జీర్ణం.. జీర్ణం.. ‘ఉపాధి’ జీర్ణం | Corruption in the Employment Guarantee Scheme funds | Sakshi
Sakshi News home page

జీర్ణం.. జీర్ణం.. ‘ఉపాధి’ జీర్ణం

Published Mon, Apr 10 2017 2:28 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

జీర్ణం.. జీర్ణం.. ‘ఉపాధి’ జీర్ణం - Sakshi

జీర్ణం.. జీర్ణం.. ‘ఉపాధి’ జీర్ణం

ఉపాధి హామీ పథకం నిధులు కైంకర్యం
- ఫామ్‌ పాండ్స్‌ తవ్వకం పేరిట రాష్ట్రంలో భారీగా అవినీతి
- వాటాలు పంచుకున్న ప్రభుత్వ పెద్దలు, టీడీపీ అగ్రనేతలు
- ఒక్క ఏడాదిలోనే దాదాపు రూ.1,000 కోట్లు స్వాహా
- తవ్వేది ఒక కుంట.. రికార్డుల్లో 10 కుంటలుగా నమోదు
- యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన... టీడీపీ నేతలే కాంట్రాక్టర్లు
ప్రకాశం జిల్లా కంభాలపాడులో ‘సాక్షి’ పరిశీలనలో అక్రమాలు బహిర్గతం 


సాక్షి, అమరావతి: గ్రామాల్లో పేద కూలీలకు పనులు కల్పించాలనే సదాశయంతో కేంద్రం ఇస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ అగ్రనేతలు ఆరగిస్తున్నారు. ఫామ్‌ పాండ్స్‌(పంట కుంటలు) తవ్వకం పేరిట కేవలం ఒక్క ఏడాదిలోనే దాదాపు రూ.వెయ్యి కోట్లు మింగేశారు. ఈ పనులను గ్రామస్థాయిలో టీడీపీ నాయకులకు కట్టబెట్టి, మీకింత మాకింత అంటూ వాటాలు పంచేసుకున్నారు. ఫామ్‌ పాండ్స్‌ తవ్వకం ముసుగులో భారీ ఎత్తున సాగుతున్న ఈ అవినీతి బాగోతం ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో బట్టబయలైంది.

పేద కుటుంబాలకు వారి సొంత గ్రామాల్లో పనులు కల్పించడానికి ఉపాధి హామీ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఫామ్‌ పాండ్స్‌ నిర్మాణానికి నిధులిస్తోంది. 2016 ఏప్రిల్‌ నుంచి 2017 మార్చి మధ్య కాలంలో కేంద్రం ఇచ్చిన ఉపాధి హామీ పథకం నిధులతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 5,45,625 పంట కుంటలు తవ్వగా, ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 3,11,161 కుంటలు తవ్వినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. ఇందుకోసం రూ.965.64 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపుతోంది. రాష్ట్రంలో మరో 1,04,000 పంట కుంటలు నిర్మాణంలో ఉన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఫామ్‌పాండ్స్‌ తవ్వకాల్లో లెక్కలేనన్ని అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ పెద్దల సహకారంతో ఈ పనులను దక్కించుకున్న అధికార పార్టీ నాయకులు నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కారు. ఒక కుంట తవ్వి, పదికుంటలు తవ్వినట్లు రికార్డుల్లో రాసేశారు. ఈ మేరకు బిల్లులు సమర్పించి, ప్రభుత్వం నుంచి డబ్బులు నొక్కేశారు. పెద్దలకు వాటాలు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. మచ్చుకు ఒక గ్రామాన్ని ‘సాక్షి’ పరిశీలించింది. అధికార పార్టీ నాయకుల అవినీతి, అక్రమాలు బహిర్గతమయ్యాయి.

ఒక్క ఏడాదే రూ.1.51 కోట్ల చెల్లింపులు
ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంభాలపాడులో పంట కుంటల తవ్వకం పనులను ‘సాక్షి’ పరిశీలించింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ప్రకాశం జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఫామ్‌పాండ్స్‌ తవ్విన మొదటి ఐదు గ్రామ పంచాయతీల్లో కంభాలపాడు ఒకటి. అందుకే ఈ గ్రామాన్ని ‘సాక్షి’ పరిశీలనకు ఎంచుకుంది. ఉపాధి హామీ పథకం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు 11 ఏళ్లలో ఈ గ్రామంలో ఈ పథకం కింద కూలీలకు రూ.3.79 కోట్లు చెల్లించగా, అందులో రూ.1.51 కోట్లు ఈ ఒక్క ఏడాదే పంటల కుంటల కోసం చెల్లించారు.

రికార్డులు తప్పుల తడకలు
కంభాలపాడులో మొత్తం 322 పంట కుంటల పనులు చేపట్టారు. ఒక్క ఏడాదిలోనే 278 కుంటల తవ్వకం పూర్తి చేసినట్టు రికార్డులో పేర్కొన్నారు. గ్రామంలో పంటకుంటలు ఎక్కడ తవ్వాలనే వివరాలు కూడా నమోదు చేసుకోకుండా పనులు మంజూరు చేశారు. వాటిని పూర్తి చేశారు, బిల్లులు కూడా చెల్లించారు. కానీ క్షేత్రస్థాయిలో ఈ మేరకు పంట కుంటలు కనిపించడం లేదు. నిబంధనల ప్రకారం ఒక కుంట తవ్వకానికి అనుమతి ఇచ్చేటప్పుడు దాన్ని ఏ రైతు పొలంలో తవ్వుతారన్న వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. సంబంధిత రైతు ఉపాధి హామీ పథకంలో కూలీగా నమోదు చేసుకుని ఉండాలి. రైతు పొలం సర్వేనంబరు, కూలీ కార్డుసంఖ్య తెలపాలి.

పొలాల్లో కాకుండా బహిరంగ ప్రదేశాల్లో పనులకు అనుమతిచ్చినా, సంబంధిత ప్రాంతం గురించి స్పష్టమైన వివరాలతోపాటు సర్వే నంబరును నమోదు చేయాలి. కంభాలపాడులో 240 పంట కుంటలను ఏయే రైతుల పొలాల్లో తవ్వారన్న వివరాలను ప్రభుత్వ రికార్డుల్లో పొందుపరచలేదు. రికార్డుల్లో 83 మంది రైతుల పేర్లను నమోదు చేసినప్పటికీ, వారి ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డు సంఖ్య స్థానంలో దొంగ నంబర్లు నమోదు చేశారు. 147 పంట కుంటలను ఏ సర్వే నంబరులో తవ్వారన్న వివరాల్లేవు.

దొంగ జాబ్‌కార్డు నంబర్లు నమోదు
కంభాలపాడులో పంట కుంటలను ఎక్కడ తవ్వారని స్థానిక అధికారులను అడిగితే వాగుల వైపే చూపిస్తున్నారు. మొదట గ్రామంలోని చిన్న ఊట్ల వాగు ప్రాంతంలో 78, ఎర్రవంక వాగులో 70, పల్లెకంటి వాగులో 73 పంట కుంటలను తవ్వినట్టు చెప్పారు. ‘సాక్షి’ పరిశీలనలో చిన్న ఊట్ల వాగు, వాగుకు ఇరుపక్కల రైతుల పొలాల్లో కేవలం 28 పంట కుంటలు మాత్రమే కనిపించాయి. గ్రామంలో మొత్తం 13 కిలోమీటర్ల పరిధిలో ఉండే మూడు వాగుల్లో 211 కుంటలు తవ్వారా? అని అధికారుల వద్ద ఆరా తీస్తే.. తాము మొదట ఇచ్చిన సమాచారం తప్పుగా వచ్చిందంటూ కొత్తగా మరొక పేర్ల జాబితాను అందజేశారు.

రెండో జాబితాలో పెద్ద ఊట్ల వాగులో 48, ఎర్రవంక వాగులో 14తోపాటు ఒక్కొక్క రైతు పేరుతో నాలుగైదు కుంటలను తవ్వినట్లు పేర్కొన్నారు. విజయవాడలోని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఉన్న జాబితాకు, స్థానిక అధికారులిచ్చిన రెండు జాబితాలకు పొంతనలేదు. కమిష నర్‌ కార్యాలయంలోని  జాబితాలో దొంగ జాబ్‌కార్డు నంబ ర్లు నమోదు చేయడం గమనార్హం. కూలీ జాబ్‌ కార్డులో ఉండే 18 అంకెల సంఖ్యను నమోదు చేయాల్సి ఉండగా, 9 అంకెల సంఖ్యలను మాత్రమే నమోదు చేశారు.

పనులన్నీ టీడీపీ నేతల పరం
రాష్ట్రంలో కొన్ని నెలలుగా ఉపాధి హామీ పథకంలో కేవలం పంట కుంటల తవ్వకం పనులకే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తోంది. ఈ పథకానికి కేంద్రం ఇచ్చే నిధులతో కాంట్రాక్టర్ల ద్వారా పనులు చేయించకూడదని నిబంధనలు న్నా గ్రామస్థాయిలో అధికార పార్టీ నేతలు, వారి అనుచరులే ఈ పనులు దక్కించుకుంటున్నారు.

యంత్రాల వాడకం... కూలీల పేరుతో బిల్లులు
ఉపాధి హామీ పథకం పనుల్లో యంత్రాల వాడకంపై నిషేధం ఉంది. అయినా పంట కుంటలను యంత్రాలతో తవ్వి కూలీల పేరుతో బిల్లులు చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో పని చేసిన కూలీలకు రోజుకు రూ.129 చొప్పున కూలీ పడుతుండగా, కంభాలపాడులో కూలీలకు రోజుకు రూ.188 చొప్పున చెల్లింపులు జరిపినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. పంటకుంట చుట్టూ రాళ్లతో రివిట్‌మెంట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ‘సాక్షి’ బృందం పరిశీలించిన ఏ ఒక్క కుంటకూ రాళ్లతో రివిట్‌మెంట్‌ చేసిన దాఖలాలు లేవు.

బోర్డులు పెట్టలేదు.. బిల్లులు తీసుకున్నారు
ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనుల వివరాలతో పని ప్రాంతంలో తప్పనిసరిగా బోర్డులు ఏర్పాటు చేయాలి. కంభాలపాడులో కేవలం ఒక్కచోట మాత్రమే బోర్డును ఏర్పాటు చేసినప్పటికీ, చిన్న ఊట్ల వాగుపై తవ్విన పంటకుంటకు పెద్ద ఊట్ల వాగులో తవ్వకానికి అనుమతిచ్చిన బోర్డును ఉంచారు. మిగిలిన చోట్ల ఎక్కడా బోర్డులు లేవు. ఏడాది కిందట పూర్తయిన వాటి వద్ద సైతం బోర్డులు ఏర్పాటు చేయలేదు. బోర్డుల ఖర్చు పేరిట రూ.500 చొప్పున బిల్లులు మాత్రం తీసుకున్నారు. బోర్డుల గురించి అధికారులను అడిగితే.. ఆర్డర్‌ ఇచ్చామని బదులిచ్చారు. అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే బోర్డులు ఏర్పాటు చేయలేదని గ్రామస్థులు చెబుతున్నారు. కంభాలపాడులో స్థానిక టీడీపీ నేత అండదండలతోనే పంటకుంటల తవ్వకంలో అవినీతి చోటు చేసుకుందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement