‘ఉపాధి’కీ ఆధార్ | aadhar card link with employment guarantee scheme | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’కీ ఆధార్

Published Mon, Sep 15 2014 2:45 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

aadhar card link with employment guarantee scheme

 ఒంగోలు సెంట్రల్: ఉపాధి హామీ పథకంలో అవినీతికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కూలీల ఆధార్ నంబరును వారి జాబ్‌కార్డులకు అనుసంధానం చేయడం ద్వారా వచ్చే నెల నుంచి చెల్లింపులు చేపట్టనున్నారు. వారం వారం కూలీలు వేతనాలు తీసుకునే సమయంలో బయోమెట్రిక్ యంత్రంలో తమ వేలిముద్రలు వేస్తేనే కూలిడబ్బులు ఇస్తారు. తద్వారా దొంగ మస్టర్లు, పనులకు రాకపోయినా నగదు చెల్లింపులు వంటి అక్రమాలకు ఇక తావుండదు.

 జిల్లాలోని 56 మండలాల్లో 38 వేల శ్రమశక్తి సంఘాలున్నాయి. వీటిలో 7.60 లక్షల మంది కూలీలు సభ్యులుగా ఉన్నారు. వీరిలో 5.75 లక్షల మంది కూలీలకు ఆధార్ కార్డులుండగా..ఇప్పటి వరకు 5.55 లక్షల మంది తమ ఆధార్ నంబరును జాబ్‌కార్డులకు అనుసంధానించుకున్నారు. 1.85 లక్షల మంది కూలీలకు ఆధార్ కార్డు
 ల్లేవు. మరో 2ఏ వేల మంది కూలీలు తమ ఆధార్ నంబరు అనుసంధానించుకోవాల్సి ఉంది.

ఆధార్‌కార్డు కలిగిన వేతనదారుల నుంచి యూఐడీ, ఈఐడీ నంబర్లు తీసుకుని ఏరోజుకారోజు వివరాలను సంబంధిత మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయానికి క్షేత్ర సహాయకులు, మేట్లు అందజేస్తున్నారు. ఇలా వచ్చిన వారి వివరాలను ఉపాధి సిబ్బంది కంప్యూటర్‌లో నమోదు చేస్తున్నారు. ఆధార్ కార్డులున్న కూలీలకే వేతనాలు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు.  

 మళ్లీ ఎంపీడీవోల పర్యవేక్షణ: ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు అరికట్టేందుకు పనుల పర్యవేక్షణను తిరిగి ఎంపీడీవోలకు అప్పగించనున్నారు. రాష్ట్రంలో పథకాన్ని పటిష్టంగా అమలు చేసే క్రమంలో పనుల పర్యవేక్షణ  బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా ఎంపీడీవోల పరిధిలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
 వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయడంతో పాటూ, నీరు- చెట్లు కార్యక్రమాన్ని ఈ పథకంలోకి తీసుకురావడం కీలకమైంది. ప్రస్తుత ఓట్ సోర్సింగ్ విధానం కారణంగా పథకంపై ప్రభుత్వానికి అజమాయిషీ కొరవడిందన్న విషయాన్ని గ్రహించి, ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement