‘మత్తు’ పంజా | liquor to fake palm effect, 19 people killed | Sakshi
Sakshi News home page

‘మత్తు’ పంజా

Published Thu, Sep 24 2015 2:35 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM

‘మత్తు’ పంజా

‘మత్తు’ పంజా

* కల్తీ కల్లు లేక మరో 19 మంది మృతి
* మహబూబ్‌నగర్ జిల్లాలోనే 9 మంది
* ఒంటికి నిప్పంటించుకొని ముగ్గురి ఆత్మహత్య
* రిహాబిలిటేషన్ సెంటర్లు లేకపోవడంతో పరిస్థితి తీవ్రం

 
సాక్షి నెట్‌వర్క్: తెలంగాణ పల్లెలపై ‘మత్తు’ మృత్యుపంజా విసురుతోంది! ఇన్నాళ్లూ కల్తీ కల్లుకు బానిసలైనవారంతా మత్తుకు దూరమై చావుకు చేరువవుతున్నారు. కొందరు పిచ్చెక్కి ప్రాణాలు తీసుకుంటే.. మరికొందరు ఆసుపత్రుల్లో కన్నుమూస్తున్నారు. బుధవారం ఇలా 19 మంది మృత్యువాత పడ్డారు. మహ బూబ్‌నగర్ జిల్లాలో తొమ్మిది మంది, నిజామాబాద్‌లో నలుగురు, ఆదిలాబాద్‌లో ముగ్గురు, మెదక్‌లో ఇద్దరు, కరీంనగర్ లో ఒక్కరు చనిపోయారు. వీరిలో మతిస్థిమితం కోల్పోయి ముగ్గురు ఒంటిపై కిరోసిన్ పోసుకొని మంటలకు ఆహుతయ్యారు. పలు జిల్లాల్లో ఆసుపత్రులు కల్లు బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రభుత్వపరంగా ఇప్పటికే రీహాబిలిటేషన్ కేంద్రాలను ప్రారంభించి ఉంటే పరిస్థితి ఇంతలా విషమించేది కాదు. బాధితులను వాటిలో చేర్చి, సకాలంలో చికిత్స అందించి ఉంటే వృతుల సంఖ్య తగ్గేది. కానీ ప్రభుత్వం ఆ దిశగా చురుగ్గా కదలడం లేదు.
 
 జిల్లాల్లో ఇదీ పరిస్థితి..
 మహబూబ్‌నగర్ జిల్లాలో కల్లులో మత్తు మోతాదు తగ్గడంతో పలువురు మతిస్థిమితం కోల్పోతున్నారు. ఆత్మకూర్ మండలం కొంకనివానిపల్లికి చెందిన బోయ బుచ్చమ్మ (45) వారం రోజులుగా కల్లు దొరకకపోవడంతో వింతగా ప్రవర్తిస్తోంది. బుధవారం కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇదే గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డి(40) తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. కల్లు లభించకపోవడంతో మానసిక రోగిగా ప్రవర్తిస్తున్నాడు. భార్య కూలీ పనులకు వెళ్లిన తర్వాత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయాడు. కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామానికి చెందిన చంద్రయ్య (65) వింత ప్రవర్తనతో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మకూర్‌లోని స్థానిక భరత్‌నగర్‌కు చెందిన గోవిందమ్మ(45), జడ్చర్ల మండలం బాదేపల్లి పట్టణానికి చెందిన వి.చెన్నయ్య(60), మైనోద్దిన్(60) మందు కల్లు తాగి చనిపోయారు. కల్లు లేక నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామానికి చెందిన దేవమ్మ(45) అస్వస్థతకు గురై చనిపోయింది. నవాబుపేట మండలం కారుకొండకు చెందిన భాగమ్మ (60) కల్తీ కల్లు లేక మతిస్థిమితం కోల్పోయింది. చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించగా చనిపోయింది.
 
 దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన కుమ్మరి బాలమ్మ(60) కల్లు లేక అస్వస్థతకు గురై చనిపోయింది. వనపర్తి మండలం శ్రీనివాసపురానికి చెందిన కృష్ణయ్యను ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. బుధవారం ఉదయం ఆస్పత్రిలోని మొదటి అంతస్తు నుంచి కిందకు దూకాడు. దీంతో అతడి కాలు విరిగింది. ఆదిలాబాద్ జిల్లా బాసరకు చెందిన ముల్కి పోతన్న (57), దూజ్‌గాం పోశెట్టి (63)లు కల్లు లేక ఫిట్స్‌తో ఇంట్లో పడిపోయాడు. వారిని ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయారు. నిర్మల్ పట్టణంలోని ఈద్‌గాంకు చెందిన మహమూద్ (45) మంగళవారం కల్లు తాగాడు. మత్తు మోతాదు తగ్గడంతో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. మైలాపూర్‌కు చెందిన కొందపురం పోశెట్టి (63) వింతగా ప్రవర్తిస్తూ బావిలో దూకాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
 
 నిజామాబాద్‌లో నలుగురు
 నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణికి చెందిన బండారి పర్వయ్య(38) కల్తీ కల్లు మృత్యువాత పడ్డాడు. ఆర్మూర్ పట్టణంలోని రంగాచారీ కాలనీలో నివసించే గాదె బాల్‌రెడ్డి(46) కొంతకాలంగా కల్తీకల్లు తాగుతున్నాడు. కొద్ది రోజులుగా దొరక్కపోవడంతో మతిస్థిమితం కోల్పోరుు ఇంట్లో నుంచి వెళ్లిపోయూడు. బుధవారం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో శవమై కనిపించాడు.  కామారెడ్డిలో ముదాంగల్లీకి చెందిన అంజయ్య(42) కల్లు లేక అనారోగ్యం బారిన పడి బుధవారం మృతిచెందాడు. సదాశివ్‌నగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డిలో పందిరి శ్రీనివాస్(35) వారం రోజులుగా కల్లు దొరక్క మృతి చెందాడు.
 
 కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం తిమ్మాపూర్‌కు చెందిన బాస జలపతి 15 రోజులుగా కల్లులో మత్తు తగ్గడంతో వికృత చేష్టలకు దిగుతున్నాడు. బుధవారం భార్యను తల పట్టుకొని గోడకు కొట్టడంతో ఆమె కోమాలోకి వెళ్లింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సిరిసిల్లకు చెందిన శ్రీరాముల రాజయ్య(55) వింతగా ప్రవర్తించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. 21న ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. బుధవారం పట్టణ శివారులోని చెరువు సమీపంలో శవమై కనిపించాడు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లికి చెందిన నీరుడి నర్సింలు (45) కల్లు లేక మంగళవారం రాత్రి కన్నుమూశాడు. ఇదే జిల్లా సుల్తాన్‌పూర్‌కు చెందిన యాదమ్మ (70) కల్తీ కల్లు లేక మతిస్థిమితం కోల్పోయింది. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ మంగళవారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.
 
 ఎర్రగడ్డకు 2 రోజుల్లో 130 మంది
 ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయం అవుట్ పేషంట్ విభాగానికి కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 130 మంది బాధితులు వచ్చారు. వీరిలో 25 మంది ఇన్‌పేషెంట్లుగా చేరారు. గత వారం రోజుల నుంచి ఆస్పత్రి ఓపీకి వస్తున్న బాధితుల్లో 80-90 శాతం మంది కల్తీ కల్లు బాధితులేనని ఆస్పత్రి వ ర్గాలు తెలిపాయి.
 
 గతం మరచి.. హుస్సేన్‌సాగర్‌లో దూకి
కల్తీ కల్లుకు దూరమై హైదరాబాద్‌లోని తిరుమలగిరికి చెందిన జక్కం సురేశ్(30) బుధవారం హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. సమయానికి పోలీసులు వచ్చి కాపాడారు. రోజు కల్లు తాగి వస్తుండటంతో భార్య రజిత జనవరిలో ఆయనకు విడాకులిచ్చింది. మంచిగా మారాలని కల్లు మానేశాడు. అయితే మానసిక స్థితి కోల్పోయి గతాన్ని కూడా మరచిపోతున్నట్టు పోలీసులు తెలిపారు.
 
 మందులు ఉన్నాయి
 కల్తీ కల్లుకు విరుగుడుగా మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని అందుబాటులో ఉంచకుండా కల్లుపై నిషేధం విధించడం సరికాదు. మానేయాలని భావించే వారికి ఈ విషయంపై దృఢమైన సంకల్పం ఉండాలి. ఇందుకోసం బాధితులు ముందు వైద్యులను సంప్రదించి వారు ఇచ్చే సూచనలు, సలహాలు పాటించాలి. వీటి సాయంతో బాధితుని శరీరంలో పేరుక పోయిన  విష పదార్థాలను బయటికి పంపి మామూలు మనిషిని చేయవచ్చు.
 - డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి,
 సీనియర్ న్యూరో ఫిజిషియన్, సిటీన్యూరో సెంటర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement