ముంబైలోనూ పనుల్లేవ్!
పుణేకు వలసకట్టిన తెలంగాణ పల్లెలు
* మహబూబ్‌నగర్ జిల్లా నుంచే అధికం
* నీటి కొరతతో ముంబైలో నిర్మాణ పనులకు బ్రేక్
* మూతపడిన కార్ఖానాలు
* వలస జీవులకు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు
గుండారపు శ్రీనివాస్, సాక్షి ప్రతినిధి, ముంబై:
‘ఊళ్లో మూడేళ్లుగా వర్షాల్లేక పంటలన్నీ ఎండిపోయాయి.. ఏవైనా పనులు చేసుకుందామని భార్యాపిల్లలతో ఇక్కడికి వచ్చా..’
‘పంటల కోసం అప్పులు చేశా.. పనులుంటే రెక్కలు ముక్కలు చేసుకొనైనా తీర్చేవాడిని. కానీ అక్కడ పనుల్లేక ఇక్కడికి రావాల్సి వచ్చింది’
...కరువు తరిమేయడంతో తెలంగాణ నుంచి పొట్ట చేతబట్టుకొని మహారాష్ట్రకు వలస వచ్చిన వారి గోడు ఇది! ఉన్న ఊళ్లో పనుల్లేక తెలంగాణ నుంచి పెద్దఎత్తున జనం పుణేకు చేరుకుంటున్నారు. ఇప్పటివరకు ముంబై, ఆ నగరం చుట్టుపక్కల ప్రాంతాలకు వలసలు ఎక్కువగా ఉండేవి. అయితే ప్రస్తుతం అక్కడ కూడా పనులు కరువయ్యాయి. మహారాష్ట్ర కూడా కరువు కోరల్లో చిక్కుకోవడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రైతులు, కూలీలు ముంబైకి చేరుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణను ఆనుకుని ఉన్న మరాఠ్వాడా, విదర్భలలో మూడేళ్లుగా దుర్భర కరువు నెలకొంది.
దీంతో ఆ ప్రాంతాల నుంచి కూలీలు భారీ సంఖ్యలో ముంబై చేరుకున్నారు. దీంతో పనికి పోటీ ఏర్పడింది. మహారాష్ట్రలోని కరువు ప్రాంతాలవారికి కూలీ పనుల్లో కొంత మేర ప్రాధాన్యం దక్కుతుండడంతో ముంబైలో తెలంగాణవాసులకు పనులు తగ్గాయి. దీనికితోడు తీవ్ర కరువు నేపథ్యంలో ముంబైలో భవన నిర్మాణం ఇతరత్రా పనులు ఆగిపోయాయి. మిల్లులు, ఇతర చిన్నచిన్న కార్ఖానాలూ మూతబడ్డాయి. దీంతో తెలంగాణ నుంచేగాకుండా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి పుణేకు వలసలు పెరిగాయి!
పుణే రైల్వేస్టేషన్ కిటకిట..
తెలంగాణ నుంచి వస్తున్న వలసజీవుల్లో సగం మంది పుణేకే చేరుకుంటున్నారు. అర్ధరాత్రి కూడా పుణే రైల్వేస్టేషన్ పరిసరాలు తెలంగాణ వలస జనంతో కిటకిటలాడుతున్నాయి. కొందరు భార్యాపిల్లలతో వస్తుండగా.. మరికొందరు వారిని ఇంటివద్దే వదిలి ఒంటరిగా వస్తున్నారు. మిగిలినవారు ఠాణే, రాయిఘడ్‌కు చేరుకుంటున్నారు. కొద్దిమంది మాత్రమే ముంబై వెళ్తున్నారు. వలస వస్తున్నవారిలో ఎక్కువ మంది మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవారే ఉంటున్నారు.
ప్రస్తుతం పుణే జిల్లాలో నిర్మాణ పనులు జోరుగా సాగుతుడడంతో పుణే నగరంతోపాటు పింప్రీ-చించ్‌వడ్ చుట్టుపక్కల పరిసరాలతోపాటు సరిహద్దు ప్రాంతాలైన దౌండ్, ఉరులి కాంచన్, రాజ్‌గురునగర్, చికిలీ, చాకణ్, తలేగావ్, శిఖరాపూర్, సనస్ వాడి, ఇందాపూర్, బారామతి, టింబూర్ణి తదితర ప్రాంతాలకు వస్తున్నారు. వీరిలో అనేక మంది అద్దెకు ఇళ్లు తీసుకునే స్థోమత లేకపోవడంతో తాత్కాలిక గుడారాల్లో తలదాచుకుంటున్నారు. గతంలో కరీంనగర్, జగిత్యాల, ధర్మపురి, లక్సెట్టిపేట, సిరిసిల్ల, వేములవాడ, గోదావరిఖని, హుజురాబాద్, వరంగల్, జనగామ, కామారెడ్డి, సిద్దిపేట, మహబూబ్‌నగర్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, వనపర్తి, నారాయణపేట్, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, తాండూర్ ప్రాంతాల నుంచి ముంబై, దాని చుట్టుపక్కల ప్రాంతాలైన బివండీ, థానేకు వలసలు ఎక్కువగా ఉండేవి. వీరికోసం తెలంగాణ నుంచి ముంబైకి ఏకంగా 28 ఆర్టీసీ బస్సులు నడిచేవి. ఇప్పుడు ఏడు బస్సులు మాత్రమే నడుస్తున్నాయి.
ముంబైలో పనుల్లేక ఇబ్బందులు
ముంబైలో పనులు కరువవడంతో ఇప్పటికే అక్కడికి వలస వెళ్లిన తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాకా కార్మికులకు వారంలో సగం రోజులే పనులు దొరుకుతున్నాయి. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారికి పలు స్వచ్ఛంద సంస్థలు, స్థానిక రాజకీయ నాయకులు అండగా నిలుస్తున్నారు. వారికి తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరికొందరు నిత్యావసర వస్తువులు అందించి ఆదుకుంటున్నారు. తెలంగాణకు చెందినవారు కూడా కొందరు ఈ తాత్కాలిక షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ నుంచి ముంబైలో సుమారు 10 లక్షల మంది ఉన్నారు. వీరిలో 70 శాతం తెలంగాణకు చెందినవారే ఉన్నారు.
కుటుంబంతో వచ్చా..
మాకు ఊళ్లో జామ, బత్తాయి పండ్ల తోట ఉంది. కానీ నీళ్లు లేక ఎండిపోయింది. అప్పుల పాలయ్యాం. నీళ్లు లేక చెట్లన్నీ ఎండిపోవడంతో చేసేదేమీ లేక పుణేకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్‌గురునగర్‌లో పనులున్నాయని చెబితే కుటుంబ సమేతంగా పుణే వచ్చాం.
- బాబ్జానాయక్, కొత్తపల్లి, మహబూబ్‌నగర్
సెంట్రింగ్ పనుల కోసం వచ్చా
వరుసగా మూడు, నాలుగేళ్లుగా వర్షాభావంతో వ్యవసాయం పనులు నడవడం లేదు. తాగునీరు కూడా లభించడం లేదు. ఉన్న రెండెకరాల భూమి బీడుగా మారింది. పుణేలోని పాషాణ్‌లో సెంట్రింగ్ పనులు, వాటర్ ప్రూఫ్ పనులున్నాయంటే భార్యా పిల్లలతో కలసి వచ్చా.
- గోపాల్ హఠియా, కిష్టాపురం తండా, మహబూబ్‌నగర్
పనులు దొరకడం లేదు
వర్షాభావం కారణంగా మా ఊర్లో ఎన్నడూ లేనంత కరువు ఏర్పడింది. పిల్లలు, భార్యను అక్కడే వదిలేసి పని కోసం ముంబై వచ్చా. కానీ ఇక్కడ కూడా పనులు దొరకడం లేదు.
- మెట్టపల్లి మల్లయ్య, సీతారాంపట్టి, సిద్దిపేట, మెదక్
27 బోర్లు వేయించినా నీరు పడలేదు
పంట కోసం 27 బోర్లు వే యించా. ఒక్కదాంట్లోనూ సరిగా నీరు పడలేదు. అప్పులు తీర్చేందుకు మరో మార్గంలేక ముంబైకి పనుల కోసం వచ్చా.
- బాపురం అంజలయ్య, రాధపూర్, దోమ మండలం, రంగారెడ్డి