సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన రూ.2.2 కోట్ల చోరీ కేసును 12 గంటలలోపే పోలీసులు ఛేదించారు. నిందితుడు అశోక్ పోలీసులకు చిక్కాడు. అదుపులోకి తీసుకున్ పోలీసులు నగదను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని మీడియా ముందుకు ప్రవేశపెట్టి.. ఎస్పీ నర్సింహ కిశోర్ ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు.
హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలలో డబ్బులు నింపే ఏజెన్సీ తరఫున అశోక్ పనిచేస్తున్నాడని.. పక్కా ప్రణాళికతో బ్యాంకు సిబ్బంది, సెక్యూరిటీ కళ్లు గప్పి నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే ఐదు ప్రత్యేక బృందాలతో గంటల వ్యవధిలో కేసును ఛేదించినట్లు ఎస్పీ చెప్పారు. నిందితుడు విలాసాలకు అలవాటు పడ్డాడని తెలిపారు. సాంకేతిక, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు.
డిగ్రీ చదివిన మాచరమెట్లకు చెందిన వాసంశెట్టి అశోక్‌కుమార్.. రాజమండ్రిలోని ఏటీఎంలలో నగదు నింపే హెచ్‌టీసీ అనే ప్రైవేటు ఏజెన్సీ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నగరంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు సంబంధించిన 11 ఏటీఎంల్లో నగదు నింపేందుకు శుక్రవారం మధ్యాహ్నం ఏజెన్సీ ఇచ్చిన రూ.2,20,50,000 చెక్కును దానవాయిపేట హెచ్‌డీఎఫ్‌సీ శాఖకు వెళ్లి నగదుగా మార్చాడు. ఆ సొమ్ము ఇనుప పెట్టెలో సర్దుకుని వ్యక్తిగత కారులో పరారయ్యడు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కారును వదిలి పరారైన అశోక్‌ను స్వగ్రామం కపిలేశ్వరం మండలం మాచర్ల మెట్ట గ్రామంలోని తన ఇంట్లో తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు అశోక్ తన ఊళ్లో గుండు చేయించుకుని తిరిగినట్లు సమాచారం. పోలీసులు నిందితుడి సెల్‌ఫోన్‌ను ట్రాక్ చేసి పట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment