సాక్షి, కోనసీమ జిల్లా: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతావారిపేట వద్ద అదుపుతప్పి కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు కుమారులు గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి తండ్రి బయటపడ్డారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
నేలపూడి విజయ్ కుమార్ భార్య, పిల్లలతో విశాఖపట్నం వెళ్లి తిరిగి పోతవరం వస్తుండగా చింతావారిపేట వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో భార్య ఉమ కారు డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
అమలాపురం రూరల్ పేరూరు పంచాయతీ తలుపులపేటకు చెందిన అంబటి రాజు (22) బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ఆదివారం ర్రాతి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సినిమాకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరిన రాజు ఆదివారం రాత్రి 10 గంటలకు బ్రిడ్జి వద్దకు వచ్చి మోటారు సైకిల్‌ని పార్కు చేసి, చెప్పులు వదిలి బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అదే సమయంలో కొంతమంది మోటారు సైకిల్‌ను పార్కు చేసి ఉండడాన్ని గమనించారు. సోమవారం ఉదయం వరకు మోటారు సైకిల్ బ్రిడ్జిపైనే పార్కు చేసి ఉండడంతో ప్రయాణికులు గమనించి 100కి సమాచారం ఇచ్చారు. దీంతో అల్లవరం పోలీసులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారులతో గాలించగా నదిలో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని ఒడ్డుకి చేర్చారు. మృతుడు తండ్రి పాపారావు ఫిర్యాదుతో అల్లవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఏ కారణం వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడో విచారణలో తెలియవలసి ఉంది. మృతుడుకి తండ్రి, తల్లి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment