జోగిపేట (అందోల్): ‘గురువు గారూ.. మేం మీ విద్యార్థులం’అంటూ నమ్మించిన యువకులు ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడి ఇంట్లో నుంచి రూ. 30 లక్షల నగదు , 10 తులాల నగలు అపహరించుకు పోయారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎస్సీ బాలుర హాస్టల్ ప్రాంతంలో రిటైర్డ్ టీచర్ లక్ష్మీనారాయణ ఒంటరిగా ఉంటున్నారు.
మార్కెట్ యార్డు ఆవరణలో రెండు నెలల క్రితం లక్ష్మీనారాయణ మద్యం సేవిస్తుండగా అటువైపుగా వచ్చిన ఇద్దరు యువకులు.. ‘గురువుగారు బాగున్నారా? మమ్మల్ని గుర్తుపట్టారా? మేము మీ శిష్యులం’అంటూ మాట కలిపారు. దీంతో పలుసార్లు కలుసుకోవడం, మద్యం సేవించడంతో వారి మధ్య చనువు ఏర్పడింది. కాగా, లక్ష్మీనారాయణ ఎప్పటిలాగే ఈనెల 24వ తేదీన మార్కెట్ యార్డు వద్దకు ఇద్దరు యువకులను తీసుకువెళ్లగా, అక్కడ దోమలు ఉన్నాయని, అన్నాసాగర్ వద్ద మంచి చోటు ఉంటుందని ఆ యువకులు తీసుకువెళ్లారు. ఆయన్ను మద్యం మత్తులోకి దింపిన ఆ యువకులు ఇంకా మద్యం, తినడానికి ఏమైనా తీసుకువస్తామని చెప్పి లక్ష్మీనారాయణ బైక్‌ను వెంట తీసుకువెళ్లారు.
దొంగతనం జరిగింది ఇలా..
బైక్ తాళం చెవిగుత్తికే ఇంటి తాళం చెవి ఉండటంతో నేరుగా వారు లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి బీరువా తాళాన్ని పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. కేవలం 14 నిమిషాల్లో వారు దొంగతనం పూర్తి చేసుకున్నట్లు సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. సాయంత్రం 4, 5 గంటల సమయంలో వెళ్లిన యువకులు రాత్రి 8 గంటల వరకు కూడా రాకపోయేసరికి లక్ష్మీనారాయణ తమ దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లి, 25వ తేదీన ఉదయం 5 గంటల సమయంలో తాను అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం లేకుండా గడియ పెట్టి ఉండడంతో లోనికి ప్రవేశించి చూడగా బీరువాలో దాచుకున్న డబ్బులు, బంగారు నగలు కనిపించకపోవడంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించారు.
ఇంటి స్థలం కొందామనుకున్నా..
రిటైర్‌మెంట్ ద్వారా వచ్చిన డబ్బులతో ఇంటి స్థలం కొందామనుకొని డబ్బు దాచుకున్నానని బాధితుడు లక్ష్మీనారాయణ విలేకరులకు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు రెండు నెలల క్రితం పరిచయమయ్యారని, తమది సంగారెడ్డి అని చెప్పారని, పేర్లు మాత్రం చెప్పలేదని అన్నారు.
విచారణ జరుపుతున్నాం: ఎస్‌ఐ
జోగిపేటలో జరిగిన దొంగతనం ఘటనకు సంబంధించి తమకు ఆలస్యంగా ఫిర్యాదు వచ్చిందని, సీసీ కెమెరా పుటేజీల ద్వారా నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నామని గురువారం ఎస్‌ఐ సామ్యానాయక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment