అవినీతికి అధికారం అండ | Corruption is the power | Sakshi
Sakshi News home page

అవినీతికి అధికారం అండ

Published Mon, Aug 21 2017 1:50 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

అవినీతికి అధికారం అండ - Sakshi

అవినీతికి అధికారం అండ

►  ‘ఉపాధి’లో అంతులేని అక్రమాలు
►  సిబ్బందికి అండగా విచారణాధికారి


అనుకున్నదే జరిగింది. ముందుస్తు ప్రణాళిక ప్రకారం ప్రొసీడింగ్‌ అధికారి, విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు అవినీతిపరులకు అండగా నిలిచారు. రూ.కోట్ల ప్రజా ధనాన్ని బొక్కేసిన అధికారపార్టీ నాయకులకు, ఉపాధి సిబ్బందికి హాని జరగకుండా కంటికి రెప్పులా కాపాడారు.

సామాజిక తనిఖీ బృందం ఉపాధి పనుల్లో భారీగా జరిగిన అవినీతికి ఆధారాలు చూపిస్తున్నా బహిరంగ చర్చా వేదిక మీద న్యాయ నిర్ణేతలు పట్టించుకోలేదు. తమ గ్రామాల్లో ఉపాధిలో జరిగిన అవినీతి గురించి చెప్పేందుకు వచ్చిన వారు ప్రొసీడింగ్‌ అధికారి తీరు చూసి న్యాయం జరగదని వెనుదిరిగారు. ఇదంతా సీతారామపురం మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటల నుంచి ఆదివారం ఉదయం 7 గంటల వరకు నిర్వహించిన ఉపాధి హామీ పథకం బహిరంగ చర్చావేదిక వద్ద జరిగింది.


ఉదయగిరి/సీతారామపురం: సీతారామపురం మండలంలో 2016 మార్చి నుంచి 2017 జూన్‌ వరకు జరిగిన  రూ.16.77కోట్ల ఉపాధి పనులకు సంబంధించి జూలై 28 నుంచి ఆగస్టు 18 వరకు సోషల్‌ ఆడిట్‌ బృందం క్షేత్రస్థాయిలో పనులు తనిఖీ చేసి అందులో లోపాలు, అవినీతిని  గుర్తించి  చర్చావేదక వద్ద తమ నివేదికలు చదివి వినిపించారు. వీరు తమ క్షేత్ర పరిశీలనలో రూ.9.84కోట్లు అవినీతి జరిగినట్లు గుర్తించారు. ఇందులో యంత్రాలతో పనులు చేసి బినామీ మస్టర్లు వేసి నేతలు, సిబ్బంది రూ.కోట్లు దిగమింగారు.

పనులు చేయకుండానే పెద్ద మొత్తంలో దోచేసిన వైనం గురించి వేదిక ముందుంచారు. నాయకులు, ఉపాధి సిబ్బంది, సామగ్రి సప్లయర్లు ఏ విధంగా ఉపాధి నిధులు కాజేశారో సవివరంగా తెలియజేశారు. అయినా దీంతో మాకు పని ఏముంది, న్యాయ నిర్ణేతను తాను అయినందున తాను చెప్పింది వేదం అన్నట్లుగా ప్రొసీడింగ్‌ అధికారి నాసర్‌రెడ్డి వ్యవహరించారు. రూ.కోట్లలో జరిగిన  అవినీతిని భారీగా తగ్గించి రూ.87 లక్షలకు కుదించారు. ఉపాధి సిబ్బందికి, నాయకులతో కుదిరిన ఒప్పుందం మేరకు, బహిరంగ వేదిక వద్ద ముందే చెప్పిన విధంగా జరిగిన అవినీతితో నిమిత్తం లేకుండా పది శాతం మాత్రమే రికవరీకి ఆదేశాలిచ్చారు.

ఊపిరి పీల్చుకున్న తెలుగు తమ్ముళ్లు, సిబ్బంది
మండలంలో భారీగా జరిగిన అవినీతి ఎక్కడ బయటపడి పరువు పోతుందో అనే ఆందోళనతో ఉన్న తెలుగు తమ్ముళ్లు ప్రొసీడింగ్‌ అధికారి సహకారంతో ఊపిరి పీల్చుకున్నారు. సస్పెన్షన్లు తప్పవని కంగారుగా ఉన్న ఉపాధి సిబ్బందిపై కూడా సదరు అధికారి ప్రేమ చూపడంతో చిన్న చర్యలు కూడా లేకపోవడంతో ఎగిరి గంతులు వేస్తున్నారు. నియోజవర్గంలో ఇప్పటికే అధికారి పార్టీ ముఖ్య నేతలు పసుపు కుంభకోణంలో చిక్కి క్రిమినల్‌ కేసులు నమోదు కావడంతో పార్టీ ప్రతిష్ట, ఎమ్మెల్యే పరువు పోయింది. ఇదే తరుణంలో ఉపాధి అవినీతి బయటపడితే  ప్రజల వద్ద మరింత పలచనవుతామని కంగారుపడ్డారు. దీంతో సదరు నాయకులు  చర్చావేదికకు వచ్చిన అధికారులను లోబరుచుకున్నట్లు తెలుస్తోంది. అధికారులు చేసిన మేలుకు ప్రతిఫలంగా రూ.లక్షల్లో ముడుపులు ముట్టాయనే ప్రచారం సాగుతోంది.

అధికారుల తీరుపై విస్మయం
అవినీతికి పాల్పడిన అధికారులు, సిబ్బంది అంతు తేల్చే కలెక్టర్‌ ఉన్నప్పుటికీ పక్కాగా జరిగిన అవినీతిని కప్పిపుచ్చిన అధికారుల తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని నిజాయితీ అధికారులతో విచారణ చేయిస్తే అవినీతిపరుల భరతం పట్టే అవకాశం ఉంది.

ఇదేమీ తీరు
మండలంలో 15 నెలలకు సంబంధించి రూ. 16.77 కోట్ల ఉపాధి పనులు నిర్వహించారు. వాటిలో మెటీరియల్‌ పనులు రూ.7 కోట్లు, కూలీల పనులు రూ.9.75 కోట్లు జరిగాయి. జిల్లాలోనే ఎక్కువ పనులు, అవినీతి జరిగే మండలం సీతారామపురం అనే విషయం జిల్లా అధికారులకు బాగా తెలుసు. అయితే ఈ మండలంలో జరుగుతున్న అవినీతిపై మీడియా, పత్రికలు పెద్దగా ఫోకస్‌ చేయకపోవడంతో వాస్తవాలు వెలుగులోకి రావడం లేదు. దీంతో జిల్లా అధికారులు కూడా పెద్దగా దృష్టి సారించడం లేదు. ఇదే ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు, ఉపాధి సిబ్బందికి, రాజకీయ నాయకులకు  వరంగా మారింది.

దీంతో ఇష్టారాజ్యంగా ప్రజా ధనాన్ని మింగేస్తున్నారు. ఈ పరిణామం భవిష్యత్తులో అక్రమార్కులు మరింత అవినీతికి పాల్పడేందుకు ఆస్కారం కల్పిస్తోంది. చర్చా వేదికలో ప్రొసీడింగ్‌ అధికారి రికవరీకి ఆదేశించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉపాధి సిబ్బంది నుంచి రూ.45.10 లక్షలు, కూలీల నుంచి రూ.4.80 లక్షలు, లబ్ధిదారుల నుంచి రూ.2.92 లక్షలు, సప్లయిదారు నుంచి రూ.9 లక్షలు, ఫారెస్ట్‌ అధికారులు నుంచి రూ.14.76 లక్షలు, ఇరిగేషన్‌ శాఖ నుంచి రూ.2.84 లక్షలు రికవరీకి ఆదేశించారు. అదేవిధంగా వివిధ పంచాయతీల్లో 42 పనులను క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు, రెండు పనులు ఏపీడీకి పరిశీలనకు ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement