సాక్షి, అమరావతి : తుపాను, వర్షాభావ ప్రాంతాల్లో రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయాల్సిందిగా కేంద్ర అధికారుల బృందాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. తుపాను, కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన బృందాలు క్షేత్రస్థాయి పర్యటనల అనంతరం శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఉన్నతాధికారులతో సమావేశమయ్యాయి. తుపాను బాధిత ప్రాంతాల్లో తాము చూసిన పరిస్థితులను, గుర్తించిన అంశాలను సమావేశంలో వివరించాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే..
విస్తృత వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి..
తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడమే కాకుండా వారికి తక్షణ సహాయాన్ని కూడా అందించాం. సహజంగా.. తుపాను ఏదో ఒక ప్రాంతంలో తీరం దాటుతుంది. కానీ, ఈ తుపాను తీరం వెంబడి కదులుతూ కోస్తా ప్రాంతంలో విస్తృతంగా వర్షాలకు కారణమైంది. దీనివల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతూ నష్టాన్ని అంచనా వేస్తోంది. ఏపీలో ఈ–క్రాపింగ్ లాంటి సమర్థవంతమైన వ్యవస్థ ఉంది. నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కోసం పెడతాం.
ఎవరైనా నష్టపోయిన రైతు పేరు లేకుంటే వెంటనే దాన్ని సరిదిద్దేలా అత్యంత పారదర్శకత వ్యవస్థను అమలుచేస్తున్నాం. రైతులను తుదివరకూ ఆదుకునేలా వ్యవస్థలు రాష్ట్రంలో ఉన్నాయి. దీనివల్ల రైతులకు అందించే సహాయం, పరిహారం అత్యంత పారదర్శకంగా వారికి చేరుతుంది. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి స్వయంగా చూసినందున ఆ మేరకు రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయండి.
ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా,డీబీటీ పథకాలు బాగున్నాయి..
రాష్ట్రంలో ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, డీబీటీ పథకాలు, ఇన్‌పుట్ సబ్సిడీ, కంటింజెన్సీ కింద విత్తనాల పంపిణీ, అమూల్ పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా మిల్క్ కలెక్షన్ సెంటర్ల ఏర్పాటూ బాగున్నాయి. అలాగే, గ్రామ సచివాలయాల వ్యవస్థ పనితీరును తాము స్వయంగా చూశామని.. ఈ కార్యక్రమాలు చాలా బాగున్నాయని కేంద్ర బృందం కితాబి చ్చింది.
కౌలు రైతులకూ రైతుభరోసా భేష్..
అంతేకాక.. కౌలు రైతులకూ ఎక్కడాలేని విధంగా రైతుభరోసా అందించడం అభినందనీయమని కేంద్ర బృందం పేర్కొంది. వరి కాకుండా పెసలు, మినుములు, మిల్లెట్స్ లాంటి ఇతర పంటల వైపు మళ్లేలా చూడాలని సూచించింది. ఇదే అంశంపై ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అధికారులు వివరించారు.
‘ఉపాధి’ పెండింగ్ నిధులు వెంటనే ఇప్పించండి..
మరోవైపు.. ఉపాధి హామీ పథకం కింద విస్తారంగా కల్పిస్తున్న పనిదినాలపైన కేంద్ర బృందానికి రాష్ట్ర అధికారులు వివరించారు. పెండింగులో ఉన్న ఉపాధి హామీ పథకం బిల్లులను రాష్ట్రానికి వెంటనే వచ్చేలా చూడాలని వారు కోరారు. అలాగే, తుపాను కారణంగా రంగుమారిన, తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామని.. ఈ విషయంలో కొన్ని సడలింపులు కావాలంటూ ఇప్పటికే కేంద్రాన్ని అభ్యర్థించామని, వీలైనంత త్వరగా అవి కూడా వచ్చేలా చూడాలన్నారు.
ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్‌ఐడీఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ, వ్యవసాయ శాఖ జేడీ విక్రాంత్‌సింగ్, డీఏఎఫ్‌డబ్ల్యూ జాయింట్ సెక్రటరీ పంకజ్ యాదవ్ సహా రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ జవహర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి. సాయిప్రసాద్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై. శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, రవాణా శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ అంబేద్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ముందుజాగ్రత్తతో నష్టాలనునివారించారు : కేంద్ర బృందం
అనంతరం.. కేంద్ర బృందం స్పందిస్తూ.. అనంతపురం జిల్లా నుంచి పర్యటన ప్రారంభమై కర్నూలు, నంద్యాల, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, ఎన్టీఆర్ జిల్లాల్లో పర్యటించామని వివరించింది. మూడు బృందాలుగా జిల్లాల్లో పర్యటించి వర్షాభావ పరిస్థితులను పరిశీలించామని అందులోని సభ్యులు తెలిపారు. వర్షాభావం కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించామని, స్థానిక రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నామన్నారు.
అలాగే, జలవనరులు, రిజర్వాయర్లలో నీటిమట్టాల పరిస్థితిని చూడడంతోపాటు ఉపాధి పథకాన్ని పరిశీలించినట్లు కేంద్ర బృందం తెలిపింది. తుపానుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అప్రమత్తం కావడంవల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలిగిందని పేర్కొంది. సచివాలయాల రూపంలో ఇక్కడ గ్రామస్థాయిలో బలమైన వ్యవస్థ ఉందని, విపత్తు వచ్చిన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో అనుసరిస్తున్న మార్గాలు బాగున్నాయని ప్రశంసించింది.
ఈ–క్రాపింగ్ లాంటి విధానం దేశంలో ఎక్కడాలేదని, ఇవి ఇతర రాష్ట్రాలూ అనుసరించదగ్గవని, ఆయా ప్రభుత్వాలకు వీటిని తెలియజేస్తామని తెలిపింది. అలాగే, తుపాను కారణంగా జరిగిన పంట నష్టం, మౌలిక సదుపాయాలకు ఏర్పడ్డ నష్టాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని బృందం వెల్లడించింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులనూ బృందం అధికారులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment