సాక్షి, అమరావతి: ఇటీవల తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ఇదే విషయాన్ని రైతు సోదరులందరికీ తెలియజేసి వారిలో భరోసా నింపాలని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఉదారంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తుపానుతో పంట నష్టం, రంగు మారిన వరి ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.
ఆర్బీకేల వారీగా కొనుగోళ్లు..
కొన్ని నిబంధనలు సడలించైనా సరే రైతులకు న్యాయం చేయాలని అధికార యంత్రాంగానికి సీఎం జగన్ స్పష్టం చేశారు. రైతుల వద్దనున్న ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపే బాధ్యతను పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకుంటారని, ఆర్బీకేల వారీగా కొనుగోళ్లు జరుగుతాయని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈమేరకు సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి అప్పటికప్పుడే ఆదేశాలు జారీచేశారు.
నష్టపోయిన రైతన్నలకు సకాలంలో ఇన్‌పుట్ సబ్సిడీ అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పంట నష్టపోయిన వారికి వైఎస్సార్ ఉచిత బీమా కింద వారికి పరిహారం అందించేందుకు అనుసరించాల్సిన ప్రక్రియను సమర్థంగా చేపట్టి ఆదుకోవాలని ఆదేశించారు.
ఎన్యూమరేషన్‌పై ఆరా
రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ (పంట నష్టం అంచనాలు) ప్రక్రియను ప్రారంభించారా? అని ఈ సందర్భంగా అధికారులను సీఎం జగన్ ఆరా తీశారు. ఈ నెల 11 నుంచి మొదలైన ఎన్యూమరేషన్ 18 వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. 19వతేదీ నుంచి 22 వరకు సామాజిక తనిఖీల కోసం జాబితాలను ఆర్బీకేలలో అందుబాటులో ఉంచనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ఆ తరువాత అభ్యంతరాల స్వీకరణ, సవరణల అనంతరం ఈ నెలాఖరుకు జిల్లా కలెక్టర్లు తుది జాబితాలను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు.
సంక్రాంతి లోగా ఇన్‌పుట్ సబ్సిడీ రైతులకు అందాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ఈ సమావేశంలో మంత్రి జోగి రమేష్, ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, సామినేని ఉదయభాను, సింహాద్రి రమేష్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ సి.హరికిరణ్, పౌరసరఫరాల శాఖ ఎండీ వీరపాండ్యన్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment