కొత్తపేట: మిచాంగ్ తుపాను, భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని.. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కేఎస్ జవహర్‌రెడ్డి చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పలివెల–పల్లిపాలెం రోడ్డులో పడిపోయిన వరి పంటను, తడిసిన ధాన్యాన్ని సీఎస్ శనివారం పరిశీలించారు. తుపాను వల్ల నియోజకవర్గంలో వరి, ఉద్యాన పంటలకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సీఎస్ జవహర్‌రెడ్డికి వివరించారు.
పూజారిపాలెం, చౌదరిపురం ప్రాంతంలో పొలాల ముంపునకు కారణమైన గోరింకల డ్రైన్‌ను సీఎస్‌కు చూపించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో తీసుకున్న ముందస్తు చర్యలతో పాటు రైతులకు నష్టపరిహారం, పంటల బీమా తదితర విషయాల్లో చేపట్టిన చర్యలను సీఎస్‌కు కలెక్టర్ హిమాన్షు శుక్లా వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముందస్తు చర్యలతో తుపాను నష్టాన్ని చాలా వరకు నివారించినట్లు చెప్పారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం నిబంధనలు కూడా సడలించిందని వివరించారు.
పంట తడిసిపోవడం వల్ల ధాన్యం మొలకెత్తడం, రంగు మారడం, నూకలవ్వడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, మిల్లర్లకు నిబంధనలు సడలించి.. వారికి తోలిన ధాన్యం ఎగుమతులకు అనుమతించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. తద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలుతో పాటు మిల్లర్ల నుంచి ఎగుమతుల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
పంట నష్టాల నమోదు అనంతరం సాయం అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కొత్తపేట ఆర్‌డీఓ ఎం.ముక్కంటి, ఎంపీపీ మార్గన గంగాధరరావు, జెడ్పీటీసీ గూడపాటి రమాదేవి, మాజీ జెడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్, తహసీల్దార్ జీడీ కిషోర్‌బాబు, ఎంపీడీఓ ఇ.మహేశ్వరరావు, వ్యవసాయ అధికారి జి.పద్మలత తదితరులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment