అధికారులు వచ్చి రుణాలు కట్టమంటున్నారు. పునరావాస కేంద్రంలో ఎలా బతకాలి. - వరస జోగమ్మ, దేవరగొంది
 
 ఇళ్లు పడగొట్టేస్తున్నారు
 నాకు ఈ ఊళ్లో 2.24 ఎకరాల భూమి ఉంది. భూమికి భూమి ఇస్తామన్నారు. ఇప్పటికీ భూమి పొజిషన్ చూపలేదు. ఒక్క ఏడాది కూడా ఫలసాయం తినలేదు. ఇప్పుడొచ్చి ఇళ్లు ఖాళీచేయమంటున్నారు. ఇళ్లను పడగొట్టేస్తున్నారు. మమ్ములను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. - తెల్లం రామాయమ్మ, దేవరగొంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement