సాక్షి, అమరావతి, సాక్షి నెట్‌వర్క్: తుపాను ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వలంటీర్ల నుంచి గ్రామ, మండల స్థాయి అధికారులు, కలెక్టర్లు, సీనియర్ అధికారులు, ప్రత్యేక అధికారులు అంతా సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. వర్షాలు కాస్త తెరిపి ఇవ్వడంతో దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. తుపాను ప్రభావిత 12 జిల్లాల్లో గురువారం రాత్రి నాటికి 428 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిల్లో 26,226 మంది ఆశ్రయం పొందుతున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 144 పునరావాస కేంద్రాల్లో 8,529 మందికి ఆశ్రయం కల్పించారు.
బాపట్ల జిల్లాలో 74 కేంద్రాల్లో 3,888 మంది, కృష్ణా జిల్లాలోని 67 కేంద్రాల్లో 3579 మంది, తిరుపతి జిల్లాలో 36 కేంద్రాల్లో 3,386 మంది, ప్రకాశం జిల్లాలోని 11 కేంద్రాల్లో 865 మంది, పల్నాడు జిల్లాలోని 14 కేంద్రాల్లో 1,677 మంది, ఏలూరు జిల్లాలోని రెండు కేంద్రాల్లో 151 మంది, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 37 కేంద్రాల్లో 910 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలోని 21 కేంద్రాల్లో 1,887 మంది, తూర్పు గోదావరి జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో 248 మంది ఆశ్రయం పొందుతున్నారు. శిబిరాల్లో ఉన్న వారికి భోజనం, మంచినీరు సౌకర్యం కల్పించారు. 74 వేలకుపైగా ఆహార పొట్లాలను బాధితులకు పంపిణీ చేశారు. 2.69 లక్షల మంచినీళ్ల ప్యాకెట్లను సరఫరా చేశారు.
171 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు ఎటువంటి వైద్య పరమైన సమస్యలు తలెత్తినా వెంటనే చికిత్స అందిస్తున్నారు. తాగు నీటికి ఇబ్బందులు లేకుండా బోర్ల వద్ద జనరేటర్లు, ట్యాంకర్లు ఏర్పాటు చేసి మరీ సరఫరా చేస్తున్నారు. సహాయ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.24.85 కోట్లు విడుదల చేసింది. ఆ నిధులతో జిల్లా కలెక్టర్లు బాధితులకు ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. పునరావాస కేంద్రాల నుంచి బాధితులు ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు ప్రభుత్వం అందించే రూ.1,000 నుంచి రూ.2,500 ఆర్థిక సాయాన్ని పలుచోట్ల పంపిణీ చేయగా, మిగిలిన చోట్ల కూడా అందించేందుకు ఏర్పాట్లు జరిగాయి.
బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ విస్తృతంగా చేపట్టారు. ఆయా కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, లీటర్ పామాయిల్ ఇస్తున్నారు. విద్యుత్ సరఫరా దెబ్బతిన్న అన్ని చోట్లా వెంటనే పునరుద్ధరించారు. దెబ్బతిన్న రహదారులను తాత్కాలికంగా బాగు చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 12 ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు నిర్విరామంగా సేవలు అందిసూ్తనే ఉన్నాయి.
కృష్ణా జిల్లా అవనిగడ్డ, మచిలీపట్నం, ప్రకాశం జిల్లా ఒంగోలు, అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి, బాపట్ల జిల్లా బాపట్ల, పొట్టిశ్రీరాములు జిల్లా నెల్లూరు, తిరుపతి జిల్లా నాయుడుపేట, గూడూరులో ఈ బృందాల సభ్యులు అలుపెరగకుండా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
♦ బాపట్ల జిల్లాలో గురువారం ఉదయం నాటికి 596 గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. దెబ్బతిన్న ఒక్కో గృహానికి రూ.10 వేలు చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నారు. 700కిపైగా కూలిన చెట్లను రోడ్లపై నుంచి తొలగించారు. జిల్లాలో లక్షకుపైగా హెక్టార్లలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. ఉపాధి కూలీలతో వరి పొలాల్లోని నీటిని బయటకు తరలించే పనులు కొనసాగిస్తున్నారు. తుపాన్ ఉధృతికి పర్చూరు నియోజకవర్గంలో పర్చూరు వాగు, కప్పలవాగు, కొమ్మమూరు కాలువ, ఆలేరు వాగులకు దాదాపు 20 చోట్ల గండ్లు పడటంతో మరమ్మతులు నిర్వహిస్తున్నారు.
♦ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధి హామీ కూలీలను వ్యవసాయ సహాయక చర్యల్లో వినియోగిస్తున్నారు. ముంపు తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో 1,282 మంది ఉపాధి కూలీలతో పంట బోదెల్లో పూడికలు తీయించారు. జేసీబీలతో డ్రెయిన్లలో పూడిక తొలగిస్తున్నారు. గ్రామాల్లో డోర్ టు డోర్ ఫీవర్ సర్వే చేపట్టారు.
♦తిరుపతి జిల్లాలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంతోపాటు 17 గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహించారు. జిల్లాకు తక్షణ సాయం కింద ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. బాధితులకు నిత్యావసర సరుకులను కిట్ రూపంలో అందజేశారు.
♦వర్షాలు కొద్దిగా తెరిపివ్వడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, చోడవరంలో ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు.
♦ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో దెబ్బతిన్న పంటను వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment