Telangana villages
-
ప్రేక్షకుల మనసును హత్తుకుంటున్న ‘మెయిల్’
మాల్గుడి అనే ఊళ్లో కథలు అందమైనవి. ఆ ఊరు కర్ణాటకలో ఉన్నట్టుగా కల్పితం. కాని నిజమైన మాల్గుడిలు ఎన్నో మన తెలుగు నేల మీద ఉన్నాయి ప్రతి ఊళ్లో ఎన్నో కతలు. ఎన్నో అనుభవాల తలపోతలు.వాటిని రాసేవారు కొందరు రాశారు. ఇప్పుడు తీసేవారు తీస్తున్నారు. ‘కంబాలపల్లి కతలు’ పేరుతో ఓటిటి ప్లాట్‌ఫామ్ ఆహాలో మొదలైన వెబ్ సిరీస్‌లో మొదటిది ‘మెయిల్’. ఇది తెలంగాణ పల్లెలోని ఒక ఇన్నోసెంట్ కథ.మరో మాల్గుడి డేస్ లాంటి కత. 1990ల తర్వాత నాటి ఆంధ్రప్రదేశ్‌లో కంప్యూటర్ కోర్సులు మొదలయ్యాయి. కాలేజీల్లో రెండు మూడు కంప్యూటర్లు పెట్టి, అవి ఉన్న చోటుకు కంప్యూటర్ ల్యాబ్ అని పేరు పెట్టి, కంప్యూటర్ కోర్సులు నేర్పించేవారు. వాటికి ఖర్చు జాస్తి. డబ్బున్న పిల్లలు చదివేవారు. బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివినవారు ఆ కాలంలో సులువుగా ఎం.సి.ఏలు చేసి ఇవాళ అమెరికాలో సెటిల్ అయ్యారు. అయితే 1990ల ఈ కంప్యూటర్ చిన్న వూళ్లకు చేరడానికి ఇంకో పదేళ్లే పట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో చిన్న చిన్న ఊళ్లల్లో వీటి సెంటర్లు వచ్చి తెలిసీ తెలియని పని మొదలయ్యింది. కంప్యూటర్లు ఆపరేట్ చేసేవారు తెలివైనవారుగా గొప్పవారుగా పరిగణింపబడ్డారు. వాటితో కొత్తగా పరిచయం పెంచుకున్న గ్రామీణ యువకులు కొన్ని కొత్త జీవితానుభవాలను నేర్చుకున్నారు. ఆ వరుసలో 2000 కాలంలో తెలంగాణ పల్లెలో ఒక కంప్యూటర్ ఎంత సందడి చేసిందో చెప్పే సినిమా ‘మెయిల్’. ఇప్పటితరానికి చేతిలోని ఫోనే ఒక కంప్యూటర్. కాని ఆ కాలంలో కంప్యూటర్ కుయ్మన్నా బీప్మన్నా భయమే. వైరస్ అన్నా భయమే. మౌస్‌ను చూసినా భయమే. మెయిల్ వచ్చింది తెలంగాణలోని మెహబూబాబాద్కు పూర్వనామం మానుకోట. దీనికి దగ్గరగా ఉండే ఊరు కంబాలపల్లి. వ్యవసాయం, వృత్తి విద్యలు, సైకిళ్ల మీద కాలేజీలకు వెళ్లే పిల్లలు, నోటు రాయించుకుని అప్పులు ఇచ్చే వ్యక్తులు... వీరందరి మధ్య హైబత్ (ప్రియదర్శి) అనే కుర్రాడు కంప్యూటర్ సెంటర్ పెడతాడు. కంప్యూటర్ సెంటర్ అంటే ఒకే ఒక కంప్యూటర్ ఉన్న కొట్టు. పిల్లలకు గేమ్స్ ఆడించి గంటకు పదిరూపాయలు సంపాదించుకునే హైబత్ దగ్గర ఉన్న కంప్యూటర్ను చూసి దానిని నేర్చుకోవాలని అనుకుంటాడు రవి (హర్షిత్ రెడ్డి) అనే డిగ్రీ కుర్రాడు. హైబత్ అతనికి ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేస్తాడు. ఇక అతనికి మెయిల్స్ వస్తాయని చెబుతాడు. ఇతని మెయిల్ ఐడి ఎవరికి తెలుసని? ఇతని మెయిల్‌కు ఎవరు మెయిల్స్ పంపుతారని? ఆ సంగతి హైబత్కు తెలియదు, రవికి తెలియదు. రోజూ వచ్చి మెయిల్ బాక్స్ ఓపెన్ చేసుకుని చూసుకుంటూ ఉంటాడు. ఒక రోజు రానే వచ్చింది మెయిల్. అందులో ‘కంగ్రాట్యులేషన్స్... మీరు రెండు కోట్ల రూపాయలు లాటరీలో గెలుచుకున్నారు.’ అని. అది ఫేక్ మెయిల్. కాని దానిని రవి నిజమని నమ్ముతాడు. తన ఫ్రెండ్‌ను కూడా ఇందులో దింపుతాడు. ఆ తర్వాత ఏమయ్యిందనేది కథ. అందమైన సంగతులు కాని ఇందుకోసం ఈ సినిమా చూడరు ఎవరూ. తెలంగాణ భాష కోసం, మనుషుల కోసం, ఊళ్లో జరుగుతున్న కథలో భాగమైన భావన కోసం, ఆ క్షణకాలపు పెను సమస్యలతో పాత్రలు సతమతమవడాన్ని చూడటం కోసం ఈ సినిమా చూస్తారు. ఇది మొత్తంగా ఒక ఊరు ఉమ్మడి కథ. పాత్రలు కొంచెం ముందు నిలబడతాయి అంతే. డిగ్రీ కాలేజీలో చేరిన వెంటనే మొదలయ్యే ప్రేమలు, పాసనయ్యానని చెప్తే పెద్దగా వ్యక్తీకరణ లేకుండా ‘బట్టలు కొనుక్కుంటావా’ అని అడిగే తండ్రులు, చదువు అబ్బని కొడుకులను చూసి నాలుగు తగిలించే నాన్నలు, అర్ధ చటాక్ చింతపండును కొనడానికి వచ్చే ఆడపిల్లలు, చిన్న చిన్న అసూయలు, కొద్ది కొద్ది ఈర్ష్యలు... మనుషులందరూ ఒకటే అని చెప్పే ఈ భావోద్వేగాలను ఈ సినిమాలో చూస్తాము. కాళ్లకు చెప్పులు వేసుకుని వస్తే కంప్యూటర్‌కు వైరస్ వస్తుందని నమ్మిన ఆ కాలంలో ఆ మూఢ విశ్వాసం చుట్టూ మంచి హాస్యం అల్లుకున్నారు. కంప్యూటర్లో డ్రైవ్ నిండి ఎర్రగా కనిపించినా అది వైరస్సే అని భయపడతాడు హైబత్. దానిని రిపేరు చేయడానికి వచ్చినవాడిది ఇంకా పెద్ద మాయ. దర్శకుడి స్వీయకథ ఈ సిరీస్‌ను తీస్తున్నది దర్శకుడు ఉదయ్ గుర్రాల. ఇతనిది ఈ సినిమా కథ జరిగిన ప్రాంతమే. బహుశా ఇతని, ఇతని స్నేహితుల అనుభవాలే ఈ సినిమా. అందుకే కథలో ఒరిజినాలిటీ, ప్రవర్తనలు, పాత్రలు సహజంగా అమిరాయి. మేకింగ్‌లో హిందీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’ ప్రభావం ఉన్నట్టు అనిపించినా అది మంచికే. కథను ఇంకొంత వేగంగా చెప్పవచ్చు. ఇంత నిడివి అక్కర్లేదు అనిపిస్తుంది. తర్వాతి చాప్టర్లో ఈ జాగ్రత్త తీసుకుంటాడని ఆశిద్దాం. ఈ సిరీస్‌ను ఓకే చేసిన నిర్మాతలు స్వప్నా దత్, ప్రియా దత్, అశ్వినిదత్ను అభినందించాలి. మిస్ హైదరాబాద్ టైటిల్ గెలుచుకున్న గౌరిప్రియ ఎంత చక్కగా నటించిందో చెప్పలేము. ఆ కళ్లే అన్ని భావాలు పలుకుతున్నాయి. ఆ తెలంగాణ పలుకు బంగారం. కోస్తా ప్రాంతంలో కథలు బాగానే వచ్చాయి. కాని రాయలసీమ, తెలంగాణ ప్రాంతం నేపథ్యంలో ఇలాంటి ఎన్నో సిరీస్‌లు తీయవచ్చు. ఇది మొదలు. మంచి కథలు రానున్నాయన్న సందేశాన్ని మోసుకొచ్చింది ‘మెయిల్’. అన్నట్టు గత ఇరవై ఏళ్లుగా ఫేక్ ఈమెయిల్స్ వచ్చి లక్షలు, కోట్లు కోల్పోయిన అమాయకులు ఉన్నారు. కాని ప్రభుత్వాలు ఈ మధ్య మాత్రమే ఆ ఫేక్ మెయిల్స్‌ను నమ్మొద్దంటూ ప్రచారం మొదలెట్టాయి. ఈలోపు జరిగిన వేలాది పెద్ద ప్రమాదాల్లో ఒక చిన్న ప్రమాదం మాత్రమే ‘మెయిల్’. – సాక్షి ఫ్యామిలీ -
ముంబైలోనూ పనుల్లేవ్!
పుణేకు వలసకట్టిన తెలంగాణ పల్లెలు * మహబూబ్‌నగర్ జిల్లా నుంచే అధికం * నీటి కొరతతో ముంబైలో నిర్మాణ పనులకు బ్రేక్ * మూతపడిన కార్ఖానాలు * వలస జీవులకు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు గుండారపు శ్రీనివాస్, సాక్షి ప్రతినిధి, ముంబై: ‘ఊళ్లో మూడేళ్లుగా వర్షాల్లేక పంటలన్నీ ఎండిపోయాయి.. ఏవైనా పనులు చేసుకుందామని భార్యాపిల్లలతో ఇక్కడికి వచ్చా..’ ‘పంటల కోసం అప్పులు చేశా.. పనులుంటే రెక్కలు ముక్కలు చేసుకొనైనా తీర్చేవాడిని. కానీ అక్కడ పనుల్లేక ఇక్కడికి రావాల్సి వచ్చింది’ ...కరువు తరిమేయడంతో తెలంగాణ నుంచి పొట్ట చేతబట్టుకొని మహారాష్ట్రకు వలస వచ్చిన వారి గోడు ఇది! ఉన్న ఊళ్లో పనుల్లేక తెలంగాణ నుంచి పెద్దఎత్తున జనం పుణేకు చేరుకుంటున్నారు. ఇప్పటివరకు ముంబై, ఆ నగరం చుట్టుపక్కల ప్రాంతాలకు వలసలు ఎక్కువగా ఉండేవి. అయితే ప్రస్తుతం అక్కడ కూడా పనులు కరువయ్యాయి. మహారాష్ట్ర కూడా కరువు కోరల్లో చిక్కుకోవడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రైతులు, కూలీలు ముంబైకి చేరుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణను ఆనుకుని ఉన్న మరాఠ్వాడా, విదర్భలలో మూడేళ్లుగా దుర్భర కరువు నెలకొంది. దీంతో ఆ ప్రాంతాల నుంచి కూలీలు భారీ సంఖ్యలో ముంబై చేరుకున్నారు. దీంతో పనికి పోటీ ఏర్పడింది. మహారాష్ట్రలోని కరువు ప్రాంతాలవారికి కూలీ పనుల్లో కొంత మేర ప్రాధాన్యం దక్కుతుండడంతో ముంబైలో తెలంగాణవాసులకు పనులు తగ్గాయి. దీనికితోడు తీవ్ర కరువు నేపథ్యంలో ముంబైలో భవన నిర్మాణం ఇతరత్రా పనులు ఆగిపోయాయి. మిల్లులు, ఇతర చిన్నచిన్న కార్ఖానాలూ మూతబడ్డాయి. దీంతో తెలంగాణ నుంచేగాకుండా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి పుణేకు వలసలు పెరిగాయి! పుణే రైల్వేస్టేషన్ కిటకిట.. తెలంగాణ నుంచి వస్తున్న వలసజీవుల్లో సగం మంది పుణేకే చేరుకుంటున్నారు. అర్ధరాత్రి కూడా పుణే రైల్వేస్టేషన్ పరిసరాలు తెలంగాణ వలస జనంతో కిటకిటలాడుతున్నాయి. కొందరు భార్యాపిల్లలతో వస్తుండగా.. మరికొందరు వారిని ఇంటివద్దే వదిలి ఒంటరిగా వస్తున్నారు. మిగిలినవారు ఠాణే, రాయిఘడ్కు చేరుకుంటున్నారు. కొద్దిమంది మాత్రమే ముంబై వెళ్తున్నారు. వలస వస్తున్నవారిలో ఎక్కువ మంది మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవారే ఉంటున్నారు. ప్రస్తుతం పుణే జిల్లాలో నిర్మాణ పనులు జోరుగా సాగుతుడడంతో పుణే నగరంతోపాటు పింప్రీ-చించ్వడ్ చుట్టుపక్కల పరిసరాలతోపాటు సరిహద్దు ప్రాంతాలైన దౌండ్, ఉరులి కాంచన్, రాజ్‌గురునగర్, చికిలీ, చాకణ్, తలేగావ్, శిఖరాపూర్, సనస్ వాడి, ఇందాపూర్, బారామతి, టింబూర్ణి తదితర ప్రాంతాలకు వస్తున్నారు. వీరిలో అనేక మంది అద్దెకు ఇళ్లు తీసుకునే స్థోమత లేకపోవడంతో తాత్కాలిక గుడారాల్లో తలదాచుకుంటున్నారు. గతంలో కరీంనగర్, జగిత్యాల, ధర్మపురి, లక్సెట్టిపేట, సిరిసిల్ల, వేములవాడ, గోదావరిఖని, హుజురాబాద్, వరంగల్, జనగామ, కామారెడ్డి, సిద్దిపేట, మహబూబ్‌నగర్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, వనపర్తి, నారాయణపేట్, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, తాండూర్ ప్రాంతాల నుంచి ముంబై, దాని చుట్టుపక్కల ప్రాంతాలైన బివండీ, థానేకు వలసలు ఎక్కువగా ఉండేవి. వీరికోసం తెలంగాణ నుంచి ముంబైకి ఏకంగా 28 ఆర్టీసీ బస్సులు నడిచేవి. ఇప్పుడు ఏడు బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. ముంబైలో పనుల్లేక ఇబ్బందులు ముంబైలో పనులు కరువవడంతో ఇప్పటికే అక్కడికి వలస వెళ్లిన తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాకా కార్మికులకు వారంలో సగం రోజులే పనులు దొరుకుతున్నాయి. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారికి పలు స్వచ్ఛంద సంస్థలు, స్థానిక రాజకీయ నాయకులు అండగా నిలుస్తున్నారు. వారికి తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరికొందరు నిత్యావసర వస్తువులు అందించి ఆదుకుంటున్నారు. తెలంగాణకు చెందినవారు కూడా కొందరు ఈ తాత్కాలిక షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ నుంచి ముంబైలో సుమారు 10 లక్షల మంది ఉన్నారు. వీరిలో 70 శాతం తెలంగాణకు చెందినవారే ఉన్నారు. కుటుంబంతో వచ్చా.. మాకు ఊళ్లో జామ, బత్తాయి పండ్ల తోట ఉంది. కానీ నీళ్లు లేక ఎండిపోయింది. అప్పుల పాలయ్యాం. నీళ్లు లేక చెట్లన్నీ ఎండిపోవడంతో చేసేదేమీ లేక పుణేకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్‌గురునగర్‌లో పనులున్నాయని చెబితే కుటుంబ సమేతంగా పుణే వచ్చాం. - బాబ్జానాయక్, కొత్తపల్లి, మహబూబ్‌నగర్ సెంట్రింగ్ పనుల కోసం వచ్చా వరుసగా మూడు, నాలుగేళ్లుగా వర్షాభావంతో వ్యవసాయం పనులు నడవడం లేదు. తాగునీరు కూడా లభించడం లేదు. ఉన్న రెండెకరాల భూమి బీడుగా మారింది. పుణేలోని పాషాణ్లో సెంట్రింగ్ పనులు, వాటర్ ప్రూఫ్ పనులున్నాయంటే భార్యా పిల్లలతో కలసి వచ్చా. - గోపాల్ హఠియా, కిష్టాపురం తండా, మహబూబ్‌నగర్ పనులు దొరకడం లేదు వర్షాభావం కారణంగా మా ఊర్లో ఎన్నడూ లేనంత కరువు ఏర్పడింది. పిల్లలు, భార్యను అక్కడే వదిలేసి పని కోసం ముంబై వచ్చా. కానీ ఇక్కడ కూడా పనులు దొరకడం లేదు. - మెట్టపల్లి మల్లయ్య, సీతారాంపట్టి, సిద్దిపేట, మెదక్ 27 బోర్లు వేయించినా నీరు పడలేదు పంట కోసం 27 బోర్లు వే యించా. ఒక్కదాంట్లోనూ సరిగా నీరు పడలేదు. అప్పులు తీర్చేందుకు మరో మార్గంలేక ముంబైకి పనుల కోసం వచ్చా. - బాపురం అంజలయ్య, రాధపూర్, దోమ మండలం, రంగారెడ్డి -
తెలంగాణ పల్లెల్లో విధ్వంసం సృష్టించొద్దు
తెలంగాణ పల్లెల్లో విధ్వంసం సృష్టించొద్దని మానవహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే అవి 30, 40 ఏళ్ల పాటు నలిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్కౌంటర్లు లేని తెలంగాణను తమకివ్వాలని ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను కోరుతున్నట్లు ఆయన తెలిపారు. వందేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర చరిత్ర రాస్తే, మొదటి మంత్రివర్గం ఎలా పనిచేసిందన్నది రికార్డవుతుందని, ఈ విషయాన్ని కేసీఆర్ గుర్తించాలని ఆయన చెప్పారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం సమీపంలో ఆయనను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులకు పైనుంచి అనుమతి ఉంటేనే ఎన్కౌంటర్లు జరుగుతాయని చెప్పారు. వీలుంటే అరెస్టు చేయడం, విచారించడం, న్యాయవ్యవస్థ ద్వారా విచారణ చేయడం పద్ధతి అని, మావోయిస్టుల విషయంలోనైనా.. మరెవరి విషయంలోనైనా ఇదే చేయాలని చెప్పారు. ఏకపక్షంగా చంపడం రాజ్యానికి, తెలంగాణ ప్రభుత్వానికి మంచిది కాదని అన్నారు. వందేళ్ల తర్వాత చరిత్ర రాస్తే ఈ మొదటి కేబినెట్ ఎలా పనిచేసిందన్నది రికార్డవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్ర పోలీసులైనా, తెలంగాణ పోలీసులైనా ఒకేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఇది తెలంగాణ ప్రభుత్వం.. ప్రజలను ఏమీ చేయొద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిస్తే వాళ్లేమీ చేయరని తెలిపారు. -
తెలంగాణ పల్లెల్లో విధ్వంసం సృష్టించొద్దు
-
‘మత్తు’ పంజా
* కల్తీ కల్లు లేక మరో 19 మంది మృతి * మహబూబ్‌నగర్ జిల్లాలోనే 9 మంది * ఒంటికి నిప్పంటించుకొని ముగ్గురి ఆత్మహత్య * రిహాబిలిటేషన్ సెంటర్లు లేకపోవడంతో పరిస్థితి తీవ్రం సాక్షి నెట్వర్క్: తెలంగాణ పల్లెలపై ‘మత్తు’ మృత్యుపంజా విసురుతోంది! ఇన్నాళ్లూ కల్తీ కల్లుకు బానిసలైనవారంతా మత్తుకు దూరమై చావుకు చేరువవుతున్నారు. కొందరు పిచ్చెక్కి ప్రాణాలు తీసుకుంటే.. మరికొందరు ఆసుపత్రుల్లో కన్నుమూస్తున్నారు. బుధవారం ఇలా 19 మంది మృత్యువాత పడ్డారు. మహ బూబ్‌నగర్ జిల్లాలో తొమ్మిది మంది, నిజామాబాద్‌లో నలుగురు, ఆదిలాబాద్‌లో ముగ్గురు, మెదక్‌లో ఇద్దరు, కరీంనగర్ లో ఒక్కరు చనిపోయారు. వీరిలో మతిస్థిమితం కోల్పోయి ముగ్గురు ఒంటిపై కిరోసిన్ పోసుకొని మంటలకు ఆహుతయ్యారు. పలు జిల్లాల్లో ఆసుపత్రులు కల్లు బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రభుత్వపరంగా ఇప్పటికే రీహాబిలిటేషన్ కేంద్రాలను ప్రారంభించి ఉంటే పరిస్థితి ఇంతలా విషమించేది కాదు. బాధితులను వాటిలో చేర్చి, సకాలంలో చికిత్స అందించి ఉంటే వృతుల సంఖ్య తగ్గేది. కానీ ప్రభుత్వం ఆ దిశగా చురుగ్గా కదలడం లేదు. జిల్లాల్లో ఇదీ పరిస్థితి.. మహబూబ్‌నగర్ జిల్లాలో కల్లులో మత్తు మోతాదు తగ్గడంతో పలువురు మతిస్థిమితం కోల్పోతున్నారు. ఆత్మకూర్ మండలం కొంకనివానిపల్లికి చెందిన బోయ బుచ్చమ్మ (45) వారం రోజులుగా కల్లు దొరకకపోవడంతో వింతగా ప్రవర్తిస్తోంది. బుధవారం కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇదే గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డి(40) తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. కల్లు లభించకపోవడంతో మానసిక రోగిగా ప్రవర్తిస్తున్నాడు. భార్య కూలీ పనులకు వెళ్లిన తర్వాత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయాడు. కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామానికి చెందిన చంద్రయ్య (65) వింత ప్రవర్తనతో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మకూర్‌లోని స్థానిక భరత్‌నగర్‌కు చెందిన గోవిందమ్మ(45), జడ్చర్ల మండలం బాదేపల్లి పట్టణానికి చెందిన వి.చెన్నయ్య(60), మైనోద్దిన్(60) మందు కల్లు తాగి చనిపోయారు. కల్లు లేక నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామానికి చెందిన దేవమ్మ(45) అస్వస్థతకు గురై చనిపోయింది. నవాబుపేట మండలం కారుకొండకు చెందిన భాగమ్మ (60) కల్తీ కల్లు లేక మతిస్థిమితం కోల్పోయింది. చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించగా చనిపోయింది. దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన కుమ్మరి బాలమ్మ(60) కల్లు లేక అస్వస్థతకు గురై చనిపోయింది. వనపర్తి మండలం శ్రీనివాసపురానికి చెందిన కృష్ణయ్యను ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. బుధవారం ఉదయం ఆస్పత్రిలోని మొదటి అంతస్తు నుంచి కిందకు దూకాడు. దీంతో అతడి కాలు విరిగింది. ఆదిలాబాద్ జిల్లా బాసరకు చెందిన ముల్కి పోతన్న (57), దూజ్‌గాం పోశెట్టి (63)లు కల్లు లేక ఫిట్స్‌తో ఇంట్లో పడిపోయాడు. వారిని ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయారు. నిర్మల్ పట్టణంలోని ఈద్గాంకు చెందిన మహమూద్ (45) మంగళవారం కల్లు తాగాడు. మత్తు మోతాదు తగ్గడంతో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. మైలాపూర్‌కు చెందిన కొందపురం పోశెట్టి (63) వింతగా ప్రవర్తిస్తూ బావిలో దూకాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిజామాబాద్‌లో నలుగురు నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణికి చెందిన బండారి పర్వయ్య(38) కల్తీ కల్లు మృత్యువాత పడ్డాడు. ఆర్మూర్ పట్టణంలోని రంగాచారీ కాలనీలో నివసించే గాదె బాల్‌రెడ్డి(46) కొంతకాలంగా కల్తీకల్లు తాగుతున్నాడు. కొద్ది రోజులుగా దొరక్కపోవడంతో మతిస్థిమితం కోల్పోరుు ఇంట్లో నుంచి వెళ్లిపోయూడు. బుధవారం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో శవమై కనిపించాడు. కామారెడ్డిలో ముదాంగల్లీకి చెందిన అంజయ్య(42) కల్లు లేక అనారోగ్యం బారిన పడి బుధవారం మృతిచెందాడు. సదాశివ్‌నగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డిలో పందిరి శ్రీనివాస్(35) వారం రోజులుగా కల్లు దొరక్క మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం తిమ్మాపూర్‌కు చెందిన బాస జలపతి 15 రోజులుగా కల్లులో మత్తు తగ్గడంతో వికృత చేష్టలకు దిగుతున్నాడు. బుధవారం భార్యను తల పట్టుకొని గోడకు కొట్టడంతో ఆమె కోమాలోకి వెళ్లింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సిరిసిల్లకు చెందిన శ్రీరాముల రాజయ్య(55) వింతగా ప్రవర్తించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. 21న ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. బుధవారం పట్టణ శివారులోని చెరువు సమీపంలో శవమై కనిపించాడు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లికి చెందిన నీరుడి నర్సింలు (45) కల్లు లేక మంగళవారం రాత్రి కన్నుమూశాడు. ఇదే జిల్లా సుల్తాన్‌పూర్‌కు చెందిన యాదమ్మ (70) కల్తీ కల్లు లేక మతిస్థిమితం కోల్పోయింది. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ మంగళవారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎర్రగడ్డకు 2 రోజుల్లో 130 మంది ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయం అవుట్ పేషంట్ విభాగానికి కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 130 మంది బాధితులు వచ్చారు. వీరిలో 25 మంది ఇన్పేషెంట్లుగా చేరారు. గత వారం రోజుల నుంచి ఆస్పత్రి ఓపీకి వస్తున్న బాధితుల్లో 80-90 శాతం మంది కల్తీ కల్లు బాధితులేనని ఆస్పత్రి వ ర్గాలు తెలిపాయి. గతం మరచి.. హుస్సేన్‌సాగర్‌లో దూకి కల్తీ కల్లుకు దూరమై హైదరాబాద్‌లోని తిరుమలగిరికి చెందిన జక్కం సురేశ్(30) బుధవారం హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. సమయానికి పోలీసులు వచ్చి కాపాడారు. రోజు కల్లు తాగి వస్తుండటంతో భార్య రజిత జనవరిలో ఆయనకు విడాకులిచ్చింది. మంచిగా మారాలని కల్లు మానేశాడు. అయితే మానసిక స్థితి కోల్పోయి గతాన్ని కూడా మరచిపోతున్నట్టు పోలీసులు తెలిపారు. మందులు ఉన్నాయి కల్తీ కల్లుకు విరుగుడుగా మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని అందుబాటులో ఉంచకుండా కల్లుపై నిషేధం విధించడం సరికాదు. మానేయాలని భావించే వారికి ఈ విషయంపై దృఢమైన సంకల్పం ఉండాలి. ఇందుకోసం బాధితులు ముందు వైద్యులను సంప్రదించి వారు ఇచ్చే సూచనలు, సలహాలు పాటించాలి. వీటి సాయంతో బాధితుని శరీరంలో పేరుక పోయిన విష పదార్థాలను బయటికి పంపి మామూలు మనిషిని చేయవచ్చు. - డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ న్యూరో ఫిజిషియన్, సిటీన్యూరో సెంటర్ -
పల్లెలకు సరికొత్త రూపు
అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పల్లెలకు సరికొత్త రూపునిచ్చేందుకు గ్రామ పంచాయతీల వారీగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. 14వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రామాభివృద్ధి ప్రణాళికలు ఉంటాయని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ విభాగం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై శనివారం ఆ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీల ప్రాథమిక విధులైన తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ.. తదితర అంశాలకు ప్రాధాన్యతనిస్తూ, ఏడాది కాలంలో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రణాళికల్లో పొందుపరుస్తామన్నారు. మన ఊరు-మన ప్రణాళిక ద్వారా గతంలో ప్రజల నుంచి సేకరించిన సూచనలను, సలహాలను తాజాగా చేపట్టిన ప్రణాళికల రూపకల్పనకు పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రతి గ్రామాన్ని వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లె మాదిరిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రణాళికల ద్వారా నిధులను సక్రమంగా వినియోగించుకునేందుకు వీలవుతుందని చెప్పా రు. స్వయం సహాయక సంఘాల, రిటైర్డు ఉద్యోగుల సహకారం తీసుకోవాలని ఆదేశించారు.