ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాల దరఖాస్తులను బయోమెట్రిక్ యంత్రం ద్వారా ఈపాస్ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయాలనే నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం కళాశాలలపై భారం మోపింది. 2013-14 విద్యా సంవత్సరం నుంచి నూతనంగా అమలులోకి తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ యంత్రాల ద్వారా విద్యార్థుల వేలిముద్రలను ఆన్‌లైన్‌లో అనుసంధానం చేస్తేనే వాటిని ఆమోదిస్తామని సంక్షేమ శాఖ అధికారులు కళాశాలల ప్రిన్సిపాళ్లకు తేల్చి చెప్పారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం సూచించిన కంపెనీల నుంచి మాత్రమే ఈ బయోమెట్రిక్ యంత్రాలను కొనుగోలు చేయాలని ఆన్‌లైన్‌లోని ఈ పాస్ వెబ్‌సైట్‌లో కంపెనీల వివరాలను ఉంచారు. బహిరంగ మార్కెట్‌లో *6 వేలకు మించని బయోమెట్రిక్ యంత్రం ఆన్‌లైన్‌తో అనుసంధానం పేరుతో కొన్ని కంపెనీలు *28 వేలుగా నిర్ణయించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 60 శాతానికి పైగా కళాశాలలు బయోమెట్రిక్ యంత్రాలను కొనుగోలు చేయలేదు. అందువల్ల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ఉపకార వేతనాలు అందే పరిస్థితులు కనబడటంలేదు.
విజన్‌టెక్, అనలాగ్ అనే కంపెనీల నుంచి మాత్రమే బయోమెట్రిక్ యంత్రాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరు మాత్రమే బయోమెట్రిక్ యంత్రాలను ఈ పాస్ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసే సాఫ్ట్‌వేర్‌తో అమ్మకాలు జరుపుతున్నారు. అదే సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తే ధర బాగా తగ్గుతుందని, విద్యార్థులకు త్వరగా ఉపకార వేతనాలు అందించవచ్చని కళాశాల యాజమాన్యాలు అంటున్నాయి.
ఇక ప్రభుత్వ కళాశాలలు బయోమెట్రిక్ యంత్రాలను కొనుగోలు చేసేందుకు నిధుల కేటాయింపులు లేవు. కొన్ని కాలేజీలు విద్యార్థుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. విద్యార్థుల నుంచి అయితే తక్కువ మొత్తంలో తీసుకున్నా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వ్యతిరేకత రాదని భావిస్తున్నారు.
బయోమెట్రిక్ కంపెనీలు పేర్కొంటున్నట్లు రోజుకు 200 మంది వేలిముద్రల సేకరణ సాధ్యం కావడంలేదని, వీటిని ఇప్పటికే కొనుగోలు చేసిన కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలకు ఈ పాస్‌లో రిజిస్టర్ చేయించుకున్న కళాశాలలు ఆదిలాబాద్- 285, ప్రకాశం-533, అనంతపురం-437, చిత్తూరు-664, తూర్పు గోదావరి- 746, గుంటూరు-732, హైదరాబాద్- 751, కడప- 522, కరీంనగర్-493, ఖమ్మం- 444, కృష్ణా-624, కర్నూలు-507, మహబూబ్‌నగర్-462, మెదక్-368, నల్గొండ-642, నెల్లూరు-439, నిజామాబాద్-375, రంగారెడ్డి-1140, శ్రీకాకుళం- 315, విశాఖపట్నం-624, విజయనగరం-344, వరంగల్-619, పశ్చిమగోదావరి-542. మొత్తం 12,608 కళాశాలలు ఉన్నాయి.
వీటిలో దాదాపుగా 13,75,048 మంది రెన్యువల్ విద్యార్థులున్నారు. ప్రభుత్వం సూచించిన కంపెనీల ధరల ప్రకారం బయోమెట్రిక్ యంత్రాలు కొనుగోలు చేయాలంటే ఒక్కో యంత్రం విలువ *27 వేలు. ఆ లెక్కన రాష్ట్రంలోని కళాశాలలన్నీ యంత్రాలు కొనుగోలు చేసేందుకు 34 కోట్ల 4 లక్షల 16 వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బహిరంగ మార్కెట్‌లో కొనుగోలుచే స్తే ఒక్కో బయోమెట్రిక్ యంత్రం 6 వేల లెక్కన రాష్ట్రం మొత్తం మీద 7 కోట్ల 56 లక్షల 48 వేల రూపాయలు సరిపోతుంది. ప్రభుత్వం సాఫ్ట్‌వేర్ పేరుతో కళాశాలల నుంచి, కళాశాలల వారు విద్యార్థుల నుంచి దోపిడీ చేస్తోంది 26 కోట్ల 47 లక్షల 68 వేల రూపాయలు అన్నమాట.
బహిరంగ మార్కెట్లో తీసుకోవచ్చు.. అయితే..
కొమ్మతి సరస్వతి, సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డెరైక్టర్
మొదట్లో ఆ రెండు కంపెనీల నుంచి బయోమెట్రిక్ యంత్రాలను కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. ధరలు ఎక్కువగా ఉన్నాయని బహిరంగ మార్కెట్లో దొరికే యంత్రాలకు ఈ పాస్ డేటా కార్డ్ అనే పరికరంతో ఈ పాస్‌వెబ్‌సైట్‌కు ఆన్‌లైన్‌లో అనుసంధానం అవ్వచ్చని ప్రభుత్వం తెలిపింది. అయితే అవి ఇంకా అందుబాటులోకి రాలేదు.
బయోమెట్రిక్ కొను‘గోల్‌మాల్’
Published Mon, Jan 27 2014 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
Advertisement
Advertisement