మాల్గుడి అనే ఊళ్లో కథలు అందమైనవి. ఆ ఊరు కర్ణాటకలో ఉన్నట్టుగా కల్పితం. కాని నిజమైన మాల్గుడిలు ఎన్నో మన తెలుగు నేల మీద ఉన్నాయి ప్రతి ఊళ్లో ఎన్నో కతలు. ఎన్నో అనుభవాల తలపోతలు.వాటిని రాసేవారు కొందరు రాశారు. ఇప్పుడు తీసేవారు తీస్తున్నారు. ‘కంబాలపల్లి కతలు’ పేరుతో ఓటిటి ప్లాట్‌ఫామ్ ఆహాలో మొదలైన వెబ్ సిరీస్‌లో మొదటిది ‘మెయిల్’. ఇది తెలంగాణ పల్లెలోని ఒక ఇన్నోసెంట్ కథ.మరో మాల్గుడి డేస్ లాంటి కత.
1990ల తర్వాత నాటి ఆంధ్రప్రదేశ్‌లో కంప్యూటర్ కోర్సులు మొదలయ్యాయి. కాలేజీల్లో రెండు మూడు కంప్యూటర్లు పెట్టి, అవి ఉన్న చోటుకు కంప్యూటర్ ల్యాబ్ అని పేరు పెట్టి, కంప్యూటర్ కోర్సులు నేర్పించేవారు. వాటికి ఖర్చు జాస్తి. డబ్బున్న పిల్లలు చదివేవారు. బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివినవారు ఆ కాలంలో సులువుగా ఎం.సి.ఏలు చేసి ఇవాళ అమెరికాలో సెటిల్ అయ్యారు. అయితే 1990ల ఈ కంప్యూటర్ చిన్న వూళ్లకు చేరడానికి ఇంకో పదేళ్లే పట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో చిన్న చిన్న ఊళ్లల్లో వీటి సెంటర్లు వచ్చి తెలిసీ తెలియని పని మొదలయ్యింది. కంప్యూటర్లు ఆపరేట్ చేసేవారు తెలివైనవారుగా గొప్పవారుగా పరిగణింపబడ్డారు. వాటితో కొత్తగా పరిచయం పెంచుకున్న గ్రామీణ యువకులు కొన్ని కొత్త జీవితానుభవాలను నేర్చుకున్నారు. ఆ వరుసలో 2000 కాలంలో తెలంగాణ పల్లెలో ఒక కంప్యూటర్ ఎంత సందడి చేసిందో చెప్పే సినిమా ‘మెయిల్’. ఇప్పటితరానికి చేతిలోని ఫోనే ఒక కంప్యూటర్. కాని ఆ కాలంలో కంప్యూటర్ కుయ్‌మన్నా బీప్‌మన్నా భయమే. వైరస్ అన్నా భయమే. మౌస్‌ను చూసినా భయమే.
మెయిల్ వచ్చింది
తెలంగాణలోని మెహబూబాబాద్‌కు పూర్వనామం మానుకోట. దీనికి దగ్గరగా ఉండే ఊరు కంబాలపల్లి. వ్యవసాయం, వృత్తి విద్యలు, సైకిళ్ల మీద కాలేజీలకు వెళ్లే పిల్లలు, నోటు రాయించుకుని అప్పులు ఇచ్చే వ్యక్తులు... వీరందరి మధ్య హైబత్ (ప్రియదర్శి) అనే కుర్రాడు కంప్యూటర్ సెంటర్ పెడతాడు. కంప్యూటర్ సెంటర్ అంటే ఒకే ఒక కంప్యూటర్ ఉన్న కొట్టు. పిల్లలకు గేమ్స్ ఆడించి గంటకు పదిరూపాయలు సంపాదించుకునే హైబత్ దగ్గర ఉన్న కంప్యూటర్‌ను చూసి దానిని నేర్చుకోవాలని అనుకుంటాడు రవి (హర్షిత్ రెడ్డి) అనే డిగ్రీ కుర్రాడు. హైబత్ అతనికి ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేస్తాడు. ఇక అతనికి మెయిల్స్ వస్తాయని చెబుతాడు. ఇతని మెయిల్ ఐడి ఎవరికి తెలుసని? ఇతని మెయిల్‌కు ఎవరు మెయిల్స్ పంపుతారని? ఆ సంగతి హైబత్‌కు తెలియదు, రవికి తెలియదు. రోజూ వచ్చి మెయిల్ బాక్స్ ఓపెన్ చేసుకుని చూసుకుంటూ ఉంటాడు. ఒక రోజు రానే వచ్చింది మెయిల్. అందులో ‘కంగ్రాట్యులేషన్స్... మీరు రెండు కోట్ల రూపాయలు లాటరీలో గెలుచుకున్నారు.’ అని. అది ఫేక్ మెయిల్. కాని దానిని రవి నిజమని నమ్ముతాడు. తన ఫ్రెండ్‌ను కూడా ఇందులో దింపుతాడు. ఆ తర్వాత ఏమయ్యిందనేది కథ.
అందమైన సంగతులు
కాని ఇందుకోసం ఈ సినిమా చూడరు ఎవరూ. తెలంగాణ భాష కోసం, మనుషుల కోసం, ఊళ్లో జరుగుతున్న కథలో భాగమైన భావన కోసం, ఆ క్షణకాలపు పెను సమస్యలతో పాత్రలు సతమతమవడాన్ని చూడటం కోసం ఈ సినిమా చూస్తారు. ఇది మొత్తంగా ఒక ఊరు ఉమ్మడి కథ. పాత్రలు కొంచెం ముందు నిలబడతాయి అంతే. డిగ్రీ కాలేజీలో చేరిన వెంటనే మొదలయ్యే ప్రేమలు, పాసనయ్యానని చెప్తే పెద్దగా వ్యక్తీకరణ లేకుండా ‘బట్టలు కొనుక్కుంటావా’ అని అడిగే తండ్రులు, చదువు అబ్బని కొడుకులను చూసి నాలుగు తగిలించే నాన్నలు, అర్ధ చటాక్ చింతపండును కొనడానికి వచ్చే ఆడపిల్లలు, చిన్న చిన్న అసూయలు, కొద్ది కొద్ది ఈర్ష్యలు... మనుషులందరూ ఒకటే అని చెప్పే ఈ భావోద్వేగాలను ఈ సినిమాలో చూస్తాము. కాళ్లకు చెప్పులు వేసుకుని వస్తే కంప్యూటర్‌కు వైరస్ వస్తుందని నమ్మిన ఆ కాలంలో ఆ మూఢ విశ్వాసం చుట్టూ మంచి హాస్యం అల్లుకున్నారు. కంప్యూటర్‌లో డ్రైవ్ నిండి ఎర్రగా కనిపించినా అది వైరస్సే అని భయపడతాడు హైబత్. దానిని రిపేరు చేయడానికి వచ్చినవాడిది ఇంకా పెద్ద మాయ.
దర్శకుడి స్వీయకథ
ఈ సిరీస్‌ను తీస్తున్నది దర్శకుడు ఉదయ్ గుర్రాల. ఇతనిది ఈ సినిమా కథ జరిగిన ప్రాంతమే. బహుశా ఇతని, ఇతని స్నేహితుల అనుభవాలే ఈ సినిమా. అందుకే కథలో ఒరిజినాలిటీ, ప్రవర్తనలు, పాత్రలు సహజంగా అమిరాయి. మేకింగ్‌లో హిందీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’ ప్రభావం ఉన్నట్టు అనిపించినా అది మంచికే. కథను ఇంకొంత వేగంగా చెప్పవచ్చు. ఇంత నిడివి అక్కర్లేదు అనిపిస్తుంది. తర్వాతి చాప్టర్‌లో ఈ జాగ్రత్త తీసుకుంటాడని ఆశిద్దాం. ఈ సిరీస్‌ను ఓకే చేసిన నిర్మాతలు స్వప్నా దత్, ప్రియా దత్, అశ్వినిదత్‌ను అభినందించాలి. మిస్ హైదరాబాద్ టైటిల్ గెలుచుకున్న గౌరిప్రియ ఎంత చక్కగా నటించిందో చెప్పలేము. ఆ కళ్లే అన్ని భావాలు పలుకుతున్నాయి. ఆ తెలంగాణ పలుకు బంగారం. కోస్తా ప్రాంతంలో కథలు బాగానే వచ్చాయి. కాని రాయలసీమ, తెలంగాణ ప్రాంతం నేపథ్యంలో ఇలాంటి ఎన్నో సిరీస్‌లు తీయవచ్చు. ఇది మొదలు. మంచి కథలు రానున్నాయన్న సందేశాన్ని మోసుకొచ్చింది ‘మెయిల్’.
అన్నట్టు గత ఇరవై ఏళ్లుగా ఫేక్ ఈమెయిల్స్ వచ్చి లక్షలు, కోట్లు కోల్పోయిన అమాయకులు ఉన్నారు. కాని ప్రభుత్వాలు ఈ మధ్య మాత్రమే ఆ ఫేక్ మెయిల్స్‌ను నమ్మొద్దంటూ ప్రచారం మొదలెట్టాయి. ఈలోపు జరిగిన వేలాది పెద్ద ప్రమాదాల్లో ఒక చిన్న ప్రమాదం మాత్రమే ‘మెయిల్’.
– సాక్షి ఫ్యామిలీ
చిన్న తెర మీద తెలంగాణ మాల్గుడి
Published Sun, Jan 24 2021 12:28 AM | Last Updated on Sun, Jan 24 2021 8:54 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment