జోగిపేట, న్యూస్‌లైన్: వృద్ధాప్యంలో ఆసరాగా నిలిచిన పింఛన్‌ను అధికారులు ఏవో సాకులు చెబుతూ ఇవ్వకపోవడంతో పండుటాకులు రోడ్డెక్కారు. పోస్ట్ ఆఫీస్‌లో వద్దు, పంచాయతీలోనే ఇవ్వాలంటూ రాస్తారోకో చేపట్టారు. వీరికి తోడుగా వికలాంగులు, వితంతువులు కూడా వచ్చి సంఘీభావం తెలిపారు. పోలీసులు వచ్చి నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. వివర్లాకి వెళ్తే...
జోగిపేట పట్టణంలోని పోస్టాఫీసులో పెన్షన్ తీసుకునేందుకు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు శుక్రవారం వచ్చారు. అయితే బయోమెట్రిక్ మిషన్ పనిచేయడంలేదని వెళ్లిపోవాలని సిబ్బంది సూచించారు. దీంతో ఆగ్రహించిన వృద్ధాప్య పింఛన్‌దారులు పోస్టాఫీసు ముందు ఆందోళనకు దిగారు.
తమకు పింఛన్లు పోస్టాఫీసులో వద్దు నగర పంచాయతీలో చెల్లించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెన్షన్‌దారులు రాస్తారోకో చేపట్టడంతో సంగారెడ్డి వైపు వెళ్లే రహదారిలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊస మానిక్యం వారికి మద్దతు తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల వరకు పింఛన్లు చెల్లించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి వృద్ధులకు నచ్చజెప్పి ఈ విషయమై అధికారులతో మాట్లాడారు. దీనిపై పోస్టల్‌శాఖ అధికారి ఎంజిఎస్ ప్రసాద్ వివరణ ఇస్తూ శుక్రవారం కొద్దిమందికి ఇచ్చిన తర్వాత మిషన్ పనిచేయలేదని, అందుకే ఇవ్వలేదన్నారు. మున్సిపల్ ఉన్న చోట కమిషనర్ సిబ్బందే చెల్లిస్తున్నారని, ఇక్కడ కూడా అలాగే చెల్లిస్తే బాగుంటుందన్నారు.
ఆసరా కోసం వేదన
Published Fri, Jan 3 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM
Advertisement