త్వరగా గట్టిపడటం.. అత్యంత పటిష్టవంతంగా మారడం దీని ప్రత్యేకత
టీ–16 ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళనంపై అంతర్జాతీయ నిపుణుల కమిటీ అభిప్రాయం
భూగర్భ జల ఒత్తిడిని సమర్థవంతంగా తట్టుకోవడానికే ఆ మిశ్రమం వైపు మొగ్గు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో టీ–16 రకం ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళనంతోనే కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేయడంతో ఆ కాంక్రీట్ సమ్మేళనం సాంకేతికత, దాని తయారీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాత డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగించిన టీ–5 రకం కాకుండా టీ–16 రకం కాంక్రీట్ సమ్మేళనం వైపే నిపుణులు ఎందుకు మొగ్గు చూపుతున్నారనే అంశంపై ఆసక్తి పెరిగింది.
గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేశాకే ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రం వాల్ పనులు చేపట్టాలి. కానీ.. గోదావరి వరదను మళ్లించే పనులు చేపట్టకుండానే 2016 డిసెంబర్ నుంచి 2018 జూన్ మధ్య వరద ప్రవాహం లేని రోజుల్లో ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో 1396.6 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందంతో డయాఫ్రం వాల్‌ను నిర్మించారు.
2017, 2018 సీజన్లలో గోదావరి వరద డయాఫ్రం వాల్ మీదుగా ప్రవహించడంతో వరద ఉద్ధతికి డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతింది. ఆ తరువాత 2019–21 మధ్య వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను నిర్మించి గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా ప్రభుత్వం మళ్లించింది.
ప్రధాన డ్యామ్ గ్యాప్–1లో డయాఫ్రం వాల్ నిర్మించింది. గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేయాలా? కొత్తది నిర్మించాలా? అన్నది తేల్చడంలో తొలుత ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) నిపుణుల సహకారం తీసుకున్న సీడబ్ల్యూసీ ఆ తర్వాత అంతర్జాతీయ నిపుణుల కమిటీతో అధ్యయనం చేసింది. చివరకు ఈ ఏడాది జూన్‌లో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని సూచించింది.
త్వరగా గట్టిపడి గోడలా మారుతుంది
ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు నిర్మించిన నేపథ్యంలో ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతానికి ఎగువన, దిగువన నీరు నిల్వ ఉంటుంది. దీనివల్ల ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో భూగర్భ జలమట్టం పెరిగింది. డయాఫ్రం వాల్ నిర్మాణానికి ట్రెంచ్ కట్టర్, గ్రాబర్ల ద్వారా భూమిని తవ్వుతూ పోతే.. భూగర్భ జలాలు పైకి ఎగదన్నుతాయి. రాతి పొర తగిలేవరకూ భూమిని తవి్వ.. ఖాళీ ప్రదేశంలోకి తొలుత బెంటనైట్ మిశ్రమాన్ని, ఆ తరువాత కాంక్రీట్ మిశ్రమాన్ని పంపాలి.
టీ–5 రకం కాంక్రీట్ మిశ్రమంలో సిమెంటు పాళ్లు తక్కువగా ఉండటం వల్ల అది త్వరగా గట్టిపడదు. అందువల్ల భూగర్బ జలాల ఒత్తిడికి అది తట్టుకుని నిలబడలేదు. అదే టీ–16 రకం కాంక్రీట్ మిశ్రమంతో సిమెంటు పాళ్లు అ«దికంగా ఉండటం వల్ల కాంక్రీట్ మిశ్రమం అధిక ఒత్తిడితో పోసిన వెంటనే బెంటనైట్ మిశ్రమం బయటకు వస్తుంది. కొంత బెంటనైట్ మిశ్రమంతో కలిసి వెంటనే టీ–16 రకం కాంక్రీట్ మిశ్రమం గట్టిపడి గోడగా మారుతుంది. తద్వారా భూగర్భ జలాల ఒత్తిడిని అణచివేస్తుంది.
టీ–5 కంటే టీ–16 రకం కాంక్రీట్ మిశ్రమం అత్యంత పటిష్టవంతమైనదని ఐఐటీ (తిరుపతి) ప్రొఫెసర్లు నిర్వహించిన పరీక్షల్లో తేలింది. అందుకే కొత్త డయాఫ్రం వాల్‌లో టీ–16 రకం కాంక్రీట్ మిశ్రమాన్ని వినియోగించాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment