ఆగని ‘కల్తీ కల్లు’ మరణాలు
ఒక్కరోజే ఏడుగురు మృతి
నిర్మల్‌లో అదుపులోకి రాని పరిస్థితి
పాలమూరు జిల్లా జడ్చర్లలో మళ్లీ ‘మత్తు’ అమ్మకాలు!
దీంతో జిల్లాలో తగ్గిన మృతుల సంఖ్య
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో కల్తీ కల్లు మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. కల్లు మత్తు మోతాదు తగ్గడంతో అనారోగ్యానికి గురైన బాధితుల్లో ఆదివారం ఏడుగురు మృతిచెందారు. అయితే, మహబూబ్‌నగర్‌లో మృతుల సంఖ్య కొద్దిగా తగ్గగా... ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో మాత్రం పరిస్థితి అదుపులోకి రావడం లేదు. వివరాలలోకి వెళితే... ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలోని గొల్లపేటకు చెందిన గ్రామ సహాయకుడు సంద లింగన్న(65) కల్లులో మత్తు మోతాదు తగ్గడంతో ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు.
ఆస్పత్రిలో చికిత్స అందించిన కుటుంబసభ్యులు కొద్దిగా కోలుకోవడంతో శుక్రవారం ఇంటికి తీసుకువచ్చారు. ఆదివారం పరిస్థితి మళ్లీ విషమించడంతో మృతిచెందాడు. గొల్లపేటకే చెందిన పశువుల కాపరి సిద్ధ లింగన్న(64) కొద్దిరోజులుగా కల్లు కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆదివారం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లగా మృతిచెందాడు. వెంకటాద్రిపేట్‌కు చెందిన నేల్ల చంద్రయ్య(48) మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తిస్తున్నాడు.
శనివారం రాత్రి ఆరోగ్యం విషమించి ప్రాణాలొదిలాడు. మండలంలోని మంజులాపూర్‌కు చెందిన బెజ్జారం రాజన్న(50) గ్రామశివారులో ఆదివారం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం గోవిందుపల్లెకు చెందిన రావుల రాజవ్వ(50) కల్లులో మత్తు తగ్గిస్తుండడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆదివారం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మహబూబ్‌నగర్ కొందుర్గు గ్రామానికి చెందిన జాల చెన్నప్ప(68) వింతగా ప్రవర్తిస్తుండడంతో షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆదివారం ఆసుపత్రి నుంచి తిరిగి ఇంటికి వచ్చాక పరిస్థితి విషమించి మృతిచెందాడు. కల్వకుర్తి మండల పరిధిలోని రఘుపతిపేటకు చెందిన రంగయ్య (68) కల్లు కోసం పలు గ్రామాలలో తిరిగాడు. తాడూరు మండలం మేడిపూర్ గ్రామ సమీపంలో రోడ్డు పక్కన పడిపోగా, రెండు రోజులక్రితం కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఆదివారం మృతి చెందాడు.
నెమ్మదించని నిర్మల్ ఆస్పత్రి...
కాగా, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి మాత్రం కల్తీకల్లు బాధితుల తాకిడి తగ్గడం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు 108 సిబ్బంది ఈ బాధితులను ఆస్పత్రికి చేరవేస్తూనే ఉన్నారు. రోజూ వచ్చే రోగుల కంటే కల్లు బాధితులే ఎక్కువగా ఉంటున్నారు. ఆదివారం ఆస్పత్రిలో సుమారు 60 మంది చేరగా.. వీరిలో దాదాపు 40 మంది కల్లు బాధితులే ఉన్నారు. గదులు సరిపోకపోవడంతో వరండాల్లోనూ బెడ్‌లు వేసి చికిత్స అందిస్తున్నారు.
బాదేపల్లి ఆస్పత్రి ఖాళీ...
పదిరోజుల పాటు కల్తీకల్లు బాధితులతో కిటకిటలాడిన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బాదేపల్లి కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌కు ఆదివారం తాకిడి తగ్గింది. ఆదివారం కల్తీకల్లు బాధితుడు ఒక్కరు కూడా ఆస్పత్రిలో చేరలేదు. శనివారం రాత్రి వరకు బాధితులందరూ డిశ్చార్జి అయ్యారని డాక్టర్లు తెలియజేశారు. ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13 మంది మృతిచెందగా, దాదాపు వంద మందికి చికిత్స అందించారు. వింతచేష్టలు, మరణాలతో అట్టుడికిన ఆస్పత్రి ప్రాంగణం ఆదివారం ప్రశాంతంగా కన్పించడంతో డాక్టర్లు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలాఉండగా, మత్తు కలిపిన కల్లు మళ్లీ దొరుకుతుండడం వల్లనే బాధితులు తగ్గిపోయారని తెలుస్తోంది.