fake palm
-
ఆగని ‘కల్తీ కల్లు’ మరణాలు
ఒక్కరోజే ఏడుగురు మృతి నిర్మల్‌లో అదుపులోకి రాని పరిస్థితి పాలమూరు జిల్లా జడ్చర్లలో మళ్లీ ‘మత్తు’ అమ్మకాలు! దీంతో జిల్లాలో తగ్గిన మృతుల సంఖ్య సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో కల్తీ కల్లు మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. కల్లు మత్తు మోతాదు తగ్గడంతో అనారోగ్యానికి గురైన బాధితుల్లో ఆదివారం ఏడుగురు మృతిచెందారు. అయితే, మహబూబ్‌నగర్‌లో మృతుల సంఖ్య కొద్దిగా తగ్గగా... ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో మాత్రం పరిస్థితి అదుపులోకి రావడం లేదు. వివరాలలోకి వెళితే... ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలోని గొల్లపేటకు చెందిన గ్రామ సహాయకుడు సంద లింగన్న(65) కల్లులో మత్తు మోతాదు తగ్గడంతో ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స అందించిన కుటుంబసభ్యులు కొద్దిగా కోలుకోవడంతో శుక్రవారం ఇంటికి తీసుకువచ్చారు. ఆదివారం పరిస్థితి మళ్లీ విషమించడంతో మృతిచెందాడు. గొల్లపేటకే చెందిన పశువుల కాపరి సిద్ధ లింగన్న(64) కొద్దిరోజులుగా కల్లు కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆదివారం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లగా మృతిచెందాడు. వెంకటాద్రిపేట్కు చెందిన నేల్ల చంద్రయ్య(48) మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తిస్తున్నాడు. శనివారం రాత్రి ఆరోగ్యం విషమించి ప్రాణాలొదిలాడు. మండలంలోని మంజులాపూర్‌కు చెందిన బెజ్జారం రాజన్న(50) గ్రామశివారులో ఆదివారం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం గోవిందుపల్లెకు చెందిన రావుల రాజవ్వ(50) కల్లులో మత్తు తగ్గిస్తుండడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆదివారం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మహబూబ్‌నగర్ కొందుర్గు గ్రామానికి చెందిన జాల చెన్నప్ప(68) వింతగా ప్రవర్తిస్తుండడంతో షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆదివారం ఆసుపత్రి నుంచి తిరిగి ఇంటికి వచ్చాక పరిస్థితి విషమించి మృతిచెందాడు. కల్వకుర్తి మండల పరిధిలోని రఘుపతిపేటకు చెందిన రంగయ్య (68) కల్లు కోసం పలు గ్రామాలలో తిరిగాడు. తాడూరు మండలం మేడిపూర్ గ్రామ సమీపంలో రోడ్డు పక్కన పడిపోగా, రెండు రోజులక్రితం కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఆదివారం మృతి చెందాడు. నెమ్మదించని నిర్మల్ ఆస్పత్రి... కాగా, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి మాత్రం కల్తీకల్లు బాధితుల తాకిడి తగ్గడం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు 108 సిబ్బంది ఈ బాధితులను ఆస్పత్రికి చేరవేస్తూనే ఉన్నారు. రోజూ వచ్చే రోగుల కంటే కల్లు బాధితులే ఎక్కువగా ఉంటున్నారు. ఆదివారం ఆస్పత్రిలో సుమారు 60 మంది చేరగా.. వీరిలో దాదాపు 40 మంది కల్లు బాధితులే ఉన్నారు. గదులు సరిపోకపోవడంతో వరండాల్లోనూ బెడ్లు వేసి చికిత్స అందిస్తున్నారు. బాదేపల్లి ఆస్పత్రి ఖాళీ... పదిరోజుల పాటు కల్తీకల్లు బాధితులతో కిటకిటలాడిన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బాదేపల్లి కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌కు ఆదివారం తాకిడి తగ్గింది. ఆదివారం కల్తీకల్లు బాధితుడు ఒక్కరు కూడా ఆస్పత్రిలో చేరలేదు. శనివారం రాత్రి వరకు బాధితులందరూ డిశ్చార్జి అయ్యారని డాక్టర్లు తెలియజేశారు. ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13 మంది మృతిచెందగా, దాదాపు వంద మందికి చికిత్స అందించారు. వింతచేష్టలు, మరణాలతో అట్టుడికిన ఆస్పత్రి ప్రాంగణం ఆదివారం ప్రశాంతంగా కన్పించడంతో డాక్టర్లు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలాఉండగా, మత్తు కలిపిన కల్లు మళ్లీ దొరుకుతుండడం వల్లనే బాధితులు తగ్గిపోయారని తెలుస్తోంది. -
‘మత్తు’ పంజా
* కల్తీ కల్లు లేక మరో 19 మంది మృతి * మహబూబ్‌నగర్ జిల్లాలోనే 9 మంది * ఒంటికి నిప్పంటించుకొని ముగ్గురి ఆత్మహత్య * రిహాబిలిటేషన్ సెంటర్లు లేకపోవడంతో పరిస్థితి తీవ్రం సాక్షి నెట్వర్క్: తెలంగాణ పల్లెలపై ‘మత్తు’ మృత్యుపంజా విసురుతోంది! ఇన్నాళ్లూ కల్తీ కల్లుకు బానిసలైనవారంతా మత్తుకు దూరమై చావుకు చేరువవుతున్నారు. కొందరు పిచ్చెక్కి ప్రాణాలు తీసుకుంటే.. మరికొందరు ఆసుపత్రుల్లో కన్నుమూస్తున్నారు. బుధవారం ఇలా 19 మంది మృత్యువాత పడ్డారు. మహ బూబ్‌నగర్ జిల్లాలో తొమ్మిది మంది, నిజామాబాద్‌లో నలుగురు, ఆదిలాబాద్‌లో ముగ్గురు, మెదక్‌లో ఇద్దరు, కరీంనగర్ లో ఒక్కరు చనిపోయారు. వీరిలో మతిస్థిమితం కోల్పోయి ముగ్గురు ఒంటిపై కిరోసిన్ పోసుకొని మంటలకు ఆహుతయ్యారు. పలు జిల్లాల్లో ఆసుపత్రులు కల్లు బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రభుత్వపరంగా ఇప్పటికే రీహాబిలిటేషన్ కేంద్రాలను ప్రారంభించి ఉంటే పరిస్థితి ఇంతలా విషమించేది కాదు. బాధితులను వాటిలో చేర్చి, సకాలంలో చికిత్స అందించి ఉంటే వృతుల సంఖ్య తగ్గేది. కానీ ప్రభుత్వం ఆ దిశగా చురుగ్గా కదలడం లేదు. జిల్లాల్లో ఇదీ పరిస్థితి.. మహబూబ్‌నగర్ జిల్లాలో కల్లులో మత్తు మోతాదు తగ్గడంతో పలువురు మతిస్థిమితం కోల్పోతున్నారు. ఆత్మకూర్ మండలం కొంకనివానిపల్లికి చెందిన బోయ బుచ్చమ్మ (45) వారం రోజులుగా కల్లు దొరకకపోవడంతో వింతగా ప్రవర్తిస్తోంది. బుధవారం కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇదే గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డి(40) తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. కల్లు లభించకపోవడంతో మానసిక రోగిగా ప్రవర్తిస్తున్నాడు. భార్య కూలీ పనులకు వెళ్లిన తర్వాత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయాడు. కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామానికి చెందిన చంద్రయ్య (65) వింత ప్రవర్తనతో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మకూర్‌లోని స్థానిక భరత్‌నగర్‌కు చెందిన గోవిందమ్మ(45), జడ్చర్ల మండలం బాదేపల్లి పట్టణానికి చెందిన వి.చెన్నయ్య(60), మైనోద్దిన్(60) మందు కల్లు తాగి చనిపోయారు. కల్లు లేక నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామానికి చెందిన దేవమ్మ(45) అస్వస్థతకు గురై చనిపోయింది. నవాబుపేట మండలం కారుకొండకు చెందిన భాగమ్మ (60) కల్తీ కల్లు లేక మతిస్థిమితం కోల్పోయింది. చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించగా చనిపోయింది. దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన కుమ్మరి బాలమ్మ(60) కల్లు లేక అస్వస్థతకు గురై చనిపోయింది. వనపర్తి మండలం శ్రీనివాసపురానికి చెందిన కృష్ణయ్యను ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. బుధవారం ఉదయం ఆస్పత్రిలోని మొదటి అంతస్తు నుంచి కిందకు దూకాడు. దీంతో అతడి కాలు విరిగింది. ఆదిలాబాద్ జిల్లా బాసరకు చెందిన ముల్కి పోతన్న (57), దూజ్‌గాం పోశెట్టి (63)లు కల్లు లేక ఫిట్స్‌తో ఇంట్లో పడిపోయాడు. వారిని ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయారు. నిర్మల్ పట్టణంలోని ఈద్గాంకు చెందిన మహమూద్ (45) మంగళవారం కల్లు తాగాడు. మత్తు మోతాదు తగ్గడంతో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. మైలాపూర్‌కు చెందిన కొందపురం పోశెట్టి (63) వింతగా ప్రవర్తిస్తూ బావిలో దూకాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిజామాబాద్‌లో నలుగురు నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణికి చెందిన బండారి పర్వయ్య(38) కల్తీ కల్లు మృత్యువాత పడ్డాడు. ఆర్మూర్ పట్టణంలోని రంగాచారీ కాలనీలో నివసించే గాదె బాల్‌రెడ్డి(46) కొంతకాలంగా కల్తీకల్లు తాగుతున్నాడు. కొద్ది రోజులుగా దొరక్కపోవడంతో మతిస్థిమితం కోల్పోరుు ఇంట్లో నుంచి వెళ్లిపోయూడు. బుధవారం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో శవమై కనిపించాడు. కామారెడ్డిలో ముదాంగల్లీకి చెందిన అంజయ్య(42) కల్లు లేక అనారోగ్యం బారిన పడి బుధవారం మృతిచెందాడు. సదాశివ్‌నగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డిలో పందిరి శ్రీనివాస్(35) వారం రోజులుగా కల్లు దొరక్క మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం తిమ్మాపూర్‌కు చెందిన బాస జలపతి 15 రోజులుగా కల్లులో మత్తు తగ్గడంతో వికృత చేష్టలకు దిగుతున్నాడు. బుధవారం భార్యను తల పట్టుకొని గోడకు కొట్టడంతో ఆమె కోమాలోకి వెళ్లింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సిరిసిల్లకు చెందిన శ్రీరాముల రాజయ్య(55) వింతగా ప్రవర్తించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. 21న ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. బుధవారం పట్టణ శివారులోని చెరువు సమీపంలో శవమై కనిపించాడు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లికి చెందిన నీరుడి నర్సింలు (45) కల్లు లేక మంగళవారం రాత్రి కన్నుమూశాడు. ఇదే జిల్లా సుల్తాన్‌పూర్‌కు చెందిన యాదమ్మ (70) కల్తీ కల్లు లేక మతిస్థిమితం కోల్పోయింది. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ మంగళవారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎర్రగడ్డకు 2 రోజుల్లో 130 మంది ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయం అవుట్ పేషంట్ విభాగానికి కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 130 మంది బాధితులు వచ్చారు. వీరిలో 25 మంది ఇన్పేషెంట్లుగా చేరారు. గత వారం రోజుల నుంచి ఆస్పత్రి ఓపీకి వస్తున్న బాధితుల్లో 80-90 శాతం మంది కల్తీ కల్లు బాధితులేనని ఆస్పత్రి వ ర్గాలు తెలిపాయి. గతం మరచి.. హుస్సేన్‌సాగర్‌లో దూకి కల్తీ కల్లుకు దూరమై హైదరాబాద్‌లోని తిరుమలగిరికి చెందిన జక్కం సురేశ్(30) బుధవారం హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. సమయానికి పోలీసులు వచ్చి కాపాడారు. రోజు కల్లు తాగి వస్తుండటంతో భార్య రజిత జనవరిలో ఆయనకు విడాకులిచ్చింది. మంచిగా మారాలని కల్లు మానేశాడు. అయితే మానసిక స్థితి కోల్పోయి గతాన్ని కూడా మరచిపోతున్నట్టు పోలీసులు తెలిపారు. మందులు ఉన్నాయి కల్తీ కల్లుకు విరుగుడుగా మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని అందుబాటులో ఉంచకుండా కల్లుపై నిషేధం విధించడం సరికాదు. మానేయాలని భావించే వారికి ఈ విషయంపై దృఢమైన సంకల్పం ఉండాలి. ఇందుకోసం బాధితులు ముందు వైద్యులను సంప్రదించి వారు ఇచ్చే సూచనలు, సలహాలు పాటించాలి. వీటి సాయంతో బాధితుని శరీరంలో పేరుక పోయిన విష పదార్థాలను బయటికి పంపి మామూలు మనిషిని చేయవచ్చు. - డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ న్యూరో ఫిజిషియన్, సిటీన్యూరో సెంటర్ -
కల్తీ ‘కల్లో’లం
* వింత ప్రవర్తనతో ఆసుపత్రుల పాలవుతున్న బాధితులు * నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న రోగులు * రెండ్రోజుల్లోనే ఆసుపత్రికి 96 మంది.. వివిధ చోట్ల మరో 200 మంది * ఆసుపత్రుల్లో పిచ్చి ప్రవర్తన.. మంచాలకు కట్టేసి చికిత్స * కల్లులో మత్తు మోతాదు తగ్గడమే కారణం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కొందరు ఉన్నట్టుండి కింద పడిపోతున్నారు.. ఇంకొందరు అకస్మాత్తుగా పిచ్చిపట్టినట్టుగా మారిపోతున్నారు.. మరికొందరు దొరికిన వారిని దొరికినట్టు కొరుకుతున్నారు! నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో ఈ దృశ్యాలు ఇప్పుడు సర్వసాధారణమయ్యాయి!! ఇన్నాళ్లూ కల్తీ కల్లుకు బానిసలైన వారంతా... ఒక్కసారిగా అది దొరక్కపోవడంతో ఇలా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. వింత ప్రవర్తన, అనారోగ్యంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. రెండ్రోజుల్లోనే నిజామాబాద్ పట్టణంలో బాధితుల సంఖ్య 96కు చేరింది. వీరంతా ప్రభుత్వాసుపత్రిలో చేరగా.. వైద్యులు తాళ్లతో మంచాలకు కట్టేసి వారికి చికిత్సలు చేస్తున్నారు. కల్తీకల్లులో మత్తు పదార్థమైన క్లోరల్ హైడ్రేట్, డైజోఫాంకు ఒక్కసారిగా దూరమవడంతో బాధితులు ఇలా ప్రవర్తిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. మొదట ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, భైంసా, బాసర, ఆదిలాబాద్‌లో బాధితులు వింతవింతగా ప్రవర్తించారు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా బాన్సువాడ, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు, నిజామాబాద్‌లో ఇలాంటి వారు రోజురోజుకూ ఎక్కువైపోతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. నిజామాబాద్ జిల్లాలో కొన్నేళ్లుగా పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు కల్తీ కల్లు దందా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల గుడుంబా, నాటుసారా, కల్తీకల్లుపై ఉక్కుపాదం మోపింది. ఈ నేపథ్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్‌ను ఇన్చార్జిగా నియమించింది. ఆయన ఆదేశాల మేరకు గత ఐదారు రోజులుగా కల్తీకల్లు నిరోధానికి ఎక్సైజ్ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నారు. ఫలితంగా కల్లులో క్లోరల్ హైడ్రేట్, డైజోఫాంను కల్లు తయారీదారులు వినియోగించడం లేదు. దీంతో అవి ఉన్న కల్లుకు అలవాటుపడిన వారికి మత్తు ఒక్కసారిగా తగ్గడంతో వింతగా ప్రవర్తిస్తున్నారు. మాక్లూర్ మండలం కల్లెడికి చెందిన ఓ వ్యక్తి పిచ్చి ప్రవర్తనతో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. నిజామాబాద్ మండలంలోని కులాస్పూర్, కులాస్పూర్తాండలో 8 మంది విచిత్ర చేష్టలు చేస్తున్నారు. బోధన్ మండలం ఎడపల్లితోపాటు బాన్సువాడ, ఆర్మూర్, మాక్లూర్, నిజామాబాద్ మండలంలోని కొన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలోని దుబ్బ, ఆదర్శనగర్, కోటగల్లి, గౌతంనగర్ ప్రాంతాల్లో సుమారు 30 మందికిపైగా ఆసుపత్రిపాలయ్యారు. మొత్తమ్మీద ప్రభుత్వాసుపత్రిలో 96 మంది బాధితులు చేరగా.. జిల్లావ్యాప్తంగా మరో 200 మంది వివిధ ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో 22 మంది మహిళలు కూడా ఉన్నారు. బాధితులు మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఇన్నేళ్లుగా మౌనం ఇన్నాళ్లూ ఎక్సైజ్ అధికారుల అండతో కల్లీ కల్లు వ్యాపారం యథేచ్ఛగా సాగింది. కల్తీ కల్లు తాగి మరణించినా, అస్వస్థతకు గురైనా నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపి చేతులు దులుపుకునేవారు. నిజామాబాద్ ఎక్సైజ్ యూని ట్ పరిధిలో 19 మండలాలు, 166 కల్లు గీత సహకార సంఘాలు, 306 కల్లు గీత కార్మికులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కామారెడ్డి పరిధిలో 117 గీత సహకార సంఘాలు, 296 టీఎఫ్టీలు ఉన్నాయి. జిల్లాలో ఎక్కడ చూసినా గీత వృత్తితో సంబంధం లేని వ్యక్తులే ‘కల్లు మాఫియా’గా అవతారమెత్తారు. ఆబ్కారీ శాఖ పట్టించుకోక పోవడంతో డైజోఫాం, క్లోరల్ హైడ్రేడ్, క్లోరోఫాం (మత్తుకోసం), శక్రీన్ (రుచి కోసం), తెల్లపౌడర్, కుంకుడు రసంతో తయారు చేసిన కల్లు విక్రయాలు జోరుగా సాగాయి. మత్తు లేక పిచ్చి ప్రవర్తన నిజామాబాద్‌లోని గౌతంనగర్‌కు చెందిన ఈ మేస్త్రీ పేరు మదన్. రోజూ ఉదయం, సాయంత్రం కల్లు తాగే అలవాటుంది. నాలుగు రోజులుగా కల్లులో మత్తు పదార్థాలు లేకపోవడంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పిస్తే అక్కడా నిలకడగా ఉండడం లేదు. అరవడం, కాళ్లు, చేతులు వంకర పోవడం, బయటకు పరుగెత్తడం వంటి చేష్టలు చేస్తున్నాడు. దీంతో వైద్యులు మంచానికి కట్టేసి చికిత్స చేస్తున్నారు. మత్తు తగ్గడం వల్లే కల్లుకు బానిస అయిన వారు అందులో మత్తు పదార్థాల మోతాదు తగ్గడంతో ఇలా ప్రవర్తిస్తుంటారు. ఉన్నట్టుండి కల్లు అందుబాటులో లేకపోవడంతో కూడా ఇలా మారుతుంటారు. కల్తీ కల్లు తాగడంతో నరాలు బలహీనపడడం, మెదడు మొద్దుబారడం, ఫిట్స్ రావడం వంటివి జరుగుతాయి. - డాక్టర్ విశాల్, మానసిక వైద్య నిపుణులు