Crop canal
-
పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న
నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): టీడీపీ మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పంట కాలువను అడ్డగోలుగా కబ్జాచేశారు. అంతటితో ఆగకుండా ఆ స్థలంలో ఆయన ఇల్లు నిర్మించుకుని తన ఆగడాలకు అంతేలేదని చాటిచెప్పారు. జిల్లాలోని రావణాపల్లి రిజర్వాయర్ బ్రాంచ్ అయిన నీలంపేట చానల్‌కు నర్సీపట్నం పరిధిలోని శివపురం వద్ద నీటిపారుదల శాఖ గోడ నిర్మించింది. దానిపైనే అయ్యన్నపాత్రుడు యథేచ్ఛగా ఇంటికి బేస్మెంట్ నిర్మించారు. ఈ చానల్ ఒడ్డున నదిలో 10 అడుగుల వరకు (సర్వే నెంబరు 276లో 2 సెంట్ల మేర) ఆయన ఆక్రమించారని ఇరిగేషన్ శాఖతోపాటు రెవెన్యూ శాఖ తేల్చింది. కాలువ కుచించుకుపోయి నీరు ఎక్కువగా వచ్చినప్పుడు సమీపంలోని పొలాలు ముంపునకు గురవుతాయి. ఈనెల 2న నోటీసులు జారీ అక్రమ నిర్మాణం తొలగించాలని ఈనెల 2న అధికారులు అయ్యన్నకు నోటీసులు జారీచేశారు. అయినా.. ఆయన స్పందించకపోవడంతో ఆర్డీఓ గోవిందరావు, ఏఎస్పీ విజయ మణికంఠ చందోలు, మున్సిపల్ కమిషనర్ కనకారావు, తహసీల్దార్ కె. జయ రెవెన్యూ, పోలీసు యంత్రాంగంతో ఆదివారం వేకువజామున జేసీబీలతో అయ్యన్న నివాసానికి చేరుకున్నారు. గోడను పాక్షికంగా కూల్చివేశారు. ఇది జరుగుతుండగా అయ్యన్న సతీమణి పద్మావతి, తనయుడు రాజేష్ వారిపై దౌర్జన్యంచేస్తూ అడ్డుకున్నారు. రాజేష్, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న టీడీపీ కార్యకర్తలు అయ్యన్న నివాసానికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకుంటూ తిరగబడ్డారు. టీడీపీ కార్యకర్తల రాకతో పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులను బెదిరిస్తున్న అయ్యన్న కుమారుడు రాజేష్ అయ్యన్న తనయుడి అభ్యర్థన మన్నించినా.. ప్రభుత్వ సర్వేయర్‌తో సర్వే చేయించాలని, ఆక్రమణ జరిగినట్లు అందులో రుజువైతే తామే తొలగిస్తామని అయ్యన్న తనయుడు రాజేష్ ఆర్డీఓను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయన అభ్యర్థన మేరకు ఆర్డీఓ అప్పటికప్పుడు సర్వేకు ఏర్పాట్లు చేశారు. కానీ, సర్వే చేయమని కోరిన టీడీపీ నేతలే మళ్లీ సర్వేను అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా సిబ్బంది నుంచి బలవంతంగా చెయిన్లు లాక్కుని, రెవెన్యూ రికార్డులు ఎత్తుకుపోయారు. ఈ తతంగాన్ని సెల్ఫోన్లో రికార్డు చేస్తున్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై కొంతమంది టీడీపీ కార్యకర్తలు చేయిచేసుకుని సెల్‌ఫోన్ లాక్కున్నారు. ఈ దశలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అయ్యన్న నివాసంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, వంగలపూడి అనిత, కేఎస్ఎన్ఎస్ రాజు, అయ్యన్న మరో కుమారుడు చింతకాయల విజయ్ బరితెగించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వ్యాన్ తీసుకొచ్చి అయ్యన్న ఇంటి ముందుపెట్టారు. కానీ.. సర్వేను అడ్డుకుని కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న టీడీపీ కార్యకర్తలను తరలిస్తారని భావించిన ఆ పార్టీ నేతలు రోడ్డుపై ఉన్న కార్యకర్తలను లోపలకు తీసుకుపోయి గేట్లు మూసేశారు. అయితే, టౌన్ సీఐ మోహన్‌రావు టీడీపీ నేతల వద్దకు వెళ్లి రెవెన్యూ రికార్డులు తిరిగి ఇవ్వాలని కోరడంతో రికార్డులు ఇచ్చేశారు. అనంతరం మళ్లీ సర్వే ప్రారంభించగా టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తూ అడ్డుకున్నారు. రాత్రి పొద్దుపోయే సమయానికి కూడా టీడీపీ కార్యకర్తలు, పోలీసులు అయ్యన్న ఇంటి వద్దే మోహరించి ఉండడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ నిర్మాణాలు తొలగించకుండా ఉత్తర్వులివ్వాలని అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులు హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ వేసినట్లు సమాచారం. కాలువను కబ్జాచేసి కట్టేశారు ఇక మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు రావణాపల్లి రిజర్వాయర్ బ్రాంచ్ నీలంపేట చానల్‌ను ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టారని నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టంచేశారు. కాలువను 10 అడుగుల మేర ఆక్రమించారని.. ఇంటి ప్రహరీ గోడతోపాటు వంట షెడ్డు నిర్మించారని వారు తెలిపారు. -
పాలగుమ్మిలో అరుదైన నీటికుక్కల సందడి
అమలాపురం రూరల్: గోదావరిలో ఎంతో అరుదుగా కనిపించే నీటికుక్కలు శుక్రవారం మధ్యాహ్నం పాలగుమ్మి పంట కాలువలో జలకాలాడుతూ వాహనచోదకుల కంట పడ్డాయి. తొలుత అటుగా వెళ్తున్న గ్రామస్తులు, వాహనచోదకులు వాటిని పెద్ద పాములుగా భావించారు. కొందరు నీటికుక్కలని చెప్పారు. ఇటీవల గోదావరి వరదల్లో వచ్చిన నీటికుక్కలు కాలువలోకి కొట్టుకొచ్చినట్లు అమలాపురం పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు ఎల్.విజయ్‌రెడ్డి చెప్పారు. ఇవి ఇక్కడ సంచరించడం చాలా అరుదని, ఎక్కువగా నదీ ప్రాంతాల్లో కనిపిస్తాయని అన్నారు. ఇవీ చదవండి: చిల్లర వేషాలు, చీకటి లీలలు.. అబ్బో మనోడు మామూలోడు కాదుగా అధికారులపై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు నోటి దురుసు -
ఆక్వా చెరువుల్లోకి ఓఎన్జీసీ వ్యర్థాలు
ఉప్పలగుప్తం: తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ జగ్గరాజుపేటలోని జీఎంఏఏ ఓఎన్జీసీ సైట్ నుంచి వెలువడిన వ్యర్థ జలాలు పంట కాలువలో చేరి ఆక్వా, చేపల చెరువులకు తీవ్ర నష్టం వాటిల్లటంతో రైతులు ఆదివారం ఉదయం ఆందోళన చేపట్టారు. ఓఎన్జీసీ సైట్‌కు వెళ్లే ఉద్యోగులను అడ్డుకుని ధర్నా నిర్వహించారు. గోపవరం గ్యాదరింగ్ స్టేషన్ (జీజీఎస్)గా వ్యవహరించే ఈ సైట్లో ముడిచమురుతో వచ్చే వ్యర్థ జలాలను సెపరేటర్ల ద్వారా శుద్ధి ప్లాంటుకు తరలిస్తారు. రెండు మూడు రోజులుగా వ్యర్థ జలాలు పంట కాలువలోకి చేరుతున్నాయి. శనివారం రాత్రి లీకేజీ ఎక్కువ కావడంతో కాలువ నిండా వ్యర్థ జలాలు చేరాయి. ఈ విషయం తెలియని ఆక్వా రైతులు కాలువలోని నీటిని చెరువుల్లోకి తోడారు. సుమారు 3 వందల ఎకరాల ఆయకట్టున్న ప్రాంతంలో 50 నుంచి 60 ఎకరాలకు ఇంజన్లతో ఆ నీటిని తోడారు. దీంతో పలు చెరువుల్లో చేపలు చనిపోయి పైకి తేలగా రొయ్యలు మృత్యువాత పడి అడుగు భాగానికి చేరినట్లు గుర్తించారు. దీంతో రైతులు అల్లూరి రమేష్‌రాజు, సామంతకూరి జగన్రాజు తదితరులు స్థానిక నాయకుడు ఇసుకపట్ల రఘుబాబు ఆధ్వర్యంలో జగ్గరాజుపేటలో ధర్నాకు దిగారు. ఎకరాకు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ఆమేరకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చల్లపల్లి సర్పంచ్ ఇసుకపట్ల జయమణి ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో వినతిపత్రాన్ని అందించారు. ఓఎన్జీసీ ఇన్స్టలేషన్ మేనేజర్ (ఐఎం) పి.జగన్నాథరావు అక్కడకు చేరుకుని వారితో చర్చించారు. సాంకేతిక బృందం నివేదిక మేరకు పరిహారం అందజేస్తామని చెప్పారు. -
కలసిసాగారు... నీరు పారించారు...
కాలువలు శుభ్రంగా ఉంటేనే పంట పొలాలకు సాగునీరందేది. ఏటా వాటి నిర్వహణ కోసం కొంత బడ్జెట్ కేటాయించడం పరిపాటి. ఆ నిధులు వెచ్చిస్తున్నట్టు రికార్డుల్లో కనిపిస్తున్నాయి. కానీ వెంగళరాయ సాగర్ పరిధిలోని 12 ఎల్, 10 ఆర్ కాలువల దుస్థితి మాత్రం అసలు వాస్తవాన్ని బయటపెడుతున్నాయి. కాలువలన్నీ తుప్పలతో పూడుకుపోయాయి. సాగునీరు సక్రమంగా అందక 2500 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకమైంది. చేసేది లేక నాలుగేళ్లుగా అక్కడి రైతులే వాటిని శ్రమదానంతో శుభ్రపరచుకుని నీరు పారించుకుంటున్నారు. మక్కువ: వెంగళరాయసాగర్ ప్రాజెక్ట్ కాలువల ఆధునికీకరణకు కోట్లాది రూపాయిలు ఖర్చుచేశామని గత పాలకులు గొప్పగా చెప్పుకున్నారు. కానీ శివారు గ్రామాల ప్రజలకు మాత్రం సాగు నీటి కష్టాలు తీరలేదు. గడచిన నాలుగేళ్లు ఈ కాలువలను అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో మక్కువ మండలంలోని వెంక ట భైరిపురం గ్రామానికి చెందిన రైతులు గ్రామంలో కమీషన్ పాట(ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు అందించాల్సిన సొమ్ము) ద్వారా కొంతమొత్తం, రైతులు చందాలు ఎత్తుకొని మరికొంత వెచ్చించి, ఏటా ఖరీఫ్ సీజన్లో కాలువల్లో పేరుకుపోయిన పూడికలు తొలగించుకొని పంటలు సాగుచేసుకుంటున్నారు. 9 గ్రామాలకు అందని సాగునీరు... వెంగళరాయసాగర్ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ పరిధిలోని 12ఎల్ కాలువ మండలంలోని చప్పబుచ్చమ్మపేట, మేళాపువలస, ములక్కాయవలస, పాపయ్యవలస, కాశీపట్నం, వెంకటభైరిపురం, కొయ్యానపేట, కొండరేజేరు గ్రామాల రైతులకు చెందిన సుమారు 2500 ఎకరాలున్నాయి. నాలుగేళ్లనుంచి కాలువల నిర్వహణ చేపట్టకపోవడంతో ఈ కాలువల ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా కావడంలేదు. కాలువల్లో తూటికాడలు, నాచు, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగిపోయి నీరు పారడంలేదు. మండలంలోని కాశీపట్నం గ్రామం సమీపంలోని 10ఆర్ కాలువ వద్ద గతంలో ఏర్పాటుచేసిన మదుము, యూటీ శిథిలావస్థకు చేరుకోవడంతో కాలువ మధ్యలో పెద్దగొయ్యి ఏర్పడి నీరు పంటపొలాల మీదుగా సీతానగరం మండలం తామరఖండి గెడ్డలోకి వృథాగా పోతోంది. దిగువనున్న పాపయ్యవలస, కొయ్యానపేట, కొండరేజేరు, వెంకటభైరిపురం గ్రామాల పరిధిలోని కాలువలకు సాగునీరు అందట్లేదు. అయినా వాటిని చక్కదిద్దేందుకు ఇరిగేషన్ అధికారులు చొరవ చూపలేదు. శ్రమదానంతో కాలువల నిర్వహణ.. అధికారులు కాలువల నిర్వహణ సరిగ్గా చేపట్టకపోవడంతో రైతులు శ్రమదానంతో ఈ నెల 14వ తేదీ నుంచి కొండరేజేరు గ్రామానికి చెందిన రైతులు కన్నంపేట గ్రామం నుంచి కొండరేజేరు వరకు కాలువలో ఉన్న పూడికలను తొలగించుకున్నారు. కొయ్యానపేట గ్రామానికి చెందిన రైతులు 12ఎల్, ఆర్ కాలువలో పేరుకుపోయిన పూడికలను మూడురోజులపాటు తొలగించుకొని పంటపొలాలకు సాగునీరు సమకూర్చుకుంటున్నారు. శనివారం వెంకటభైరిపురం గ్రామానికి చెందిన సుమారు 150మంది పురుషులు, మహిళలు కలసికట్టుగా కాలువల్లో పేరుకుపోయిన పూడికలు, తూటికాడలు తొలగిస్తున్నారు. సుమారు 7కిలోమీటర్ల పొడవునా తుప్పలు తొలగిస్తున్నారు. వెంకటభైరిపురం గ్రామానికి చెందిన రైతులు ఏటా రూ. లక్ష వరకు వెచ్చించి, కాలువలు నిర్వహించుకుంటున్నారు. ఎల్బీసీ పరిధిలోని 12ఎల్ కాలువ మొత్తం పూడికలతో నిండిపోవడంతో సరాయివలస, కొండబుచ్చమ్మపేట గ్రామాలకు చెందిన పంటపొలాలకు సాగునీరు అందకపోవడంతో, చందాలు ఎత్తుకొని పూడికలు తొలగించుకునేందుకు సమాయత్తమవుతున్నారు. అదును దాటిపోతున్నా... జరగని ఉభాలు.. శివారు గ్రామాలైన వెంకటభైరిపురం, కొండరేజేరు, కొయ్యానపేట, సరాయివలస, గోపాలపురం గ్రామాల పంటపొలాలకు కాలువల ద్వారా సాగునీరు అందకపోవడంతో ఖరీఫ్‌సీజన్ సగం పూర్తయినా పంటపొలాలకు సాగునీరు అందకపోవడంతో రైతులు ఉభాలు జరిపించలేకపోతున్నారు. దీనివల్ల నారుమడులు ముదిరిపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో సొంతంగా కాలువలు శుభ్రం చేసి నీటిని సమకూర్చుకుంటున్నారు. అధికారులు ఇప్పటికైనా వారి సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాల్సిందే. సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం.. నాలుగేళ్లుగా కాలువల నిర్వహణ చేపట్టకపోవడంతో సాగునీటికోసం అనేక అవస్థలు పడుతున్నాం. ఏటా రైతులు చందాలు ఎత్తుకొని, కాలువల్లో పూడికలు తొలగించుకుంటున్నాం. ఏటా ఖరీ ఫ్ సీజన్ ముగిసిన సమయంలో ఉభాలు జరి పిస్తుండటంతో దిగుబడులు రావడం లేదు. సాగు చేసినప్పటికి వచ్చిన దిగుబడులు పెట్టుబడులకే సరిపోతున్నాయి. ఏటా మేమే కాలు వ శుభ్రపరచుకుంటున్నా... ఇరిగేషన్ అధికా రులు పట్టించుకోవడం లేదు. – రెడ్డి శ్రీరాము, వెంకటభైరిపురం, రైతు సీజన్ పూర్తవుతున్నా ఉభాలు జరగలేదు.. నాకు పదెకరాల పొలం ఉంది. అదంతా కాలువ పరిధిలోనే ఉన్నందున కాలువ ద్వారా నీరురాకపోవడంతో ఇంతవరకు ఉభా లు జరిపించలేకపోయాం. ఖరీఫ్‌సీజన్ ముగుస్తుండటంతో నారుమడులు ముదిరిపోతున్నా యి. ముదిరిన నారు నాటినా ప్రయోజనం ఉండదు. దిగుబడి శాతం తగ్గిపోతుంది. ప్రతి ఏటా ఇదేతంతు జరుగుతుంది. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. – జాగాన తిరుపతినాయుడు, రైతు, వెంకటభైరిపురం -
డెల్టా..ఉల్టా
భీమవరం (ప్రకాశం చౌక్): పశ్చిమ డెల్టా కాలువలు అధ్వానంగా మారాయి.. ఏళ్ల తరబడి ఆధునికీకరణకు నోచుకోక రైతులను ఇబ్బందులు పెడుతున్నాయి. వేసవిలో కాలువలను ఆధునికీకరిస్తాం అని పాలకులు చెబుతున్నా.. ఏటా అంతంతమాత్రంగానే పనులు జరగడం పరిపాటిగా మారిపోయింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో డెల్టా ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలో పనులు కూడా చకచకా జరిగా యి. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆధునికీకరణపై దృష్టి సారించకపోవడంతో నిధులు మురిగిపోయాయి. తెలుగుదేశం ప్రభుత్వ ఐదేళ్ల పాలనలోనూ ఆధునికీకరణ పనులు నామమాత్రంగానే జరిగాయి. అధ్వానంగా పంట కాలువలు పశ్చిమ డెల్టా పరిధిలో 11 ప్రధాన కాలువలు, వాటి బ్రాంచ్ కెనాల్స్ కింద 5,29,962 ఎకరాల ఆయకట్టు ఉంది. దీనిలో నికర ఆయకట్టు 4,60,000 ఎకరాలు కాగా చేపల చెరువులు 69,962 ఎకరాలు ఉన్నాయి. పదేళ్లుగా దాదాపు అన్ని కాలువలు పూడుకుపోవడం, కర్రనాచుతో నిండిపోవడం, గట్లు బలహీనంగా మారడంతో ముంపు సమయంలో గండ్లు పడే పరిస్థితి ఉంది. కొన్ని కాలువలు చెత్తాచెదారాలతో మురుగు కాలువలను తలపించేలా మారిపోయాయి. ఆయా కారణాలతో పొలాలకు సాగునీరు సక్రమంగా అందడం లేదు. నీరు ఉధృతంగా వచ్చినప్పుడు కొన్నిచోట్ల కర్రనాచు వల్ల నీరు ముందుకు పారక గట్లు తెగుతున్నాయి. అటువంటి సమయాల్లో పొలా ల్లోకి ముంపు నీరు చేరి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పదేళ్ల క్రితమెప్పుడో కాలువ పూడికతీత పనులు జరిగాయి. ఆ ఆతర్వాత ఎన్నడూ పూరిస్థాయిలో పనులు జరిగిన దాఖలాలు లేవు. పనులు నామమాత్రం డెల్టా కాలువల ఆధునికీకరణ పనులకు నిధులున్నా అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో అంతంతమాత్రంగానే జరిగాయి. అధునికీకరణ పేరు చెప్పి ఒక వియ్యర్ నిర్మాణం చేపట్టడం, ఒకటి, రెండు గట్లను పటిష్టం చేయడంతో సరిపెడుతున్నారు. జారిపోతున్న గట్లకు రివిట్మెంట్ నిర్మాణ పనులు చేయడం లేదు. ఈ ఏడాది రూ.30 కోట్ల వరకు.. ఈఏడాది వేసవిలో కాలువల ఆధునికీకరణకు సుమారు రూ.30 కోట్ల వరకు నిధులు మంజూరైనట్టు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే పనులకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. సక్రమంగా బిల్లులు రాకపోవడంతో ఇరిగేషన్ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు మక్కువ చూ పడం లేదు. దీంతో టెండర్లకు స్పందన కరువయ్యింది. ఈ ఏడాదీ అనుమానమే..! జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో మళ్లీ టెండర్లు పిలిచేందుకు అవకాశం లేదు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు టెండర్లు పిలుస్తారా? లేక అధికారులు నేరుగా టెండర్లు పిలిచి పనులు అప్పగిస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు. ఈక్రమంలో వేసవి ఆధునికీకరణ పనులపై రైతుల్లో సందేహాలు నెలకొన్నాయి. ఆధునికీకరణ పనులు జరగకపోతే సాగునీటి ఇక్కట్లు తప్పవని, కాలువ గట్లు తెగిపోవడం ఖాయమని రైతులు ఆందోళన చెందుతున్నారు.} డ్రెయినేజీ శాఖలోనూ ఇదే తంతు పశ్చిమ డెల్టా పరిధిలో మురుగు నీటి డ్రెయిన్లూ అధ్వానంగానే ఉన్నాయి. పూడుకుపోయి, తూడు, చెత్తాచెదారంతో నిండి ఉన్నాయి. దీంతో ముంపు సమయాల్లో పొలాల్లో నీరు బయటకు పారడం లేదు. డ్రెయినేజీ గట్లు బలహీనంగా ఉండటంతో పాటు చాలాచోట్ల ఆక్రమణలో ఉన్నాయి. డ్రెయినేజీ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. బిల్లుల పెండింగ్ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గతేడాది డ్రెయిన్ల అభివృద్ధికి సంబంధించి సుమారు రూ.50 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిస్తే రూ.20 కోట్ల పనులకు టెండర్లు దాఖలు కాలేదు. ఈ ఏడాది సుమారు రూ.10 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అధికారులు మరోమారు టెండర్లు పిలవనున్నారు. పూడిక తీత పనులు చేపట్టాలి మా గ్రామం ఆయకట్టు జీ అండ్ వీ పంట కాలువ నీటిపై ఆధారపడి ఉంది. అయితే పంట కాలువలో కర్రనాచు తీవ్రంగా ఉండటం వల్ల సాగునీరు కిందకు పారడం లేదు. దీంతో నీరు గట్లు దాటి పైకి రావడంతో గండ్లు పడుతున్నాయి. మట్టి, కంకర బస్తాలతో అడ్డుకట్ట వేసుకుంటున్నాం. కాలువ పూడిక తీసి సుమారు 10 ఏళ్లు కావడంతో పూడుకుపోయింది. ఈ వేసవిలో అయినా కాలువ పూడికతీత పనులు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. – పోలుకొండ మోహన్‌రావు, రైతు, కొండేపూడి స్పందన అంతంతమాత్రం కాలువల ఆధునికీకరణ కోసం ఎన్నికల కోడ్‌కు ముందు కొబ్బరికాయ కొట్టిన పనులు జరుగుతున్నాయి. నరసాపురం, పాలకొల్లు ప్రాంతాల్లో కాలువలకు సంబంధించి పనులు చేస్తున్నాం. పశ్చిమ డెల్టా ఆధునికీకరణ పనులకు సుమారు రూ.30 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులకు సంబంధించి టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన తక్కువగా ఉంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మళ్లీ టెండర్లు పిలుస్తాం. అత్యవసరమైన పనులను చేయడానికి చర్యలు తీసుకుంటాం. – ఎం.దక్షిణామూర్తి, ఇరిగేషన్ శాఖ ఈఈ, శెట్టిపేట, నిడదవోలు మండలం ఎవరూ ముందుకు రాలేదు ఈ ఏడాది డ్రెయినేజీ అభివృద్ధి పనుల నిమిత్తం సుమారు రూ.10 కోట్లకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరు ముందు రాలేదు. మళ్లీ టెండర్లు పిలవడానికి ప్రస్తుతం ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే టెండర్ల ప్రక్రియ చేపడతాం. కాంట్రాక్టర్లు ముందుకువస్తే వారికి పనులు అప్పగించి డ్రెయిన్లు అభివృద్ధి చేస్తాం. కాంట్రాక్టర్లు ముందుకురాకపోతే ఉన్నతాధికారుల అదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. – పి.నాగార్జునరావు, డ్రెయినేజీ శాఖ ఈఈ, భీమవరం -
పంట కాలువలో రాతి విగ్రహం
సంగం(ఆత్మకూరు): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని ర్యాంపు వద్దనున్న కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ సమీపంలోని ఓ పంట కాలువలో ఆదివారం పురాతన రాతి విగ్రహం బయటపడింది. కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ నుంచి పడమటిపాళెం గ్రామ రైతులకు సాగునీరు అందించే కాలువలో నాలుగు అడుగుల ఎత్తైన రాతి విగ్రహాన్ని గాంధీజన సంఘం గ్రామానికి చెందిన ఓ చిన్నారులు గుర్తించారు. రాతి విగ్రహం చేసిన విధానాన్ని బట్టి చూస్తే సుమారు 100 ఏళ్లకు పైగా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. విగ్రహానికి ఎడమ చేతిలో శంకు, కుడిచేతిలో కిందకు చూపుతున్నట్లుగా కత్తి ఉన్నాయి. ఈ విగ్రహాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల వారు తరలి వచ్చారు. -
అంత్యక్రియలకు అరటిబోదెలే సాయం..
జి.పెదపూడి(పి.గన్నవరం): ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల కోసం నలుగురి సాయం కావాలంటారు. అయితే ఆ గ్రామంలో ఆ నలుగురితో పాటు అరటిబోదెల సాయం కూడా అవసరమే. ఎందుకంటే వాటి సాయం లేకుండా శవాన్ని శ్మశానానికి తరలించడం సాధ్యం కాదు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం జి.పెదపూడి శివారు ఉచ్చులవారిపేట వద్ద ప్రధాన పంట కాలువపై ఏడేళ్ల క్రితం చేపట్టిన వంతెన నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు. దీంతో గ్రామంలో ఎవరైనా మరణిస్తే.. అరటి బోదెలతో తెప్పలు ఏర్పాటు చేసి, దానిపై పాడె లేదా శవపేటికను ఉంచి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో కాలువలో ఈదుతూ మృతదేహాన్ని అవతలి ఒడ్డుకు చేర్చాల్సి వస్తోంది. ఆ సమయంలో పలువురు ప్రమాదాల బారిన కూడా పడుతున్నారు. కాగా, ఆదివారం ఉచ్చులవారిపేటకు చెందిన గిడ్డి పల్లాలమ్మ(70) మరణించింది. దీంతో ఆమె మృతదేహాన్ని ఎప్పటిలాగే అరటి బోదెల సహాయంతో కాలువ దాటించి అంత్యక్రియలు నిర్వహించారు. -
గడువు పెంపు!
అమలాపురం :గోదావరి డెల్టా పంట కాలువల మూసివేత గడువు పెంచనున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 31 నుంచి కాలువలు మూసివేయాల్సి ఉంది. కానీ డెల్టాలో రబీ సాగు ఆలస్యం అవుతున్నందున ఏప్రిల్ 10 వరకూ సాగునీరు పంపిణీ చేయాల్సి ఉందని అధికారులు గుర్తించారు. ఈమేరకు గడువు పెంచేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. జిల్లాలోని తూర్పు, మధ్యడెల్టా, పిఠాపురం బ్రాంచ్ కెనాల్(పీబీసీ) పరిధిలోని సుమారు 3.30 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు జరుగుతోంది. గోదావరిలో నీటి ఎద్దడి ఉన్నందున డిసెంబరు 31 నాటికి నాట్లు పూర్తి చేయాలని, మార్చి 31 నాటికి కాలువలు మూసివేస్తామని అధికారులు తొలి నుంచి చెబుతూ వస్తున్నారు. ఇలా చేస్తేనే డెల్టా ఆధునికీకరణ పనులు ఎంతోకొంత పూర్తవుతాయని వారంటున్నారు. రబీ సాగుకు ముందు కాకినాడలో జరిగిన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు (ఐఏబీ) సమావేశంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ మేరకు నిర్ణయించారు. ఇందుకు తగినట్టుగా ఈ నెల 31 నాటికి కాలువలు మూసివేయాలని ఇటీవల కాకినాడలో కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఇరిగేషన్ శాఖ సమావేశంలో నిర్ణయించారు. అయితే డెల్టాలో ఫిబ్రవరి మొదటివారంలో కూడా నాట్లు పడినందున కాలువలకు ఏప్రిల్ 10 నుంచి 15 వరకూ సాగునీరు ఇవ్వాల్సి వస్తుందని వివరిస్తూ ‘అసాధ్యమని తెలిసి కూడా అదేపాట’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఏప్రిల్ 10 వరకూ - మిగతా 2లోఠ డెల్టా కాలువలకు నీరు ఇవ్వక తప్పదని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా సీలేరు పవర్ జనరేషన్ ద్వారా వస్తున్న నీటినే కాకుండా బైపాస్ పద్ధతిలో మరో 15 రోజుల పాటు అదనపు నీటిని రప్పించాలని శుక్రవారం నిర్ణయించారు. అంటే ఈ నెల 28 వరకూ బైపాస్ పద్ధతిలో నీరందుతుందన్నమాట. సీలేరు నుంచి వదిలే నీరు ధవళేశ్వరం బ్యారేజికి చేరేసరికి వారం రోజులు పడుతోంది. అంటే బైపాస్ పద్ధతిలో ఏప్రిల్ 5 వరకూ బ్యారేజికి నీరు వస్తుంది. కోతలకు వారం రోజుల ముందు నుంచి పొలానికి నీరు పెట్టకుండా ఆరబెట్టే అకాశముంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 10 వరకూ సాగునీరు పంపిణీ చేయాలని, తద్వారా రబీ సాగుకు పూర్తిగా నీరందించినట్టవుతుందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. త్వరలో కలెక్టర్, ప్రజాప్రతినిధులకు ఈ విషయం తెలిపి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులను పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్ణయించారు. ఈ కారణంగానే మార్చి 31 నాటికి కాలువలు మూసివేయాలని నిర్ణయించారు. అయితే బడ్జెట్లో ప్రభుత్వం కేవలం రూ.30 కోట్లు మాత్రమే కేటాయించడంతో ప్రజాప్రతినిధులు, అధికారుల్లో నిరుత్సాహం చోటుచేసుకుంది. ఈ నిధులతో కాలువలపై చిన్నచిన్న మరమ్మతులు మినహా భారీ పనులు చేసే అవకాశం లేదు. నిధులు తక్కువగా కేటాయించడం కూడా కాలువల మూసివేత గడువు పెంచడానికి కారణమైంది. -
రైతులు సుభిక్షంగా ఉండాలి
సోమశిల: రైతులు పంట కాలువను సద్వినియోగం చేసుకుని సుభిక్షంగా ఉండాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రైతులకు సూచించారు. అనంతసాగరం మండలం బెడుసుపల్లి సమీపంలోని కేడీపల్లి పంట కాలువకు సోమవారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దాదాపు 18 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న పంట కాలువను అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి చేసిన కృషి అభినందనీయమన్నారు. ఐదు గ్రామాల పొలాలకు సాగునీరు అందుతుందన్నారు. రైతులు మాట్లాడుతూ తమ సమస్యను ఎమ్మెల్యేగా గెలిచిన గౌతమ్‌రెడ్డి తనదిగా భావించి దాదాపు 3,600 ఎకరాల ఆయకట్టు కలిగిన కాలువను అభివృద్ధి పథాన నడిపినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే సేవలు భేష్: జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి రైతుల సమస్యలను తనవిగా భావించి పంట కాలువను అభివృద్ధి చేసేందుకు సొంత నిధులు వెచ్చించిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి సేవలు అభినందనీయమని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ప్రశంసించారు. పంట కాలువ నీటి విడుదల కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథి పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పంట కాలువ నిరుపయోగంగా ఉండటాన్ని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారన్నారు. నేడు ఈ కాలువ ద్వారా ఐదు గ్రామాల పరిధిలో పొలాలు అభివృద్ధిలోకి రానున్నాయన్నారు. ఈ సందర్భంగా నాయకులను రైతులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కల్వకుంట వెంకటేశ్వర్లురెడ్డి, సంగం జెడ్పీటీసీ దేవసహాయం, తూమాటి దయాకర్‌రెడ్డి, అల్లారెడ్డి సతీష్‌రెడ్డి, పోతల నరసింహులు, కరేటి పెంచలయ్య, చండ్రా ప్రసాద్‌నాయుడు, షేక్ మౌలా, దుగ్గిరెడ్డి రత్నారెడ్డి, షేక్ షబ్బీర్, కేతా రాఘవరెడ్డి, ఎస్దానీ, పాపుదీపు సుబ్బారెడ్డి, పాలపాటి నాగార్జునరెడ్డి, పెద్దిరెడ్డి హరికృష్ణారెడ్డి, బట్రెడ్డి చక్రధర్‌రెడ్డి, ఎద్దుల శ్రీనివాసులురెడ్డి, నారసింహారెడ్డి, సాగునీటి శాఖ డీఈ రవి, తహశీల్దార్ సోమ్లా బనావత్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.