
గోదారమ్మ సాక్షిగా మరోసారి అసత్యాలు వల్లించిన సీఎం చంద్రబాబు
వాటికి వంత పాడుతూ ‘గాడిన పడిన పోలవరం’ అంటూ ‘ఈనాడు’ తప్పుడు కథనం
నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించి మరోసారి జీవనాడికి బాబు ద్రోహం
స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండా పునాది డయాఫ్రం వాల్ పనులను చేపట్టిన వైనం
దీంతో వరద ఉద్ధృతికి కోతకు గురై డయాఫ్రం వాల్ దెబ్బతిందని తేల్చిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ
డబ్బులు వసూలయ్యే మట్టి పనులు మాత్రమే చేపట్టి స్పిల్‌వే పనులు గాలికి..
ఈ నిర్వాకాలతో సమయం వృథా.. పెరిగిన అదనపు వ్యయం
రామోజీ బంధువుకు చెందిన నవయుగకు నామినేషన్‌పై రూ.2,917 కోట్ల పనులు
బాబు చారిత్రక తప్పిదాలను సరిదిద్దుతూ.. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టి పూర్తి చేసిన వైఎస్ జగన్
కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 48 గేట్లతో సహా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేసి స్పిల్ వే మీదుగా గోదావరి ప్రవాహం మళ్లింపు
డయాఫ్రం వాల్ భవితవ్యంపై నిపుణుల కమిటీతో అధ్యయనం..
గత సర్కారు కృషి వల్లే 2026 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా కేంద్ర కేబినెట్ గడువు నిర్దేశించిందంటున్న అధికారవర్గాలు
సాక్షి, అమరావతి: పోలవరం నిర్మాణంలో తాను చేసిన చారిత్రక తప్పిదాలు, విధ్వంస కాండను కప్పిపుచ్చుకుంటూ.. గోదారమ్మ సాక్షిగా.. ప్రాజెక్టు వేదికగా సీఎం చంద్రబాబు మార్చి 27న మరోసారి అసత్యాలను వల్లించారు. ఎద్దు ఈనిందంటే.. దూడను గాటికి కట్టేయడానికి తాడు తెచ్చిన రీతిలో ‘గాడిన పడిన పోలవరం ప్రాజెక్టు’ శీర్షికన ‘ఈనాడు’ సోమవారం పచ్చి అబద్ధాలు అచ్చేసింది. అసలు వాస్తవాలు ఇవీ..
⇒ తెలుగు ప్రజల దశాబ్దాల కల పోలవరాన్ని సాకారం చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. 2009 నాటికే రూ.5,298.71 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. రిజర్వాయర్, కుడి, ఎడమ కాలువలకు అవసరమైన లక్ష ఎకరాలకుపైగా భూమిని సేకరించారు. కుడి కాలువలో 95 శాతం, ఎడమ కాలువలో 70 శాతం పనులను పూర్తి చేశారు.
⇒ కేంద్రమే నిర్మించాల్సిన పోలవరాన్ని కమీషన్ల దాహంతో ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ 2016లో సీఎం చంద్రబాబు దక్కించుకున్నారు. 2013–14 ధరల ప్రకారం అంటే.. 2014 ఏప్రిల్ 1 నాటికి ప్రాజెక్టు నీటి పారుదల విభాగం వ్యయంలో మిగిలిన రూ.15,667.90 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం విధించిన షరతుకు అంగీకరించారు. ఆ మేరకే నిధులు ఇచ్చేలా 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ తీర్మానించింది. నిజానికి పోలవరం భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికే రూ.33 వేల కోట్లు వ్యయం అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఆదిలోనే పోలవరాన్ని చంద్రబాబు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టినట్లు స్పష్టమవుతోంది.
⇒ గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండా.. నదికి అడ్డంగా నిర్మించాల్సిన ప్రధాన డ్యాం గ్యాప్–2లో 1,396.6 మీటర్ల పొడవున పునాది డయాఫ్రం వాల్ పనులను 2016 నవంబర్‌లో చంద్రబాబు చేపట్టారు. 2018 జూన్ నాటికి పూర్తి చేశారు. 2017, 2018లో గోదావరి వరద డయాఫ్రం వాల్ మీదుగా ప్రవహించడంతో.. ఆ వరద ఉద్ధృతికి కోతకు గురై దెబ్బతిందని ఇటీవల కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నియమించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ (పీవోఈ) తేల్చి చెబుతూ నివేదిక ఇచ్చింది. దీన్ని బట్టి పోలవరం ప్రాజెక్టులో విధ్వంసం సృష్టించింది చంద్రబాబేనన్నది స్పష్టమవుతోంది.
⇒ 2019 మే 30న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వెంటనే ప్రణాళికాబద్ధంగా పోలవరాన్ని పూర్తి చేసేలా అడుగులు వేశారు. ఈ క్రమంలో పీపీఏ ఆదేశాల మేరకు ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలకు ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి.. చేసిన పనులకు రక్షణ చర్యలను అధికారులు చేపట్టారు. రామోజీరావు సమీప బంధువుకు చెందిన నవయుగకు నామినేషన్ పద్ధతిలో చంద్రబాబు కట్టబెట్టిన రూ.2,917 కోట్ల పనులను నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు రద్దు చేశారు. ఆ సంస్థకే సీఎం చంద్రబాబు కట్టబెట్టిన జలవిద్యుత్కేంద్రం పనుల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తకపోవడంతో ఆ కాంట్రాక్టును రద్దు చేసి.. రెండు పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఖజానాకు రూ.838.5 కోట్లను ఆదా చేశారు.

⇒ వైఎస్ జగన్ ప్రభుత్వం ఒకవైపు నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూనే మరోవైపు గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టింది. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 48 గేట్లతో సహా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేసి 2021 జూన్ 11న స్పిల్ వే మీదుగా 6.1 కి.మీ. పొడవున గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. జలవిద్యుత్కేంద్రం పనులను పరుగులెత్తించారు. ప్రధాన డ్యాం గ్యాప్–1లో డయాఫ్రం వాల్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాంలను పూర్తి చేశారు. సీడబ్ల్యూసీ అదనంగా ప్రతిపాదించిన పనులను పూర్తి చేశారు. జలాశయంతో కుడి, ఎడమ కాలువను అనుసంధానం చేసే కనెక్టివిటీస్ పనులను కొలిక్కి తెచ్చారు. చంద్రబాబు సర్కారు చేసిన చారిత్రక తప్పిదాలను సరిదిద్దారు.
⇒ ప్రధాన డ్యాం గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ భవితవ్యాన్ని తేల్చితే ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామని.. తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరం పూర్తికి సహకరించాలని ప్రధాని మోదీని అనేక మార్లు నాడు సీఎం వైఎస్ జగన్ కోరారు. పోలవరం భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికే రూ.33 వేల కోట్లు అవసరమని.. అలాంటిది 2013–14 ధరల ప్రకారం రూ.15,667.90 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యం కాదని వివరించారు. వీటిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు.
⇒ డయాఫ్రం వాల్ సహా వరదలకు దెబ్బతిన్న పనులను పునరుద్ధరించేందుకు రూ.2 వేల కోట్లు, తొలిదశ పనుల పూర్తికి రూ.పది వేల కోట్లు వెరసి.. రూ.12 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ 2023 జూన్ 5న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నోట్ సిద్ధం చేశారు. ప్రాజెక్టును తొలి దశలో పూర్తి చేయడానికి మిగిలిన పనులకు రూ.12,157 కోట్లు.. ఆ తర్వాత రెండో దశ పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలని 2024, ఫిబ్రవరి 29న ప్రాజెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు(పీఐబీ) కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన పంపింది. అప్పటికే ఎన్డీఏలో చేరిన చంద్రబాబు ఆ ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయకుండా మోకాలడ్డారు.
⇒ 41.15 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేసేలా పోలవరాన్ని పూర్తి చేసేందుకు రూ.12,157 కోట్లను మంజూరు చేస్తూ 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే ప్రాజెక్టులో నీటి నిల్వను 194.6 టీఎంసీల నుంచి 115.44 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసేలా ఎత్తును తగ్గించారు. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు కింద 7.20 లక్షల ఎకరాల్లో కేవలం 1.98 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లందించడం సాధ్యమవుతుంది. దీన్ని బట్టి పోలవరానికి చంద్రబాబు మళ్లీ ద్రోహం చేసినట్లు స్పష్టమవుతోంది.
⇒ వైఎస్సార్‌సీపీ హయాంలో పోలవరాన్ని గాడిలో పెట్టడం.. ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్.. ఇక గ్యాప్–1, గ్యాప్–2లలో ప్రధాన డ్యాం నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకపోవడం వల్లే 2026 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర కేబినెట్ లక్ష్యంగా నిర్దేశించిందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.