jogipet
-
జోగిపేట ఆక్స్ఫర్డ్ స్కూల్‌పై కేసు నమోదు.. కారణం ఇదే..
సాక్షి, సంగారెడ్డి: జోగిపేటలోని ఆక్స్ఫర్డ్ స్కూల్‌పై కేసు నమోదు అయ్యింది. ఆక్స్ఫర్డ్ పాఠశాలలో అధిక ఫీజులు, బుక్స్ విక్రయిస్తున్నారని డీఈవోకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు విద్యార్థి సంఘాలు డీఈవోకు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో డీఈవో ఆదేశాలలో ఎంఈవో కృష్ణ ఆక్స్ఫర్డ్ స్కూల్లో తనిఖీలు చేపట్టారు. అయితే, స్కూల్‌ను తనిఖీ చేయడానికి వచ్చిన ఎంఈవోతో పాఠశాల సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో స్కూల్ నిర్వాహకుడు వేణుపై ఎంఈవో జోగిపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్లో సీట్ల కేటాయింపుపై సస్పెన్స్.. ఆ 70 మంది పరిస్థితేంటి? -
అందోల్, జోగిపేట చైర్మన్‌ను దింపేద్దాం..
సాక్షి, జోగిపేట(అందోల్): సంగారెడ్డి జిల్లాలోని అందోల్–జోగిపేట మున్సిపాలిటీ రాజకీయాలు ఊహించని విధంగా రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై సొంత పార్టీ (బీఆర్ఎస్)కి చెందిన కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారు. దీనిపై శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో నోటీసును అందజేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. శనివారం ఉదయం 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు తమ కుటుంబ సభ్యులతో కలసి చిట్కుల్లోని చాముండేశ్వరీ అమ్మవారి ఆలయం ఆవరణలో సమావేశమయ్యారు. చైర్మన్, వైస్చైర్మన్ల వ్యవహారశైలిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, వారిని పదవిలో నుంచి దింపేయాలని తీర్మానించారు. అక్కడ నుంచి నేరుగా సంగారెడ్డి కలెక్టరేట్‌కు వెళ్లారు. అక్కడ కలెక్టర్ లేకపోవడంతో అదనపు కలెక్టర్ వీరారెడ్డిని కలిశారు. ఆయన సూచన మేరకు ఇన్‌వార్డులో అవిశ్వాస తీర్మానం నోటీసును అందించారు. అక్కడి ఉద్యోగులు సోమవారం వచ్చి కలెక్టర్‌ను కలవాలని సూచించడంతో నోటీసు అందించి వెనుదిరిగారు. మెజారిటీ కౌన్సిలర్ల వ్యతిరేకత అందోల్ – జోగిపేట మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులున్నాయి. ఇందులో 14 మంది బీఆర్ఎస్, ఆరుగులు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. ప్రస్తుతం వీరిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు చైర్మన్‌ను వ్యతిరేకిస్తున్నారు. రోజూ చైర్మన్ వెంట ఉండే కౌన్సిలర్లు సైతం బహిరంగంగా చైర్మన్ తీరుపై విమర్శలు చేయడం విశేషం. కాగా, ఈ పరిణామంపై ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. -
గురువు గారూ.. గురువు గారూ.. అంటూ దోచేశారు
జోగిపేట (అందోల్): ‘గురువు గారూ.. మేం మీ విద్యార్థులం’అంటూ నమ్మించిన యువకులు ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడి ఇంట్లో నుంచి రూ. 30 లక్షల నగదు , 10 తులాల నగలు అపహరించుకు పోయారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎస్సీ బాలుర హాస్టల్ ప్రాంతంలో రిటైర్డ్ టీచర్ లక్ష్మీనారాయణ ఒంటరిగా ఉంటున్నారు. మార్కెట్ యార్డు ఆవరణలో రెండు నెలల క్రితం లక్ష్మీనారాయణ మద్యం సేవిస్తుండగా అటువైపుగా వచ్చిన ఇద్దరు యువకులు.. ‘గురువుగారు బాగున్నారా? మమ్మల్ని గుర్తుపట్టారా? మేము మీ శిష్యులం’అంటూ మాట కలిపారు. దీంతో పలుసార్లు కలుసుకోవడం, మద్యం సేవించడంతో వారి మధ్య చనువు ఏర్పడింది. కాగా, లక్ష్మీనారాయణ ఎప్పటిలాగే ఈనెల 24వ తేదీన మార్కెట్ యార్డు వద్దకు ఇద్దరు యువకులను తీసుకువెళ్లగా, అక్కడ దోమలు ఉన్నాయని, అన్నాసాగర్ వద్ద మంచి చోటు ఉంటుందని ఆ యువకులు తీసుకువెళ్లారు. ఆయన్ను మద్యం మత్తులోకి దింపిన ఆ యువకులు ఇంకా మద్యం, తినడానికి ఏమైనా తీసుకువస్తామని చెప్పి లక్ష్మీనారాయణ బైక్‌ను వెంట తీసుకువెళ్లారు. దొంగతనం జరిగింది ఇలా.. బైక్ తాళం చెవిగుత్తికే ఇంటి తాళం చెవి ఉండటంతో నేరుగా వారు లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి బీరువా తాళాన్ని పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. కేవలం 14 నిమిషాల్లో వారు దొంగతనం పూర్తి చేసుకున్నట్లు సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. సాయంత్రం 4, 5 గంటల సమయంలో వెళ్లిన యువకులు రాత్రి 8 గంటల వరకు కూడా రాకపోయేసరికి లక్ష్మీనారాయణ తమ దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లి, 25వ తేదీన ఉదయం 5 గంటల సమయంలో తాను అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం లేకుండా గడియ పెట్టి ఉండడంతో లోనికి ప్రవేశించి చూడగా బీరువాలో దాచుకున్న డబ్బులు, బంగారు నగలు కనిపించకపోవడంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించారు. ఇంటి స్థలం కొందామనుకున్నా.. రిటైర్మెంట్ ద్వారా వచ్చిన డబ్బులతో ఇంటి స్థలం కొందామనుకొని డబ్బు దాచుకున్నానని బాధితుడు లక్ష్మీనారాయణ విలేకరులకు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు రెండు నెలల క్రితం పరిచయమయ్యారని, తమది సంగారెడ్డి అని చెప్పారని, పేర్లు మాత్రం చెప్పలేదని అన్నారు. విచారణ జరుపుతున్నాం: ఎస్ఐ జోగిపేటలో జరిగిన దొంగతనం ఘటనకు సంబంధించి తమకు ఆలస్యంగా ఫిర్యాదు వచ్చిందని, సీసీ కెమెరా పుటేజీల ద్వారా నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నామని గురువారం ఎస్ఐ సామ్యానాయక్ తెలిపారు. -
అప్పు తీర్చే మార్గం కనిపించడంలేదు.. ఊరు విడిచి వెళ్లిపోతున్నా!
జోగిపేట(అందోల్): బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక, అధికారుల వేధింపులు తట్టుకోలేక, రుణం తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఓ రైతు కుటుంబం బతుకుదెరువు కోసం పటాన్చెరువు శివారు ప్రాంతానికి పయనమైంది. ఈ సంఘటన శుక్రవారం సంగారెడ్డి జిల్లా అందోల్ మండల పరిధి కంసాన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రైతు ఆశిరెడ్డిగారి శంకర్ రెడ్డి తెలిపిన ప్రకారం మండల పరిధిలోని కన్సాన్పల్లి గ్రామంలో తనకు 3.31 ఎకరాల పొలం ఉంది. తన పొలంలో బోరు మోటర్, పైపులైన్ ఏర్పాటు కోసం 2016లో జోగిపేట కోఆపరేటివ్ బ్యాంకులో రూ.80 వేల రుణం తీసుకున్నాడు. పంట దిగుబడులు రాకపోవడం, ఇతరుల పొలాలను కౌలుకు తీసుకుని సాగుచేసినా దిగుబడులు రాలేదు. దీంతో అప్పు తీర్చే మార్గం కనిపించలేదు. బ్యాంకు అధికారులు ఒత్తిడి చేయడంతో మరోచోట అప్పు చేసి రూ.40 వేలు చెల్లించాడు. ప్రభుత్వ రుణమాఫీ చేస్తుందని ఆశగా ఎదురుచూసినా లాభం లేకుండా పోయింది. చేసిన అప్పు రూ.1.42 లక్షలకు చేరింది. అప్పులు తీర్చడం కోసం ట్రాక్టర్ కూడా అమ్మేశాడు. ప్రస్తుతం వేసిన మొక్కజొన్న కూడా చేతికి రాకుండా పోయింది. బ్యాంకు అధికారులు పదే పదే ఇంటి చుట్టూ తిరుగుతూ నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈనెల 23వ తేదీన గ్రామంలో భూమి వేలం వేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. గ్రామంలో బకాయి ఉన్నట్లు పోస్టర్లు అంటించారు. ఒకవైపు అవమానం, మరోవైపు అప్పు తీర్చే మార్గం లేక భార్యాపిల్లలకు నచ్చజెప్పి ఊరు విడిచివెళ్లిపోయాడు. రూ.1.42 లక్షలు చెల్లించాల్సి ఉంది కన్సాన్పల్లి గ్రామానికి చెందిన రైతు శంకర్‌రెడ్డి మోటారు కొనుగోలు కోసం, బోరు వేయించేందుకు రూ.80 వేలు 2016లో తీసుకున్నాడు. చాలాసార్లు గ్రామానికి వెళ్లి నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. ఒకసారి రూ.40 వేలు చెల్లించాడు. ఇంకా రూ.1.42 లక్షలు బకాయి ఉంది. ఈనెల 23వ తేదీన ఆయన భూమిని వేలం వేస్తున్నట్లు ప్రకటన కూడా ఇచ్చాం. ఇందులో 70 నుంచి 80 శాతం చెలిస్తే కొంత సమయం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పాం. పాత బకాయిలు పేరుకుపోవడంతో కొత్త రుణాలు ఇవ్వలేకపోతున్నాం. నిబంధనల ప్రకారమే రైతుకు నోటీసులు జారీ చేశాం. – రాజు, మేనేజర్ జోగిపేట డీసీసీబీ బ్రాంచ్ -
విషాదం: శుభకార్యానికి వెళ్తుండగా..
సాక్షి, జోగిపేట (అందోల్): శుభకార్యంలో పాల్గొనేందుకు వెళ్లిన కుటుంబాన్ని.. అరగంటలో గమ్యస్థానం చేరుకుంటుందనగా మృత్యువు కబళించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందిన ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం అల్మాయిపేట శివారులో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలానికి చెందిన ఎల్లదాస్ కుటుంబీకులు చాలా ఏళ్లుగా సంగారెడ్డిలో స్థిరపడ్డారు. ఆదివారం మన్సాన్పల్లిలోని బంధువుల ఇంట్లో డోలారోహణం కార్యక్రమం ఉంది. ఈ వేడుకకు ఎల్లదాసు సోదరుడైన శ్రవణ్‌కుమార్ (40) అతని భార్య స్వప్న, పిల్లలు సాయిచరణ్ (7), సాయి విఘ్నేశ్ (11)తో పాటు వరుసకు బావ అయిన వెంకటేశం (39) అతని భార్య పద్మ, ఇతర కుటుంబ సభ్యులు భవాని, రమేశ్‌తో కలిసి ఆటోలో అందోల్ మండలం మన్సాన్పల్లి గ్రామానికి బయల్దేరారు. అల్మాయిపేట సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన కంటెయినర్ ఆటోని ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో శ్రవణ్‌కుమార్, సాయిచరణ్, సాయి విఘ్నేశ్ అక్కడికక్కడే మృతి చెందగా క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకటేశం మృతి చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ భవాని, స్వప్న, రమేశ్, పద్మలను మెరుగైన చికిత్సకోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై జోగిపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ పరిశీలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
మరో ఆర్టీసీ కండక్టర్ మృతి
జోగిపేట(అందోల్) : ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మతిస్థిమితం కోల్పోయి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కండక్టర్ నాగేశ్వర్(43) బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన నాగేశ్వర్ నారాయణఖేడ్ డిపోలో విధులు నిర్వర్తించేవాడు. ఆయన మృతితో జోగిపేటలో ఉద్రిక్తత నెలకొంది. మృతదేహాన్ని గురువారం ఉదయం 5 గంటలకు అంబులెన్స్‌లో జోగిపేటకు తీసుకువచ్చారు. కాగా, స్థానిక ఆర్టీసీ జేఏసీ నేతలు నాగేశ్వర్ మృతదేహాన్ని నారాయణఖేడ్ డిపోకు తరలించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. మృతదేహాన్ని నారాయణఖేడ్ బస్‌డిపోకు ఎందుకు తీసుకువెళ్లకూడదని నిలదీశారు. అంబులెన్స్‌లోనే మృతదేహం.. ఇదిలా ఉండగా నాగేశ్వర్ మృతదేహాన్ని ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అంబులెన్స్ నుంచి బయటకు తీయనీయకుండా ఆర్టీసీ కార్మిక సంఘ నాయకులు అడ్డుకున్నారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల నగదు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు మంజూరు చేయిస్తామని డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, తెలంగాణ జాగృతి కార్యదర్శి భిక్షపతి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తరఫున కార్మిక సంఘ నాయకులకు, మృతుడి భార్య సంగీతకు హమీ ఇచ్చారు. -
సార్ వీఆర్ఓకు డబ్బులిచ్చినా పని చేయలేదు
సాక్షి, జోగిపేట(అందోల్): ‘సార్ వీఆర్ఓకు డబ్బులిచ్చాను.. అయినా పని చేయడం లేదు సార్’ అంటూ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఒక రైతు అనడంతో సభలో కొద్దిసేపు కలకలం ఏర్పడింది. బుధవారం జోగిపేట తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరికి డబ్బులు ఇవ్వకూడదని అనడంతో అక్కడే కూర్చున్న నేరడిగుంట గ్రామానికి చెందిన రైతు తాను వీఆర్ఓకు డబ్బులు ఇచ్చానని, అయినా ఇప్పటివరకు పని కాలేదని అనడంతో ఎమ్మెల్యే ఆ రైతును దగ్గరకు పిలిచి ఏం జరిగిందని అడిగి తెలుసుకొన్నాడు. ఈ విషయం ఏదో తేల్చాలని పక్కనే ఉన్న తహసీల్దార్‌కు సూచించారు. దీంతో ఒక్కసారిగా రైతులంతా పాత పాసుబుక్కులు తీసుకొని వేదిక వద్దకు వచ్చారు. సార్ ఇంకా నాకు పాసు పుస్తకాలు రాలేదు.. రోజూ తిరుగుతున్నాం అంటూ ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వీరందరి దరఖాస్తులను స్వీకరించేలా ఒకరిని నియమించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. దీంతో సిబ్బంది ద్వారా వారి దరఖాస్తులు స్వీకరించారు. -
మహిళా మంత్రులు లేనందునే మహిళా గవర్నర్
సాక్షి, జోగిపేట(అందోల్): రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పించలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కే.మాధవి అన్నారు. జోగిపేటలోని శ్రీరామ ఫంక్షన్ హాలులో జరిగిన నియోజకవర్గ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కమీషన్ల ప్రభుత్వం.. రాష్ట్రంలో మహిళా మంత్రులకు అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించకపోవడంతో కేంద్రం ఒక మహిళను గవర్నర్‌గా నియమించిందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీని చూస్తేనే టీఆర్ఎస్ పార్టీలో గుబులు పుడుతుందన్నారు. రాష్ట్రంలో కమీషన్ల ప్రభుత్వం కొనసాగుతుందని, సచివాలయంలో కాలుపెట్టని తొలి ముఖ్యమంత్రి కేసీఆరేనని అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. 33లక్షల బీజేపీ సభ్యత్వాలు పూర్తి రాష్ట్రంలో ఇప్పటి వరకు 33 లక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయన్నారు. మాజీ మంత్రి బాబూమోహాన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 7500 సభ్యత్వాలు పూర్తయ్యాయన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 1.80 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని, జనవరి 13వ తేది వరకు సభ్యత్వ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. సమావేశంలో జహీరాబాద్ బీజేపీ పార్లమెంట్ ఇంచార్జి ఆర్.ప్రభాకర్‌గౌడ్, నియోజకవర్గ ఇంచార్జి ప్రభాత్‌కుమార్, జిల్లా నాయకులు జగన్నాథం, ప్రేమ్‌సాగర్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి ఆర్.మాణయ్య,పట్టణ అధ్యక్షులు ఎర్రారం సతీష్ ముదిరాజ్, నాయకులు నవీన్, సాయి, హరీష్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు. -
రిజర్వేషన్లపై ఉత్కంఠ!
సాక్షి, జోగిపేట(సంగారెడ్డి) : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. సాధ్యమైనంత తొందరలోనే పురపాలక సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తగ్గట్టు అధికారులు ఓటర్ల గణనను చేపట్టారు. గత నెల 22న ప్రారంభమైన ఈ ప్రక్రియ ఈ నెల 14న పూర్తి కానుంది. అధికార ఏర్పాట్ల విషయాన్ని అటుంచితే ఇటు మున్సిపల్ చైర్మన్‌గిరిపై ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది. ఓటర్ల గణన తర్వాత ఏ మున్సిపాలిటీ రిజర్వేషన్ ఎవరికి కలిసి వస్తుందోనని ఎదురు చూస్తున్నారు. రిజర్వేషన్ కలిసి వస్తే చాలు ఎలాగైనా పదవి దక్కించుకోవాలని ఇప్పటికే యత్నాలు ముమ్మరం చేశారు. ఒకవేళ ‘పుర’ పీఠం మహిళలకు కేటాయిస్తే తమ బంధువులనూ బరిలో దించే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకుంటున్న వారి సంఖ్య జిల్లాలో పెరిగిపోతోంది. జిల్లాలో సంగారెడ్డి, జోగిపేట, జహీరాబాద్, సదా శివపేట మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఏర్పడిన నారాయణఖేడ్, అమీన్పూర్, తెల్లాపూర్, ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే వార్డుల వారిగా ఓటర్ల వివరాలు తెలుసుకున్న ఆశావహులు కౌన్సిలర్‌గా పోటీ చేసి ‘పుర’ పీఠంపై దృష్టి సారించారు. తొలి చైర్మన్లు ఎవరో..? జిల్లాలో కొత్తగా ఏర్పడిన అమీన్పూర్, నారాయణఖేడ్, తెల్లాపూర్, ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీలకు మొదటిసారిగా జరిగే ఎన్నికల్లో చైర్మన్లుగా ఎవరు ఎన్నికవుతారో వేచి చూడాల్సిందే. ఈ ఎన్నికల్లో తామే కొత్త మున్సిపాలిటీలపై జెండా ఎగురవేస్తామన్న ధీమాను అధికార పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే రిజర్వేషన్లు ఏవి వస్తాయోనన్న టెన్షన్లో ఉన్నారు. చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న వారు తమకు అనూకూలంగా రిజర్వేషన్లు వస్తాయా లేదా అన్న ఉత్కంఠతతో ఉన్నారు. కొత్త మున్సిపల్ చట్టంలో చైర్మన్ పదవికి ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కూడా ఎక్కడా ప్రస్తావన తీసుకురాకపోవడంతో పరోక్ష ఎన్నికలే జరగవచ్చని అంటున్నారు. పాత పాలకవర్గం ఆశలు గత ఎన్నికల్లో కొనసాగిన పాలకవర్గాలు తిరిగి మరోసారి ఎన్నిక కావాలన్న ఆశతో ఉన్నారు. జహీరాబాద్, సంగారెడ్డి, జోగిపేట, సదాశివపేట మున్సిపాలిటీల్లో మహిళలే చైర్పర్సన్లుగా కొనసాగారు. జరగబోయే ఎన్నికల్లో వారి భర్తలు ఆశలు పెంచుకుంటున్నారు. ఏదిఏమైనా అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి జిల్లాలోని 8 మున్సిపాలిటీలను సాధించుకునేలా ముందుకు సాగుతోంది. జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అందరి కంటే ముందే మున్సిపాలిటీలో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. సుమారుగా రూ.10 కోట్ల విలువ చేసే పనులను చేపట్టేందుకు నిర్ణయించుకొని శంకుస్థాపనలు చేశారు. -
కొడుకా.. రమేశా!
సాక్షి, జోగిపేట(అందోల్): చేతికి ఎదిగివచ్చిన కొడుకు.. రాత్రి పడుకొని ఉదయం లేచి చూసే సరికి శవంగా మారడంతో ఆ తల్లి గుండె తల్లడిల్లింది.. ఎంత పనిచేసావు కొడుకా రమేశు అంటూ గుండలవిసేలా రోదించింది. జీవితంపై విరక్తితో మంగళవారం యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. జోగిపేట పట్టణానికి చెందిన బీర్ల రమేశ్ (26) బీఈడీ పూర్తిచేసిన ఎస్సై, లేదా కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో కొన్ని రోజులుగా సంగారెడ్డిలోనే స్నేహితులతో ఉండి వారితో పాటు సాధన చేస్తున్నాడు. శివరాత్రి పండుగకోసం జోగిపేటకు వచ్చిన ఆ యువకుడు సోమవారం తన ఇంటిలోని కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. ఉదయం లేచి చూడగానే రమేష్ కనిపించకపోయే సరికి కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఎక్కడకు వెళ్లాడోనని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. సోదరుడు అనిల్ మండలం పరిధిలోని మాసానిపల్లి శివారులోని తమ వ్యవసాయ భూమి వద్దకు వెళ్లగానే అక్కడ రమేష్ చెట్టుకు ఉరివేసుకొని వేలాడుతుండడాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సమచారం ఇచ్చారు. కాలనీవాసులు, మిత్రులు, బంధువులు, అక్కడి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై వెంకటేశ్ వచ్చి పంచనామా నిర్వహించి మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోదరుడు అనిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ముక్కు క్యాన్సరే కారణమా..? సోమవారం అర్థరాత్రి 12 గంటలు దాటిన తర్వాత తన సెల్‌ఫోన్‌లోని స్టేటస్‌లో నోస్ క్యాన్సర్ అని ముక్కు ఫొటోను పోస్టు చేసారు. కొంత మంది స్నేహితులు ఆ స్టేటస్‌ను చూసి పొద్దున మాట్లాడదామని ఊరుకున్నారు. ఉదయం లేచే సరికి ఈ సంఘటన తెలియడంతో స్నేహితులంతా ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. మూడేళ్ల నుంచి ముక్కుకు సంబంధించి వ్యాధితో బాధ పడుతున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. అది క్యాన్సర్ అని మాత్రం చెప్పలేదన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి ఒక్కసారిగా శవంగా మారడంతో కాలనీలో విషాధచాయలు అలుముకున్నాయి. రమేశ్ (ఫైల్) -
జోగిపేటలో వైఎస్సార్సీపీ పాదయాత్ర
జోగిపేట(అందోల్): వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చేస్తున్న పాదయాత్ర వెయ్యి కి.మీ పూర్తయిన సందర్భంగా ఆయనకు మద్దతుగా జోగిపేటలో సోమవారం అందోల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి, మెదక్ జిల్లా అధ్యక్షుడు బి.సంజీవరావు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రను ప్రారంభించారు. మార్కెట్ యార్డు, బసవేశ్వర విగ్రహం, హనుమాన్ చౌరస్తా, అంబేడ్కర్ విగ్రహం మీదుగా అన్నాసాగర్ గ్రామ సమీపంలోని ముర్షద్ వరకు పాదయాత్ర కొనసాగింది. వైఎస్.జగన్ నాయకత్వం వర్థిల్లాలి, వైఎస్సార్ అమర్ రహే, వైఎస్సార్సీపీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు పాదయాత్రలో భాగంగా స్థానిక పబ్బతి హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అన్నాసాగర్ దర్గాలో ప్రార్థనలు చేశారు. వైఎస్.జగన్‌కు భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వేడుకున్నారు. హనుమాన్ దేవాలయంలో కొబ్బరికాయ కొట్టిన అనంతరం ముందుకు కదిలారు. వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం కావడం ఖాయమని, దానికి ఆయన చేపడుతున్న పాదయాత్రలకు వస్తున్న ప్రజా స్పందనే సాక్ష్యంగా చెప్పవచ్చని మెదక్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బి.సంజీవరావు, రాష్ట్ర వైఎస్సార్సీపీ కార్యదర్శి బాలకృష్ణారెడ్డి, జిల్లా వైఎస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు డీజీ మల్లయ్య యాదవ్ అన్నారు. ప్రజల ఆదరాభిమానాల మధ్య చేపడుతున్న పాదయాత్ర నేటికి వెయ్యి కి.మీకు చేరుకుందని చెప్పారు. రాష్ట్ర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పాదయాత్రలను చేపడుతున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ జిల్లాల్లో కూడా పార్టీ పటిష్టంగా తయారవుతోందన్నారు. దివంగత నేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతాయన్నారు. నియోజకవర్గంలో యువత పార్టీ వైపు బాగా ఆకిర్షతులవుతోందని అన్నారు. కార్యకర్తలు రాజకీయ ఒత్తిళ్లకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, జిల్లా వైఎస్సార్సీపీ వర్కింగ్ ప్రసిడెంట్ బాగయ్య, మెదక్ జిల్లా యువత విభాగం అధ్యక్షుడు రాజేందర్, మండల శాఖ అ«ధ్యక్షుడు జీ.శంకర్, జోగిపేట పట్టణ అధ్యక్షుడు రాకేష్, సోషల్‌మీడియా ఇన్చార్జి పవన్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీలు రమేశ్, పరిపూర్ణ, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు పాండు, జిల్లా నాయకులు బుచ్చయ్య నవీన్, నరేష్, కార్తీక్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు. -
బిడ్డా లేవురా...!
► కొడుకు మృతదేహంపై పడి కంటతడిపెట్టిన తండ్రి ► సంగుపేట వద్ద బైకును వెనుక నుంచి ఢీకొన్న లారీ ► అక్కడికక్కడే యువకుడి దుర్మరణం. జోగిపేట(అందోలు): బిడ్డా లేవురా.. నీ చెల్లెలికి ఏమని చెప్పాలిరా?.. ఎంత పనిచేస్తివి దేవుడా? నేనన్నా చావకపోతి కదా.. అంటూ కన్నతండ్రి కొడుకు శవం మీద పడి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే అక్కడి వారందరూ కంటతడిపెట్టారు. ఈ సంఘటన మంగళవారం అందోలు మండలం సంగుపేట గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. కొడుకును ఇంజనీర్‌గా చూడాలనుకున్న తండ్రి ఆశలను మృత్యువు కబలించుకొని పోయింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆశలు చిదిమేసిన లారీ చిలప్‌చెడ్ మండలం సోమక్కపేట పంచాయతీ పరిధిలోని రహీంగూడ నివాసి మల్లేశం, కొడుకు నీరుడి ప్రశాంత్(17)తో కలిసి సంగారెడ్డి వైపు నుంచి జోగిపేటకు బైకుపై (టీఎస్ 15 ఇజె 4931)వస్తున్నారు. ఈ క్రమంలో అందోలు మండలం సంగుపేట గ్రామం వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో బైక్ వెనుక కూర్చున్న ప్రశాంత్ అక్కడికక్కడే చనిపోగా తండ్రి మల్లేశం తలకు గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని బీజేఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో చేర్పించేందుకు ప్రశాంత్‌ను తీసుకొని మల్లేశం సోమవారం ఇంటి నుంచి వెళ్లాడు. ప్రశాంత్‌ను కళాశాలలో జాయిన్ చేసి రాత్రి సంగారెడ్డికి వచ్చారు. ఉదయమే ఇంటికి బైకుపై బయలుదేరారు. మరో అరగంటలో ఇంటికి చేరుదామనుకున్న సమయంలోనే లారీ వీరు ప్రయాణిస్తున్న బైకును వెనుక నుంచి ఢీకొని కొద్ది దూరం ఈడ్చుకుపోయింది. దీంతో యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన మల్లేశంకు ప్రథమ చికిత్సలు చేశారు. ఎస్ఐ పరమేశ్వర్, వట్పల్లి సర్పంచ్ గణేష్‌లు మృతదేహాన్ని జోగిపేట ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఎన్ఎల్ఓ1ఎల్ 9469 నంబరుగల లారీని వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. దీంతో పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు. వందలాదిగా ఆసుపత్రికి చేరుకున్న గ్రామస్తులు సంఘటన విషయం తెలుసుకున్న రహింగూడ గ్రామస్తులు వందలాదిగా ఆసుపత్రికి, సంఘటన స్థలానికి బైకులు, ఆటోలలో చేరుకున్నారు. గ్రామంలో మంచి పేరు ఉన్న మల్లేశం కుమారుడు చనిపోవడంతో రాజకీయ పార్టీల నాయకులు తరలివచ్చారు. గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ దగ్గరుండి పోస్టుమార్టం పనులు పూర్తి చేయించారు. ఆస్పత్రి ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ పరమేశ్వర్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. -
ఏమార్చి ఏటీఎం కార్డు కొట్టేశాడు!
జోగిపేట (మెదక్) : పక్క వ్యక్తి నుంచి తెలివిగా ఏటీఎం కార్డును కొట్టేసిన ఓ ఘనుడు అదే కార్డు నుంచి రూ.10వేలు డ్రా చేసుకొని ఉడాయించిన ఘటన ఇది. మెదక్ జిల్లా జోగిపేటలో జరిగింది. అల్లాదుర్గం మండలం బిబిజీపూర్ గ్రామానికి చెంది ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ లింగపురం రాములు ఆదివారం జోగిపేటలో బస్టాండ్ వద్ద ఉన్న ఏటీఎంకు వెళ్లాడు. అప్పటికే ఆ ఏటీఎం వద్ద చాంతాడంత లైను ఉంది. ఆ వరుసలో ముందు నిలబడి ఉన్న ఓ అపరిచితుడు.. తనకి ఏటీఎం కార్డు ఇస్తే డబ్బులు డ్రా చేసి ఇస్తానంటూ నమ్మబలికాడు. నిజమేననుకుని అతడి వంతు వచ్చేదాకా అక్కడే ఉండి..అతనితో కలిసి డబ్బు డ్రా చేసేందుకు వెళ్లాడు. రాములు కార్డు ఇవ్వగా ఆ వ్యక్తి ఆ కార్డును తీసుకొని ఏటీఎం మిషన్‌లో పెట్టి తీసి సీక్రెట్ నంబరు కొట్టమని చెప్పాడు. ఆ నంబరును గుర్తుంచుకున్న అపరిచితుడు తర్వాతి ఆప్షన్లను తప్పుగా నొక్కి ఆ కార్డు పనిచేయడంలేదంటూ తన వద్ద నున్న మరో సీతారాం అనే పేరున్న ఏటీఎం కార్డును రాములు చేతిలో పెట్టి అక్కడి నుంచి నిష్ర్కమించాడు. అయితే, లైన్లోనే ఉన్న రాములు కొద్దిసేపటి తర్వాత ఏటీఎం మిషన్‌లో కార్డు పెట్టగా వేరొక పేరు కనిపించింది. దీంతో రాములు అపరిచితుడి కోసం అటూఇటూ గాలించాడు. కనిపించకపోవడంతో వెంటనే తన ఏటీఎం కార్డును బ్లాక్ చేయాలంటూ బ్యాంకు సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో అతని సెల్‌కు రూ.10 వేలు డ్రా చేసినట్లు మెసేజ్ అందింది. సోమవారం ఎస్బీహెచ్ బ్యాంకుకు వెళ్లగా స్థానిక క్లాక్‌టవర్ ఏటీఎంలో నుంచి రూ.10 వేలు డ్రా అయినట్లు అధికారులు తెలిపారు. బాధితుడు జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఏటీఎంలలోని సీసీ కెమెరాల పుటీజీలను పరిశీలించి నిందితుడి ఆచూకీ తెలుసుకుంటామని ట్రైనీ ఎస్సై గౌతం తెలిపారు. -
రూ.కోటితో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
జోగిపేట (మెదక్) : మెదక్ జిల్లా జోగిపేటలోని తహశీల్దార్ గెస్ట్‌హౌస్ భవనం.. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుగా మారబోతోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో శాసనసభ్యుల క్యాంపు కార్యాలయాలను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం స్థానిక కాలేజీ రోడ్డులోని 1.20 ఎకరాల స్థలంలో ఉన్న పురాతన తహసీల్దారు గెస్ట్‌హౌస్‌ను నిర్ణయించారు. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఈ శిథిల భవనాన్ని కూలగొట్టి రూ.కోటితో కొత్తగా డబుల్ ఫ్లోర్ భవనం నిర్మించనున్నారు. ఈ మేరకు ఉన్నత అధికారులకు నివేదిక పంపారు. రెండు మూడు నెలల్లో కొత్త భవనం నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు సోమావారం తెలిపారు. -
మహిళపై అత్యాచారం, ఆపై హత్యాయత్నం..
జోగిపేట (మెదక్): మహిళను మద్యం తాగించి అత్యాచారం, ఆపై హత్య చేసేందుకు యత్నించిన నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మెదక్ డీఎస్పీ రాజారత్నం మంగళవారం జోగిపేట పోలీస్‌సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 4వ తేదీన టేక్మాల్ మండలం తంపులూరు గ్రామానికి చెందిన మహిళ తన బంధువుల ఇంట్లో జరిగే పెళ్లికి పెద్ద శంకరంపేట మండలం ఉత్తులూరు వెళ్లింది. ఈ నెల 5వ తేదీన అక్కడే ఆమెకు బంధువైన ఎడ్ల యాకోబ్ అలియాస్ పెంటయ్య కలిశాడు. ఆమెను నిర్మానుష్యం ప్రాంతానికి తీసుకువెళ్లి మద్యం తాగించి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను తీవ్రంగా హింసించటంతో స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమె కాళ్లకు ఉన్న వెండి కడియాలను తీసుకుని పరారయ్యాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న బాధితురాలు తన బంధువు సాయంతో పెద్దశంకరంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఈ కేసులో పోలీసులు విచారణ జరిపి నిందితుడు యాకోబ్‌ను ఉత్తులూరులో మంగళవారం అదుపులోకి తీసుకొని జోగిపేట మున్సిఫ్ కోర్టుకు రిమాండ్ చేశారు. నిందితుడిపై రౌడీషీట్‌ను తెరుస్తున్నట్లు డీఎస్పీ రాజారత్నం వివరించారు. -
కొంప ముంచిన రాంగ్‌కాల్..!
జోగిపేట: ఫోన్లో పరిచయం స్నేహంగా మారింది. ఆపై ప్రేమకు దారితీసింది. ఆరు నెలలపాటు చనువుగా ఉన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఆపై ప్రేమికురాలి వద్ద నుంచి రూ.4.25 లక్షలు తీసుకుని ఉడాయించాడా ప్రేమికుడు. ఈ ఘటన బుధవారం మెదక్ జిల్లా జోగిపేటలో వెలుగు చూసింది. ఆరు నెలల క్రితం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం చిలిప్‌చెడ్ గ్రామానికి చెందిన ఏఎన్ఎం శ్రీలత ఫోన్‌కు రాంగ్‌కాల్ వచ్చింది. దీంతో ఆమె ‘రాంగ్‌కాల్’ అంటూ పెట్టేసింది. అతను మళ్లీ.. మళ్లీ కాల్ చేయడంతో ఇద్దరి మధ్య పరిచయం స్నేహం వరకు వెళ్లింది. తనను తాను కిశోర్‌బాబుగా పరిచయం చేసుకున్న అతను, తనది విజయవాడ అనీ.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సొంతిల్లు ఉందని చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆరు నెలలుగా ఇద్దరు స్నేహంగా ఉంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో తాను ప్లాట్ కొంటున్నానని.. రూ. 35 వేలు తక్కువగా ఉన్నాయని.. ఈ మొత్తాన్ని సర్దుబాటు చేయాలని ఒత్తిడి పెంచాడు. జోగిపేట ఎస్బీఐలో డబ్బు డ్రా చేసేందుకు మంగళవారం ఉదయం ఇద్దరూ కలిసి వెళ్లారు. తన ఖాతానుంచి శ్రీలత రూ.35 వేలు డ్రా చేసి ఇచ్చింది. అదే సమయంలో శ్రీలత ఖాతాలో మరో రూ.3.90 లక్షల వరకు నగదు ఉన్నట్టు గమనించిన అతడు.. అంతలోనే కుట్ర పన్నాడు. ఇంత డబ్బు ఉద్యోగి ఖాతాలో ఉండకూడదని, సంవత్సరం చివర కావడంతో ఇన్‌కంటాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాడు. ఆమెతో రూ.3.90 లక్షలు డ్రా చేయించాడు. మధ్యాహ్నం వరకు బ్యాంకులోనే ఉండి డబ్బులు తీసుకుని పక్కనే ఉన్న వెంకటేశ్వర సినిమా థియేటర్లోకి సినిమా చూసేందుకు వెళ్లారు. సినిమా మధ్యలోనే బ్యాగులో ఉన్న డబ్బును ఆమెకు తెలియకుండా (రూ.3.90 లక్షలు) కాజేసీ, తనకు ఫోన్ వస్తుందని మాట్లాడి వస్తానంటూ బయటకు వెళ్లిపోయాడు. 15 నిమిషాల వరకు అతను రాకపోవడంతో ఆమె ఫోన్ చేసింది. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో తన బ్యాగును చూసుకుంది. అందులో డబ్బులు లేకపోవడంతో ఒక్కసారిగా కంగుతింది. బయటకు వచ్చి తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. దీనిపై బుధవారం జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బ్యాంకులోని వీడియో ఫుటేజీలను పరిశీలించారు. కాగా, అతని సెల్ నంబర్ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, శ్రీనివాసరావు పేరు మీద ఉన్నట్లు ఎస్ఐ విజయ్‌రావు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కిశోర్‌బాబుపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అధికారులు వేధిస్తున్నారంటూ ఆటోడ్రైవర్ల ధర్నా
జోగిపేట (మెదక్) :ఆర్టీఏ, పోలీసుల వేధింపులకు నిరసనగా మెదక్ జిల్లా జోగిపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఆటో డ్రైవర్లు ధర్నాకు దిగారు. రవాణా, పోలీసు శాఖలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ కార్యదర్శి, ఆటో డ్రైవర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు మొగులయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రైవర్లందరికీ ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రకటించి ఏడాది కావస్తున్నా కార్యరూపం దాల్చలేదన్నారు. ఆర్టీసీ డీఎం... ఆర్టీఏ అధికారులను ఉసి గొలిపి ఆటో డ్రైవర్లను వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు కూడా వారానికి రెండు సార్లు జరిమానాల పేరుతో రూ.200 నుంచి రూ.600 వరకు వసూలు చేస్తున్నారన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. -
అన్నదాత ఆత్మహత్య
జోగిపేట (మెదక్) : మెదక్ జిల్లా ఆందోల్ మండలం చింతకుంట గ్రామంలో ఓ రైతు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన లింగయ్య (36) రెండెకరాల్లో వరి పంట సాగు చేశాడు. అది కాస్తా ఎండిపోవడంతో మనస్తాపం చెంది శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి సమీపంలో ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లింగయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
హత్యకేసులో అనుమానితుడి ఆత్మహత్య
జోగిపేట : పట్టణంలో గత నెల జరిగిన హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తి ఒకరు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జోగిపేటలో గురువారం కలకలం రేపింది. వివరాలి లా ఉన్నాయి.. మే 29వ తేదీ వేకువజామున నర్రా ఆంజనేయులు (30)ను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. కాగా.. ఆంజనేయులు హత్యకు సంబంధించిన వివరాలు అత డి సోదరుడైన పెంటయ్యకు తెలిసి ఉం టాయని కుటుంబ సభ్యులు పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పెంటయ్యను శనివారం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. హత్యకు సంబంధించిన వివరాలు తెలిసి ఉంటే చెప్పాలని కోరినా అతడి నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో ఆదివారం ఇంటికి పంపి సోమవారం తిరిగి రావాలని సూచించారు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ.. సోమవారం ఇంటి నుంచి వెళ్లిన పెంటయ్య గురువారం పశువుల పాక వద్ద గల చింత చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. ఈ విషయాన్ని గమనించిన పెంటయ్య తల్లి రత్నమ్మ కుటుంబ సభ్యులకు తెలి యజేసింది. సమాచారం అందుకున్న సీఐ నాగయ్య, ఎస్ఐ శ్రీనివాస్‌లు గ్రా మానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం సంఘటనా స్థలంలో ఉన్న ఖాళీ బీరు బాటిల్, సిల్‌తో ఉన్న గుళికల ప్యాకెట్‌ను గుర్తించారు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడు గత నెల పెద్ద కూతురు వివాహం చే యడంతో ఆర్థిక ఇబ్బందులు, అదే నెలలో సోదరుడు ఆంజనేయులు మృతితో మానసికంగా కృంగిపోయిన తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య సుశీల జోగిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. మృతుడికి పెద్ద కుమార్తె నవనీతకు వివాహం కాగా కుమారుడు శివకుమార్, మరో కుమార్తె భవానీలు ఉన్నారు. జోగిపేట ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. -
హత్య కేసులో అనుమానితుడు బలవన్మరణం
మెదక్ (జోగిపేట) : మెదక్ జిల్లా జోగిపేటలో గత నెల జరిగిన హత్య కేసులో అనుమానితుడుగా ఉన్న హతుడి సోదరుడు నర్రా పెంటయ్య(35) గురువారం చెట్టుకు వేలాడుతూ కనిపించడం స్థానికంగా సంచలనం రేపింది. గత నెల 29వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు నర్రా ఆంజనేయులు(30)ను నిద్రస్తున్న చోటనే కిరాతకంగా నరికి హత్య చేసారు. ఆంజనేయులుకు సంబంధించిన వ్యక్తులు.. ఆంజనేయులు సోదరుడు పెంటయ్యకు హత్య ఎవరు చేసారో తెలుసునని, అతడిపై అనుమానం ఉందని పోలీసులకు తెలుపడంతో గత శని, ఆదివారం రోజుల్లో పెంటయ్యను స్టేషన్‌కు పిలిపించి హత్యకు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే చెప్పాలని ప్రశ్నించి వదిలేశారు. అయితే పెంటయ్య ఈనెల 15వ తేదిన ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. కాగా గురువారం ఇంటికి దగ్గరలోని చింతచెట్టుకు పెంటయ్య మృతదేహం వేలాడుతూ కనిపించింది. గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మృతుడి తల్లి రత్నమ్మ పశువుల పాక వద్దకు వెళ్లగా పెంటయ్య చెట్టుకు వేలాడుతూ కనిపించడంతో ఆమె వెంటనే ఇరుగు, పొరుగు వారికి తెలియజేసింది. పోలీసులకు కూడా సమాచారం తెలియడంతో సీఐ వి.నాగయ్య, ఎస్ఐ శ్రీనివాస్‌లు సంఘటనాస్థలం వద్దకు చేరుకున్నారు. సంఘటన స్థలంలో ఖాళీ బీరు బాటిల్, సీల్‌తో ఉన్న గుళికల పాకెట్‌ను గుర్తించారు. అప్పుల బాధతోనే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు : భార్య ఫిర్యాదు గత నెల పెద్ద కూతురు వివాహాం చేయడంతో ఆర్ధిక ఇబ్బందులు, అదే నెలలో సోదరుడు ఆంజనేయులు మృతితో మానసికంగా వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య సుశీల జోగిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పులు పెరిగిపోవడంతో ప్రతి రోజు ఆలోచించి ఆందోళనకు గురయ్యేవాడని ఫిర్యాదులో పేర్కొంది. సోదరుడి మరణం కూడా ఆయనను బాగా ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
ఆరు బయట నిద్రిస్తుండగా.. దారుణ హత్య
జోగిపేట (మెదక్): ఇంటి ఆరు బయట నిద్రిస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఈ ఘటన మెదక్ జిల్లా జోగిపేటలోని శివాజీరోడ్డులో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. హమాలీగా పనిచేసే ఆంజనేయులు (30)ను దుండగులు గొడ్డలితో మెడపై నరికేశారు. స్థానికులు శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించగా, వారు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
జోగిపేటలో వర్షం...తడిచిన ధాన్యం
జోగిపేట (మెదక్) : మెదక్ జిల్లా జోగిపేటలో శుక్రవారం వర్షం కురిసింది. దీంతో స్థానిక వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రైతులు ఆరబెట్టుకున్న 200 క్వింటాళ్ల ధాన్యం తడిచిపోయింది. మూడు రోజులుగా కేంద్రం నిర్వాహకులను గన్నీ బ్యాగులు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని, దీంతో అకాలవర్షానికి ధాన్యం తడిచిపోయిందని రైతులు తెలిపారు. అలాగే రాయికోడ్, అల్లాదుర్గం మండలాల్లో కూడా కొద్దిపాటి వర్షం కురిసింది. -
చెరకు సీజన్లో ‘బడి’ని వదిలేస్తున్న గిరిజన విద్యార్థులు
జోగిపేట మార్కెట్ గంజ్ ఆవరణ.. సేదతీరుతున్న గిరిజన కుటుంబాలు..పుల్కల్ మండలంలో చెరకు కొట్టేందుకు వెళుతూ మార్గమధ్యలో వారు ఆగారు. అలా ఆగిన వారిని ‘సాక్షి’ పలకరించింది. ఆ వలసజీవులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ పిల్లల్ని పాఠశాలకు పంపాలని ఉందని..అయినా తాము ఒక చోట పిల్లలు మరోచోట కష్టమనే ఇలా వెంట తీసుకె ళ్తున్నామన్నారు. చదువు మానేసిన బడిపిల్లల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో మానేసిన బడిపిల్లల కోసం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి చెరుకు సీజన్లో గిరిజన పిల్లలు వారి చదువులకు తప్పనిసరి పరిస్థితుల్లో దూరం అవుతున్నారు. వీరి భవిష్యత్తుపై ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని పలువురు విద్యావంతులు అంటున్నారు. ప్రతి సీజన్లో ఇలా విద్యకు దూరం కావడం వల్ల భవిష్యత్తులో వారు పూర్తి స్థాయిలో విద్యావంతులు కావడానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. చెరకు సీజన్లో గిరిజనులు తమ కుటుంబాలతో సహా ఇతర ప్రాంతాలకు తరలివెళుతుంటారు. అయితే ఇంట్లోని వారందరూ నెలల పాటు ఉండరు కాబట్టి పిల్లల్ని ఎక్కడ ఉంచేందుకు అవకాశం లేక వారిని వెంట తీసుకువెళుతున్నారు. దీంతో వారు రెండు నెలల పాటు పాఠశాలలకు డుమ్మా కొట్టాల్సి వస్తుంది. రెండో తరగతి నుంచి 8,9 తరగతులకు చెందిన విద్యార్థులు కూడా వీరిలో ఉన్నారు. ఎక్కువగా ఈ వలసజీవులు ఎడ్లబళ్లపై అందోలు, పుల్కల్ మండల ప్రాంతాల్లో చెరకును కొట్టేందుకు వెళుతుంటారు. పాఠశాలలకు డుమ్మా ప్రతి చెరకు సీజన్లో గిరిజన ప్రాంతాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు పాఠశాలలకు దూరం అవుతున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని కంగ్టి, కల్హేర్, నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గం పరిధిలోని రేగోడ్ మండలానికి చెందిన వందల సంఖ్యలో విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో పాఠశాలలకు వెళ్లకుండా తమ తల్లిదండ్రుల వెంట చెరకు కొట్టే ప్రాంతాలకు తరలివెళుతున్నారు. దీంతో ఆయా విద్యార్థులు అన్ని రకాలుగా నష్టపోతున్నారు. తల్లిదండ్రులకు తోడుగా.. చెరకు కొట్టేందుకు వెళ్లి ఆ ప్రాంతాల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తారు. చెరకు కొట్టే సమయంలో తండ్రులకు, వంట పనులు చే సే సమయంలో తల్లులకు ఆ విద్యార్థులు సహకరిస్తుంటారు. తండ్రులు చెరకును కొట్టి ఎడ్లబళ్లపై ఫ్యాక్టరీకి తరలించే సమయంలో తల్లుల వద్ద వారి పిల్లలు తోడుగా ఉంటున్నారు. కొంత మేరకు తల్లిదండ్రులకు చేదోడుగా వాదోడుగా ఉంటున్నా పాఠశాలను వదిలి చదువుకు దూరంగా వెళ్లడం వారి భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మా పిల్లలు చదువుకోవాలని ఉన్నా.. మా పిల్లలు చదువుకోవాలనే మాకుంటుంది, కానీ సీజన్లో కేవలం పిల్లలను ఇంటి వద్ద వదిలేసి రావడం కుదరదు. మా తండాల్లో హాస్టళ్లు లేకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకు వెళ్తున్నాం. పెద్ద తండాలో 60 మంది విద్యార్థులున్నా ఒకే టీచర్ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో కూడా పిల్లలకు సరైన ఆహారాన్ని అందించడం లేదు. -
మళ్లీ పెన్షన్ సర్వే!
జోగిపేట: నగర పంచాయతీ పరిధిలో పెన్షన్ అర్హుల ఎంపిక సక్రమంగా జరుగలేదని తేలడంతో మళ్లీ వారం రోజుల్లో మండల స్థాయి అధికారులతో సర్వే నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామని అందోలు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్, ఆర్వీఎం పీఓ యాస్మిన్ బాష తెలిపారు. శుక్రవారం జోగిపేటలోని తహిశీల్దారు కార్యాలయంలో పెన్షన్‌కు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎంత మందిని అర్హులుగా గుర్తించారు? లబ్ధిదారుల ఎంపిక ఎలా జరిగిందని స్పెషల్ ఆఫీసర్ నగర పంచాయతీ కమిషనర్ విజయలక్ష్మిపై ప్రశ్నల వర్షం కురిపించారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆమెపై యాస్మిన్‌బాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పంచాయతీలో 2408 మంది పెన్షన్‌కు అర్హతలేని వారు దరఖాస్తు చేసుకున్నారు. 175 దరఖాస్తులు తొలగించారు. కాగా 2233 దరఖాస్తుల్లో అర్హులను ఎంపిక చేయాల్సి ఉండగా 1382 మందిని ఇప్పటి వరకు ఎంపిక చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇంకా 900 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ 98 శాతం అర్హులు ఎలా వచ్చారని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం కొన్ని గైడ్‌లై న్స్ ఇచ్చిందని, వాటిని ఏమీ పట్టించుకోకుండా అర్హులను గుర్తించినట్లు తెలుస్తుందన్నారు. పెన్షన్ దారులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేసిందో అప్పటి నుంచి పెన్షన్ డబ్బులు చెల్లిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పెన్షన్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించేందుకు తనను పంపించారని, కలెక్టర్‌కు పూర్తి నివేదికను అందజేసి ఏమి చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు. -
కల్లు..కల్తీఫుల్లు!
జోగిపేట: కల్తీకల్లుతో జోగిపేట తూలిపోతోంది. పొద్దునే చాయ్ తగ్గినట్టుగా చాలామంది కల్లు తాగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కల్లుకు బానిసలైన వారు కొన్నిరోజుల పాటు ఇతర ప్రాంతాల్లో ఉండాల్సిన సమయంలో తమ వెంట 20, 30 లీటర్ల కల్లును తీసుకువెళ్తున్నారు. అలా కల్లును తీసుకెళ్లనివారు ఒక్కసారిగా కల్లు తాగడం మానేయడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. అందువల్లే కల్లుకు బానిసలైనవారు నీళ్ల తాగకుండా ఉండగలం కానీ, కల్లు లేకుండా ఉండలేమంటున్నారు. వీరి వ్యసనాన్ని ఆసరాగా తీసుకున్న కల్లు కాంట్రాక్టర్లు పది లీటర్ల కల్లులో మత్తుపదార్థాలు కలిపి వంద లీటర్లు చేసేస్తున్నారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. కల్తీ ఎలా జరుగుతుందంటే... అల్లాదుర్గం, రేగోడ్ మండలాల్లోని ఈత చెట్ల నుంచి సేకరించిన కల్లును డిపోలకు తరలిస్తారు. డిపోల్లో సహజసిద్ధంగా లభించిన కల్లులో డైజోఫాం, అల్ఫాజోలం వంటి మత్తు పదార్థాలను కలుపుతారు. ఆ కల్లును లారీలు, ఇతర వాహనాల్లో గ్రామాలకు రవాణా చేస్తారు. రెండు మండలాలకు చెందిన మెజార్టీ గీత కార్మిక సంఘాలు వారు.. ప్రతి సంవత్సరం జోగిపేటకు చెందిన ఓ కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకుంటారు. గీత కార్మికుల నుంచి సేకరించిన స్వచ్ఛమైన కల్లునే సరఫరా చేయాల్సి ఉండగా, సదరు కాంట్రాక్టర్ కాసులకోసం కక్కుర్తిపడి మత్తుపదార్థాలను కల్లులో కలిపి వారి జీవితాలను నాశనం చేస్తున్నాడు. అయినప్పటికీ ఎక్సైజ్ శాఖ మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. చాలా చోట్ల లెసైన్స్ లేని దుకాణాలు సైతం దర్జాగా కల్లును విక్రయిస్తున్నా, అధికారులు అమ్యామ్యాలతో కళ్లుమూసేసుకున్నారు. శాంపిల్స్ సేకరణ..అదే తంతు ఎక్సైజ్ శాఖ తమ పరిధిలోని దుకాణాలు, కల్లు డిపోల్లోని కల్లును ప్రతి నెల 20 శాంపిల్స్‌ను తీసి నిజామాబాద్‌లోని రీజినల్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ లేబరేటరీకి పంపుతారు. అక్కడి నుంచి వచ్చే రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటారు. కానీ లేబరేటరీ నుంచే వచ్చే రిపోర్టులో కల్తీ శాతం నిల్ అని వస్తోంది. 2013-14 సంవత్సరానికి గాను జోగిపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 250 నుంచి 300 వరకు కల్లు శాంపిల్స్‌ను లేబరేటరీకి పంపగా, అందులో 20 వరకు మాత్రమే కల్తీ అని ఫలితం వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆ 20 దుకాణాలు కూడా గ్రామీణ ప్రాంతంలోని లెసైన్స్‌లేని దుకాణాలు కావడం విశేషం. ఇక మిగతా దుకాణాల్లో కల్లు కల్తీకావడం లేదా అంటే..ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. వాస్తవానికి దాదాపుగా ప్రతి కల్లు దుకాణంలోనూ కల్తీ దందా సాగుతోంది. కానీ రిపోర్టుల్లో మాత్రం కల్తీ నిల్ అని వస్తోంది. ఇలా రిపోర్టు వచ్చేందుకు పెద్దమొత్తంలో నగదు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చేది కొంత..తయారయ్యేది కొండంత అల్లాదుర్గం మండలం ఫరిధిలోని గడిపెద్దాపూర్, వట్పల్లి, బహిరన్‌దిబ్బ, నాగులపల్లి గ్రామాలలోని ఈత చెట్ట నుంచి కల్లును అన్నాసాగర్, అందోలు డిపోలకు తరలిస్తారు. ఈ డిపోల్లో తయారైన కల్లును అందోలు, పుల్కల్ మండలాల్లోని కల్లు దుకాణాలకు సరఫరా చేస్తారు. కేవలం రెండు ప్రాంతాల కోసం మాత్రమే సరిపోయే కల్లును కల్తీ చేసి మిగతా గ్రామాలకు సైతం పంపిణీ చేస్తున్నారు. వారానికి 800 లీటర్ల కల్లు మాత్రమే ఈత వనాల నుంచి రవాణా అవుతున్నట్లు సమాచారం. కానీ జోగిపేట, అందోలు సొసైటీలకు చెందిన 8 కల్లు దుకాణాలతో పాటు పుల్కల్ మండలంలోని 20 గ్రామాలలోని కల్లు దుకాణాలకు ఈ రెండు డిపోల ద్వారా పంపిణీ చేస్తారు. కల్లు డిపోల్లో 30 శాతం ఎక్కువగా కల్లు మిగులుతున్నట్లయితే ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఇతర సొసైటీల వారు లిఖిత పూర్వకంగా కోరితే ఆ గ్రామాలకు కల్లును సరఫరా చేయాలని ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. ఈత వనాల నుంచి వచ్చేది తక్కువే అయినా మత్తు పదార్థాలతో కల్తీచేసి వందల లీటర్లు సర ఫరా చేస్తున్నారు. ఎక్సైజ్ సార్లకు ఏమీ తెలియదట! కల్లునుకల్తీ చేసి యథేచ్ఛగా విక్రయాలు జరుపుతున్నా అబ్బేం అదేం లేదంటున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. జోగిపేటకు సుమారుగా 25 కి.మీ దూరంలో ఉన్న ఈత చెట్ల నుంచి రెండు రోజులకోసారి స్వచ్ఛమైన కల్లును అందోలు, అన్నాసాగర్ డిపోలకు తరలిస్తారు. ఈ కల్లులో నీళ్లు, చక్కెరతోపాటు అల్ఫాజోలం, డైజోఫాం వంటి మత్తు పదార్థాలను కలుపుతారు. ఈ విషయం ప్రపంచమంతా తెలిసినా ఎక్సైజ్ అధికారులకు మాత్రం తెలియనట్లే నటిస్తున్నారు. కొన్ని చోట్ల వారికళ్లముందే ఈ తంతు జరుగుతున్నా పట్టించుకున్న పాపానపోరు. కల్తీ కల్లు సేవించి ఎంతో మంది అనారోగ్యానికి గురై మరణించినా పట్టించుకోవడం లేదు. దీంతో కల్తీ కల్లు వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. -
‘హెరిటేజ్’ను మూసివేయాలి
జోగిపేట: హెరిటేజ్ పరిశ్రమను మూసివేయాలని డిమాండ్ చేస్తూ జోగిపేటలో టీజీవీపీ ఆధ్వర్యంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీజీవీపీ నాయకులు విద్యార్థులతో ఊరేగింపుగా వచ్చి హెరిటేజ్ పరిశ్రమను మూసివేయాలంటూ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకు ముందు వారు స్థానిక తహశీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి, అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ టీజీబీవీ నాయకులు కృష్ణాగౌడ్, సురేష్ మాట్లాడుతూ హెరిటేజ్ పాల కారణంగా చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నందున ప్రభుత్వం వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హెరిటేజ్ పాలను నిషేధించాలి సంగారెడ్డి క్రైం: తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డి కొత్తబస్టాండ్ ఎదుట ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ పాలలో డిటర్టెంట్ కలిపి కల్తీ చేస్తున్నందున ఆ పాలను తెలంగాణ రాష్ట్రంలో నిషేధించాలన్నారు. కల్తీ పాల విక్రయాలకు మద్దతు పలుకుతున్న తెలంగాణ టీడీపీ నేతలు తమ వైఖరిని మార్చుకోవాలన్నారు. హెరిటేజ్ పాలు విక్రయించి ఎక్కువ లాభాలు పొందాలనే దురాలోచనతో ఆవులకు, గేదెలకు ఇంజెక్షన్లు ఇవ్వడంతో పసిపిల్లలు, విద్యార్థులు కిడ్నీ, కాలేయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ పాలను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల వేణు, మండల అధ్యక్షుడు శివరామకృష్ణ, మచ్చేందర్, రాజు, శ్రీనివాస్, నర్సిములు, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. -
సింగూరుపైనే ఆశలు
జోగిపేట: సింగూరు.. జిల్లాలోనే పెద్ద ప్రాజెక్టు. హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే జలాశయం. అంతేకాదు 40 వేల ఎకరాలకు సాగునీరు అందించే సామర్థ్యం గలసాగునీటి వనరు. దీన్ని గుర్తించే 2006 జూన్ 7న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 2 టీఎంసీల నీటిని సాగుకు మళ్లించి ఈ ప్రాంత రైతుల కష్టాలు తీర్చాలని భావించారు. ఇందుకోసం భారీగా నిధులు కేటాయించారు. అయితే వైఎస్సార్ అకాల మరణానంతరం ఈ ప్రాజెక్టుపై ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడంతో సింగూరు నీరు రైతన్నలను ఊరిస్తూనే ఉంది. కానీ జిల్లా రైతుల సాగునీటి కష్టాలు బాగా తెలిసి మంత్రి హరీష్‌రావు సింగూరుపై ప్రత్యేక దృష్టి సారించారు. బడ్జెట్లో నిధులు కేటాయించేలా చూడడంతో పాటు ఈ డిసెంబర్లో 10 వేల ఎకరాలను సింగూరు నీటితో తడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. లిఫ్ట్ ద్వారా నీరందించేందుకు కసరత్తు ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుత నీటి మట్టంగా 518.891 మీటర్లు ఉన్నట్టు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు నిర్ధారించారు. అందువల్ల ప్రస్తుతం ఈ నీళ్లను నేరుగా గేట్లు తెరిచి పంట పొలాలకు పంపించడం వీలుకాదు. కాబట్టి ప్రత్యేకంగా మోటార్లను ఏర్పాటు చేసి లిఫ్ట్ ద్వారా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇరిగేషన్ ఈఈ ఆత్మరాం ‘సాక్షి’కి తెలిపారు. లిఫ్ట్ వద్ద మోటార్ల ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం, రూఫ్‌షెడ్ వంటి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఇరిగేషన్ శాఖ ఎస్ఈ శైలేంద్ర పనులను పరిశీలించారు. ఏదైనా సరే డిసెంబర్ మొదటి వారం వరకు 10 వేల ఎకరాలను సింగూరు నీరందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్లో రూ.13 కోట్లు తెలంగాణ రాష్ర్టం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లో సింగూరు ప్రాజెక్టుకు రూ.13 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో రైతులకు బకాయిగా ఉన్న రూ.5 కోట్ల పరిహారం పంపిణీ చేయనున్నారు. ఇక మిగిలిన నిధులతో కాల్వల నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. మంత్రి హరీష్‌రావు ప్రత్యేక చొరవ జిల్లాలోనే పెద్ద ప్రాజెక్టుగా ఉన్న ‘సింగూరు’ ద్వారా రైతులకు సాగునీరందించే విషయంలో నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత తొలిసారి జూలై 21నమంత్రి హరీష్‌రావు, స్థానిక శాసనసభ్యుడు పి.బాబూమోహన్‌తో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. అక్కడే ఇరిగేషన్ శాఖ రాష్ట్రఅధికారులతో సమావేశమై రబీలో 10 వేల ఎకరాలకు, వచ్చే ఖరీఫ్ నాటికి 40వేల ఎకరాలకు సింగూరు నీరందిస్తామని ప్రకటించారు. -
పెన్షన్.. టెన్షన్!
జోగిపేట: జిల్లాలో ఇప్పటి వరకు సుమారు ఐదు వేల పింఛన్ల పంపిణీ జరిగినట్లు సమాచారం. అయితే పింఛన్లకు సంబంధించి ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. పింఛన్ల కోసం దరఖాస్తులు కుప్పలు, తెప్పలుగా రావడం, మార్గదర్శకాల్లో స్పష్టత లేకపోవడంతో అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు. వృద్ధాప్య, వితంతు, వికలాంగులతో పాటు పాటు వివిధ కేటగిరీల కింద పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 6,7 తేదీల్లో అర్హుల జాబితాను ఎంపిక చేసి పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించాలని అధికారులు ప్రకటించారు. అయితే జాబితా సిద్ధం కాకపోవడంతో ఆ ఆదేశాలను చాలా వరకు సిబ్బంది పాటించలేదనే విమర్శలున్నాయి. దీంతో దరఖాస్తు చేసుకున్న వారు, గతంలో పెన్షన్లు పొందిన వారు మాత్రం తమకు పెన్షన్ వస్తుందో..రాదోననే ఆందోళనతో ఉన్నారు. జిల్లాలో సుమారుగా 2.40 లక్షల మందికి ఆసరా పథకం కింద పింఛన్ల పంపిణీ చే సేందుకు ఎంపిక చేశారని అధికార వర్గాలు తెలిపాయి. అందోలు మండలంలో నగర పంచాయతీ మినహా మిగతా గ్రామాల్లో 6,914 దరఖాస్తులు రాగా, 4374 పెన్షన్లు మంజూరైనట్లు తెలిపారు. జోగిపేట-అందోలు నగర పంచాయతీ పెన్షన్ల విషయంలో కొంత అయోమయం నెలకొంది. పట్టణంలో పెన్షన్ దారులు, దరఖాస్తు చేసుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆసరా పథకం పేరుతో వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1,500 ఇస్తుండడంతో లబ్ధిదారులు కొత్త పింఛన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 8న అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్ చేతుల మీదుగా సుమారు 600 మందికి పెన్షన్లను పంపిణీ చేశారు. అయితే చాలా మంది పేర్లు జాబితాలో కనిపించకపోవడం...వారు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో గ్రామాల్లో పంపిణీ చేస్తామని చెబుతున్నా, అది సాధ్యం కాదంటున్నారు. ప్రొసీడింగ్‌లను సిద్ధం చేసి కార్డులను సిద్ధం చేసి, జాబితాను ఆన్లైన్లో పెట్టాల్సి ఉంది. -
సింగూరు పారేనా.. సిరులు పండేనా
జోగిపేట: సాగునీటికోసం అల్లాడిపోతున్న మెతుకుసీమ రైతులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సింగూరు జలాలు ఏళ్లుగా ఊరిస్తూనే ఉన్నాయి. 40 వేల ఎకరాలకు నీరందించాలన్న లక్ష్యంతో చేపట్టిన పనులకు గ్రహణం పట్టడంతో గతంలో నిర్మించిన కాల్వలు శిథిలమయ్యాయి. ప్రత్యేక రాష్ట్రంలోనైనా సింగూరు జలం పారితే సిరులు పండించాలని రైతులంతా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. కొన సా...గుతున్న పనులు ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటించిన వైఎస్ రాజశేఖరరెడ్డి మె తుకుసీమ రైతాంగం దుస్థితి చూసి చలించిపోయారు. సాగు నీటికోసం వారు పడుతున్న ఇబ్బందులు చూసి ఎంత ఖర్చయినా సరే సింగూరు జలాలను సేద్యానికి అందిస్తామని హామీ ఇచ్చారు. సింగూరు జలం పారితే 40 వేల ఎకరాలు పచ్చగా ఉంటాయని తెలుసుకుని, 2004లో అధికార పగ్గాలు చేపట్టగానే సింగూరు కాల్వల నిర్మాణానికి, భూములు కోల్పోతున్న రైతులకు పరిహారానికి రూ.89.98 కోట్లు మంజూరు చేశారు. అనంతరం 2006లో ముఖ్యమంత్రి హోదాలో ఈ పనులకు శంకుస్థాపనలు కూడా చేశారు. అనంతర కాలంలో నిధులు విడుదల కాకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. దీంతో గతంలో నిర్మించిన కాల్వలు కూడా శిథిలమయ్యాయి. ‘ట్రయల్న్’్రతో చెరువుల్లోకి నీరు అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సింగూరు జలాలను సాగుకు అందించాలన్న ఉద్దేశంతో హడావుడిగా పనులు చేపట్టింది. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి 13న అప్పటి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఎడమ కాల్వ నుంచి నీటిని చెరువుల్లోకి పంపేందుకు ట్రయల్న్‌న్రు ప్రారంభించారు. అందోల్ చెరువులోకి నీరును తరలించేందుకు ప్రత్యేక చర్యల కారణంగా మార్గమధ్యలోని సుమారు 20 చెరువుల్లోకి నీరు చేరింది. ఎడమ కాల్వ నుంచి 0.15 టీఎంసీల నీటిని అప్పట్లో వదిలినట్లు అధికార వర్గాలు తెలిపాయి. లిఫ్ట్ పనులు పూర్తయ్యేదెన్నడో లిఫ్ట్ ద్వారా సేద్యానికి నీరందించేందుకు గాను ప్రభుత్వం రూ.17 కోట్లను మంజూరు చేసింది. ఇప్పటి వరకు ఈ పథకానికి రూ.6 కోట్లు విడుదల చేసినట్లు సంబంధిత శాఖ డిప్యూటీ ఈఈ జగన్నాథం తెలిపారు. ఈ పథకానికి రాజనర్సింహ లిఫ్ట్ ఇరిగేషన్ అని నామకరణం చేశారు. ఈ పనులు పూర్తయితేనే నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు కాల్వల ద్వారా నీటిని అందించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మంత్రి హరీష్‌రావుపైనే ఆశలు ఏళ్లుగా సాగుతున్న సింగూరు పనులను వెంట నే పూర్తి చేస్తే 40 వేల ఎకరాలకు సాగు నీరందుతుందని, అందువల్ల జిల్లాకు చెందిన నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు ఈ పథకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని రైతులు కోరుతున్నారు. మంత్రికి జిల్లాపై పూర్తి అవగాహన ఉన్నందున తప్పనిసరిగా సింగూరు కాల్వల నిర్మాణం ప నులు పూర్తి అవుతాయని వారు ఆశాభావం వ్య క్తం చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టుకు సంబంధించిన పనులపై నీటి పారుదల శాఖ ఉన్నత అధికారులతో ఈనెల 21వ తేదీన సింగూరులో విసృ్తత స్థాయి సమావేశాన్ని మంత్రి టి.హరీష్‌రావు ఏర్పాటు చేయడంతో రైతులంతా గంపెడాశలతో శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు. -
కుర్సీ వేసుకుంటా
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ఆంధ్ర ప్రాజెక్టులు చకచకా పూర్తయిపోతున్నాయి. మన సింగూరు.. చిన్న ప్రాజెక్టు. ఇంత చిన్న ప్రాజెక్టు ఇప్పటివరకు ఎందుకు పూర్తికాలేదు? ఇప్పుడు నేను చెప్తున్నా.. సింగూరు ఇప్పుడైతది. అవసరమైతే సింగూరు కట్ట మీద కుర్సేసుకొని కూర్చుంటా.. ప్రాజెక్టు కట్టిస్తా’అని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. జోగిపేటలో మంగళవారం తెలంగాణ విజయోత్సవ సభ జరిగింది. ఈ సభకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త బీబీ పాటిల్, మాజీ మంత్రి కరణం రామచంద్రారావు భార్య, మాజీ ఎమ్మెల్యే కరణం ఉమాదేవిలకు కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన ప్రసంగించారు.గతంలో బాబూమోహన్‌ను గెలిపించడం కోసం జోగిపేటకు వ చ్చానని, ఈ నియోజక వర్గంపై నాకు పూర్తి అవ గాహన ఉందని చెప్పారు. ఆనాడు మీరు బాబుమోహన్‌ను గెలిపిస్తే జోగిపేటను దత్తత తీసుకుంటానని చెప్పి రూ.100 కోట్ల అభివృద్ధి పనులు చేశానని కేసీఆర్ గుర్తుచేశారు. ‘1930లో ఇక్కడ ప్రథమాంధ్ర మహాసభ జరిగింది. 2014లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు మొట్ట మొదటి తెలంగాణ సభ ఇక్కడే జరుగుతోంది. జోగిపేటకే ఆ గౌరవం దక్కిందని’ అన్నారు. జోగిపేటను సిద్దిపేటగా మారుస్తానని హామీ ఇచ్చారు. రైతుల ఆకలి చావులకు, చేనేత కార్మికుల ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలే కారణమన్నారు. సింగూరు నుంచి అందోల్‌కు 40 వేల ఎకరాలకు నీళ్లు రావాలని ఏనాడో 30 ఏళ్ల క్రితం జీఓ ఇస్తే ఇవాల్టీకి చుక్కనీరు రాని పరిస్థితి ఉందన్నారు. ‘సింగూరు ప్రాజెక్టుకు కాల్వలు తవ్విన పరిస్థితి ఘోరంగా ఉంది. తూములు ఎంత ఎత్తులో ఉన్నాయ్, కాల్వలు ఏ ఎత్తులో తవ్వారు? ఇలాంటి పనులతో సింగూరు నీళ్లను మనం జన్మలో చూస్తమా?’ అని ప్రశ్నించారు. సింగూరు ఎత్తి పోతల ప్రాజెక్టును కూడా మంజూరు చేయించింది కేసీఆరే అని చెప్పారు. సోనియాగాంధీని ఒప్పించి ప్రాజెక్టును పట్టుకొచ్చినట్లు చెప్పారు. ఇక్కడినుంచి మనుషులు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నా కానీ ఆ పని ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చే యలేదని కేసీఆర్ ప్రశ్నించారు. సింగూరు నిండిన తర్వాత చాలా నీళ్లు గోదావరి నదిలోకి పోతున్నాయని, అవసరమైతే ఇంజినీరింగ్ నిపుణులతో మాట్లాడి సింగూరు ప్రాజెక్టు సామర్థ్యం పెంచగలిగే అవకాశం ఉంటే పెంచేందుకు కృషి చేస్తానన్నారు. జోగిపేటలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తానని అన్నారు. మెదక్ జిల్లాను సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ అనే మూడు జిల్లాలుగా విభజన చేస్తామని చెప్పారు. ఈ జిల్లాల పునర్నిర్మాణంలో వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని కేసీఆర్ తెలిపారు. మెతుకుసీమలో మంచి భూములు ఉన్నాయని, ఇక్కడి వర్షపాతం సగటున 900 నుంచి 1000 మిల్లీమీటర్లు ఉంటుందన్నారు. ఇక్కడి రైతులను మంచి పంటలు పండించేలా ప్రోత్సహించి, ఆ పంట విత్తనాలను తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను లక్షాధికారులుగా చేస్తామని ఆయన చెప్పారు. మెదక్ జిల్లాలో చిన్న నీటి పారుదల పనుల్లో రూ. కోట్లు అవినీతి జరిగిందని, టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వాటిని తిరిగి రాబడతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. సభలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ, ఎమ్మెల్యేలు హరీష్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, హన్మంత్ షిండే, గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, ఆకుల రాజేందర్, ఎమ్మెల్సీ మహమ్మద్ అలి, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు
జోగిపేట, న్యూస్‌లైన్: కాంగ్రెస్‌తో ఎట్టిపరిస్థితిలో పొత్తు ఉండదని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు హరీష్‌రావు స్పష్టం చేశారు. ఏప్రిల్ 1న జోగిపేట శివారులో నిర్వహించనున్న కేసీఆర్ బహిరంగ సభకు సంబంధించిన సభా వేదిక స్థలాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేసారు. జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ప్రసక్తేలేదని, ఆ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజలను తికమక పెట్టేందుకు పొత్తులు ఉంటాయంటూ చెబుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు బంగారు తెలంగాణను కోరుకుంటున్నారని, ఆదిశగా టీఆర్ఎస్ కృషి చేయనుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల అభ్యర్థుల జాబితా సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల్లో గెలిచే గుర్రాలనే గుర్తించి టికెట్లను పార్టీ అధిష్టానవర్గం ఖరారు చేస్తుందన్నారు. ఆయనతోపాటు మాజీ ఎంపి పి.మాణిక్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, అందోల్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి పి.కిష్టయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పి.శివశేఖర్, డాకూర్ సర్పంచ్ ఏ.శంకరయ్య, నాయకులు డిబి.నాగభూషణం, ఎల్లయ్య, అరవిందరెడ్డి, అనిల్‌గౌడ్ తదితరులు ఉన్నారు. -
‘దొరతనంలేని తెలంగాణ తెచ్చుకుందాం’
జోగిపేట: దొరతనం పారదోలే తెలంగాణను ప్రజలు, యువత కోరుకుంటున్నారని, అందుకు అందరం కృషి చేద్దామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ డిప్యూటీ సీఎం సి.దామోదర రాజనర్సింహ అన్నారు. మెదక్ జిల్లా జోగిపేటలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియాగాంధీ రుణం తీర్చుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించింది రాజకీయ పార్టీలు కాదని ఉద్యోగ, విద్యార్థి, కళాకారులేనన్నారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కాంగ్రెస్‌కే సాధ్యమని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనదేనన్నారు. -
సింగూరు ఎడమ కాల్వకు నీరు
పుల్కల్/ జోగిపేట, న్యూస్‌లైన్: ‘సింగూరు’ ట్రయల్ రన్‌ను డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ గురువారం ప్రారంభించారు. పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వారా మెయిన్ కాల్వలోకి నీటిని వదిలారు. ఈ సందర్భంగా ఆయన ఎడమ కాల్వ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎడమ కాల్వకు ఉన్న రెండు గేట్లను ఎత్తారు. అక్కడి నుంచి కాల్వ వెంట సుమారు మూడు కిలో మీటర్ల మేర పాదయాత్ర చేశారు. అనంతరం ముద్దాయిపేట వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నాటి 102 రోజుల దీక్ష ఫలితం, వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీ నేడు నెరవేరిందని అన్నారు. ఎనిమిది చెరువుల్లోకి నీరు ఎడమ కాల్వ ద్వారా వదిలిన 0.15 టీఎంసీల నీరు పుల్కల్ మండలంలో ఐదు చెరువులకు, అందోల్ మండలంలో మూడు చెరువులకు వెళ్లనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నీరు చెరువుల్లోకి చేరితే సుమారు 7,550 ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. సింగూరు ఎడమ కాల్వ నుంచి వదిలిన నీరు మొదట అందోల్ పెద్ద చెరువులోకి వెళ్లనున్నాయి. ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ స్మితా సబర్వాల్, ఆర్డీఓ వనజాదేవి, జెడ్పీ మాజీ చైర్మన్ బాలయ్య, జగన్మోహన్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లప్ప, డీసీసీబీ డెరైక్టర్ రాంచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షలు దుర్గారెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, గోవర్ధన్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ప్రజలు పాల్గొన్నారు. -
ఆసరా కోసం వేదన
జోగిపేట, న్యూస్‌లైన్: వృద్ధాప్యంలో ఆసరాగా నిలిచిన పింఛన్‌ను అధికారులు ఏవో సాకులు చెబుతూ ఇవ్వకపోవడంతో పండుటాకులు రోడ్డెక్కారు. పోస్ట్ ఆఫీస్‌లో వద్దు, పంచాయతీలోనే ఇవ్వాలంటూ రాస్తారోకో చేపట్టారు. వీరికి తోడుగా వికలాంగులు, వితంతువులు కూడా వచ్చి సంఘీభావం తెలిపారు. పోలీసులు వచ్చి నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. వివర్లాకి వెళ్తే... జోగిపేట పట్టణంలోని పోస్టాఫీసులో పెన్షన్ తీసుకునేందుకు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు శుక్రవారం వచ్చారు. అయితే బయోమెట్రిక్ మిషన్ పనిచేయడంలేదని వెళ్లిపోవాలని సిబ్బంది సూచించారు. దీంతో ఆగ్రహించిన వృద్ధాప్య పింఛన్‌దారులు పోస్టాఫీసు ముందు ఆందోళనకు దిగారు. తమకు పింఛన్లు పోస్టాఫీసులో వద్దు నగర పంచాయతీలో చెల్లించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెన్షన్‌దారులు రాస్తారోకో చేపట్టడంతో సంగారెడ్డి వైపు వెళ్లే రహదారిలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊస మానిక్యం వారికి మద్దతు తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల వరకు పింఛన్లు చెల్లించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి వృద్ధులకు నచ్చజెప్పి ఈ విషయమై అధికారులతో మాట్లాడారు. దీనిపై పోస్టల్‌శాఖ అధికారి ఎంజిఎస్ ప్రసాద్ వివరణ ఇస్తూ శుక్రవారం కొద్దిమందికి ఇచ్చిన తర్వాత మిషన్ పనిచేయలేదని, అందుకే ఇవ్వలేదన్నారు. మున్సిపల్ ఉన్న చోట కమిషనర్ సిబ్బందే చెల్లిస్తున్నారని, ఇక్కడ కూడా అలాగే చెల్లిస్తే బాగుంటుందన్నారు. -
‘బిల్లు’లో అభ్యంతరకర అంశాలు
జోగిపేట, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన విభజన బిల్లులో తెలంగాణకు అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన జోగిపేటలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు, పెన్షను, జలాలు, ఆస్తులు, అప్పులు, ఉన్నత విద్యకు సంబంధించిన అం శాల్లో తెలంగాణకు నష్టం జరిగే విధంగా ముసాయిదాలో పొందుపరచారన్నారు. ఆరు సూత్రాల పథకానికి విరుద్ధంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన 83వేల మంది తెలంగాణ వారికి చెందిన ఉద్యోగాల్లో అక్రమంగా చేరారన్నారు. 1969లో జీఓ 36 ప్రకారం 24వేల మంది అక్రమంగా నియమితులయ్యారని, 1985లో జీఓ 610 ప్రకారం 59 వేల మంది అక్రమంగా నియమితులయ్యారని, వీరిని వెంటనే వారి వారి స్వస్థలాలలకు పంపించాలని జీఓ జారీ చేసినా నేటి వరకు అమలుకాలేదన్నారు. ఆరు సూత్రాల పథకానికి విరుద్ధంగా ఆంధ్ర ఉద్యోగులు 1.62 లక్షల మంది తెలంగాణలో పనిచేస్తున్నారన్నారు. వీరందరిని ఆంధ్ర ప్రాంతానికి పంపిస్తే తెలంగాణకు సంవత్సరానికి రూ.5 వేల కోట్లు మిగులుతాయన్నారు. కృష్ణా, గోదావరి జలాలను ప్రాం తాల వారీగా పంపిణీ చేయాలన్నారు. రాష్ట్రంలో రూ.1.70 వేల కోట్ల అప్పులున్నాయని, వీటిని ఏ ప్రాంతానికి ఎక్కువ ఖర్చుపెట్టారో ఆ విధంగానే పంపకాలుండాల న్నారు. సింగరేణి, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగుల నుంచి ఎలాంటి సూచనలు ముసాయిదాలో చేయలేదన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ శాంతి భద్రతలను రాష్ట్ర గవర్నర్‌కు అప్పగించారని విమర్శించారు. సమావేశంలో అందోల్ నియోజకవర్గ ఇన్చార్జి పి.కిష్టయ్య, జిల్లా నాయకులు డీబీ నాగభూషణం, ఏ.శంకరయ్య, మండల నాయకులు సిహెచ్.వెంకటేశం, జి.ఎల్లయ్య, ఎండి.ఖాజా పాల్గొన్నారు. -
దొంగనోట్ల కలకలం
జోగిపేట, న్యూస్‌లైన్: రూ.500 నోట్లను చూస్తే జోగిపేట వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఎంత దగ్గరి బంధువులు ఇచ్చినా అనుమానంగా చూస్తున్నారు. ఏకంగా వాటిని గుర్తించేందుకు పలువురు వ్యాపారస్తులు స్కానింగ్ యంత్రాలను కొనుగోలుచేస్తున్నారు. దీనికి కారణం ఈ ప్రాంతంలో దొంగనోట్ల చెలామణి అధికంగా ఉండడమే. వివరాల్లోకి వెళ్తే.. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి పత్తి కొనుగోలు చేసేం దుకు వచ్చిన వ్యాపారస్తులు రైతులను దొంగనోట్లతో నిలువునా మోసం చేస్తున్నారు. ఇటీవల జోగిపేట ప్రాంతానికి చెందిన రైతు మద్నూర్ ప్రాంతంలో పత్తిని విక్రయించగా వారు ఇచ్చిన డబ్బులతో తిరిగి ఇంటికి చేరుకున్నాడు. అతడు రూ.500 నోటును తీసుకొని కిరాణదుకాణానికి వెళ్లగా అనుమానం వచ్చిన కిరాణదారుడు స్కానింగ్ మిషన్‌లో పరీక్షిం చాడు. దీంతో అది దొంగనోటుగా తేలింది. ఈ విషయం చెప్పడంతో రైతు తనకు పత్తి విక్రయదారుడు ఇచ్చిన అన్ని నోట్లను స్కాన్ చేయిం చాడు. అందులో రూ.5 వేల వరకు దొంగ నోట్లుగా తేలింది. దీంతో బాధిత రైతు లబోదిబోమన్నాడు. స్థానికంగా ఉన్న దుకాణాలలో రోజుకో చోట రూ.500, రూ.1000 నోట్లు వస్తూనే ఉన్నాయి. దీంతో వ్యాపారస్థులు ఈ నోట్లను చూస్తే చాలు వణికిపోతున్నారు. బ్యాంకుల్లో కూడా వచ్చిన నోట్లను అధికారులు గుర్తించి పెన్నుతో కొట్టేసి తిరిగి ఇచ్చేస్తున్నట్లు తెలిసింది. గత సంవత్సరం కూడా పుల్కల్ మండలం చౌటకూర్ గ్రామంలో కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యాపారస్తులు రూ.15 నుంచి 20 వేల వరకు దొంగనోట్లు వచ్చాయి. తర్వాత గుర్తించిన రైతులంతా వారి వద్దకు పరుగులు తీసిన విషయం పాఠకులకు విదితమే. స్థానిక పెట్రోల్ బంక్‌లల్లో ఎవరైనా రూ.500 నోటు ఇస్తే వారి వాహనం నంబరును కూడా ఆ నోటుపై రాసి పెడుతున్నారు. ఇటీవల పోసానిపేటకు చెందిన ఒక రైతు టాక్టర్ కిరాయిగా మూడు వెయ్యి రూపాయల నోట్లను ట్రాక్టర్ యజమానికి ఇవ్వగా అవి దొంగనోట్లు అని తేలడంతో ఈ వ్యవహరం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లినట్లు సమాచారం. దొంగనోట్లు వస్తుండడంతో ఆందోళన చెందుతున్న వ్యాపారస్థులు చేసేదిలేక డబ్బు లు లెక్కించే మిషన్లు కొనుగోలు చేస్తున్నారు. పట్టణంలో ఇప్పటికే 20 నుంచి 30 వరకు మిషన్ల కొనుగోలు చేసినట్లు తెలిసింది. పోలీస్‌శాఖ దొంగనోట్లకు సంబంధించి ప్రత్యే క నిఘాను ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యాపారస్థులు, ప్రజలు కోరుతున్నారు. -
డిసెంబర్ నుంచి ఇందిరమ్మ హస్తం ప్రారంభం
జోగిపేట, న్యూస్‌లైన్: జిల్లాలో కొత్తగా మూడు ప్రాజెక్టుల పరిధిలో ఇందిరమ్మ అమృత హస్తం పథకాన్ని డిసెంబర్ 1నుంచి ప్రారంభిస్తున్నట్లు ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ శైలజ తెలిపారు. శుక్రవారం జోగిపేటలో నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మొదటి విడతగా జిల్లాలో ఐదు ప్రాజె క్టుల పరిధిలో ఈ పథకాన్ని కొనసాగిస్తూ రెండో విడతగా జోగిపేట, దుబ్బాక, గజ్వేల్ ప్రాజెక్టుల్లో ప్రారంభిస్తున్నామని తెలిపారు. జిల్లాలో సిద్దిపేట, పటాన్చెరు, సదాశివపేట ప్రాజెక్టుల్లో ఈ పథకం ప్రారంభం కాలేదన్నారు. గతంలో బాలింతలు, గర్భిణుల ఇళ్లకు వెళ్లి పౌష్టికాహారాన్ని పంపిణీ చేసేవారమని, అలా పంపిణీ చేయడం వల్ల పారదర్శకత లోపిస్తోందని భావించి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోనే వారికి వండి పెడతామని నెలకు 25 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్లు నిర్వహిస్తారన్నారు. ఐకేపీ వారు పాలు, కూరగాయలు, పోపు సామాన్లు సరఫరా చేస్తారని వీటికి గాను ఐసీడీఎస్ తరఫున డబ్బులను వారి ఖాతాల్లో వేస్తామన్నారు. కందిపప్పు, బియ్యం, ఆయిల్, గుడ్లు ఐసీడీఎస్ తరఫున పంపిణీ చేస్తామన్నారు. శిశుమరణాలు తగ్గించేందుకు పుట్టిన బిడ్డ బరువు పెంచేందుకు, రక్త హీనతను తగ్గించేందుకు ఈ పథకం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి ఐసీడీఎస్ సీడీపీఓ ఎల్లయ్య అధ్యక్షత వహించారు. ప్రాజెక్టు పరిధిలో బాలామృతం పథకం ఏడు నెలల నుంచి 3 సంవత్సరాలలోపు పిల్లలకు ప్రతినెల బాలామృతం పథకం క్రింద రెండున్నర కిలోల పోషక పదార్థాల పాకెట్‌ను పంపిణీ చేస్తామని ప్రాజెక్టు అధికారి ఎల్లయ్య తెలిపారు. ప్రతి రోజు 20 గ్రాముల చొప్పున దీనిని పిల్లలకు పట్టించాల్సి ఉంటుందన్నారు. ఏపీ ఫుడ్ పంపిణీ చేసే మాడిఫైడ్ థెరఫ్యూటిక్ ఫుడ్‌ను డిసెంబర్ 1నుంచి ప్రాజెక్టు పరిధిలోని పిల్లలకు అందించనున్నట్లు తెలిపారు. -
పాలిటెక్నిక్ కళాశాలలోపుట్టెడు సమస్యలు
జోగిపేట, న్యూస్‌లైన్: స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో కనీస వసతులు కరువయ్యాయి. సొంత భవనం లేకపోవడంతో డిగ్రీ కళాశాల భవనంలో తాత్కాలిక పద్ధతిన కొనసాగుతోంది. గదులు, అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. టాయిలెట్స్ లేక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. ల్యాబ్‌లు లేక ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇలా అనేక సమస్యలతో విద్యార్థులు విద్యాభ్యాసాన్ని సాగిస్తున్నారు. 2011 సంవత్సరంలో జోగిపేటకు పాలిటెక్నిక్ కళాశాల మంజూరైంది. సొంత భవనం లేకపోవడంతో ప్రస్తుతం ఆ కళాశాలను స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మూడు గ్రూపులు కొనసాగుతున్నాయి. ఎలక్ట్రానిక్, మెకానికల్, ఈసీఈలో మొత్తం 435 మంది విద్యార్థులున్నారు. కళాశాల ఏర్పాటై రెండేళ్లు పూర్తి కావస్తున్నా సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. సొంత భవనాన్ని నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని అందోల్ శివారులో గుర్తించినా నిధులు మంజూరు కాలేదు. పాలిటెక్నిక్ కళాశాలలో కనీసం కరెంటు సౌకర్యం కూడా లేకపోవడం శోచనీయం. సాంకేతిక విద్యకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో సమాచారాన్ని ప్రభుత్వం అందించే క్రమంలో కంప్యూటర్ను కూడా వినియోగించుకోలేని దుస్థితి. అందోల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సంబంధిత శాఖనే చూస్తున్నా నిధులు మంజూరు కాకపోవడం గమనార్హం. మూడు కోర్సులను నిర్వహించేందుకు తొమ్మి ది తరగతి గదులు అవసరం ఉన్నా ప్రస్తుతం ఏడు గదులే ఉన్నాయి. కొత్త భవనం అందుబాటులోకి రాగానే మరో మూడు గదులు కేటాయిస్తామని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హమీ ఇచ్చినట్టు సమాచారం. ప్రాక్టికల్స్‌కు మాసాబ్‌ట్యాంకు, జహీరాబాద్ వెళ్లాల్సిందే.. స్థానిక కళాశాలలో ల్యాబ్‌కు సంబంధించి ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రాక్టికల్స్ కోసం వంద కిలో మీటర్ల దూరంలోని జహీరాబాద్‌కు విద్యార్థులను పంపుతున్నారు. 10 నుంచి 15 రోజులపాటు అక్కడే ఉండి ఏడాదికి సంబంధించిన ప్రాకిక్టల్స్ను పూర్తి చేసుకొని వస్తున్నారు. జహీరాబాద్‌లో ఈసీఈ కోర్సు లేకపోవడంతో ఆ కోర్సుకు సంబంధించిన విద్యార్థులు మాసాబ్‌ట్యాంక్‌కు వెళ్లాల్సి వస్తుంది. పోస్టులన్నీ ఖాళీనే... పాలిటెక్నిక్ కళాశాలలో దాదాపు పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ప్రిన్సిపాల్, లైబ్రరీయన్, పీడీ, సీనియర్ అసిస్టెంట్-2, జూనియర్ అసిస్టెంట్-2, ఎలక్ట్రికల్ ప్రధానశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం సీనియర్ ప్రధానశాఖాధికారి ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. కేవలం నలుగురు రెగ్యులర్, పదిమంది పార్ట్‌టైం లెక్చరర్లు మాత్రమే పనిచేస్తున్నారు. -
కట్నం వేధింపులతో మహిళ ఆత్మహత్య
జోగిపేట, న్యూస్‌లైన్ : అదనపు కట్నం వేధిం పులు తాళలేక మండల పరిధిలోని డాకూర్ గ్రా మానికి చెందిన జ్యోతి (22) సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ ముకీద్‌పాషా కథనం మేరకు.. అందోల్ మండలం డాకూర్ గ్రామానికి చెందిన భూమయ్యకు టేక్మాల్ గ్రామానికి చెందిన జ్యోతినిచ్చి ఏడాదిన్నర క్రితం లాంఛనాలతో వివాహం చే శారు. మొదట్లో వీరి సంసారం సాఫీగా సాగి నా కొంత కాలం తరువాత భర్త రూ. లక్ష అదనపు కట్నం తేవాలని వేధించేవాడు. సోమవా రం కూడా కట్నం డబ్బు తేవాలని భర్త భూమ య్య వేధించసాగాడు. దీంతో భర్త పెట్టే వేధిం పులు తాళలేక ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగువారు ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకంగా ఉండటంతో ఆమెను సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
‘అక్షయపాత్ర ’ భోజనంలో బల్లి అవశేషాలు
జోగిపేట, న్యూస్‌లైన్: విద్యార్థులకు అక్షయపాత్ర ద్వారా అందిన మధ్యాగ్న భోజనంలో బల్లి అవశేషాలు కనిపించాయి. దీంతో విద్యార్థులు భోజనం చేసేందుకు నిరాకరించడంతో మళ్లీ భోజనం పంపిస్తామని హామీ ఇచ్చిన నిర్వాహకులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో చిన్నారులంతా ఆకలితో అలమటించారు. స్థానికంగా చర్చనీయాంశమైన ఈ సంఘటన జోగిపేట ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం...జోగిపేట ఉర్దూ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పంపిణీ చేసే అక్షయపాత్ర నిర్వాహకులు ఎప్పటిలాగే సోమవారం ఉదయం 11 గంటలకు అన్నం, సాంబారు ఉన్న పాత్రలను పాఠశాలలో ఉంచి వెళ్లిపోయారు. మధ్యాహ్నం భోజనాన్ని పంపిణీ చేస్తున్న క్రమంలో బల్లి అవశేషాలు భోజనంలో కనిపించాయి. దీంతో ఉపాధ్యాయులు చిన్నారులకు భోజనాన్ని వడ్డించకుండా మానేశారు. ఈ విషయం సమీప ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థులకు కూడా తెలియడంతో వారంతా అక్షయపాత్ర ద్వారా అందిన మధ్యాహ్న భోజనం చేసేందుకు నిరాకరించారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు కూడా భోజనం తినవద్దని చిన్నారులకు సూచించారు. వెంటనే ఉపాధ్యాయులు ఈ విషయాన్ని అక్షయపాత్ర నిర్వాహకులకు తెలిపారు. వెంటనే పరిశుభ్రమైన భోజనాన్ని మళ్లీ పంపాలని కోరారు. అయితే అందుకు అంగీకరించిన అక్షయపాత్ర నిర్వాహకులు సాయంత్రం 4 గంటల వరకూ భోజనం పంపలేదని హెచ్ఎం బిక్షపతి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. దీంతో కొందరు విద్యార్థులు హాస్టళ్లకు వెళ్లిపోగా, మిగతా వారంతా ఆకలితో అలమటించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆగ్రహం అక్షయప్రాత నిర్వాహకులు నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు పంపిణీ చేసే ఆహారంలో నాణ్యతలోపంతో పాటు పురుగులు రావడంపై వారు ఆందోళన చెందారు. అన్నంలో బల్లి వచ్చిన విషయాన్ని చిన్నారులు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులను ప్రశ్నించారు. పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని వారు హెచ్చరించారు. -
ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం
మెదక్ : ఆందోల్ మండలం జోగిపేటలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నం చేసింది. పద్మ అనే మహిళ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. వారి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. కన్న పిల్లలను చంపి, ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి కారణాలు తెలియలేదు. -
టీచర్ల పనితీరులో మార్పు
జోగిపేట, న్యూస్‌లైన్: ఉపాధ్యాయుల పనితీరులో చాలా మార్పు వచ్చిందని, బాగా పనిచేస్తున్నారని, భవిష్యత్తులో మంచి ఫలితాలు రావడం ఖాయమని జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్ పేర్కొన్నారు. గురువారం జోగిపేటలోని బాలుర ఉన్నత పాఠశాల, ఉపాధ్యాయుల నిరంతర సమగ్ర మూల్యాంకనపై శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కలెక్టర్ విద్యపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, ఈ సంవత్సరం మంచి ఫలితాలు సాధిం చేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. ఈ సారి జూలై మాసం నుంచే 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభించినట్లు తెలిపారు. హెచ్ఎంలు వారానికి 8 తరగతులు తప్పనిసరిగా నిర్వహించాలని, లేనట్లయితే ఇంక్రిమెంట్లు కట్ చేస్తామని హెచ్చరించారు. స్పోకన్ ఇంగ్లీష్ తరగతులను నిర్వహించాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు. పాఠశాలల్లో ప్రతి శుక్రవారం అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులచే క్విజ్ పోటీలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో విద్యావలంటీర్ల స్థానంలో ప్రభుత్వం అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టుల నియామకాన్ని చేపడుతుందని తెలిపారు. జిల్లాకు 230 పోస్టులను కేటాయించినట్లు వివరించారు. ఉన్నత పాఠశాలల్లో 430 పోస్టులు అవసరమని ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. మండల స్థాయిలో సమగ్ర మూల్యాంకనంపై నిర్వహిస్తున్న శిక్షణ పట్ల ఉపాధ్యాయులు సైతం సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. మారిన సిలబస్‌ను ఎలా భోదించాలన్న విషయమై శిక్షణలో ఉపాధ్యాయులకు తెలియజేస్తున్నట్లు చెప్పారు. శిక్షణ కేంద్రం వద్ద సలహాల బాక్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముం దు జోగిపేట ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు సంబంధించిన హాజరు రిజిష్టరు, మధ్యా హ్న భోజన పథకంనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన చెత్త డబ్బాను చూసి అభినందించారు. ఎంఇఓ బి.గోపాల్ ఆయన వెంట ఉన్నారు.