![Polavaram should be completed with in deadline: Debashree Mukherjee](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/POLAVARAM.jpg.webp?itok=gCRmKpHF)
కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆదేశం
సీడబ్ల్యూసీ, పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం
పనుల పురోగతిపై ఇక నెల వారీ సమీక్ష
సాక్షి, అమరావతి: కేంద్ర మంత్రివర్గం నిర్దేశించిన గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) అథారిటీ(పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులను కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ(Debashree Mukherjee) ఆదేశించారు. 2026, మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని.. వరదలు వంటి సమస్యలు ఉత్పన్నమైతే మరో ఏడాది గడువు పొడిగిస్తామని.. ఎట్టిపరిస్థితుల్లోనూ 2027, మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్దేశించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
ఆ మేరకు ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రిమావిరా సాఫ్ట్‌వేర్‌తో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని, నెల వారీ లక్ష్యాలు నిర్దేశించుకుని పనులు చేయాలని దిశానిర్దేశం చేశారు. పనుల పురోగతిపై ప్రతి నెలా తాను సమీక్షిస్తానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సోమవారం ఢిల్లీలోని తన కార్యాలయంలో దేబశ్రీ ముఖర్జీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై పీపీఏ సీఈవో అతుల్ జైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి వివరించారు. ప్రధాన(ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం గ్యాప్–2లో కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రం వాల్ పనులపై దేబశ్రీ ముఖర్జీ సమగ్రంగా సమీక్షించారు. 1396.6 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందంతో చేపట్టిన డయాఫ్రం వాల్ నిర్మాణంలో జనవరి 18 నుంచి ఇప్పటిదాకా ఐదు ప్యానెళ్లు దించారని పీపీఏ సీఈవో అతుల్‌జైన్ వివరించారు.
ప్రస్తుత రెండు కట్టర్లతో పనులు చేస్తున్నారని.. వచ్చే నెలలో మూడో కట్టర్ వస్తుందని.. 2025, డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్‌ను పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. ఆలోగా డయాఫ్రం వాల్‌ను పూర్తి చేయడానికి రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో చర్చించి నెల వారీ లక్ష్యాలను నిర్దేశించుకుని తనకు నివేదిక ఇవ్వాలని పీపీఏ సీఈవోను దేబశ్రీ ముఖర్జీ ఆదేశించారు.
డిజైన్ల ఆమోదంపై సత్వరమే నిర్ణయం
పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టడానికి అత్యంత కీలకమైన డిజైన్ల రూపకల్పన, ఆమోదం ప్రక్రియపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమీక్షించారు. బంకమట్టి ఉన్న ప్రాంతంలో డయాఫ్రం వాల్ పనులు చేపట్టడానికి సంబంధించిన డిజైన్‌ను సీడబ్ల్యూసీకి పంపామని ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు. అంతర్జాతీయ నిపుణుల కమిటీతో చర్చించి.. ఆ డిజైన్‌ను వీలైనంత తొందరగా ఆమోదించాలని సీడబ్ల్యూసీ చైర్మన్ ముకేష్‌కుమార్ సిన్హాను ఆదేశించారు.
ప్రధాన డ్యాం గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాంను ఇప్పటికే పూర్తి చేశామని.. గ్యాప్–1, గ్యాప్–2లలో ఈసీఆర్‌ఎఫ్ డ్యాంను నిర్మించాలని.. అందుకు సంబంధించిన డిజైన్‌లను రూపొందిస్తున్నామని సీఈ కె.నరసింహమూర్తి వివరించారు. డిజైన్‌లను ఆమోదించడంలో జాప్యం జరగకుండా చూడాలని సీడబ్ల్యూసీ చైర్మన్‌ను దేబశ్రీ ముఖర్జీ ఆదేశించారు. ప్రధాన డ్యాం గ్యాప్–1, గ్యాప్–2లలో ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనులు చేపట్టడానికి మెటీరియల్(మట్టి, రాళ్లు) ఏ మేరకు అవసరం.. ఏ మేరకు అందుబాటులో ఉంది.. ఇంకా అవసరమైన మెటీరియల్‌ను ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారు అన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని సూచించారు.
రూ.2,700 కోట్ల అడ్వాన్సుకు రాష్ట్ర జలవనరుల శాఖ విజ్ఞప్తి
ప్రాజెక్టు పనులకు రీయింబర్స్‌మెంట్‌గా రూ.459.69 కోట్లు, అడ్వాన్సుగా రూ.2,348 కోట్లు అక్టోబర్ 10న విడుదల చేశారని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ వివరించారు. ఇందులో రూ.459.69 కోట్లకు సంబంధించి యూసీలను ఇప్పటికే కేంద్ర జల్ శక్తి శాఖకు పంపామని గుర్తు చేశారు. అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,348 కోట్ల వ్యయానికి సంబంధించిన బిల్లులను పీపీఏ ద్వారా పంపామని తెలిపారు. అడ్వాన్సుగా మరో రూ.2,700 కోట్లు విడుదల చేయాలని కోరారు. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ వీలైనంత తొందరగా అడ్వాన్సుగా నిధులు ఇస్తామని చెప్పారు.
నాణ్యతకు మూడంచెల విధానం..
ప్రాజెక్టు పనుల్లో నాణ్యతపై ఏమాత్రం రాజీపడే ప్రశ్నే లేదని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. పనుల్లో నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడానికి వ్యాప్కోస్, సీఎస్‌ఎంఆర్‌ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్), రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకోవా లని ఆదేశించారు. మూడు ల్యాబ్‌లలో ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ పనుల నాణ్యతను నిర్ధారించాలని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment